సెక్షన్ 66 ఎ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ప్రభుత్వం 2000 సంవత్సరలొ ఐటీ చట్టం (సాంకేతిక పరిజ్ఞాన) చట్టం వ్యాపార లావాదేవీలను, ఇ-కామర్స్‌ను నియంత్రించడానికి అమలులొ తెచ్చినంది 2008లో చట్టాన్ని సవరించి 66ఎ సెక్షన్‌ చేర్చారు.ఐ.టి. చట్టంలోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.

  1. కంప్యూటర్‌ను గానీ, ఇతర సమాచార పరికరాన్ని గానీ ఉపయోగించి ఇతరులకు హానికర, అభ్యంతరకర సమాచారాన్ని చేరవేసినా;
  2. ఒక సమాచారం తప్పు అని తెలిసినప్పటికీ ఇతరులకు కోపం/ అసౌకర్యం/ ప్రమాదం/ అడ్డంకి కలిగించే నేరపూరిత ఉద్దేశంతో, శతృత్వంతో, ద్వేష భావంతో, దురుద్దేశంతో కంప్యూటర్ ద్వారా దానిని వినియోగించుకున్నా...
  3. ఇతరులకు అసౌకర్యం కలిగించేలా, లేదా తప్పుదారి పట్టించేలా ఏదైనా ఇ-మెయిల్‌ను వాడుకున్నా, అసలు సందేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఏమార్చాలని చూసినా...

ఈ చట్టం కింద మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. ఒక సమాచారాన్ని రూపొందించినా, వేరేవారికి చేరవేసినా, ఇతరుల నుంచి స్వీకరించినా నేరమే. ముద్రణ రూప సమాచారం, చిత్రాలు, ధ్వని, దృశ్యాలు, ఇతర ఎలక్ట్రానిక్ సమాచారం విషయాల్లో ఇది వర్తిస్తుంది. ఈ చట్టాన్ని 2008లో సవరించారు. 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు.

నెటిజన్ల అరెస్టు[మార్చు]

సోషల్ మీడియాలో ఈ కామెంట్లే చేయాలి.. ఫలానా చర్చించకూడదన్న నిర్బంధాలు కొనసాగాయి. 66 ఏ ప్రకారం దేశవ్యాప్తంగా నెటిజన్ల అరెస్టు పర్వం సాగింది. గీత దాటితే అంతే అన్న భయం కలిగించారు. అభ్యంతరకర, అసభ్యకర పదజాలంతో కామెంట్లు పెడితే కచ్చితంగా తప్పే. కానీ సాధారణ విషయాలపై తమ మనోభావాలను వ్యక్తం చేస్తే తప్పు ఎలా అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తూ వచ్చారు. నిరసనలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం 66 ఏ సెక్షన్‌పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ కామెంట్లపై అరెస్టు చేసేటప్పుడు పోలీసు ఉన్నతాధికారుల సూచనలు తప్పనిసరి అని చెప్పింది[1]. ఈ సెక్షన్ పై లక్నో, మద్రాసు హైకోర్టులలో వాజ్యాలు కూడా దాఖలైనాయి.[2][3]బొంబాయి హైకోర్టు వెబ్‌సైట్లలో అసత్యపు సమాచారాన్ని చేర్చడం సైబర్ నేరంగా పరిగణించింది.[4]

సుప్రీం కోర్టు తీర్పు[మార్చు]

సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీం కోర్టు కీలక తీర్పు మంగళవారం 24 మార్చి 2015 న వెలువరించింది. పౌరుల భావ ప్రకటనను నిరోధించే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 A, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.‘స్వేచ్ఛను అడ్డుకోవడానికి అర్ధం లేని భయాలు కారణం కాకూడదు. అభిప్రాయాన్ని చెప్పనిస్తే విపత్తు ముంచుకొస్తుందని భావించడానికి కూడా బలమైన ప్రాతిపదికలు ఉండాలి కదా!’ అంటూ న్యాయమూర్తులు ఆర్‌.ఎఫ్‌. నారీమన్‌, జాస్తి చలమేశ్వర్‌లు చేసిన వ్యాఖ్యలు ప్రశంసనీయమైనవి. ఒక వ్యాఖ్య, ఒక కార్టూన్‌, ఒక లైక్‌ సమాజాన్ని అతలాకుతలం చేసేస్తాయంటూ వెంటపడి అరెస్టులు చేస్తున్నవారి భయాలకు సముచితమైన ఆధారాలు, అర్ధాలు లేవని న్యాయస్థానం భావించింది.రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం అనే ప్రాథమిక హక్కుకు ఈ సెక్షన్ భంగం కలిగిస్తోందన్నారు. 'ఇతరులకు కోపం తెప్పించేది, అసౌకర్యం కలిగించేది, తీవ్ర తప్పిదం...' ఇలాంటి వాటికి నిర్దిష్ట నిర్వచనాలు లేవనీ, అందువల్ల వాటిలో ఉన్న అంశాలను తెలుసుకోవడం అటు చట్టాన్ని అమలు చేసే సంస్థలకు, ఇటు తప్పిదం చేసేవారికి కష్టమని పేర్కొంది. ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయనీ, సెక్షన్-66ఎ మాత్రం శాశ్వతంగా ఉంటుందని పేర్కొంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ- తదుపరి ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటుందనే హామీని ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వజాలదని తెలిపింది. ఒక సమాచారం ప్రజలకు అందుబాటులో లేకుండా నిలుపుదల చేయడం, కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి సంబంధించిన 69-ఎ, 79 సెక్షన్లను మాత్రం ధర్మాసనం కొట్టివేయలేదు. కొన్ని నియంత్రణలతో వాటిని అమలు చేయవచ్చని తెలిపింది.

తీర్పు నేపద్యం[మార్చు]

శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణించినప్పుడు ముంబైలో బంద్‌ పాటించడాన్ని ఒక యువతి ఫేస్‌బుక్‌లో ప్రశ్నిస్తే మరొకరు దానిని లైక్‌ చేయడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అంతర్జాలంలో రాజకీయ అసమ్మతిని, అసంతృప్తిని, భిన్న రాజకీయ దృక్ఫథాలనూ వెలువరించేవారిని సైతం అరెస్టు చేయడానికి 66 (ఎ) సెక్షన్‌ వీలుకల్పించడం గర్హనీయం. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు 66 (ఎ) సెక్షన్‌ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ విద్యార్థిని శ్రేయ సింఘల్‌ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన నేరాలన్నింటినీ 'శిక్షార్హం కాని నేరాలు'గా పరిగణించాలని కోరారు. బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న సింఘల్‌ సెలవుల్లో స్వదేశం వచ్చి, న్యాయశాస్త్ర కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ముంబయి యువతుల అరెస్టు జరిగింది. 2012 సెప్టెంబర్‌లో అవినీతికి వ్యతిరేకంగా వ్యంగ్య చిత్రాలు గీసిన ముంబయి కార్టూనిస్టు అశీమ్‌ త్రివేదీనీ ఇదే సెక్షన్‌ కింద అరెస్టు చేశారు. 2012 అక్టోబరులో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీని ట్విటర్‌లో విమర్శించినందుకు పుదుచ్చేరి వ్యాపారవేత్త రవి శ్రీనివాసన్‌నూ అరెస్టుచేశారు.వీటిపై 2014 డిసెంబర్‌ మొదటివారంలో విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు, ఐటీ చట్టంలోని వివాదగ్రస్త సెక్షన్లపై తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. 'భారతదేశం 60 ఏళ్లపాటు ఈ సెక్షన్లు లేకుండానే ముందుకు సాగింది. వీటిపై స్టే ఇస్తే మిన్ను విరిగి మీద ఏమీ పడదు' అంటూ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతర్జాలంలో రాజకీయ అసమ్మతిని తెలిపేవారిని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తప్ప దిగువస్థాయి అధికారులు అరెస్టు చేయకూడదంటూ 2013 జనవరిలోనే కేంద్రప్రభుత్వం ఒక సలహా పత్రం జారీచేసినా, శాంతిభద్రతలు రాష్ట్రాల జాబితాలోని అంశం కావడంతో పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. దీనితో కేంద్రం సలహాకు అందరూ కట్టుబడి ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరినీ 66 ఎ సెక్షన్‌ కింద అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.అభ్యంతరకరమైన అంశాలను వెబ్‌లో నమోదుచేసే వారిని అరెస్టు చేసే అధికారాలను పోలీసులకు కల్పిస్తున్న సైబర్‌ చట్టంలోని వివాదాస్పద అంశం(ఐటీ చట్టంలోని 66ఏ సెక్షను) రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది[5].[6]

మూలాలు[మార్చు]

  1. Section 66A of the Information Technology Act, CIS India
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-29. Retrieved 2015-03-25.
  3. http://www.thehindu.com/news/states/tamil-nadu/validity-of-section-66a-of-it-act-challenged/article4116598.ece
  4. "Creating a website can entail cyber crime: HC". Archived from the original on 2013-08-22. Retrieved 2015-03-25.
  5. http://supremecourtofindia.nic.in/FileServer/2015-03-24_1427183283.pdf
  6. "SC quashes Section 66A of IT Act: Key points of court verdict". Times of India. 24 March 2015. Retrieved 24 March 2015.

ఇతర లింకులు[మార్చు]