హిమాలయన్ బ్లండర్ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమాలయన్ బ్లండర్
రచయిత(లు)జాన్ డాల్వి
దేశంభారతదేసం
భాషఇంగ్లీషు
ప్రచురణ కర్తథాకర్; నటరాజ్
ప్రచురించిన తేది
1968; others
పుటలు506

హిమాలయన్ బ్లండర్, బ్రిగేడియర్ జాన్ డాల్వి రాసిన అత్యంత వివాదాస్పదమైన యుద్ధ స్మారక పుస్తకం. 1962 నాటి చైనా-భారత యుద్ధ కారణాలు, పర్యవసానాలు, పరిణామాలను ఈ పుస్తకం వివరిస్తుంది, ఈ యుద్ధంలో చైనా చేతిలో భారతదేశానికి ఓటమి ఎదురైంది.

1919 ఏప్రిల్ 14 నాడు గాంధీ రాసిన "హిమాలయన్ మిస్‌కాలిక్యులేషన్" [1] అనే వ్యాసం పేరును తోచేలా ఈ పుస్తకానికి పెట్టినట్లుగా అనిపిస్తుంది. గాంధీ ఆత్మకథలో 33వ అధ్యాయానికి ఆ పేరునే పెట్టాడు. [2] : 469 

బ్రిగేడియర్ డాల్వి భారత సైన్యంలో పనిచేశాడు. యుద్ధం గురించి ప్రత్యక్ష సాక్షి కథనం ఈ పుస్తకం. ప్రచురించిన తర్వాత, భారత ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. [3]

పుస్తకం కారణంగా, "హిమాలయన్ బ్లండర్" అనే పదం భారీ వైఫల్యానికి పర్యాయపదంగా ఉపయోగిస్తున్నారు. 

సారాంశం[మార్చు]

వెల్లింగ్టన్‌లోని DSSCలో బ్రిగే. డాల్వి గడిపిన రోజులతో పుస్తకం ప్రారంభమవుతుంది. అతను ఒక అతిథి అధ్యాపకుడు, పదవీవిరమణ చేసిన బ్రిటీష్ అధికారి. అక్కడ జరిగిన ఒక సంఘటనను అతడు ఇలా వివరించాడు: 1954 ఏప్రిల్‌లో ఒకరోజు పాఠం జరుగుతూండగా, నెహ్రూ చైనాతో పంచశీల ఒప్పందంపై సంతకం చేసి, చైనీయులు ముందుకు చొచ్చుకు రాకుండా నిరోధించేందుకు టిబెట్‌లో ఉన్న ఒక స్థానాన్ని చైనీయులకు అప్పగించాలని నిర్ణయించాడని విన్న డాల్వి క్లాసును ఆపి, 'భారత్, చైనాల మధ్య త్వరలో యుద్ధం జరుగుతుందనీ, ఈ క్లాసులో ఉన్న మీరు ఆ యుద్ధంలో పాల్గొంటారనీ' హెచ్చరించాడు.

బ్రిగ్. డాల్వి భారతదేశం, చైనాల నేపథ్యంలో టిబెట్ స్థానాన్ని పరిశీలిస్తాడు. బ్రిటీష్ వారికి చైనా సామ్రాజ్య ఆశయాల గురించి తెలుసని ఆయన చెప్పాడు. అందువల్ల వారు టిబెట్‌ను బఫర్ ప్రాంతంగా చేసుకుంటూ వచ్చారు. ఊహించిన విధంగానే, చైనీయులు 1950లో టిబెట్‌పై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నారు. నెహ్రూ అవలంబించిన చైనా-మిత్ర విధానం కారణంగా భారత్, ఈ దాడిపై నిరసన వ్యక్తం చేయలేదు. చైనీయులు టిబెట్ నుండి లడఖ్ సమీపంలోని అక్సాయ్ చిన్ వరకు రోడ్లను నిర్మించడం ప్రారంభించారు. చైనా కింది రెండు ప్రధాన భూభాగాలకు తనవేనని వాదిస్తుంది-

1) లడఖ్‌కు ఈశాన్య భాగంలో ఉన్న అక్సాయ్ చిన్ .

2) బ్రిటీష్ నియమించిన నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (NEFA), ఇదే ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం.

యుద్ధం[మార్చు]

1962 సెప్టెంబర్ 8న యుద్ధం మొదలైనప్పుడు నెహ్రూ భారతదేశం బయట ఉన్నాడు. చైనీయులు లడఖ్ ప్రాంతంపైన, NEFA పైనా ఏకకాలంలో దాడి చేశారుఅక్సాయ్ చిన్‌లో . 11,000 కిమీ² ప్రాంతాన్నీ, NEFAలో గణనీయమైన ప్రాంతాన్నీ పట్టుకోగలిగారు. IV కార్ప్స్ కమాండర్, జనరల్ BM కౌల్ యుద్ధంలో ముందు భాగాన లేడు. అనారోగ్యం నుండి కోలుకుంటూ ఢిల్లీలోని మిలటరీ ఆసుపత్రిలో ఉన్నాడు. BM కౌల్, తనకు వ్యక్తిగతంగా నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని, తనకంటే సమర్థులైన సీనియర్ అధికారులను వెనక్కి నెట్టి జనరల్ స్థానానికి పదోన్నతి పొందాడని డాల్వి ఆరోపించాడు.

డాల్వి ప్రకారం, భారత సైన్యంలో నాయకత్వం, పర్వత యుద్ధానికి సంబంధించిన పరికరాలు, ఆయుధాలు, వెచ్చని దుస్తులు, మంచు బూట్లు, గ్లాసులూ వంటి ప్రాథమిక ఆవశ్యక వస్తువులు లేవు. బలమైన ప్రత్యర్థిని తన బ్రిగేడ్ ధైర్యంగా, స్థైర్యంతో ఎదుర్కొన్న వైనాన్ని బ్రిగే డాల్వి ప్రశంసించాడు. భూభాగాన్ని పొందినప్పటికీ, చైనా సైన్యం యథాతథ స్థితిని కొనసాగిస్తూనే ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించింది. బ్రిగ్. డాల్విని అతని బ్రిగేడ్ సైనికులతో పాటు యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అధికారికంగా భిన్నమైన వైఖరిని కొనసాగిస్తూనే చైనా ఆ దాడిని ఎలా నిశితంగా ప్లాన్ చేసిందో కూడా డాల్వి రాశాడు.

డాల్వి యుద్ధానంతర పరిణామాలను కూడా పరిశీలిస్తాడు. ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వ్యతిరేకులు రక్షణ మంత్రి కృష్ణ మీనన్, జనరల్ బ్రిజ్ మోహన్ కౌల్‌లను పరాజయానికి బాధ్యులుగా చేయగా, వారిద్దరూ రాజీనామా చేశారు.

కన్నడ పాత్రికేయుడైన రవి బెళగెరె, హిమాలయన్ బ్లండర్‌ని కన్నడం లోకి అనువదించాడు. ఈ కన్నడ రచన వలన చైనాపై భారత సైన్యం ఓటమికి గల కారణాల గురించి భారతీయ పాఠకులు మరింత తెలుసుకునేందుకు వీలైంది.

సంచికలు[మార్చు]

ప్రచురించబడిన ఎడిషన్‌లు:

  • డాల్వి, జాన్ పి. (1968). హిమాలయన్ బ్లండర్; 1962 భారత చైనా యుద్ధం (1st ed.). ముంబై: థాకర్. (506 pages)
  • డాల్వి, జాన్ పి. (1969). హిమాలయన్ బ్లండర్; 1962 భారత చైనా యుద్ధం (2nd ed.). ముంబై: థాకర్. (506 pages)
  • డాల్వి, జాన్ పి. (2003). హిమాలయన్ బ్లండర్; భారత దేశం పొందిన ఘోరమైన సైనిక ఓటమి గురించిన కఠిన వాస్తవం. డెహ్రా డూన్: నటరాజ్. ISBN 978-8185019666. (506 pages)
  • డాల్వి, జాన్ పి. (2010). హిమాలయన్ బ్లండర్; భారత దేశం పొందిన ఘోరమైన సైనిక ఓటమి గురించిన కఠిన వాస్తవం. డెహ్రాడూన్: నటరాజ్. ISBN 978-8181581457. (506 pages)

మూలాలు[మార్చు]

  1. "Articles By Gandhi: A Himalayan Miscalculation - April 14, 1919" Archived 2020-01-27 at the Wayback Machine (accessed 10 June 2012)
  2. Gandhi, Mohandas K.; Mahadev H. Desai (1993). An autobiography: The story of my experiments with truth. Boston, MA, USA: Beacon Press. ISBN 0807059099.
  3. Dutta, Sujan (6 October 2012). "Himalayan Blunder (Part II) - Air chief revives China war and Kargil debates". The Telegraph. Calcutta. Retrieved 10 June 2013.