తాండూరు
వికీపీడియా నుండి
| ?తాండూర్ మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తాండూర్ |
| జిల్లా(లు) | రంగారెడ్డి |
| గ్రామాలు | 33 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
103,278 (2001) • 52136 • 51142 • 59.82 • 70.26 • 49.18 |
తాండూర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ పట్టణము, మండలము. రంగారెడ్డి జిల్లాలో పశ్చిమాన ఉన్న ఈ పట్టణము పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు మరియు వ్యవసాయపరంగా కందులకు ప్రసిద్ది. మొదటి గ్రేడు పురపాలసంఘంచే పట్టణ పాలన నిర్వహించబడు తాండూరు పట్టణమునకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి రోడ్డు మరియు రైలు పరంగా మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాదుకు పశ్చిమాన 116 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. రాజకీయంగా కూడా మర్రి చెన్నారెడ్డి, ఎం.మాణిక్ రావు లాంటి ప్రముఖులు తాండూరు నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించారు. పట్టణం సమీపంలో పలు సిమెంటు కర్మాగారాలు కలవు. పట్టణానికి తాగునీరు అందించే కాగ్నానది, దాని సమీపంలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రం పట్టణానికి 4 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] పట్టణ స్వరూపం, జనాభా
తాండూరు పట్టణము హైదరాబాదు నుండి 110 కిలోమీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లా పశ్చిమాన ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం తాంఢూరు పట్టణం జనాభా 57,943. ఇందులో పురుషులు 51% మరియు మహిళలు 49% ఉన్నారు. పట్టణం సగటు అక్షరాస్యత 60% (జాతీయ సగటు 59.5%). మగవారిలో అక్షరాస్యత 67%, ఆడువారిలో 52% ఉంది. మొత్తం జనాభాలో 15% మంది ఆరేళ్ళలోపు వయసు గలవారు.
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు. ఇంతకు క్రితం ఈ నియోజకవర్గం హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజన ఫలితంగా నూతనంగా ఏర్పడిన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగమైంది.
- ప్రధాన వ్యాసం: తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
[మార్చు] పట్టణ పాలన
తాండూరు పట్టణ పరిపాలన పురపాలక సంఘం ద్వారా నిర్వహించబడుతుంది. 1953, నవంబర్ 23న ఇక్కడ పురపాలక సంఘం ఏర్పాటుచేయబడింది.[1] మొదటి పురపాలకసంఘం చైర్మెన్‌గా ముధెళ్ళి నారాయణరావు పనిచేశాడు. 1961 లో పట్టణ జనాభా కేవలం 2000 ఉండగా నేడు సుమారు 60 వేలకు పైగా జనాభాతో విలసిల్లుతోంది. నాపరాతి గనులు, పాలిష్ మిషన్ల వల్ల అనేక మంది జీవనోపాధి కొరకు మారుమూల పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. పాలిష్ మిషన్ల వల్ల మున్సీపాలిటీకి అధిక మొత్తంలో ఆదాయం కూడ వస్తుంది. అలాగే భవన నిర్మాణాల పరిశ్రల ఏర్పాటు అనుమతులకు మునిసిపాలిటీకి అనుమతి ఫీజు లభిస్తుంది. ప్రస్తుతం పట్టణ పరిధిలో 27 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు తరఫున ఒక వార్డు మెంబర్ పురపాలక సంఘంలో ఆ వార్డు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల సమస్యలను పరిష్కరించుటకు కృషిచేస్తాడు.
[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు
తాండూరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో కాగ్నానది ఉంటుంది, ఇది మూసీ నదికి ఉపనది. ఈ నది నుండి మహబూబ్ నగర్లోని కోడంగల్ మున్నగు ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తారు.
- తాండూరు కంది పప్పు
మంచి మాంసకృత్తులు పౌష్టికాహారం కల్గిన కందిపప్పు ఉత్పత్తిలో తాండూరు పేరెన్నికగన్నది. కందిపప్పు ఉత్పతిలో తాండూరు రాష్ట్రంలోనే ప్రముఖ స్థానం ఆక్రమిస్తుంది. నల్లరేగడి భూముల్లో పెరిగే కంది పంటకు ఇక్కడి భూములు అనువుగా ఉండటం మరియు రైతులు ఆసక్తి చూపడంతో పంట ఉత్పత్తి బాగుగా జర్గుతుంది. ఈ పంటకు వర్షాకాలం ఆరంభంలో విత్తనాలు చల్లుతారు. నవంబర్ చివరి నాటికి పంట మార్కెట్ లోకి వస్తుంది. పూర్తిగా ఎండని, కాయ దశలోనే ఉన్న కంది కాయలను రైతులు మార్కెట్ లో తెచ్చి అమ్మడం, దాన్ని ఉప్పు వేసిన నీటిలో ఉడకబెట్టి దాని విత్తులను తినడం ఇక్కడ మాత్రమే కన్పించే అపురూప దృశ్యం.
[మార్చు] వ్యాపారం, పరిశ్రమలు
ఇక్కడి నుండి భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు వాడే నాపరాయి షోలాపూర్, ముంబాయి, హైదరాబాదు మున్నగు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కంది పంట వల్ల ఇక్కడ దాల్ మిల్లులు కూడ అధిక సంఖ్యలోనే ఉన్నాయి. కల్తీ లేని స్వచ్ఛమైన కందులకు ఇక్కడి మార్కెట్ ప్రసిద్ధి. పరిసర ప్రాంతాలలో కూడ తాండూరు కందికి విపరీతమైన డిమాండు ఉంది.
- పాలిషింగ్ పరిశ్రమ
ముఖ్య వ్యాసము: తాండూర్ నాపరాతి పరిశ్రమ
భవనాల నిర్మాణంలో ఫ్లోరింగ్‌కు వాడే నాపరాతి పరిశ్రమకు తాండూర్ ప్రసిద్ధి చెందినది. గనుల నుంచి ముడి రాళ్ళను తీయడం ఒక ఎత్తయితే దానికి మెరుగులు దిద్ది భవనాల నిర్మాణంలో ప్లోరింగ్ కు అనువైన రీతిలో మలచడం మరో ఎత్తు. తాండూర్ పట్టణములోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా ఈ పరిశ్రమ విస్తరించి ఉన్నది. సిరిగిరిపేట్, ఓగిపూర్, మల్కాపూర్, కరణ్‌కోట్, బషీరాబాద్ ప్రాంతాలలో నాపరాతి గనులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. గతంలో బంజరు భూములుగా వదలిచేసిన ఈ ప్రాంతాలు ప్రస్తుతం కనకపు కాసులు వెదజల్లుతున్నాయి. ఈ పరిశ్రమ వల్ల అధిక సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది, కార్మికులకు, జీవనోపాధి లభిస్తుంది, వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఆదాయం లభిస్తుంది, యంత్రపరికరాలు తయారు చేయువారికి, మెకానిక్ లకు మంచి డిమాండు ఉంటుంది. ఈ విధంగా తాండూరు పట్టణము అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం లభిస్తున్నది.
- తాండూర్ సిమెంటు పరిశ్రమ
తాండూరులో రెండు భారీ సిమెంటు కర్మాగారాలున్నాయి. ఒకటి విశాఖ సిమెంట్ ఇండస్ట్రీస్‌కు చెందినది. మరొకటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందినది. తాండూర్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాదు రైల్వేస్టేషన్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో కరణ్‌కోట గ్రామం పరిధిలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అజమాయిషీలోని సిసిఐ సిమెంటు కర్మాగారం 1987లో ఉత్పత్తి ప్రారంభించబడింది.[2] ఇది 2340 ఎకరాల వైశాల్యంలో విస్తరించబడి ఉన్నది. సి.సి.ఐ.కు దేశవ్యాప్తంగా ఉన్న 11 సిమెంటు ప్లాంట్లలో ఇది ఒకటి.
[మార్చు] రవాణా సదుపాయాలు
రవాణా పరంగా తాండూరుకు రైలు మరియు రోడ్డురవాణాకు మంచి సౌకర్యాలు కలవు.
- రైలు రనాణా
తాండూరు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జొన్‌లో హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి రైలుమార్గము లో హైదరాబాదు కు పడమరన 110 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా మహబూబ్ నగర్ మరియు మెదక్ జిల్లా ప్రజలు కూడా ముంబాయి వైపు వెళ్ళడానికి ఈ రైల్వేస్టేషన్ నుంచే బయలుదేరుతారు. తిరుపతి, బెంగుళూరు, ముంబాయి మున్నగు ప్రాంతాలు వెళ్ళడానికి ఈ స్టేషన్ అనువుగా ఉన్నది.
- రోడ్డు రవాణా
బస్సులు కూడ హైదరాబాదు మరియు మహబూబ్ నగర్ మున్నగు పట్టణాల నుంచి ప్రయాణానికి మంచి వసతులున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు బస్సులు తాండూరు నుండి రాష్ట్ర రాజధానికి, మరియు జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాలకు నడుపుతున్నారు. హైదరాబాదు, గానుగాపూర్, విజయవాడ, గుడివాడ, పరిగి, కుర్ల, ముంబాయి, థానె, కొడంగల్, శ్రీశైలం, యాదగిరిగుట్ట - ఇక్కడి నుండి బస్సు సర్వీసులున్న ప్రధాన పట్టణాలు.
[మార్చు] విద్య, వైద్యం
- కొన్ని విద్యాసంస్థలు
|
|
[మార్చు] తాండూరు పట్టణ చరిత్ర
తాండూరు పట్టణానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1953 కు పూర్వం ఇది నిజాం రాష్ట్రం లో భాగంగా ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉండేది. 1953 లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో హైదరాబాదు జిల్లాలో కలిసింది. 1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ఫలితంగా ఆంద్ర ప్రదేశ్ లో భాగమై 1978 వరకు హైదరాబాదు జిల్లాలోనే కొనసాగింది. 1978 లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంతో ఇది ఈ జిల్లాలో భాగమై కొనసాగుతోంది.
[మార్చు] ఆలయాలు, చూడదగిన స్థలాలు
- శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం
తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం కోర్కెలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పర్గి, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా విపరీతంగా వస్తుంటారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రెండు రోజులు ప్రధానమైనవి. శని, ఆది వారాల్లో జర్గే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జర్గే రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. భక్తులు తమ కోరికల్ని మనస్సులో తలచి రథంపైకి అరటిపళ్ళు విసురుతారు. కలశపు భాగానికి అవి తగిలితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రథోత్సవం తర్వాత రథం చుట్టూ మరియు పరిసర ప్రాంతంలో దుకాణాలు వెలుస్తాయి. వారం రోజుల పాటు ఈ ప్రదేశం జనసందోహంగా ఉంటుంది. ఆదివారం అర్థరాత్రి జర్గే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది.
-
- దేవాలయ చరిత్ర
కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామలో సుమారు 200 సంవత్సరాల క్రితం భద్రప్ప జన్మించినట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబుతారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఇత్సవాలు జర్గుతాయి. తాండూరు నివాసి పటేల్ బసన్నకు భద్రప్ప కలలో కన్పించి తన పాదుకలను భావిగి మటం నుంచి తీసుకువచ్చి వీటిని తాండూరు లో ప్రతిష్టించి, ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, జాతర జర్పాలని అజ్ఝాపించినట్లు కథ ప్రచారంలో ఉంది.
- తాండూరు పరిసరాలలో చూడదగిన ప్రదేశాలు
- శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం
- రసూల్పూర్ హనుమాన్ దేవాలయం - తాండూరుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- జుంటుపల్లి రామాలయము - తాండూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన దేవాలయం.
- జుంటుపల్లి ప్రాజెక్టు
- కాగ్నానది - తాండూరు పట్టణానికి, చుట్టుప్రక్కల షుమారు 45 గ్రామాలకు మంచినీరు అందించే నది.
- కోట్ పల్లి ప్రాజెక్టు
- అనంతగిరి కొండలు
- ముర్షిద్ దర్గా
- అల్లాపూర్ ప్రాజెక్టు
[మార్చు] తాండూరు పట్టణ ప్రధాన ఘట్టాలు
- 1953: తాండూరు పురపాలక సంఘం ఏర్పాటైంది.
- 1957: తాండూరు పట్టణానికి విద్యుత్ సౌకర్యం కల్పించబడింది.
- 1960: పట్టణంలో టెలిఫోన్ ఎక్ఛేంజీ ఏర్పాటుచేయబడింది.
- 1981: కొత్త బస్టాండు ప్రారంభమైంది.
- 2002: పట్టణ పరిధి 5.82 చ.కి.మీ. నుంచి 18.25 చ.కి.మీ.కు పెంచబడింది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] ఇతరాలు
ఇక్కడ ప్రతి ఏటా ఉగాది పర్వదినం తర్వాత "శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర" మరియు రథోత్సవం జర్గుతుంది.
- తాండూర్ పట్టణంలోని సినిమా థియేటర్లు
శాంత్‌మహల్ (ఏ.సి.) థియేటర్, లక్ష్మీమహల్ (ఏ.సి) థియేటర్, సరస్వతి థియేటర్, ఆదిశక్తి థియేటర్, శివశక్తి థియేటర్, శ్రీనివాస థియేటర్, చంద్ర థియేటర్
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ వార్తా దినపత్రిక, దశమ వార్షిక ప్రత్యేక సంచిక, రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 2006
- ↑ http://cementcorporation.co.in/plants_tandur.html
|
|||||||