చంపారన్ సత్యాగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంపారన్ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డా. అనుగ్రహ్ నారాయణ్ సిన్హా తదితరులు

చంపారన్ సత్యాగ్రహం భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో 1916 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లాలో భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ స్ఫూర్తితో రేగిన తొలి ఉద్యమం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దీనికి ప్రముఖ స్థానం ఉంది. నీలిమందు రైతులను ఆంగ్లేయుల దోపిడీ నుంచి కాపాడటం కోసం సుమారు ఒక సంవత్సరం పాటు గాంధీజీ ఈ ఉద్యమం నడిపాడు.[1]

నేపథ్యం

[మార్చు]

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బేరార్ (ప్రస్తుతం బీహార్), ఔధ్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్), బెంగాల్ ప్రాంతాల్లో 1750 నుంచి వ్యాపారాత్మక పంటగా పండించడం ప్రారంభించారు. ఇది ప్రాథమికంగా చైనా, యూకె, యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యేది. ఈ పంటకు ఎక్కువ నీరు అవసరం కావడం, పండించిన తర్వాత నేలలో సారం కోల్పోవడం మూలాన రైతులు దీనిని వ్యతిరేకించేవారు. దానికి బదులు ఆహార పంటలైన వరి, ధాన్యాలు పండించేవారు. దీంతో ఆంగ్ల పరిపాలకులు ఈ పంటను పండించమని బలవంతం చేశారు. ప్రాంతీయంగా ఉన్న రాజులు, నవాబులు, భూస్వాములతో కుమ్ముక్కై ఋణాలు ఇవ్వడానికి దీన్ని ఒక సాకుగా వాడుకున్నారు. కొంతమంది ఆసియా, యూరోపు వర్తకులకు ఈ వ్యాపారం చాలా లాభసాటిగా సాగింది.[2]

నీలిమందును వస్త్రాల తయారీలో విరివిగా వాడేవారు. బెంగాల్ ప్రాంతం ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్ళినపుడు అక్కడి రైతులను బలవంతంగా నీలిమందు పండించేలా చేశారు. జర్మనీలో నీలిమందును కృత్రిమంగా తయారు చేసే విధానాలు కనుగొనడంతో రైతులు పండించే నీలిమందుకు గిరాకీ తగ్గింది. భూమిని కౌలుకు తీసుకున్న రైతులందరూ తాము పండించే భూమిలో కొంత భాగంలో ఖచ్చితంగా నీలిమందు తోటలు పెంచవలసిందింగా నిర్బంధం విధించారు. రైతులకు చాలా తక్కువ ధర చెల్లించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ల రంగు అందుబాటులోకి రాకపోవడంతో నీలిమందుకు గిరాకీ పెరిగింది. అయినా రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేవారు కాదు.

అటువంటి సమయంలో రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి గాంధీజీని సంప్రదించి అక్కడికి వచ్చి తమకు సహాయం చేసాల్సిందిగా కోరాడు. అప్పటిదాకా గాంధీజీ తనకు భారతదేశంలో చంపారన్ ఎక్కడుందో కూడా తెలియదని తన ఆత్మకథలో రాసుకున్నాడు. 1917, ఏప్రిల్ 10న డాక్టర్ రాజేంద్రప్రసాద్, మరికొంత మంది న్యాయవాదులతో కలిసి రైలులో సాధారణ బోగీలో చంపారన్ కి చేరుకున్నాడు.[3] అక్కడి నిరక్షరాస్యతను గమనించిన గాంధీ నవంబరు 13, 1917న తూర్పు చంపారన్ ను 30 కి.మీ దూరంలో ఉన్న బర్హార్వా లఖన్సేన్ అనే ఊర్లో మొట్టమొదటిసారి ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించాడు. ఇందుకు ఆయన అనుచరులు కొంతమంది, అదే ప్రాంతంనుంచి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సేవకులు సహకరించారు.[4]

1859-60 ప్రాంతంలో కూడా నీలిమందు పోరాటాలు జరిగాయి కానీ ఇది మళ్ళీ కొత్తగా ప్రారంభమైన ఉద్యమం.[5] ఉద్యమానికి సిద్ధం అయ్యారు. గాంధీ తన బృందంతో కలిసి జిల్లాలోని గ్రామ గ్రామాన్ని పర్యటించి అక్కడి రైతులను కలిసి బలవంతంగా నీలిమందు పండించడం వలన వారు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేసుకున్నాడు. గాంధీజీ చంపారన్ చేరుకున్నప్పటి నుంచే ప్రభుత్వం ఆయన కదలికల మీద ఓ కన్నేసి ఉంచింది. ఏప్రిల్ 15 న ఆయన మోతీహరి చేరుకునే సరికి ఆయనను వెనక్కి మళ్ళాల్సిందిగా ఆజ్ఞ జారీ చేసింది. కానీ గాంధీ అందుకు తన ధిక్కారాన్ని తెలియజేశారు.

మూలాలు

[మార్చు]
  1. చలసాని, నరేంద్ర (7 October 2017). "గాంధీజీ.. 'చంపారన్' ప్రయోగం". andhrabhoomi.net. ఆంధ్రభూమి.
  2. Farin, Hunt (1 January 1999). The India-China opium trade in the nineteenth century (1 ed.). North Carolina: Jefferson.
  3. Brown, Judith Margaret (1972). Gandhi's Rise to Power, Indian Politics 1915-1922: Indian Politics 1915-1922. New Delhi: Cambridge University Press Archive. pp. 384. ISBN 978-0-521-09873-1.
  4. "The Telegraph - Calcutta (Kolkata) | Bihar | Gandhi heritage cries for upkeep". www.telegraphindia.com. Archived from the original on 2017-08-04. Retrieved 2017-08-04.
  5. "The story of Champaran Satyagraha, India's first civil disobedience movement". indiatoday.in. India Today. Retrieved 13 August 2018.