అంబుజమ్మాళ్
ఎస్. అంబుజమ్మాళ్ | |
|---|---|
| జననం | ఎస్. అంబుజమ్మాళ్ 1899 జనవరి 8 chennai(Madras), India |
| ఇతర పేర్లు | అంబుజం అమ్మాళ్ |
| వృత్తి | స్వాతంత్ర్య సమర యోధురాలు, సామాజిక కార్యకర్త |
| భాగస్వామి | ఎస్. దేశికాచారి |
అంబుజమ్మాళ్ దేశికాచారి (శ్రీనివాస అయ్యంగార్) భారతీయ స్వాతంత్రోద్యమ కార్యకర్త, మహిళా హక్కుల కార్యకర్త. [1] గాంధేయవాది అయిన ఆమె శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. అంబుజమ్మాళ్‌కు 1964 లో పద్మశ్రీ లభించింది. ఆమె 1993 లో మరణించింది.
తొలి జీవితం, విద్య
[మార్చు]అంబుజమ్మాళ్ 1899 జనవరి 8 న ఎస్. శ్రీనివాస అయ్యంగార్, రంగనాయకి దంపతులకు జన్మించింది. శ్రీనివాస అయ్యంగార్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులలో ఒకరు. స్వరాజ్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అంబుజమ్మాళ్ మాతామహుడు సర్ వి.భాష్యం అయ్యంగార్, అతను మద్రాస్ ప్రెసిడెన్సీకి అడ్వొకేట్-జనరల్‌గా నియమితులైన మొదటి భారతీయుడు. అంబుజమ్మాళ్ 1910 లో కుంభకోణానికి చెందిన న్యాయవాది ఎస్ దేశికాచారిని పెళ్ళి చేసుకుంది.
జీవితం తొలినాళ్ళలో, ఆమె మహాత్మాగాంధీ ఆలోచనల పట్ల, ముఖ్యంగా అతని నిర్మాణాత్మక సామాజిక-ఆర్థిక కార్యక్రమం పట్ల ఆకర్షితురాలైంది. సోదరి సుబ్బలక్ష్మి, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి, మార్గరెట్ కజిన్స్‌తో పరిచయం కలిగాక ఆ ఆసక్తి ఇనుమడించింది. అంబుజమ్మాళ్ ఉపాధ్యాయురాలిగా అర్హత సాధించి, శారద విద్యాలయ బాలికల పాఠశాలలో పార్ట్‌టైమ్‌లో బోధించారు. 1929 నుండి 1936 వరకు శారదా లేడీస్ యూనియన్‌లో కమిటీ సభ్యురాలు. ఆమె సోదరి సుబ్బలక్ష్మితో కలిసి చాలా సన్నిహితంగా పనిచేసింది. 1929 లో, ఆమె మద్రాసు మహిళా స్వదేశీ లీగ్ కోశాధికారిగా నామినేటైంది. ఈ లీగ్, కాంగ్రెసుకు చెందిన రాజకీయేతర విభాగం. ఇది గాంధీ ప్రవచించిన సామాజిక, ఆర్థిక కార్యక్రమాలను అమలు చేసేది.
రాజకీయాల్లో పాత్ర
[మార్చు]1930 లో, శాసనోల్లంఘన ఉద్యమం ద్వారా ఆమె రాజకీయ జీవితంలో ప్రవేశించింది. గాంధీ అభ్యర్థన మేరకు, జాతీయ ఉద్యమానికి మద్దతుగా ఆమె తమ నగలను దానం చేసింది. స్వదేశీ ఉద్యమానికి ఆమె బలమైన మద్దతుదారు. ఖద్దరు ధారణను స్వీకరించింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టైంది. 1932 లో, ఆమె కాంగ్రెసులో "మూడవ నియంత" గా ప్రశంసించబడింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించడంలో ముందుండి సత్యాగ్రహులను నడిపించింది.
ఆమె సంపూర్ణ కాంగ్రెస్ మహిళ. 1934 నుండి 1938 వరకు హిందీ ప్రచార సభ మేనేజింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉండేది. ఆమె హిందీ ప్రచారం కోసం చాలా పని చేసింది. హిందీ ప్రచార సభలో ఆమె కార్యకలాపాలలో భాగంగా, 1934 లో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి హాజరయింది. 1934 నవంబరు నుండి 1935 జనవరి వరకు గాంధీతో కలిసి వార్ధా ఆశ్రమంలో ఉంది. మైలాపూర్ లేడీస్ క్లబ్ కార్యదర్శిగా (1936 నుండి ఆమె నిర్వహించిన పదవి) ఉంటూ, ఆమె హిందీ తరగతులు నిర్వహించింది.
ఆమె ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ (WIA) లో ముఖ్యమైన భాగం, 1939 నుండి 1942 వరకు, ఆ తరువాత 1939 నుండి 1947 వరకు కోశాధికారి పదవిని చేపట్టింది. WIA లో ఉండగా ఆమె, బాల్య వివాహాలు, బహుభార్యాత్వం, దేవదాసి వ్యవస్థల రద్దు చెయ్యడంపై ఆమె పనిచేసింది. మహిళల హక్కులను, వారి ఆస్తి హక్కులనూ రక్షించడానికి చట్టం తీసుకురావడంపై కూడా ఆమె కృషి చేసింది. WIA తరపున, ఆమె మద్రాస్ కార్పొరేషన్‌కు నామినేటైంది. 1947 లో, మద్రాసులో జరిగిన అఖిల భారత మహిళా సదస్సులో, ఆమె రిసెప్షన్ కమిటీ అధ్యక్షురాలిగా నామినేటైంది. అమె సామాజిక సేవలో అంకితభావంతో పనిచేసింది.
1948 నుండి శ్రీనివాస గాంధీ నిలయం అధ్యక్షురాలు, కోశాధికారిగా పనిచేసింది. అది స్వయంగా ఆమె స్థాపించిన సంస్థయే. ఇది పేద బాలికలకు ఉచిత కోచింగ్ అందించేది. అందులో ఉచిత డిస్పెన్సరీ ఉండేది. దాని ప్రింటింగ్ ప్రెస్‌లో మహిళలకు శిక్షణ, ఉపాధిని కూడా అందించేది. అక్కడ పేదలకు ఉచితంగా పాలు, మందులు, గంజి అందించేది.
వినోబా భావే సహచరురాలిగా అంబుజమ్మాళ్, 1956 లో భూదాన్ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి అతనితో కలిసి తమిళనాడులో పర్యటించింది. అతి పారిశ్రామికీకరణకు ఆమె అనుకూలంగా ఇండేది కాదు. వినోబా భావే సూచించిన గ్రామ స్వయం సమృద్ధి నమూనాను ఆమె విశ్వసించింది.
1957 నుండి 1962 వరకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా, 1957 నుండి 1964 వరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా ఉంది.
అంబుజమ్మాళ్ నిరాడంబరంగా ఉండేది అక్కమ్మ అని ఆమెని ప్రేమగా పిలిచేవారు. మెడలో పూసల దండ తప్ప మరేమీ ధరించేది కాదు. [2]
ఆమె హిందీ, తమిళ భాషల్లో పండితురాలు. గాంధీ గురించి తమిళంలో మూడు పుస్తకాలు రాసింది. నాన్ కంద భారతం (నేను చూసిన భారతం) అనే పేరుతో ఆత్మకథ రాసింది.[3]
1964 లో అంబుజమ్మాళ్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. స్వాతంత్రోద్యమంలో చేస్న సేవకు గాను 1973 లో భారత ప్రభుత్వం తామ్రపత్రం అందించింది.
మూలాలు
[మార్చు]- ↑ https://www.womeninpeace.org/a-names/2017/4/19/srinivasa-ambujammal
- ↑ https://www.thehindu.com/features/metroplus/women-of-steel/article5022187.ece Women of Steel
- ↑ Ramanathan, Malathi (1998). "CHALLENGE AND RESPONSE BY WOMEN IN THE MADRAS PRESIDENCY IN THE EARLY 20TH CENTURY: S. Ambujammal and Sister R. S. Subbalakshmi". Proceedings of the Indian History Congress. 59: 629–641. ISSN 2249-1937.