ఉప్పు సత్యాగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ, ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్ర
దండి సత్యాగ్రహం మార్గం

ఉప్పు సత్యాగ్రహం (ఆంగ్లం : The Salt Satyagraha) మహాత్మా గాంధీచే ప్రారంభించి సాగించిన అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం, ఇది బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా జరిగింది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన "దండి యాత్ర" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం. దీనిలో ప్రధానమైన గాంధీ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగానే కాక దానిని ప్రతీకగా వినియోగించుకుని మొత్తం భారతీయులపై బ్రిటీషర్ల అన్యాయమైన పరిపాలనపై ఒక శాంతియుత పోరాటం.[1]

ఈ సత్యాగ్రహం ప్రారంభానికి కొన్నిరోజులకు ముందే బ్రిటిష్ వారు గాంధీని మార్చి 5, 1930 న అరెస్టు చేశారు. ఈ ఉప్పుసత్యాగ్రహం గురించి ప్రపంచానికి తెలిసినపుడు, ప్రపంచం దృష్టియంతా ఈ సత్యాగ్రహం వైపున ఆసక్తిగా వుండినది. ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరకాలం వుండినది. మహాత్మాగాంధీని జైలునుండి విడుదల చేశాక, వైశ్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్తో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సంభాషణలు మొదలయ్యాయి.[2] ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు.[3] ఈ ఉద్యమం బ్రిటిష్ రాజ్య అరాచక విధానాలు తేటతెల్లమైనాయి.[4][5], లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.[6]


ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర[మార్చు]

దండి మార్చ్‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. http://www.gandhiashramsevagram.org ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రమణ్యం . తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.

నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన దండు నారాయణరాజును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించారు.

ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి అనే గేయకవితను రాశారు.

మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన క్రొవ్విడి లింగరాజు ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు.

బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు.

ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనే కేంద్ర శాసన సభకు రామదాసు పంతులు, శాసన మండలి సభ్యత్వానికి స్వామి వెంకటాచలం రాజీనామాలు చేశారు.

ఉప్పు చట్టాలను ఉల్లఘించి బులుసు సాంబమూర్తి , ఉన్నవ లక్ష్మీనారాయణ ( మాలపల్లి నవల రచయిత), ఖాసా సుబ్బారావు లాఠీ దెబ్బలు తిన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని తన నివాసం వేదవనంలో సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు , రాయల సీమ పరిధిలో కల్లూరి సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.

నెల్లూరులోని మైపాడు బీచ్‌లో బెజవాడ గోపాలరెడ్డి ఉప్పు తయారు చేసి ప్రజలకు అమ్మారు.

సత్యాగ్రహం[మార్చు]

ఉద్యమ విరమణ[మార్చు]

ఉప్పు సత్యాగ్రహ సమయంలోని ర్యాలీలో మహాత్మాగాంధీ.

సత్యాగ్రహం నిలిపివేసే అవకాశాలను పరిశీలించమంటూ యరవాడ జైలులోని గాంధీని మితవాదులైన తేజ్ బహదూర్ సప్రూ, జయకర్ కలవగా, కాంగ్రెస్ అధ్యక్షుడైన జవాహర్‌లాల్ నెహ్రూదే నిర్ణయం తీసుకునే అధికారమని గాంధీ తిప్పి పంపాడు. జవాహర్‌లాల్, మోతీలాల్ ఉద్యమాన్ని కొనసాగించడమే తమ అభిమతమని గాంధీకి గట్టిగా చెప్పినా వైశ్రాయ్‌కి చెప్పి వారిద్దరినీ గాంధీని కలిసేందుకు యరవాడ తీసుకువెళ్ళారు. అయితే చర్చలు ఫలప్రదం కాలేదు.[7] అక్టోబరు 11న ఆరునెలల శిక్షాకాలం పూర్తై జవాహర్‌లాల్ విడుదల అయి భూమిశిస్తు కౌళ్ళు, ఆదాయపు పన్నులు నిలిపివేసేలా ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించడంతో పదిరోజుల్లో మళ్ళీ అరెస్టుచేశారు. ఈసారి రెండేళ్ళ కఠిన శిక్ష విధించారు. ఈసారి పరిశీలించేందుకు పుస్తకాలు లేవన్న కారణాన్ని పక్కన పెట్టి తన కుమార్తె ఇందిరకు ప్రపంచ చరిత్రపై లేఖలు రాయడం కొనసాగించాడు. [8] 1931 ఫిబ్రవరి 6న మోతీలాల్ మరణించాడు. తండ్రి అంత్యక్రియల సందర్భంగా రాజకీయాలలో సమయం వెచ్చించలేని జవాహర్‌లాల్ తరఫున తనకు తానై స్వంత బాధ్యతతో గాంధీ నడుమ గాంధీ-ఇర్విన్ సంధి కుదుర్చుకుని శాసనోల్లంఘనాన్ని నిలిపివేశాడు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, అల్పసంఖ్యాక వర్గాల స్థితి వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగే చర్చలకు కాంగ్రెస్ హాజరవుతుందని అంగీకరించాడు. అందుకు బదులుగా హింసాత్మకమైన అభియోగాలు లేనివారి విడుదల, ఉప్పుతయారీకి అనుమతి, శాంతియుతమైన పికెటింగుకు అవకాశం ఇస్తుంది. జవాహర్‌లాల్‌కు ఈ సంధి ఆమోదయోగ్యం కాలేదు.[9] ఇది స్వాతంత్ర్యాన్ని కాకపోయినా కనీసం పన్నుల చెల్లింపు నిరాకరణలో పాల్గొన్న బార్డోలీ, యుపీ ప్రాంతాల రైతుల జప్తు అయిన ఆస్తులు తిరిగి, ఉప్పు తయారీకి, సేకరణకు పూర్తి హక్కులు ప్రభుత్వం ఇవ్వడం కూడా సాధించలేకపోయింది.[10] అయితే గాంధీ జవాహర్ ఊహిస్తున్నదాని కన్నా ఎక్కువగా ఉద్యమం వల్ల దేశం నీరసించి శక్తి, ఉత్సాహాలు కోల్పోయిందని అంచనా వేశాడు.[9] కరాచీ కాంగ్రెస్‌ మహాసభలో ఈ అంశంపై జవాహర్ స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టగా ఉద్యమ విరమణ ఆమోదం పొందింది.

పాదపీఠికలు[మార్చు]

  1. "Mass civil disobedience throughout India followed as millions broke the salt laws", from Dalton's introduction to Gandhi's Civil Disobedience. Gandhi & Dalton, 1996, p. 72.
  2. Dalton, p. 92.
  3. Johnson, p. 234.
  4. Johnson, p. 37.
  5. Ackerman & DuVall, p. 109.
  6. Ackerman & DuVall, pp. 106.
  7. సర్వేపల్లి గోపాల్ 1993, p. 128.
  8. సర్వేపల్లి గోపాల్ 1993, p. 130.
  9. 9.0 9.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 133.
  10. సర్వేపల్లి గోపాల్ 1993, p. 134.

[[1]]

మీడియా[మార్చు]

గాంధీ, అనుయాయుల ఉప్పు సత్యాగ్రహ యాత్ర సమయపు, ఒరిజినల్ చిత్రం.

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]