Jump to content

వెల్లెస్లీ

వికీపీడియా నుండి
The Most Honourable The Marquess Wellesley KG PC PC (Ire)
వెల్లెస్లీ


పదవీ కాలం
8 December 1821 – 27 February 1828
ప్రధాన మంత్రి The Earl of Liverpool
George Canning
The Viscount Goderich
చక్రవర్తి George IV
ముందు The Earl Talbot
తరువాత The Marquess of Anglesey
పదవీ కాలం
12 September 1833 – November 1834
ప్రధాన మంత్రి The Earl Grey
చక్రవర్తి William IV
ముందు The Marquess of Anglesey
తరువాత The Earl of Haddington

పదవీ కాలం
6 December 1809 – 4 March 1812
ప్రధాన మంత్రి Hon. Spencer Perceval
చక్రవర్తి George III
ముందు The Earl Bathurst
తరువాత Viscount Castlereagh

పదవీ కాలం
18 May 1798 – 30 July 1805
ప్రధాన మంత్రి William Pitt the Younger
Henry Addington
చక్రవర్తి George III
ముందు Sir Alured Clarke
(provisional)
తరువాత The Marquess Cornwallis

వ్యక్తిగత వివరాలు

జననం 20 June 1760 (2024-12-23UTC00:54:26)
Dangan Castle, County Meath
మరణం 1842 సెప్టెంబరు 16(1842-09-16) (వయసు 82)
Knightsbridge, London
జాతీయత Irish
రాజకీయ పార్టీ Tory
జీవిత భాగస్వామి (1) Hyacinthe Gabrielle Roland
(1766–1816)
(2) Marianne Caton (d. 1853)
పూర్వ విద్యార్థి Christ Church, Oxford

లార్డు (మార్నింగటన్) వెల్లెస్లీ (1760-1842)లేదా వెల్లెస్లీ అని ప్రసిధ్ధిచెందిన రిచార్డు కొల్లి ( మార్నింగటన్) వెల్లెస్లీ (Richard Collie (Mornington) Wellesley) బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్. కారన్ వాలీసు తరువాత సా.శ. 1797 లో గవర్నర్ జనరల్ పదవిచేపట్టే నాటికి బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వ్యాపార సంస్థ రాజ్యపాలనచేయటం ప్రారంభించి భారతదేశములో వలసరాజ్య విస్తరణ చేయు లక్ష్యసాధనతో పురోగమించుచున్నది . రాజ్యతంత్రములతో సాధించిన ప్లాసీయుద్దం విజయానంతరం బ్రిటిష్ కంపెనీ వారికి 1757 లో వంగరాష్ట్రం స్వాదీనమైనది. 1765 లో బక్సరు యుద్దం విజయముతో మొగలు చక్రవర్తి రెండవ షా ఆలం ఇచ్చిన ఫర్మానాతో బీహారు, ఒరిస్సా, వంగ రాష్ట్రములలో రాజస్వము వసూలు చేసుకును (దివానీ గిరి )హక్కేకాక దక్షిణ భారతదేశములోని ఉత్తర సర్కారులు లోనూ, కర్నాటక రాజ్యములోనూ రాజ్యపాలనాధికారములు కలిగినవి. 18వ శతాబ్దములో కలిగిన ఆ విశేష ఉపలబ్ధితో వెల్లస్లీ కూడా రాజ్య తంత్రములతోనే 19 వ శతాబ్ధారాంభములో వలస రాజ్యమును విస్తారణ చేయటమేగాక భారతదేశములో బ్రిటిష్ కంపెనీ ఆదిపత్యమును, సార్వభౌమత్వమును చాటి నిరూపించాడు. ఆయన కాలములో బ్రిటిష్ ఇండియా నొక అతిపెద్ద వలసరాజ్యమైనది.[1]

జీవిత ముఖ్యాంశాలు

[మార్చు]

వెల్లెస్లీ తండ్రి, గారెట్టు వెల్లెస్లీ (Garret Wesley) మార్నింగటన్ ఎర్ల్ అను ఐర్లాండు హోదా గల మొదటి ప్రభువు ( 1st Earl of Mornington) అగుటచే మార్నింగటన్ వెల్లస్లీ అని కూడా అంటారు. ఇంటి పేరు మొదట వెస్లీ (WESLEY) అనియుండినది తరువాత వెల్లెస్లీ (WELLESLEY) అని వాడుకలోకి వచ్చింది. వెల్లెస్లీ సోదరుడు,ఆర్ధర్ వెల్లెస్లీ, వెల్లింగటన్ అను చిన్న బ్రిటిష్ వలసరాజ్యమునకు సింహాసనవారసుడైన డ్యూక్ (Duke of Wellington) అనబడు హోదాకలవాడు. అందుచే వెల్లింగటన్ వెల్లెస్లీ (Wellington Wellesley) అని కూడా ప్రసిధ్దిెచెందిన ఆర్ధర్ వెల్లెస్లీ ఫ్రాన్సుదేశ యుధ్దవీరుడైన నెపోలియన్ను బెల్జియమ్ లోని వాటర్లూ ( 1815 జూన్)లో ఓడించిన ప్రగతి గలవాడు, తరువాత బ్రిటన్ దేశానికి ప్రధాన మంత్రిగా నియమింప బడినాడు (జనేవరి 1828). గవర్నర్ జనరల్గా చేసిన మన రిచార్డు వెల్లెస్లీ 1760 జూన్ 20 తేదీన ఐర్లాండులో జన్మించెను. విస్కౌంటు (Viscount) అను రాజవంశ హోదాతో పిలువబడియున్నాడు. విస్కౌంటు అను రాజవంశీయ హోదా బరాన్ (BARON) కన్నా పైన ఎరల్ (EARL) కన్నా తక్కువ హోదా) . ఇంగ్లండ్ (England) లోని ఈటన్ కాలేజీలోను, ఆక్సఫొర్డు లోనూ చదువుకున్న తరువాత 1781 లో తండ్రి మరణానంతరం ఐర్లాండు పార్లంమెంటు (ఐర్లాండు హౌస్ ఆఫ్ లార్డ్సు)లో సభ్యుడైనా తరువాత మార్నింగటన్ అను హోదాకలిగినది. 1784 లో ఇంగ్లీషు పార్లమెంటు (హౌస్ ఆప్ కామన్సు) సభ్యుడైయ్యెను. ఐర్లాండు పార్లమెంటులోనున్నంతకాలం 1797 దాకా మార్నింగటన్ అను హోదాకలిగియున్నాడు. విలియం పిట్టు బ్రిటిష్ ప్రధానమంత్రిగా యున్న కార్యకాలం (1783-1801)లో ఆర్థిక విభాగమునకు అధిపతిగానైయ్యెను. 1793లో బ్రిటిన్ రాజుయొక్క మంత్రాలోచన సభలో (ప్రీవీకౌన్సిల్లో (Privy Council) సభ్యుడుగనూ, ఇండియా వ్యవహారాల బోర్డు (India Board of Control) లో కమీషనర్ గనూ నియమింపబడెను. 1794 లో రోల్లండుతో వివాహం. 1797లో బ్రిటిష్ ఈస్టు డియా కంపెనీకి గవర్నర జనరల్ గా నియమింపబడెను. 1797 లో మార్క్విస్ (MARQUESS) అను హోదా ఇవ్వబడింది. వెల్లెస్లీ గవర్నర్ జనరల్ కార్యకాలంలో కంపెనీ డైరెక్టర్ల కూటమి (కోర్టు ఆఫ్ డైరెక్టర్లు) (Court of Directors) అభిమతాలు అనుసరించక వారితో విభేదములు కలిగి రెండుమూడు సార్లు పదవీ విరమణకు ముందుకువచ్చాడు. అంతేకాక, అప్పటిలో ఫ్రెంచివారితో జరుగుచున్న విభేదముల విషయములో బ్రిటిష ప్రభుత్వమువారిచ్చిన ఉత్తర్వులును కూడా త్రోసిపుచ్చాడు. దాంతో 1805 లో కంపెనీ పైఅధికారులు వెల్లస్లీదొరను వెనక్కి పిలిపించారు. అంతేకాక ఫార్లమెంటులో ఆరోపణాభియోగము (ఇంపీచ్మెంటుImpeachment) ప్రవేశపెట్తారన్న పరిస్థితి కలిగినది. 1809 లో స్పైన్ దేశానికి బ్రిటిష్ రాజదూత (Ambassador)గా నియమింపబడినాడు. 1809 లో బ్రిటిష్ ప్రధానమంత్రి గానున్న స్పెంసర్ పెర్సెవల్ (SPENCER PERCEVAL) మంత్రిపరిషత్తులో విధేశ వ్యవహారాల మంత్రిగానియమింపబడెను. కానీ ఆ పదవీ బాధ్యతలు నడుపుచున్న కాలమందు కూడా చాలా విభేదములకు గురై 1812 లో విరమణ చేశాడు. ఐర్లాండులోని రోమన్ కాతలిక్ (Roman Catholic) క్రైస్తవ మతస్తులకు రాజకీయ హక్కులు కల్పించాలని సంకల్పముకలవాడగుటచే అక్కడి రాజకీయనాయకులతో విభేదముకలిగినది. 1812 మేనెలలో ప్రధానమంత్రి పెరసెవల్ హత్యచేయబడిన తరువాత అప్పటిలో బ్రిటిష్ యువరాజు (Prince Regent)గానున్న జార్జి ప్రేరణపై వెల్లెస్లీ దొర ప్రధానమంత్రి పదవికిపోటీచేశాడు గానీ గెలుపొందలేదు. తరువాత 1821 లో ఐర్లాండుకు వైసరాయిగా నియమింపడ్డాడు. ఆ కార్యకాలంలో ఐర్లండులోని రోమన్ కాతలిక్ క్రైస్తవ మతస్తుల పక్షంనిలచి వారికి రాజకీయంగాహక్కులకోసం ప్రయత్నించుటవలన అప్పటికి రాజుగా నున్న నాలుగవ జార్జి (King George IV) అప్రసన్నుడైనందున పదవినుండి తొలగింపబడే పరిస్థితిలో వెల్లెస్లీ సోదరుడైన ఆర్ధర్ వెల్లెస్లీ ( వెల్లింగటన్ డ్యూక్) బ్రిటిష్ ప్రధానమంత్రిగా నియమింపబడినాడు. వెల్లింగటన్ వెల్లెస్లీ కూడా ఆ విషయములో భిన్నాభిప్రాయుడైనందున మన రిచార్డు వెల్లెస్లీ దొర ఐర్లాండు వైసరాయిగా పదవీ విరమణచేశాడు. తరువాత భ్రిటన్ దేశములో విఘ్ ( Whig) రాజకీయ పార్టీవారు 1835 లో అధికారములోకి వచ్చిన పిదప వెల్లెస్లీని మరి ఐర్లాండుకు పంపుటకు నిరాకరించబడినందున వెల్లెస్లీ తీవ్ర వైషమ్యుతో ఆశాభంగము వెలిబుచ్చి చివరకు 1842 సెప్టెంబరు 26తేదీన మరణించెను.[2],[3]

వెల్లెస్లీ అభిమతాలు రాజ్యతంత్రముల సమీక్ష

[మార్చు]

జనరల్ వెల్లెస్లీ అఫీషియల్ డెస్పాచి ( వెల్లెస్లీ దొర తన సంస్థలోని సేనానాయకులు, రెసిడెంట్లుగా నుండిన ఉద్యోగులకు, వ్రాసిన లేఖలు, దేశీయ నవాబులకు, రాజులకు వ్రాసిన లేఖలు) వల్ల ఆయన చేసిన రాజ్య తంత్రములే కాక ఆయన సేనాదికారైన ఆర్ధర్ వెల్లింగటన్ వెల్లెస్లీ ద్వారా చేయించిన సైనికచర్యలు వెలువడి చరిత్రకెక్కినవి. అవి తెలుసుకున్నచో వెల్లెస్లీ దొర కార్యకాలము (1797-1805)లోని రాజ్యతంత్రములు, చర్యలు బ్రిటిష్ వారి అధికారమును ప్రబలము చేయుటకు, ఇచ్చటి వలసరాజ్యమును విస్తరణచేయుటకు చేసినవేననిన్నూ అది కూడా కుతంత్రములతో కూడినవనియూ తెలియుచున్నది. వెల్లెస్లీ అధికారములోకి వచ్చునాటికి పిట్టు ఇండియా చట్టము 1783 ప్రకారం ఇచ్చట రాజ్యాధిపత్యముచేయు కంపెనీ ప్రతినిధులు భారతదేశములోని స్వదేశ రాజులయొక్క ఆంతరంగిక వ్యవహారములలో జోక్యముచేసుకునకూడదని కంపెనీ కోర్టు ఆఫ్ డైరెక్టర్ల అబిమతము. కానీ వెల్లెస్లీ ఆ అభిమతమును పూర్తిగా తిరగవేసి దేశములోని స్వదేశరాజులందరినీ బ్రిటిష్ కంపెనీ వారికి విధేయులుగానుండవలెనన్న అభిమతముతో తన అధికారమును వినియోగించాడు. అనుబంధ సమాశ్రయము (subsidiary alliance) అను రాజనీతిని బలవంతముగా అమలుచేసి స్వదేశరాజులవ్యవహారాలలో జోక్యముచేసుకుని రాయబారములు, సంది పత్రములు వ్రాయించుకున్నాడు. వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గా పదవి చేపట్టేనాటి పరిస్థితులు కారణమని నెపము చెప్పుట సరికాదు. అయినాకూడా ఆకాలమునాటి పరిస్థితులు కొన్ని ఇచ్చట తెలుపవలసియున్నది. ఆంగ్లో-ఫ్రెంచి యుద్దములు చిరకాలమునుండి జరుగుచున్నవి. కానీ 18-19 శతాబ్దములోనివి భారతదేశము బ్రిటిష్ వలస రాజ్యముగా పెరుగుచున్న కాలమందు జరిగినట్టి ఆయుధ్దములకు చాలప్రాముఖ్యత నెలకొనియున్నది. 1793- 1802 మధ్యకాలంలో ఫ్రెంచి విప్లవం కారణంగా ఫ్రెంచివారికీ బ్రిటిషవారికీ జరుగుచున్న ప్రపంచయుధ్దముల వల్లనూ, 1803-1815 మధ్య ఫ్రెంచి నాయకుడైన నెపోలియన్ వల్ల అనేకదేశములలో ఉన్న బ్రిటిష్ వలసరాజ్యములు, బ్రిటిష్ అధినివేశ స్వరాజ్యములుకు ముప్పుసంభవించు పరిస్థితులునెలకొనియున్నవి. భారతదేశములో కూడా బ్రిటిష్ వారి ఆధిపత్యమునకు పగ్గములు తగిలినవి. అప్పుడు స్వదేశరాజుల సహాయ సహకారము అవసరమైనవి. వెల్లెస్లీ చేసిన రాజ్యతంత్రములతో స్వదేశ రాజులను, నవాబులనూ సంతోషపెట్టుటుకు వెల్లెస్లీ కాలములో జరిగిన యుధ్దములు సలిపి కైవశముచేసుకున్న భూభాగములను, సంధి-వప్పందాలుతో సంపాదించిన భూభాగములనూ దేశీయ రాజులకిచ్చి (కొన్నిచోట్ల విక్రయించి) వారి నెయ్యము కోరినాడు. అంతేకాక, గవర్నర్ జనర్ వెల్లెస్లీ దొర ముందుచూపుతో భారతదేశములో తమవారి ఆధిపత్యము సన్నగిల్లకుండా నుండుటకు, స్వదేశ రాజులు సంస్థానాధీశులు ఫ్రెంచివారితో స్నేహం, సైనిక సహాయం కోరకుండానుండుటకునూ, బ్రిటిష్ సంస్థతో స్నేహంగావుండి, బ్రిటిష్ సైనికదళాలను రక్షణకొరకు వారి వారి సంస్ధలలో నుంచుకుని పోషించు నటులనూ, బ్రిటిష్ కంపెనీవారి ప్రతినిధిని రాయబారిగా (రెసిడెంటు) గా వారి కొలువులో నుంచుకొనునటులనూ, బ్రిటిషవారి అనుమతిలేనిదే యితరులతో యుధ్ధముగానీ, శాంతి సంధి గానీ చేసికొనకుండునటులనూ ఒడంబడికలు వ్రాయించుటకు రాయబారములుచేశాడు. సంధిపత్రాలద్వారా వప్పందాలు చేసుకున్నాడు. కొన్ని సంధి పత్రములలో (చిన్నఅక్షరములషరత్తు) బ్రిటిషవారికి విధేయులైయుండవలెనని గూడా చేర్చాడు. కానీ బ్రిటిష్ కంపెనీ వారికే లోబడియుండునటుల చేయలేక పోయాడు. హైదరాబాదు నిజాం గారు ఫ్రెంచి వారిస్నేహమునపేక్షించి తన సైన్యములకు ఫ్రెంచి యుద్యోగులచేత శిక్షణనిప్పించుచుండెను. సింధియారాజు ఫ్రెంచి సైన్యమును తన సంస్థానములోనుంచుకునెను. నెపోలియన్ ను భారతదేశానికి ఈజిప్టుమార్గమున వచ్చి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టమని టిప్పుసుల్తాను రాయబారము పంపెను. బ్రిటిషవారికీ ప్రెంచి వారికీ జరిగే ఆ ప్రపంచ యుధ్ధములో భారతదేశము లోనున్నటువంటి పరిస్థితి బ్రిటిష్ వారి ఓటమికి తోడ్పుడునని వెల్లెస్లీ అబిమతము. గవర్నర్ జనరల్ వెల్లెస్లీ టిప్పుసుల్తానుకు వ్రాసిన లేఖలో ఫ్రెంచి వారు చేసిన అనేక కార్యములను, తీరును మహమ్మదీయ మత విరుధ్దమైన కొన్ని సంఘటనలు ఉల్లేఖించాడు. బ్రిటిష్ వారి సైనికబలముకు తట్టుకొనలేని ప్రెంచివారి సహాయం అపేక్షించుట తనరక్షణకు రాదని దడిపించుతూ వ్రాసిన ఆ లేఖ వెల్లెస్లీ చేసిన రాజ్యతంత్రములు వెల్లడించును. కానీ మిగతా చిన్న దేశీయ పరిపాలకులలాగ, మైసూరు పులి అని ప్రసిధ్ధిగాంచిన టిప్పు సుల్తాన్ వెల్లెస్లీ దొర కపట తంత్రములలో చిక్కుకునలేదు. వెల్లెస్లీ ప్రవేశపెట్టిన ఆ అనుబంధసమాశ్రయమునకు (Subsidiary alliance)నకు వప్పుకొనలేదు. అందుకని టిప్పుసుల్తాను మీది యుధ్దము ప్రకటించి హతమార్చి ఆతని రాజ్యముగానున్న అనేక అధనివేశ స్వరాజ్యములను కైవశం చేసుకుని తనకు విధేయులుగానుండటకు లంచముగా హైదరాబాదు నవాబుకు పంచాడు. వెల్లెస్లీ దొర 1802 లో పీష్వాతో చేయబడిన సంధిలోనే అతని సర్వాధికారములు తీసివేలయబడు సూచనలతో చేశాడు. డక్కన్ పరగణాలలో మహారాష్ట్ర రాజ్య సమ్మేళనము బ్రిటిష్ వారికి ముప్పుగా తలపోసి, మహారాష్ట్రు నాయకుల మధ్య విభేదములు రేక్కితించి వారిలోనొకరిని తనకనూలముగా నుండునటుల రాజ్యతంత్రములు చేశాడు. మైసూరు రాజ్యవిచ్ఛిన్నముచేసినటులే మహారాష్ట్రనాయకుల రాజ్యములను కైవశంచేసుకుని బ్రిటిష్ వలసరాజ్యములో కలుపుకున్నాడు. ఆ విధంగా దేశంమొత్తంమీద అనేక భూభాగములను కైవశంచేసుకుని బ్రిటిష వలసరాజ్యమును వలససామ్రాజ్యముగా చేశాడు. వెల్లెస్లీ చేసిన యుధ్దములకు రాజ్యతంత్రములకు చేసిన విపరీత ఖర్చులను లండను లోని కంపెనీ కోర్టు ఆఫ్ డైరెక్టర్లు నివ్వెరపడి అసమ్మతి తెలిపారు. ఫ్రెంచి- బ్రిటిష ప్రపంచ యుధ్దములలో సంధి వప్పందముల ననుసరించి బ్రిటిష్ ప్రభుత్వము వారు యుద్దమునకు పూర్వము భారతదేశములో ఫ్రెంచివారి స్వాధీనములోనున్న భూభాగములను వారికప్పగించమని ఉత్తర్వులు జారీచేసిననూ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ఖాతరు చేయలేదు. వెల్లెస్లీ అబిమతము ప్రకారము బ్రిటిష్ కంపెనీ సివిల్ సర్వీసు ఉద్యోగులకు పరిపాలన దక్షత కలుగజేయుటకొక పాఠశాల ఏర్పరచదలచగా కంపెనీ డైరెక్టర్లు అభ్యంతరముచేసి మాన్పించారు.[1][3].

వలసరాజ్య విస్తరణకు వెల్లెస్లీ చేసిన యుధ్ధములు, రాజ్యతంత్రములు

[మార్చు]

వెల్లెస్లీకి ముందు బ్రిటిష్ కంపెనీ వారి అధినేతలుగా రాబర్టు క్లైవు (1757-1765), వారన్ హేస్టింగ్సు (1774-1785) చేసిన అనేక రాజ్యతంత్రములతో బ్రిటిష్ వ్యాపార సంస్థ భారతదేశములోని కొన్ని భూభాగములను వశపరుచుకుని రాజ్యపరిపాలన చేసే ఆధిపత్యము కలుగచేశారు. 1797-1805 మద్య వెల్లెస్లీ గవర్నరు జనరల్ గానున్నప్పడు బ్రిటిష్ వలసరాజ్యమును, కంపెనీ వారి ఆధిపత్యమును ఇంకా ఎక్కువగా ప్రబలింప చేయుటకు చేసిన యుధ్ధములు, రాజ్యతంత్రములలో ప్రముఖమైనవి (1)నాలుగవ మైసూరు యుధ్దము (2) మహారాష్ట్రనాయకుల వ్యవహారములలో జోక్యము (3) రెండవ మహారాష్ట్ర యుద్దము, ఢిల్లీ, అస్సాము, లాస్వారీ, ఆర్గానుల యుద్దములు (4) హెల్కరుతో యుద్దము (5) భరతపురం ముట్టడి

నాల్గవ మైసూరు యుధ్దము

[మార్చు]

1789-1792 జరిగిన మూడవ మైసూరు యుద్దములో (గవర్నర్ జనరల్ కారన్ వాలీసు స్వయముగా సైనికాధిపత్యమువహించి చేసిన యుధ్దము) పరాజయముపొంది సంధిచేసుకున్న టిప్పుసుల్తాను అప్పటికి అణిగియున్నా, సమయముకోసము వేచియుండి కారన్ వాలీసు వెడలిపోయినతరువాత యధావిధిగా ఫ్రెంచి వారి సైనిక సహాయము చేకూర్చుకుండుటయే కాక ఫ్రెంచియుధ్దవీరుడుగా ప్రసిధ్దిచెందుతున్న నెపోలియన్ అప్పటికి (1798 నాటికి) ఈజప్టు పరిసరప్రాంతములకు చేరువలోనుండగా అతనిని భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వారిని పారత్రోలమని ఆహ్వానించినటుల తెలుసుకున్న గవర్నరు జనరల్ వెల్లెస్లీ బ్రిటిష్ వారి ఆధిపత్యమునకు ముప్పు కలగబోవునను ముందాలోచనలతో పదవిచేపట్టగనే చేసిన మొదటి యుద్దము మైసూరునవాబు టిప్పు సుల్తాన్ తో. 1799 లో జనరల్ హారిస్ (Gen. Harris) సైన్యాధిపత్యము క్రిందనున్న వెల్లెస్లీ సోదరుడైన కర్నల్ ఆర్ధరు వెల్లింగటన్ వెల్లెస్లీ బ్రిటిష్ సైన్యముతోనూ, హైదరాబాదు నిజాము సైన్యసహాయంతోను మైసూరు రాజ్య రాజధానియైన శ్రీరంగపట్టణంను ముట్టడించి ఆక్రమించాడు. అప్పుడు జరిగిన ఆ యుద్దములో టిప్పుసుల్తానును హతమార్చి మొత్తం మైసూరు రాజ్యమును బ్రిటిషవారి కైవశముచేసుకుని ఆ రాజ్యములోని కొన్ని సామంతరాజ్య భూభూగాములను హైదరాబాదు నిజాం కిచ్చి నవాబుగారిదగ్గరనుండి అనుబంధ సమాశ్రయము (subsidiary alliance) కు వడంబడిక చేసుకున్నాడు. ఆ వడంబడిక ప్రకారము హైదరాబాదు నిజాం బ్రిటిష్ వారికి విధేయుడై బ్రిటిష్ వారితో శాశ్వతముగా స్నేహముగానుండి వారికి సహాయంచేయవలయునని. మైసూరు రాజ్యపతనముతో భారతదేశములో తూర్పు సముద్రతీరమొత్తము బ్రిటిష్ వారి వశములోకుచ్చింది. చెన్నపట్టణ ము పూర్తిగా బ్రిటిష్ వారికి ముప్పులేని (క్షేమమైన) రాజధానిగా తయారైనది. టిప్పుసుల్తానును హతమార్చినతరువాత 1761 లో హైదరాలీ సిహాసనభ్రష్టునిగా చేసిన వడయారు రాజవంశీయ రాజకుమారుని పేరుకు సిహాసనా ధిపతిగాచేసి మైసూరు రాజ్యమును రక్షితరాజ్యము (protectorate territory) గా చేశాడు. తిరువనంతపురం (తిరువాంకూర్), కొచ్చిన్ రాజ్యాలు కూడా అప్పటికే రక్షిత రాజ్యములుగానుండెను.....సశేషం

మహారాష్ట్ర రాజ్యములో బ్రిటిష్ కంపెనీ వారి జోక్యము,యుధ్ధములు

[మార్చు]

బ్రిటిష్ కంపెనీ వారు రాజ్యాధికారములు చేకూర్చుకుంటూ, వలసరాజ్య విస్తరణ చేయ మొదలుపెట్టిన కొద్ది కాలం భారతదేశములో అనేక స్వతంత్రరాజ్యములను విఛ్చినముచేసి పురోగతి చేయుచుండిరి గానీ, మహారాష్ట్ర రాజ్యముల విషయములో వెనకడుగులోనే యుండిరి. మహారాష్ట్రరాజ్య సమ్మిళత కూటమి వీరికి అవరోధముగా నుండెను. మిగతా రాజ్యములలాగనే వారసత్వపు తగాదాలలో మొదటిసారిగా వీరి జోక్యమునకు అనుకూల పరిస్థితుల 1772 లో కలిగినవి. మహారాష్ట్ర రాజ్యములో మొదటి సారిగా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీవారు యద్దమునకు దిగినది 1775-1782 మధ్య వారన్ హేస్టింగ్సు మొదటి గవర్నర జనరల్ గానున్న కాలములో. వారసత్వపు తగదాలలో జోక్యము కలుగచేసుకునటమువలన అనవరసరపు యుద్దములు చేసి వారి రాజ్యములోని కొన్ని పరగణాలను జాగీరులుగా స్వీకరించి, మరి కొన్ని చోట్ల రాజస్వ హక్కులు పొంది బ్రిటిష్ వారి ఆదిపత్యమును స్థాపించి, వలసరాజ్య విస్తరణచేశారు. తదుపరి వెల్లెస్లీ కాలములో చేసిన రాజ్యతంత్రముల వలన మహారాష్ట్రరాజ్యంలో కూడా అనుబంధ సమాశ్రయమను సంధి ( subsidiary alliance) వప్పందములు చేయుంచుకునటమేగాక, మహారాష్ట్ర స్వరాజ్యములలో కుతంత్రములతో స్వామిద్రోహములు, అంతఃకలహములు కలుగచేసి ఇంకా అధికముగా బ్రిటిష్ వారి వలసరాజ్య విస్తరణ జరిగింది.

మహారాష్ట్ర రాజ్య పరిచయం

[మార్చు]

ఛత్రపతి శివాజీ అని ప్రసిధ్దిగాంచిన శివాజీ మహారాజు ( శివాజి భోస్లే ) 1674 లో భారతదేశములో పశ్చమదిశనున్న తన రాజధాని రాయఘడ్లో పట్టాభిషేకముచేసుకుని ఉత్తరమున మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తోనూ, దక్షిణ మున గోల్కొండ, బీజాపూర్ సుల్తానులతోనూ, అనేక సార్లు యుద్దములు చేసి గెలుపు ఓటమిలు పొంది, అనేక కోటలను ఆక్రమించి మహారాష్ట్ర రాజ్యమును దేశము నలుమూలలకు విస్తరింపచేసి పరిపాలన కనుకూలముగా మహారాష్ట్ర యుద్దవీర వంశీయులగువారిని బరోడాలో గైక్వాడ్ లను, గ్వాలియర్, ఉజ్జయిని లలో శింధియా ( షిండే ) (Scindia or Shinde) లను, నాగపూరులో భోన్సెలే లను, మాళ్వ,ఇందౌర్ లలో హోల్కర్ లను సామంత-స్వతంత్ర రాజులుగా నియమించి, మహారాష్ట్ర రాజ్యసమ్మేళన (confederation) (సామ్రాజ్యము) గా చేసిన మహా వీరుడే కాక అష్టప్రధానులను మంత్రిపరిషత్తు ( విజయనగర సామ్రాజ్యములో శ్రీకృష్ణదేవరాయలు వారు ప్రవేశపెట్టిన విధానము ) తో రాజ్యపాలనచేసి సైనికంగానూ, సాంఘికంగాను, రాజనీతి పరిజ్ఞానముగల పరిపాలనా దక్షుడు. భౌగోళకముగా మహారాష్ట్ర రాజ్యము పశ్చమతీరమున సంయక్తంగానున్న (గుజరాత్ కలసియున్న) మహారాష్ట్ర రాష్ట్ర పరిధి, ఉత్తరమున ఇప్పటి మద్య ప్రదేశ్+ఉత్తర ప్రదేశ్ లలోని చాల భూభూగములు, దక్షిణమున తమిళనాడు దాకా విస్తరించియున్నది. మహారాష్ట్ర రాజ్యకూటమిలో కేంద్రీయరాజ్యము పశ్చమభారతదేశములో పూనాను రాజధానిగా (అంతకుముందు రాయగడ్ ను) రాజధానిగాకలిగి యున్న రాజ్యము. మిగతా మహారాష్ట్ర రాజ్యములు స్వతంత్ర రాజులు పరిపాలించే మహారాష్ట్రరాజ్యములు. అవన్నీ కలిపిన ది సమ్మళితరాజ్యకూటమి. శివాజీ 1680లో మరణించిన తరువాత ఔరంగజేబు శివాజి పెద్ద కుమారుడగు శంభాజీని హతమార్చి (1689) శంభాజీ భార్యను, కుమారుడు శాహూజీని బంధించివుంచాడు. అందుచే శంభాజీ చనిపోయన తరువాత మహారాష్ట్ర రాజ్యమునకు శివాజీ రెండవభార్య కుమారుడైన రాజారాం మహారాష్ట్ర రాజ్యమునకు రాజైనాడు. కానీ అతను కొలది రోజులకే (1700 లో) మరణించబట్టి అతని భార్య తారాబాయి రాజ్యమేలుతూ, వారి కుమారునికి పట్టాభిషేకం చేసింది. 1707 లో ఔరంగజేబు మరణించినతరువాత శాహుజీని విడుదలచేశారు. రాజ్యమేలుతున్న తారాబాయితో శాహూజీకి సింహాసనంకోసం విబేదమలు కలిగినవి. అప్పడు బాలజీవిశ్వనాథ తోకూడిన మంత్రి పరిషత్తు మద్దతు, సహాయంతో సాహూజీ మహారాష్ట్రరాజ్యమునకు రాజై సతారాలో కాలముగడిపసాగెను. అప్పటినుండి శివాజీ వంశీయ వారసులు పేరుకుమాత్రమూ రాజుగానుండి పీష్వా అనబడిన ప్రధానమంతికి పరిపాలన రాజ్యభారమును వప్పిగించారు. మొదటి పీష్వా తరువాత పీష్వావారసులే మహారాష్ట్ర రాజ్యమునేలిన రాజులైనారు. మొదటి పీష్వా బాలాజీ విశ్వనాద్ (1668-1720). పీష్వాగా 1713- 1720. ఆయన సంతతి వారు ఆరుగురు ఆయనతరువాత మహారాష్ట్ర సామ్రాజ్యమును విస్థిరించిరి. పీష్వాలే మహారాష్ట్ర రాజ్య పరిపాలకులు. రెండవపీష్వా బాజీరావు I (1700-1740). అతని కార్యకాలము (1720-1740) లోనే రాజధానిని రాయఘడ్ నుండి పూనాకు మార్చబడింది. అతనే బాజీరావు బలాల్ ఆనికూడా ప్రసిధ్ధి. అతని కుమారుడు బాలాజీబాజీ రావు (నానాసాహెబ్ అనికూడా ప్రసిధ్ది) (1720-1761) 1740 లో పీష్వాగా నియమింపబడినాడు. వెల్లెస్లీ కాలమునాటి పీష్వా బాజీరావు II (1775-1851) పీష్వాగా 1795లో నియమింపబడి 1818 దాకా పరిపాలించాడు. అతనే ఆఖరి పీష్వా. అతనితో పీష్వాపరిపాలన అంతరించి మహారాష్ట్రరాజ్యము పూర్తిగా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వారి వశమైనది.[4]

మహారాష్ట్రరాజ్య కూటమి విచ్చినం, యుద్దములు

[మార్చు]

వలస రాజ్య విస్తరణకు, బ్రిటిష్ వారి ఏకఛత్రాధిపత్యమునకు వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గా చేసిన కుతంత్రములు పీష్వా పరిపాలించు మహారాష్ట్ర రాజ్యము అంతరించుటకు అంకురార్పణముచేయటమేకాక స్వతంత్రరాజులు పరిపాలించు మహారాష్ట్రరాజ్యముల మధ్య విభేదముల కలిపించి సమ్మిళితమహారాష్ట్ర రాజ్య కూటమిని (confederation) విచ్చినముచేసినవి . బ్రిటిష్ వారు చేసిన ఏడెండ్ల మొదటి మహారాష్ట్రయుద్దము (1775 1782) ఫలితముగా బ్రిటిష్ కంపెనీ వారికి మహారాష్ట్రరాజ్యము పూర్తిగా వశము కాలేదు. మొదటి మహారాష్ట్రయుద్దము 1782 లో సాల్బాయ్ సంధితో ముగిసినది. అటుతరువాత, 8 ఏండ్ల బాలుడైన సవాయి మాధవరావు (మాధవరావుII) పీష్వాగా నియమించబడి నానాఫడ్నవీసు (నానా ఫడ్నీసు) అను మంత్రి పరిపాలన చేయసాగెను. ఆ సల్బై సంధి ప్రకారము మహారాష్ట్ర రాజ్యములో బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ వారికి కేవలమూ సలసెట్టీ ద్వీపం (island) మాత్రం మిగిలినది. మొదటినుండి కూడా దేశములోనున్న నాలుగు మహారాష్టరాజ్యముల మధ్య విభేదములువచ్చినప్పటికీ బయటవారితో యుద్దము తటస్థించినచో మహారాష్ట్రు లందరూ ఏకమై కూటమిగా పోరాడుచుండిరి. 1782 సల్బై సంధి తరువాత నుండి 1802 దాకా జరిగిన ఘటనలు (1) మహారాష్ట్రకూటమిలో మహాయోధుడుగా పేరుపోందిన మాహదజీ సిందియా మొగల్ రాజధాని ఢిల్లీని రక్షిణ చేయు మొగల్ సైనికాధికారి మీర్జా నజఫ్ ఖాన్ 1782 ఏప్రిల్లో మరణించటంతో సిందియాను వకీల్ ఉల్ ముతలాగ్ అను హోదాలో ఢిల్లీ పరగణాలను రక్షించుటకు ఢిల్లీ చక్రవర్తి కొలువులో నియమించబడ్డాడు. రాజపుత్రయోధులతో తలపడి యుధ్ధములుచేసి వారి రాజ్యములైన జోధ్ పూర్, జయపూర్, అజ్మీర్ను ముట్టడించి ఆక్రమించాడు (పటాన్, మెడ్తియా యుద్దములలో), కానీ 1787 లో రాజస్తాన్ లోని దౌసా జిల్లాలో లాల్సట్ (Lalsot) యుద్దములో రాజపుత్రుల చేతులలో ఓటమికి పాల్పడినా మొత్తానికి ఢిల్లీలో మహారాష్ట్రుల ఆదిపత్యము స్థాపించాడు. (2)1795 లో ఖర్దా యుద్దములో హైదరాబాదునిజాముతో యుద్దము చేసి మహారాష్ట్ర రాజ్యాదిపత్యమును దక్కన్ పీఠభూములలో చాటించాడు. 1794 ఫిబ్రవరిలో మహాదజీ సింధియా మరణం, (3) పీష్వా సవాయి మాధవరావు (మాధవరావుII) 1795 లో ఆత్మహత్యచేసుకుని మరణించటం (4) బాజీరావుII (రఘునాదరావు కుమారుడు) 1795 లో పీష్వాగా నియమించబడటం (5) మంత్రి నానాపడ్నవీసు 1800 మార్చిలో మరణం (6) బాజీరావు II పరిపాలన అభిమతములకు వ్యతిరేకించి మహారాష్ట్రరాజ్య కూటమిలోని ఇందౌరు రాజు యశ్వంతరావు హోల్కరు పూనాపై యుద్దము ప్రకటించాడు. పీష్వాబాజీరావు పక్షమున దౌలతరావు సిందియా చేరి హోల్కరులతో చేసిన యుద్దము పూనా యుద్దము 1802 మేలో జరిగింది (7) పూనా యుద్దములో ఓడిపోయిన పీష్వా బాజీరావు II పారిపోవటంతో పూనాలో ఆనందరావును హోల్కర్ పీష్వాగా నియమించాడు. (8) పూనా యుద్దములో ఓడిపోయిన పీష్వా బాజీరావు II 1802 అక్టోబరులో బస్సీనుకు చేరుకుని బ్రిటిష్ కంపెనీవారితో రాయబారంచేసి శరణు కోరటం జరిగింది. అటువంటి అవకాశములే బ్రిటిష్ వారికి వరప్రసాదములైనందువలన గవర్నర్ జనరల్ వెల్లెస్లీ మామూలు సంధి వప్పందము కాక తన అభిమతానుసారము, బ్రిటిష్ కంపెనీవారి వలసరాజ్యవిస్తరణ లక్ష్యములను సాధించుటకు తయారుచేయబడిన అనుబంద సమాశ్రయ వప్పందము ( subsidiary alliance)ను బాజీరావు II చేత 1802 డిసెంబరు 31 తేదీన వ్రాయించి పుచ్చుకున్నాడు.అదే బెస్సీను సంధి. దాంతో మహారాష్ట్ర రాజ్యపతనారంభమని చెప్పవచ్చును. ఆ 1802 బస్సీను సంధి ప్రకారము (1) బ్రిటిష్ వారికి మితులు, శత్రువులైన వారలను బాజీరావు కూడా అలాగే పరిగణించ వలసియుండును (2) బ్రిటిష కంపెనీ వారు బాజీరావు రాజ్యమును తమరాజ్యముగనే రక్షింతురు (3) బ్రిటిష్ సైన్యమును బాజీరావు తన రాజ్యములో శాశ్వతముగా వుంచుకునవలసియుండును. బాజీరావు చేసిన ఆ సంధి మహారాష్టకూటమి వారు అసమ్మతితో ఖండించిరి. కానీ బ్రిటిష్ కంపెనీ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ అతనినే తిరిగి పీష్వాగా చేయుటకు సంధి ప్రకారమూ కట్టుబడి యున్నందున్న రాజ్యంతంత్రములే కాక సరాసరి యుద్దము నకు దిగారు. తత్ఫలితముగా మహారాష్ట్రరాజ్యములలో బ్రిటిష్ వారు జరిపిన యుద్దములు, రాజ్య తంత్రములు కేవలం వెల్లెస్లీ దొర రాజ్యకాంక్షనెరవేర్చుటకు జరిపినవే. అనవసరపు ఆధిక్యతానిరూపణకోసము చేసిన కార్యాచరణములు. మహారాష్ట్ర రాజ్యకూటమిలో గ్వాలియర్ రాజు దౌలత్ రావు సింధియా ఎవరైతే అప్పటిదాకా బాజీరావు పక్షముననిలిచి మదత్తునిచ్చెనో ఆ రాజ్యమును ముందుగా కూలద్రోయుటకు ఆ రాజ్యములో నున్న ఫ్రెంచి సైన్యాధికారులకు లంచములిచ్చి సైనిక సహాయముచేయకుండా చేసుకున్నారు. వెల్లేస్లీ తన సైనికాదికారులకు, రెసిడెంట్లకు వ్రాసిన లేఖలు"Dispatches, Minutes, and Correspondence of Marquess Wellesley K.G " అను పత్రాచారముల ద్వారా ఆ కుతంత్రములు చరిత్రలోకి వచ్చినవి.[1]

కుతంత్రములు
[మార్చు]

ఆ కుతంత్రములు వెల్లెస్లీ తన సైనికాధికారులద్వారా చేయించాడు అట్టి వాటిలో (1)ఢిల్లీ చక్రవర్తికి, బీగం సమ్రూకి బ్రిటిష్ వారి రక్షణలోకి రమ్మనమని లేఖలు వ్రాయించాడు (2) బీరార్ రాజు రాఘోజీ భోన్సలే పై కుట్రలు చేయుటకు 1803 ఆగస్టు 3 తేదీన వెల్లెస్లీ వ్రాసిన లేఖ (3) ఆగస్టు 24 తేదీన మేజర్ షాకు వ్రాసిన లేఖలో కర్నల్ క్లోజు అను రెసిండెంటైన సైనికాధికారికి తను వప్పచెప్పిన కుతంత్రయోధములను ఉల్లేఖించాడు. తరువాత1803సెప్టెంబరు28 తేదీన రెసిడెంట్ క్లోజుకు వ్రాసిన లేఖలో పీష్వా బాజీరావు క్రిందయున్న మంత్రులకు లంచమిచ్చు విషయములను గూర్చి ఉల్లేఖనచేసియున్నవి. దౌలత్ సింధియా రాజ్యములో నున్న యూరోపియన్ సిబ్బంది, సైనిక సిబ్బంది యొక్క స్వామిద్రోహ చర్యలవల్లనే బురహాన్ పూర్ బ్రిటష్ వారి వశమైనటుల బయల్పడినది. సింధియా కొలువులో పెర్రాన్ (Pierre Perron) అను ఫ్రెంచి ఉద్యోగి లంచమునకు లొంగక ఉద్యోగము మానుకుని పోయినట్లు చరిత్రలో కనబడుచున్నది. కేంగా కోట తమ వశమౌటకు కోటలోపలి సిబ్బందికి స్వామిద్రోహముచేయునటుల లంచమిచ్చినటుల సైనికాదికారిగానున్న జనరల్ లేక్ (General Lord Gerard Lake) వెల్లెస్లీకి 1803 సెప్టెంబరు 8 తేదీన వ్రాసిన లేఖ వల్ల బయల్పడినది. ఇందౌర్ రాజు యశ్వంతరావు హోల్కర్ ను పతనము చేయుటకు సరాసరి యుద్దమునకు దిగకుండా కపటస్నేహము చేయమని జనరల్ లేకుకు వెల్లెస్లీ వ్రాశాడు. దాంతో జనరల్ లేకు కపటస్నేహమే కాక యశ్వంతరావు హోల్కర్ బ్రిటిష్ వారి పై కుట్రచేయుచుండెనన్న పత్రములు తన చేజిక్కినవని యుధ్ధ కారణములు కల్పించుటకు కల్పిత నేరారోపణలు చేశాడు. వెల్లెస్లీ చేసిన అనేకమైనట్టి కుట్రలు బ్రిటిష్ కంపెనీ పై అధికారులకు తెలిసినాగానీ వారు చేసినదల్లా వెల్లెస్లీని పదవినుండి తీసేసి వెనక్కి పిలిపించటం. భారతదేశములో బ్రిటిష్ కంపెనీయెక్క రాజ్యమును సామ్రాజ్యముగాచేసినదుకు మార్కిస్ హోదానిచ్చి చివరకు 1804 డిసెంబరు 6 తేదీన వెనక్కి పిలిపించారు.

రెండవ మహారాష్ట్రయుద్దము (1802-1805)
[మార్చు]

వెల్లెస్లీ కాలంలో బ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్రరాజ్యములలో మూడేండ్ల పాటు (1802-1805) చేసిన అనేక యుద్ధములు కలిపి రెండవ మహారాష్ట్ర యుద్దముగా ప్రసిద్ధిచెందినవి. ఆ రెండవ మహారాష్ట్రయుద్దమునకు సైనికాధిపతిపత్యము వహించినది సర్వసైన్యాధిపతిగా జనరల్ జెరార్డు లేకు (Gen.Gerard Lake) మరియూ వెల్లెస్లీ సోదరుడైన మేజర్ జనరల్ ఆర్దర్ వెల్లెస్లి ( Gen. Arthur Wellesley). వారు అవలంబించిన సైనిక వ్వూహము మహారాష్ట్ర నాయకులు కూటమీగా ఏదుర్కొను అవకాశము లేకుండా ముగ్గురినీ వేరు వేరుగా ఒకేమారుగా అనేకచోట్ల యుద్దములలో నిమగ్నము చేశారు. పదభ్రష్టుడై పారారైన పీష్వా బాజీరావు గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ప్రతిపాదించిన అనుభంద సమాశ్రయ సంధి (Subsidiary alliance) ను వప్పుకునటకు వ్యతిరేకించి విరోధించిన సింధియా భోన్స్లే లను జనరల్ జెరార్డు లేకు లాస్వారి, ఢిల్లీలలోనూ తరువాత ఆస్సే అర్గాన్ యుద్దములలో ఓడించి వారిని అదుపులోనుంచాడు. పదవీ బ్రష్టుడైన బాజీరావుత కలసి హోల్కరుల వశములోనున్న పూనాపై రెండువైపులనుంచి ముట్టడించారు. 1803 మే నెలలో ఆర్ధరు వెల్లెస్లీ పూనాను తిరిగి అక్రమించాడు. తరువాత అహమద్ నగర్ కోటను 1803 ఆగస్టు 7 తేదీన ముట్టడించి ఆక్రమించాడు. ఆ తరువాత అచ్చటికి దగ్గిరలోనున్న ఇప్పటి జాల్నా జిల్లా లోనున్న అస్సె (Assaey) అను చోట సిందియా- భోన్ స్లె కూటమిలోని కర్నల్ పోల్ మన్ అను మాజీ బ్రిటిష్ సైనికుడు (Anthony Pohlmann ) ఆధ్వర్యములోనున్న అశ్వదళముతో సెప్టెంబరు 23 తేదీన అస్సీ యుద్దము ( Battle of Assaey) జనరల్ వెల్లెస్లీ సైన్యము చాల నష్టములుకలిగినా చివరకు విజయము వారిదైనది. ఇంకొక ప్రక్కన సింధియా రాజు రాజ్యములోని ఫ్రెంచి సైన్యాధికారి పెర్రాన్ (Pierre Perron ) కాపాడుచుండియున్న ఆలిఘర్ కోటను 1803 సెప్టెంబరు లోముట్టడించి 4 తేదీన జనరల్ జెరార్డు లేకు ఆక్రమించాడు. అటు తరువాత బురహాన్ పూర్, అసీర్ ఘడ్, గౌలీఘర్ లనుసెప్టంబరు 14 తేదీన ఆక్రమించారు. 1803 నవంబరు 1 తేదీన ఆల్వార్ (Alwar) దగ్గర లాస్వారి (Laswari) లో జరిగిన యుద్దము జనరల్ జెరార్డు లేకు (Gen.Gerard Lake) కునూ రాఘోజీ భోన్స్లే మద్ద్య జరిగింది. ఆ యుద్దములో భోనస్లే ఓడిపోయి చేసుకున్న దియోగాం (ఒరిస్సాలోని దియోగాం) సంది ఫలితమునే బ్రిటిష్ వారికి ఒరిస్సాలోని కటక్ పరగణాలు, బల్సార్ ప్రాంతములు జాగీరులుగా ఇవ్వబడినవి. బ్రిటిష్ సైనికదళము ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పరిసరప్రాంతములు సింధియా సైనికులబారినుండి తప్పించి చక్రవర్తిని తమ నిర్బంధరక్షణలో (protective custody) అను నెపముతో నుంచుకున్నారు. Aargaon ఆర్గాన్ ఇప్పటి రత్నగిరి జిల్లా జరిగిన అర్గాన్ యుద్దము 1803 నవంబరు 19 తేదీన జరిగినది ఆర్ధర్ వెల్లెస్లికి సింధియా భోనస్లే కూటమైన సైన్యమునకు జరిగిన యుద్దములో కూడా బ్రిటిష్ వారిదే విజయమైనది. ఇంకా ఆ యుద్దము నాలుగువైపులా ప్రబలి గుజరాత్ లోని బరోడా, బరోచ్ మొదలగు ప్రాంతములను, ఒరిస్సాలో కటక్, జగన్నాధ్ ప్రాంతములు కూడా అక్రమించారు ఈ అన్ని యుద్దములలోనూ, సింధియా-భోన్సలే సైన్యమును ఓడించి చివరకు వారిద్దరుచేత వేరు వేరుగా సంధిపత్రములు వ్రాయించి పుచ్చుకున్నారు. 1803 డిసెంబరు 17 తేదీన భోన్సలే తోనూ వప్పుదలలతో వ్రాయించి పుచ్చుకున్నారు. ఆ సంధి ప్రకారము భోస్సలే తన రాజ్యములోని బీరార్ నుండి వార్దా దాకాదక్కన్ పీఠభూమి (Deccan Plateau) లోని భూభాగములు హైదరాబాదు నిజాము నకు స్వాదీనముచేశాడు. 1803 డిసెంబరు 30 తేదీన సిందియాతో చేయించిన సంధి పత్రములో దోవబ్, బుందెల్ ఖండ్, బరూచ్, ఇంకా గుజరాత్ లోని కొన్ని ప్రాంతములు, అహమద్ నగర్ కోటనూ, అజంతా పరగణాలు గోదావరి నదితాకచున్నట్టి ప్రాంతములు, అంతేకాక సింధియా రాజు చేసిన సంధి వప్పందములలో తను ఢిల్లీ చక్రవర్తి, హైదరాబాదు నిజాము, బరోడా రాజు గైక్వాడ్ ఏ విధమైన అధికారము చెలాయించకూడదనీను వారివి స్వంత రాజ్యములుగా పరిగణించవలెననీ కూడా సంధి పత్రములో వప్పుదల చేయించుకున్నారు. ఆనేక యుద్దములలో కలిగిన ఆయా విజయములతో 1804 సంవత్సరం మొదటికల్లా మహారాష్ట్ర పీష్వా, హైదరాబాదు నిజాము, హోల్కరు తప్ప మిగతా స్వతంత్ర మహారాష్ట్ర రాజులైన గైక్వాడు, సిందియా, భోన్సలే, బ్రిటిష్ కంపెనీ వారి చేతిక్రింద తాబేదారులైనారు. స్వతంత్ర రాజ్యములుగానుండిన బెంగాలు, బీహారు, ఒరిస్సా, కర్నాటక, పూర్తిగా బ్రిటిష్ వారి కైవశమైయుండినవి. దాంతో బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ రాజ్యాదికారములు కలిగి భారతదేశములో ఎదురులేని సామర్ధ్యములుకలిగిన సర్వాదికార శక్తి అయినది. ఏడు సంవత్సరముల పరిపాలనలో (1798-1805) గవర్నర్ జనరల్ గా వచ్చిన వెల్లెస్లీ 19వ శతాబ్దారంభములోనే భారతదేశములోనున్న బ్రిటిష్ వలసరాజ్యమును సామ్రాజ్యముగా చేశాడని చెప్పవచ్చును.[5]

భరత్ పూరు ముట్టడి, దౌలత్ రావు సిందియా తిరుగుబాటు
[మార్చు]

బ్రిటిష్ కంపెనీ వారి గవర్నర్ జనరల్ వెల్లెస్లీ కార్యకాలములో జరిగిన రెండవ మహారాష్ట్ర యుద్దములో చిక్కని మహారాష్ట్ర నాయకుడైన యశ్వంతరావు హోల్కర్ బ్రిటిష్ వారికి లొంగక తప్పించుకుని గరిల్లా యుద్దములు సాగించాడు. పుష్కర్ను మరియూ జయపూర్ లోనున్న బ్రిటి స్తావరాల లపై దోపిడీ, దాడులు చేసి మండసౌర్కు చేరుకుని అక్కడ బనాసలో సరాసరి యుద్దము చేసి బ్రిటిష్ సైన్యమును ఆగ్రాకు తరిమి కొట్టగలిగాడు. అటుతరువాత మథుర ముట్టడించిఆక్రమించాడు కానీ ఢిల్లీని ముట్టడించటములో విఫలుడై దాఓబ్ వైపు వెడలి బ్రిటిష స్తావరములపై దాడులు జరిపాడు. ఫరూకాబాద్లో ఓడిపోయి భరత్ పూర్ రాజ్యములోని డిగ్లో తలదాచుకుండాగా బ్రిటిష సైన్యము డిగ్ ను ముట్డడించి 1804 డిసెంబరు 13 న ఆక్రమించాయి, తరువాత భరతపూరు పై దండయాత్రలో బ్రిటిష్ వారు విఫలులైనారు. ఈ లోపల దౌలతరావు సింధియా 1803 లో చేసిన సందిని తిరిస్కరించి అనేక మహారాష్ట్ర వీరులతో యశ్వంతరావు హోల్కర్ తో చేతులుకలిపి సల్బాగ్లో సమావేశమై బ్రిటిష్ కంపెనీ వారిని దేశమునుండి తరిమి వేయటకు ఆలోచనలు జరిపాడు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "The British Rule in India" D.V.Siva Rao (1938) ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp40-44,46-49,52-55,56-61,132,196-200
  2. Ecyclopaedia Britannica 14th Edition (1929)Volume 23, pp497-498
  3. 3.0 3.1 Ecyclopaedia Britannica Micropedia 15th Edition (1984)Volume III, pp 608-609
  4. కధలు-గాధలు,మూడవ భాగము దిగవల్లి వేంకట శివరావు (2010) విశాలాంధ్రా పబ్లిషంగ్ హౌస్,హైదరాబాదు pp209-221
  5. History of Indian Subcontinent. "Encyclopidea Britannica,Macropidea" 15th Edition(1984) Volume9, pp 389-392 "