Jump to content

డల్ హౌసీ

వికీపీడియా నుండి
ది మెర్క్యూస్ అఫ్ డల్ హౌసీ
భారత గవర్నర్ జెనరల్
In office
12 జనవరి 1848 – 28 ఫిబ్రవరి 1856
చక్రవర్తివిక్టోరియా
ప్రధాన మంత్రిలార్డ్ జాన్ రస్సెల్
ది ఎర్ల్ అఫ్ డెర్బీ
ది ఎర్ల్ అఫ్ అబెర్డీన్
ది విస్కౌంట్ పాల్మెర్స్టన్
అంతకు ముందు వారుది విస్కౌంట్ హార్డింగ్
తరువాత వారుది విస్కౌంట్ క్యానింగ్
ట్రేడ్ బోర్డు ప్రెసిడెంట్
In office
5 ఫిబ్రవరి 1845 – 27 జూన్ 1846
చక్రవర్తివిక్టోరియా
ప్రధాన మంత్రిసర్ రాబర్ట్ పీల్
అంతకు ముందు వారువిలియం ఎవార్ట్ గ్లాడ్ స్టోన్
తరువాత వారుది ఎర్ల్ అఫ్ క్లారేన్దోన్
వ్యక్తిగత వివరాలు
జననం22 ఏప్రిల్ 1812
డల్ హౌసీ కాసిల్, మిడ్లోథియాన్
మరణం19 డిసెంబర్ 1860 (48 సంవత్సరాలు)
డల్ హౌసీ కాసిల్, మిడ్లోథియాన్
పౌరసత్వంబ్రిటన్ , ఐర్లాండ్
జీవిత భాగస్వామిలేడీ సుసాన్ హే (d. 1853)
కళాశాలక్రిస్ట్ చర్చి, ఆక్స్ ఫర్డ్

డల్ హౌసీ గా ప్రసిధ్ధి చెంది 1847-1856 మధ్యకాలములో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ గా భారతదేశమును పరిపాలించిన దొర పూర్తిపేరు జేమ్స్ యాన్డ్రూ బ్రౌన్ ర్యామ్సె (James Andrew Broun Ramsay, 1st Marquess of Dalhousie). ఇతని పరిపాలనకాలములో పంజాబు, సింధ్, బర్మా ప్రాంతములు బ్రిటిష్ ఇండియాలో చేర్చబడి బ్రిటిష్ వలసరాజ్య విస్తరణ చేయబడింది. ఇందుకొరకు డల్ హౌసీ చేసిన కుతంత్రములు, అక్రమ యుద్ధములు, అవలంబించిన కార్యాచరణలు నిరంకుశమైనవి. 1848- 1857 మద్యకాలమందు డల్ హౌసీ తన మిత్రులకు వ్రాసిన లేఖల ఉల్లేఖనలు చరిత్ర కెక్కినవి చూడగా అతని నిరంకుశ పరిపాలనా విధానము అబిమతములు, స్వతంత్ర రాజ్యములను ఏవిధముగా డల్ హౌసి ఆక్రమించి బ్రిటిష్ వలసరాజ్యములో కలుపుకున్నదీ విశదమగుచున్నవి (Private letters of Marquess of Dlhousie by J.G.A Baird.) అంతేకాక 1857 సిపాయల విప్లవమని ప్రసిద్ధిచెందిన భారతదేశమందలి స్వతంత్రసంగ్రామమునకు కారణం డల్ హౌసీ ప్రభువు అభిమతములు నిరంకుశ కార్యాచరణ తీరేనని ఇంగ్లండులోని బ్రిటిష్ రాజకీయనాయకులు విమర్శించారు. 1858 నవంబరు 1 వ తేదీన భారతదేశమును బ్రిటిష్ సామ్రాజ్యలో కలుపుబడినటుల రాజ్యాంగ పత్రము విడుదలచేయుచూ విక్టోరియా రాణిగారు చేసిన ప్రకటన బహుశా డల్ హౌసీ నిరంకుశ పరిపాలనలాంటివి భావికాలములో సంభవించకుండుటకోసమే ననవచ్చు. కానీ డల్ హౌసీ గవర్నర్ జనరల్ గా కొన్ని గణనీయమైన అబివృధ్ది కార్యములు కూడా చేశాడు. 1833 రాజ్యాంగచట్టమురాక ముందు బ్రిటిష్ ఇండియా కంపెనీకి వున్నట్టి చిరకాలపు వ్యాపారసంఘపు లక్షణములునింకను మిగులుయున్నవాటిని మాన్పించి బ్రిటిష్ రాజ్య రాజ్యతంత్రముల పై నెలకొల్పడిన రాజ్యపరిపాలనకొరకు విభాగములను నెలకొలిపి భావి ప్రభుతోద్యోగ చట్రమును (framework) సృష్టించి, మొదటి రైలు దారిని నిర్మింపజేసి, తంతి తపాలా పధ్ధతిని నెలకొల్పి, విద్యావిధానములలో పరివర్తన తీసుకువచ్చే ప్రణాళిక తయారుచేయుటం మొదలగు గొప్ప అభివృధ్ధి కార్యక్రమములు చేపట్టి అమలుచేసిన ఘనత డల్ హౌసీ ఫ్రభువు దే నని చెప్పక తప్పదు.[1]

జీవిత ముఖ్యవిశేషాలు (1812-1860)

[మార్చు]
లేడీ సుసాన్, డల్హౌసీ సతీమణి

స్కాట్ ల్యాండ్ దేశంలోని ఎడింబరోకి దగ్గర్లోనున్న మిడ్లోథ్యిన్ జిల్లాలో డల్ హౌసీ అనే రాజ భవంతికి ప్రభువులు (Earl) గా ప్రసిధ్ధిచెందిన ర్యామశే వంశములో 1812 ఏప్రిల్ 22 తారీఖున జన్మించెను. అందుచే డల్హౌసీ అని ప్రసిధ్ది చెందెను. తండ్రి పేరు జార్జి ర్యామశే, 9వ డల్ హౌసీ ప్రభువుగను(Earl) కెనడాకు గవర్నర్ జనరల్ గనుండినవాడు. తల్లి పేరు క్రిస్టియన్. బాల్యమునందు విద్యాభాసము 1823 స్కాట్ లాండులోని ప్రముఖమైన పాఠశాలలో ప్రారంభించి 1829 లో ఆక్సఫోర్డులోని క్రిస్టు చర్చి కాలేజీలో 1832 దాకా చదువుసాగిన తరువాత 1836 లో మాడమ్ సుసాన్ తో వివాహం జరిగింది. 1837 లో టోరీ (కన్జర్వేటివ్) పార్టీ అధికారములోనుండెడి రోజులలో బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడయ్యెను. ఇంగ్లండు బోర్డు ఆఫ్ ట్రేడ్ కు 1843 లో ఉపాధ్యక్షునిగను, 1845-46 లో అధ్యక్షునిగ పనిచేసే రోజులలో ఇంగ్లండు లోని రైల్వే రహదార్ల సమశ్యలను విజయవంతముగా పరిష్కారము చేసి కార్యసాధకుడని పేరు పొందినందువలన ఇంగ్లండులో ప్రతిపక్ష రాజకీయ పార్టీ విఘ్ (లిబరల్సు) అధికారములోకి వచ్చిననూ కనజర్వేటివ పార్టీవాడైన డల్ హౌసీ దొర భారతదేశానికి 1847 లో గవర్నర్ జనరల్ గా నియమించబడినాడు . 1848 నుండి 1856 దాకా భారతదేశములో గవర్నరజనరల్ పదవిలో కార్యాచరణ ద్వారా రాజ్యతంత్రములతోనూ, కొన్ని యుద్ధములు సలిపియూ అనేక ప్రముఖ స్వతంత్రరాజ్యములను బ్రిటిష్ ఇండియాలో కలిపి వలసరాజ్య విస్తీర్ణముచేసి, 1856 పదవీ విరమణచేసి ఇంగ్లండుకు తిరిగి వెడలిపోయాడు. భారతదేశములో సంభవించిన 1857 సిపాయల విప్లవమునకు డల్ హౌసీ దొర అవలంబించిన నిరంకుశమైన అభిమతములే కారణములని ఇంగ్లండులోని రాజకీయ నాయకులు, చరిత్రకారుల అభిప్రాయము. స్కాట్ ల్యాండులోని తన స్వస్తళమైన డల్ హౌసీ భవంతిలో 1860 డిసెంబరు 19 వతేదీన మరణించాడు. డల్ హౌసీ దినచర్యగా కార్యాచరణ సూత్రములు జీవితాంతము రచించినవి విశేషమైన పరిపాలనా సిధ్దాంతములు(Manual of administration) గా బ్రిటిష్ పార్లమెంటు గుర్తించి భావి పరిపాలకులకు మార్గదర్శకమగునవిగా ప్రచురించబడినవి.

కార్యాకాలమందలి ముఖ్యాంశాలు (1848-1856)

[మార్చు]

డల్ హౌసీ కార్యకాలములోని ముఖ్యాంశములు (1) భారతదేశములో బ్రిటిష్ వలసరాజ్య విస్తారణ జరిగింది. అప్పటిదాకా పంజాబు, బర్మా స్వతంత్రరాజ్యములుగానుండినవి బ్రిటిష్ రాజ్యపరిపాలనలోకి తీసురాబడినవి. అందుకొరకు యుద్ధములు, రాజ్యతంత్రములతో కూడిన రాజ్యాక్రమణలు చేసి బ్రిటిష్ రాజ్యమును విస్తరించాడు.(2) బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీయొక్క రాజ్యపాలనా దక్షత పెంపుదల చేయుటకు ఆ కంపెనీ అప్పటివరకూ(1833) వర్తక సంఘపు పాత వ్యాపారక లక్షణములు ఇంకా మిగిలియున్నవాటిని పూర్తగా తుడిపి రాజ్యాపాలనమునకు కావలసిన రీతిలోకి తీసుకువచ్చాడు. (3) పరిపాలక, సాంఘిక, సామాజకమునకు సంబంధించిన కొన్ని గణనీయమైన సంస్కరణలు, దేశాభివృధ్దికి రోడ్డు, రైలు మార్గములు, సాగునీటి కాలువలు, విద్యాభివృధ్దికి కార్యప్రణాళికలు మొదలగు ప్రశంసనీయమైన కార్యక్రమాలు కూడా చేశాడు. అతను చేసిన కార్యాచరణలలో అక్రమ యుద్ధములు, రాజ్యతంత్రముల ద్వారా అక్రమ రాజ్యాక్రమణలు ముఖ్యాంశములు

సిక్కుల సామ్రాజ్య చరిత్ర, సిక్కులతో బ్రిటిష్ వారి యుద్దములు

[మార్చు]

18-19వ శతాభ్దపు భారతదేశ సామ్రాజ్యములు, రారాజుల చరిత్రలలో లాగనే సిక్కు సామ్రాజ్యము కూడా వారసత్వపు వైషమ్యాలు, అంతఃకలహములు, రాజద్రోహములవల్లనే విఛ్చినమౌతున్న స్థితిలో17వ శతాబ్దమునుండి బ్రిటిష్ వలసరాజ్యమును విస్తరించుటకు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వారు చేసిన యుద్ధములు, రాజ్యతంత్రములు, సంధి వడంబడికలతో బ్రిటిష్ వారి వశమై 1849 నాటికి బ్రిటిష్ వలసరాజ్యమైన బ్రిటిష్ ఇండియాలో పూర్తిగా కలసి అంతరించిపోయింది. బ్రిటిష్ వారి వశమైన ఆఖరి భారతీయ సామ్రాజ్యము సిక్కు సామ్రాజ్యము మని చెప్పవచ్చును. మొదట 1765 లో మొగల్ సామ్రాజ్యము పతనారంభమై నది. తరువాత టిప్పుసుల్తాన్ పరిపాలించిన మైసూరు రాజ్యము 1799లో అంతరించింది. అటుతరువాత శివాజీ మహారాజు స్థాపించిన మహారాష్ట్ర సామ్రాజ్యము 1818 లో రూపుమాసిపోయినది, అంతతః మహారాజ రంజీత్ సింగ్ స్థాపించిన సిక్కు సామ్రాజ్యము 1849 లో డల్ హౌసీ కార్యకాలములో రెండవ సిక్కు యుద్ధముతో అస్తమించి బ్రిటిష్ వారి వలసరాజ్యములో కలిపివేయబడింది. 18 వ శతాబ్దము చివరిలో సిక్కు సామ్రాజ్యమును స్థాపించి లాహోర్ ను రాజధానిగాచేసుకుని పిరిపాలించిన మహారాజా రంజీత్ సింగ్ 1801- 1839 మధ్యకాలములో బ్రిటిష్ కంపెనీ వారితో సన్నిహిత సంబంధములు కలిగియుండెను. అతని కాలమందు సిక్కుల సామ్రాజ్యము ఇప్పటి పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతములు (ముల్తాన్ చుట్టుపట్ల),భారతదేశములోని ఇప్పటి పూర్తి పంజాబు రాష్ట్రము, హిమాచల్ ఫ్రదేశ్ కొంత, జమ్మూ –కాశ్మీరములో కొంత భాగము కలసియుండిన చాల విశాలమైన భూభాగము. పరిపాలన రీత్యా లాహోర్, ముల్తాన్, పెషావర్, కాశ్మీర్ రాజ్యముల క్రింద విభజించబడియుండెను. 1839 లో రంజీత్ సింగ్ మరణించిన తరువాత వారసు డైన రంజీత్ సింగ్ కుమారుడే కాక అతని కూమారుడు కూడా వెంటవెంటనే హతమార్చబడ్డారు. పంజాబ్ రాజ్యములోని సింధన్ వాలియాలు, డోగ్రాలు అను రెండు పక్షముల మధ్య అధికారముకోసం విభేదములు వచ్చినవి. రంజీత్ సింగ్ కుమారుని అక్రమసంతానమైన మనుమడు షేరసింగ్ ను 1841 లో డోగ్రాలు పంజాబ్ రాజుగా చేయగలిగారు. కాని స్వల్పకాలములోనే షేర్ సింగ్ కూడా హత్యచేయబడుట, తదనంతరం కూడా డోగ్రా పక్షమువారే పైచేయిగానుండి పంజాబును రంజీత్ సింగ్ వంశీయులగు డోగ్రాలనే సింహాసనాధీశులుగాచేసి పంజాబును పరిపాలించుచుండిరి. 1845 లో జరిగిన మొదటి సిక్కు యుధ్దము నకు కారణము 1843 లో బ్రిటిష్ కంపెనీ వారు సింధ్ ప్రాంతములను ముట్టడించి ఆక్రమించుటవలన మొదలైనది. అప్పటినుండి పంజాబ్ రాజులకు, బ్రిటిష్ కంపెనీ వారికీ విభేదములేర్పడి క్రమేణా 1845కి పూర్తియుధ్దస్తాయికి చేరుకుని సట్లేజ్ నదీ సమీపములోని ఫిరోజ్ పూర్లో మొదటి సిక్కు-బ్రిటిష్ యుద్ధము జరిగి 1846 లో లాహోర్ సంధితో సిక్కు రాజ్య పతన ప్రారంభమైనది. ఆ మొదటి యుద్ధములో పంజాబు రాజ్యములోని రాజద్రోహులు కొందరి సహాయ సహకారంతో బ్రిటిష్ సైన్యములు విజయము సాధించగలిగారు.

రెండవ సిక్కు యుద్దము (1848-49)

[మార్చు]

రెండవ సిక్కు యుద్ధము 1848 ఏప్రిల్ లో ముల్తాన్ రాజ్యాదికారము బ్రిటిష్ వారు వహించుటకు దివాన్ ముల్రాజ్ వద్దకు పంపబడ్డ బ్రిటిష్ ప్రతినిధులు హత్యచేయబడటంతో పరిస్థితులు యుధ్దసిద్దములైనవి గానీ అప్పుడు వెంటనే బ్రిటిష్ వారు యుద్ధమునకు దిగక నవంబరు- 1848 డిసెంబరులో ఇంకా రెండుమూడు చోట్ల పూర్తిస్తాయి సైనిక చేసి విజయ పరంపరలతో చివరగా జనేవరి 1849లో ముల్తాన్ కోటను కైవశం చేసుకున్నారు. అటుతరువాత 1849 ఫిబ్రవరిలో చివరగా రావల్ పిండిలో సిక్కు సైన్యము పూర్తిగా ఓడించి పంజాబు రాష్ట్రమును బ్రిటిష్ ఇండియాలో కలిపివేశాడు. ఆ ఘనకార్యమునకు డల్హౌసీ ప్రభువుకు (10th Earl of Dalhousie) మార్కిస్ అను ఉన్నత బిరుదు చే సత్కరించబడినాడు. అప్పటినుండి మొదటి మార్కిస్ డల్ హౌసీ (1st Marquess of Dalhousie) అని ప్రసిధ్ధి చెందాడు.

బర్మా బ్రిటిష్ బర్మాగా మారిన చరిత్ర

[మార్చు]

భారతదేశానికి ప్రక్కన తూర్పులోవున్న దేశములు బర్మా, సింగపూరు మరియూ చైనా. చైనాతో సరిహద్దులు గల పై బర్మాకీ బంగళాఘాతము తీరమువైపుయున్న క్రిందిబర్మా లోని రాజ్య పరిపాలకులమద్య చిరకాల వైషమ్యాలుు యుద్ధములు జరుగుచుండెను. క్రింది బర్మా రాజ్యమునకు రాజధాని ఆవా లేదా (ఇంవా). ఆ రాజ్యమునకు ముఖ్యమైన నౌకా కేంద్రము రంగూన్ లేదా యాంగూన్. భారతదేశము, సింగపూరు కూడా 18వ శతాబ్దమునాటికే (బర్మాకన్నా ముందుగనే) బ్రిటిష్ వారికి వలస రాజ్యములైనవి. భారతదేశములో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వారి రాజ్యపాలన జరుగుచుండెను. చాలాకాలము వ్యాపార సంస్థగానుండిన బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీని 1833 నుండి వ్యాపార సంస్థగా కాక లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వమునకు రాజ్యపాలక ప్రతినిధిగా చేయబడినప్పటికీ, వెనుకదారిలో వ్యాపారపు వ్యవహారములు సాగుచుండుటవలన కలకత్తానుండి సింగపూరుకు నేరుగా సముద్రమార్గమున వీరి సరకులరవాణా రాకపోకల వల్ల మద్యలోనున్న క్రింది బర్మాకు సంకటముగానుండేడిది. బ్రిటిష్ వారికి చైనా, వ్యాపార రీత్యా సుముఖమైన దేశము. క్రింది బర్మా రాజ్యము 19 శతాబ్దము మొదటిలో సయాం రాజ్యము (థైలాండ్) లోని ఆరకన్ పర్వత పరగాణాల పై దండయాత్రచేసి 1813 లో మణిపూర్ను 1817-19మధ్య అస్సాంను ఆక్రమించటంతో భారతదేశములోని వంగరాష్ట్రము (ఇప్పటి పశ్చమ బెంగాల్ రాష్ట్రము+ బంగళా దేశములోని చిట్టకాంగ్ ) సరిహద్దు దాకా వ్యాపించింది. దాంతో అప్పటిలో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డు అమహెరెస్టు వంగరాష్ట్రమును పరిపాలించుచున్న దొర బర్మాలోని ఆవా (ఇన్వా)ను రాజధానిగా చేసుకుని క్రిందిబర్మాను పరిపాలించుచున్న రాజు బోడవ్పాయ పై యుద్ధము ప్రకటించాడు. తత్ఫలితముగా జరిగినది మొదటి బర్మా యుద్ధము 1824-26 లో. ఆయుధ్ధములో సయాం అనబడిన ఇప్పటి థైలాండ్ బ్రిటిష్ వారి మిత్రపక్షముగా పాలుపంచుకున్నది. మొదటి బర్మాయుద్ధములో బర్మా ఓడిపోయి బ్రిటిష్ వారితో 1826 సంవత్సరము చేసుకున్న సంధి ( యండబూ సంధి )ప్రకారము అస్సాం, మణిపూర్, ఆరకన్ మరియూ టెన్నెసీర్యమ్ పరగణాలు బ్రిటిష ఇండియా వశమైనవి. అంతేకాక రంగూన్ (యాంగూన్) సముద్రతీరములోనున్న బ్రిటిష్ నౌకలకు రక్షణ కలిపించే బాధ్యత రంగూన్ లోనున్న బర్మారాజ్య ప్రతినిధి పైనుంచబడింది. ఆ మొదటి బర్మాయుద్ధముతోనే క్రిందిబర్మా బ్రిటిష్ బర్మాగా మారుటకు అంకురార్పణమైనది. రెండవ బర్మాయుద్ధముతో (1852) క్రిందిబర్మా రంగూన్ తో సహా బ్రిటిష బర్మాగామారిపోయింది. 1885 నాటికి మూడవ బర్మా యుద్ధానంతరం బర్మామొత్తం దేశమంతయూ బ్రిటిష్ వలసరాజ్యమై బ్రిటిషఇండియాలో భాగముగా పరిపాలింపబడింది.

రెండవ బర్మా యుద్దము (1852)

[మార్చు]

డల్ హౌసీ కార్యకాలమందు జరిగిన రెండవ బర్మా యుద్ధము (1852) అకారణమైన సైనిక చర్య కేవలము డల్ హౌసీ దొర అభిమతముపైన జరిగినదని చరిత్రలో విశదమగుచున్నది. రంగూన్ పరిపాలకుడు బర్మా రాజ్యప్రతినిదిగా బ్రిటిష్ వారి నౌకలకు తగు రక్షణకలిగించలేదని నెపముచూపి చిలిపికారణములు కలిగించి విభేదమును పెంచిన డల్ హౌసీ ప్రభుత్వము వారు రంగూన్ గవర్నర్ ను తీసివేయబడినప్పటికీ సద్దుకోక యుద్ధమునకు దిగారు. ఆ 1852 సైనిక చర్యతో క్రింది బర్మాలోని మూడు సముద్రతీరములు మత్తమా (ఇప్పటి మరతబన్), రంగూన్ (ఇప్పటి యాంగూన్) మరియూ బస్సీన్ (ఇప్పటి పసీన్) ఆక్రమించారు. తరువాత 1853 లో అరకన్ పర్వత పరగణాలోని ఇర్రవాడి నదీ తీరమందలి ప్రొమే (ప్యాయ), పెగూ యోమా ఆక్రమించారు. ఆవా లోని బర్మారాజు అసహాయుడై తలవంచక తప్పలేదు. బర్మాలోని ఈ ప్రాంతములను బ్రిటిష్ ఇండియా వలసరాజ్యములోకలుపుకోడానికి డల్ హౌసీ దొర చేసిన ఆ అక్రమ సైనిక చర్య తీవ్రముగా విమర్శించబడింది.[2]

బ్రిటిష్ వలసరాజ్య విస్థరణకు అవలంబించిన రాజనీతి, డల్ హౌసీ కార్యాచరణ సమీక్ష

[మార్చు]
డల్హౌసీ చిత్రపటం, జాన్ వాట్సన్-గోర్డాన్ చేత గీయబడినది, 1847.

భారతదేశములో బ్రిటిష్ వలసరాజ్య విస్తరణకు 18 వ శతాబ్దములో బ్రిటిష్ కంపెవీ ప్రతినిధులు రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సు అనేక కుతంత్రములు, యుద్ధములు చేయగా తదుపరి కాలములో వచ్చిన గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ఇంకో కొత్తమార్గం కనిపెట్టి అనుబంధ సమాశ్రయమను (subsidiary alliance) రాజ్యతంత్రముతో కూడిన రాజనీతిని అమలుచేసి వలసరాజ్య విస్తరణచేశాడు. డల్ హౌసీ దొర ఆ మార్గములనే కాక ఇంకా కొత్త విధానము చే వలస రాజ్య విస్తరణ చేశాడు. యుద్ధములుచేసి కొన్ని స్వతంత్రరాజ్యములను తన బ్రిటిష్ వలసరాజ్యములో కలుపునుటయు, యుద్ధములు చేయకుండా రాజ్యకుతంత్రములు ప్రయోగించి ఇంకా కొన్ని స్వతంత్రరాజ్యములను కలుపుకుని భారతదేశములోని బ్రిటిష్ వలసరాజ్యమును విస్తరించాడు. బ్రిటిష్ వారి ఆధిక్యత, దొరతనం(European superiority) నిలబెట్టుకునటయే అతని లక్ష్యముగానుండిన రాజనీతి. అతను అవలంబించిన అబిమతములు (1) స్వతంత్రరాజ్యములను పరిపాలించుచున్న రాజు వారసుడు లేకుండా మరణించినచో వారసుడును దత్తతచేసుకునటకు ముందు రాజ్యము బ్రిటిష్ కంపెనీ ప్రభుత్వమును అనుమతి అడుగవలసియున్నది కావున అనుమతి యివ్వకపోయినయెడల స్వతంత్రరాజ్యపాలనా అధికారమునకు అనుమతి నవీకరణకాజాలదు అప్పుడు ఆ రాజ్యము బ్రిటిష్ ఇండియాలో కలిపివేయబడవలెననియూ (2) రెండవ అభిమతముగా దేశీయు నవాబుగాని రాజు గానీ కంపెనీ ప్రభుత్వమును సైనికసహాయంకోరినప్పుడు ప్రతిఫలముగా కొత్త జాగీరులను తీసుకుని బ్రిటిష్ వలస రాజ్యములో కలుపుకునటు. ఇది రాబర్టు క్లైవు, వారన్ హేస్టింగ్సుల పాత కుతంత్రమైనా ధనము బదులు జాగీరులే తీసుకునట డల్ హౌసీ దొర అవలంబించిన అభిమతము. (3) స్వతంత్ర రాజు పరిపాలనలోఅవకతవకలున్నవని కారణము (4) నాలుగవ అభిమతముగా దేశీయ రాజులుకు, నవాబులకు రాజకీయ లాంఛనముగా మర్యాదలు, గౌరవములను ఉపసంరించుట. ఆ విధమైన అభిమతములు, రాజనీతి అమలుచేసి అనేక స్వతంత్రరాజ్యములను బ్రిటిష్ వలస రాజ్యములో కలిపివేసి తమ బ్రిటిష్ రాజ్య విస్తరణ చేశాడు. రాజ్య విస్తరణ చేయుటవలన తమకు రాజస్వ ఆదాయము పెరుగునను ఉద్దేశము కలిగియుండవచ్చు. అందుచే రాజస్వము అధికముచేసి ఆర్థిక స్థితి మెరుగు పర్చడానికి ప్రయత్నించాడు. ఆవిధముగా అంతమొనర్చిన రాజ్యములు (1)1848లో సతారా, (2) 1852-53 లో క్రిందిబర్మా రాజ్యములోని అనేక భూభాగామలను చిలిపికారణములు చెప్పి, భారతదేశములోని తమ రాజ్య సరిహద్దు దాకా విస్తరించిన ఏ ఇతర రాజ్యములను సహించరాదన్న అభిమతముతో యుద్ధమునకు దిగి బర్మారాజును ఓడించి బ్రిటిష్ ఇండియాలో కలుపుకున్నవి అరకన్ పర్వత పరగణాలు, రంగూన్, పెగూయోమా. ఈ భూభాగమల వలన విస్తరించిన బ్రిటిష్ వలసరాజ్యమువలన రాజస్వము అధికమగునని ఆశించిన డల్ హౌసీ దొర ఆశలు నిరాశలైనవి. పైపెచ్చు రాజ్యపాలక ఖర్చులు అధికమైనవి. (3) 1854 లో నాగపూరు మరియూ ఝాన్సీ (4)1856లో అయోధ్య రాజు పరిపాలనలో అవకతవకలున్నవని కారణముచే అతనిని పదభ్రష్టనిచేసి అయోధ్యరాజ్యమును తన బ్రిటిష్ రాజ్యములో కలుపుకున్నాడు. (5) సైనిక వ్యయములక్రింద హైదరాబాదు నవాబుదగ్గరనుండి బీరార్ను కలుపుకున్నాడు. (6)దేశీయ రాజులకు నవాబులకు పాతకాలపు మర్యాదలు, హోదాలు తీసివేసెను. చిరకాలమునుండి బ్రిటిష్ వారికి సానుకూలమైన రాజులను కూడా పదబ్రష్టులుగ చేసి వారి రాజ్యములను తమ వలసరాజ్యములో కలుపుకున్నాడు. (7) దేశీయ సైనికులకు వారి మతవిరుద్దములైన ఆధేశములుగా పరిగణింపబడినట్టి విదేశ సముద్రయానము(బర్మాయుద్ధమునకు దేశీయ సైనికులను పంపుటకిచ్చిన ఆదేశములు) (8) 1855 లో దేశములో మొట్టమొదటిసారిగా నిర్మించిన రైలు మార్గము బుద్ధిపూర్వకముగనే సైనికసిబ్బంది, ఖణిజసంపదలు తరలించుటకు ఉపయోగపడి బ్రిటిష్ వారి ఆర్థికాభివృద్దకి తోడ్పడినది గానీ ప్రజలు, రైతుల రాకపోకలకుపయోగపడేదిగా చేయలేదు. పై చెప్పిన ఏడు అక్రమ కార్యాచరణతో పాటు డల్ హౌసీ అభివృధ్ది కార్యక్రమములు చేపట్టి మొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వము వారిచే భారతదేశములో దేశాభివృద్ది, ప్రజాక్షేమకార్యక్రమములకు విశేష ఆర్థిక వ్యయముతో పెద్దఎత్తున పెట్టుబడి పెట్టించిన ఘనత గవర్నర్ జనరల్ డల్ హౌసీ కే. అంతేకాక కొన్ని సామాజిక, సాంఘికాభివృద్దికి, విద్యాబివృధ్దికి తోడ్పడే సంస్కరణలు కూడా చేశాడు. అంతేకాక పరిపాలనా దక్షత చూపు మార్గదర్శకములగు సూత్రములును దినచర్యగా రచించినవి డల్ హౌసీ దినచర్యగా కార్యాచరణ సూత్రములు జీవితాంతము రచించినవి విశేషమైన పరిపాలనా సిధ్దాంతములు(Manual of administration) గా బ్రిటిష్ పార్లమెంటు గుర్తించి భావి పరిపాలకులకు మార్గదర్శకమగునవిగా ప్రచురించబడినవి.

డల్ హౌసీ చేసిన అభివృధ్ది కార్యక్రమములు, పరిపాలక, సాంఘిక సామజక సంస్కరణలు

[మార్చు]

(1)కలకత్తా నుండి ఢిల్లీ, పంజాబు రాష్ట్రమునకు ఘనమైన జాతీయ రహదారి (ట్రంకు రోడ్డు) నిర్మాణము (2) సైనిక సదుపాయములకోసము సరుకులరవాణాలకు చేసిన రైలు మార్గముల నిర్మాణము బ్రిటిష్ పరిపాలకులకు ఆర్థికంగా లాభదాయకమైనది. ప్రజల రాకపోకలకు చేసియుండలేదు. (3) తంతి తపాలా పధ్దితి నెలకొల్పి దేశాభివృధ్దికి గొప్ప మార్గదర్శనమైన పనిసాధించాడు (4) వంగరాష్ట్ర పరిపాలనా యంత్రాంగములో మొట్టమొదటిసారిగా లెఫ్టనెంన్టు గవర్నరును నియమించి పరిపాలన పటిష్ఠముచేశాడు (5) ప్రజాసేవకోద్యోగ (పబ్లికవర్క్సు) విభాగమును నెలకొల్పెను (6) సాగునీటి సేద్యముకోసము పెద్దఎత్తున గంగానదీ కాలువల త్రవ్వించి సాగునీటి సదుపాయములు కలుగజేయుట చాల విశేషమైన పని (8) ఆదునిక వున్నత విద్యావిధానము ప్రవేశపెట్టెను (9) వితంతు వివాహములను చట్టబద్దమైనవిగ చేయుటవలన మూఢాచారములు తొలగిపోవుటకు దోహమైనది

బయటి లింకులు

[మార్చు]

https://en.wikipedia.org/wiki/Sikh_Empire

https://en.wikipedia.org/wiki/James_Broun-Ramsay,_1st_Marquess_of_Dalhousie

మూలాలు

[మార్చు]
  1. “The British Rule in India” D.V.Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల,బెజవాడ pp 210-215
  2. Macropedia Britannica 15th Edition (1984)vol.3. pp512

==

==

"https://te.wikipedia.org/w/index.php?title=డల్_హౌసీ&oldid=4077037" నుండి వెలికితీశారు