గదర్ ఉద్యమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గదర్ పార్టీ
అధ్యక్షుడుసోహన్ సింగ్ భక్నా
స్థాపకులుకర్తార్ సింగ్ సరభ
స్థాపన తేదీ1913
రద్దైన తేదీ1919
Preceded byపసిఫిక్‌ తీర హిందీ సంఘం
రాజకీయ విధానంభారత స్వాతంత్ర్యోద్యమం
రంగు(లు)ఎరుపు, కుంకుమ, ఆకుపచ్చ
ఇండిపెండెంట్ హిందూస్థాన్ పత్రిక

గదర్ పార్టీ లేదా గదర్ ఉద్యమం, భారత స్వాతంత్ర్యోద్యమం కాలంలో పంజాబీలు స్థాపించిన భారతీయ విప్లవ సంస్థ.[1] హిందూ, సిక్కు, ముస్లిం నాయకుల సమ్మేళనంతో ఏర్పడింది. 1913లో బ్రిటీష్ పాలనతో సంబంధరహితంగా విదేశాలనుండి భారతదేశానికి పనిచేయడం ప్రారంభమై, భారత స్వాతంత్ర విప్లవోద్యమంలో భాగంగా భారతదేశంలోని విప్లవకారులతో కలిసి పనిచేయడమేకాకుండా వారికి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని అందించడానికి సహాయపడింది.[2]

ఈ పార్టీ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇందులో భాయ్ పర్మానంద్, సోహన్ సింగ్ భక్నా, హర్ దయాల్, మొహమ్మద్ ఇక్బాల్ శేదై, కర్తార్ సింగ్ శరభ, అబ్దుల్ హఫీజ్ మహ్మద్ బరకాతుల్లా, సులామన్ చౌదరి, అమీర్ చౌదరి, రష్బీరి బోస్, గులాబ్ కౌర్ తదితరులు కీలక సభ్యులుగా ఉన్నారు.

ఏర్పాటు

[మార్చు]

1910 దశకంలో వాషింగ్టన్‌, ఒరేగాన్‌ రాష్ట్రాల్లోని కట్టెల మిల్లులలో, కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములలో పనిచేయడానికి పంజాబ్ రాష్ట్రం నుండి చాలమంది కార్మికులు వెళ్ళారు. అయితే అక్కడ పనిచేస్తున్న తెల్లజాతీయుల జీతంకంటే, భారతీయులకు తక్కువ జీతం చెల్లించడంతోపాటూ వివక్ష, చిన్నచూపు చూపించేవారు. అలా ఇంగ్లీషువారిపై కోపం పెంచుకున్న భారతీయులు, దేశానికి స్వాతంత్ర్యం వస్తేనేగాని తమ జీవితాలు మారవని అర్థంచేసుకున్నారు. మొదటిసారిగా 1913 ఏప్రిల్‌లో ఒరేగాన్‌లోని అస్టోయియాలో భారతీయ కార్మికులు సమావేశమై, 'పసిఫిక్‌ తీర హిందీ సంఘం' ను ఏర్పాటు చేసారు. సంఘం ప్రధాన కార్యాలయంపైన యుగంతర్‌ ఆశ్రమ్‌ (శాన్‌ఫ్రాన్సిస్కో) లో సంఘం నుండి 1913 నవంబరు 1న 'గదర్‌' అనే ఒక వారపత్రికను ప్రారంభించింది.[3]

గదర్ అనే పేరు వెనుక చాలా నేపథ్యమే ఉంది. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని బ్రిటిషు వారు 'గదర్‌' (తిరుగుబాటు) గా పిలిచేవారు. ఆ పోరాటాన్ని కొనసాగించి, అంతిమంగా దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడమే లక్ష్యం కాబ‌ట్టి పత్రికకు ఆ పేరునే ఖరారు చేశారు. కాలక్రమేణా ఆ సంఘమే 'గదర్‌ పార్టీ'గా ప్రసిద్ధికెక్కింది.[4]

కార్యకలాపాలు

[మార్చు]
గద్దర్ వార్తాపత్రిక (ఉర్దూ) సం. 1, నం. 22, 1914 మార్చి 28

పార్టీ వారపత్రిక ది గదర్ పత్రిక కేంద్రంగా పార్టీ ఎదిగింది. ఈ పత్రిక మాస్ట్ హెడ్‌పై శీర్షిక ఇలా ఉంది: అంగ్రేజీ రాజ్ కా దుష్మన్ (బ్రిటిష్ పాలనకు శత్రువు). "భారతదేశంలో తిరుగుబాటును ప్రేరేపించడానికి" ధైర్యవంతులైన సైనికులు కావాలి " అని గదర్ ప్రకటించింది. వాళ్ళు చెల్లించాల్సింది-మరణం; వెల-బలిదానం; పింఛను - స్వేచ్ఛ; యుద్ధ క్షేత్రం-ఇండియా ".

పార్టీ సిద్ధాంతం దృఢమైన లౌకికవాదం. తరువాత పంజాబ్‌లో ప్రధాన రైతు నాయకుడైన సోహన్ సింగ్ భక్నా మాటల్లో: "మేము సిక్కులమో పంజాబీలమో కాదు. మా మతం దేశభక్తి. " ది గదర్ మొదటి సంచిక శాన్ ఫ్రాన్సిస్కోలో 1913 నవంబరు 1 న ప్రచురితమైంది.

పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కర్తార్ సింగ్ శరభ మొదటి సంచికలో ఇలా రాసాడు: "ఈ రోజు విదేశాలలో 'గదర్' ప్రారంభమవుతోంది, కానీ మన దేశ భాషలో, ఇది బ్రిటిష్ రాజ్‌పై యుద్ధం. మా పేరు ఏమిటి? గదర్. మా పని ఏమిటి? గదర్. విప్లవం ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో. పెన్నులు, సిరాల స్థానంలో రైఫిళ్ళూ, రక్తం వచ్చే సమయం త్వరలోనే వస్తుంది."

1914 లో కెనడా ప్రభుత్వపు భారత వ్యతిరేక వలస చట్టాలకు సూటిగా సవాలు విసిరిన కోమగట మారు ఓడ ప్రయాణం తరువాత, అమెరికాలో నివసిస్తున్న అనేక వేల మంది భారతీయులు తమ వ్యాపారాలను, గృహాలనూ విక్రయించి బ్రిటిషు వారిని భారతదేశం నుండి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. హర్ దయాళ్, అమెరికా అధికారులు తనను బ్రిటిషు వారికి అప్పగిస్తారనే ఆందోళనతో యూరోప్‌కు పారిపోయాడు. సోహన్ సింగ్ భక్నా అప్పటికే బ్రిటిషు వారికి చిక్కి ఉన్నాడు. నాయకత్వం రామచంద్ర భరద్వాజ్ చేతికి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కెనడా ప్రవేశించిన తరువాత, ఈ సంస్థ అమెరికాలో కేంద్రీకృతమైంది. జర్మనీ ప్రభుత్వం నుండి దానికి గణనీయమైన నిధులు అందాయి. వారి ధోరణి చాలా తీవ్రవాద పద్ధతిలో ఉండేది. హర్నామ్ సింగ్ చెప్పిన ఈ మాటలు దాన్ని ప్రతిబింబిస్తాయి:

"మాకు పండితులు, ముల్లాలూ ఎవరూ అవసరం లేదు"

20 వ శతాబ్దపు రెండవ దశాబ్దంలో పార్టీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంపై భారతదేశం అసంతృప్తి కారణంగాను, భారతదేశంలో రాజకీయ సంస్కరణలు లేకపోవడం వల్లనూ దాని బలం పెరిగింది.1917 లో హిందూ జర్మన్ కుట్ర విచారణలో గదర్ పార్టీ నాయకుల్లో కొందరిని అరెస్టు చేసారు. విచారణలో వారి పత్రిక ప్రసక్తి వచ్చింది.1914 లో, హర్యానాకు చెందిన పార్టీ సభ్యుడు కాశీ రామ్ జోషి అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1915 మార్చి 15 న అతడిని వలస ప్రభుత్వం ఉరితీసింది.[5] గద్దర్ పార్టీకి పంజాబ్ ప్రావిన్స్‌లో నిబద్ధత కలిగిన కార్యకర్తలుండేవారు. కానీ దాని వారిలో చాలా మంది ప్రభుత్వ వత్తిడికి లోనై కెనడా, అమెరికాలకు ప్రవాసం వెళ్ళిపోయారు. దానితో గదర్ పార్టీ భారత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం మానేసింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని 5 వుడ్ స్ట్రీట్ నుండి పార్టీ కార్యకలాపాలు నడిచేవి. పార్టీ పత్రిక ఇండిపెండెంట్ హిందూస్థాన్ అక్కడి నుండే వెలువడేది. ఇక్కడే గదర్ స్మారకాన్ని నిర్మించారు. పార్టీకి మెక్సికో, జపాన్, చైనా, సింగపూర్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలయా, ఇండో-చైనా, తూర్పు ఆప్రికా, దక్షిణ ఆఫ్రికా వంటి ఇతర దేశాలలో క్రియాశీల సభ్యులుండేవారు.

వ్యవస్థాపక సభ్యులు

[మార్చు]
  1. సోహన్ సింగ్ భక్నా (అధ్యక్షుడు)
  2. కేసర్ సింగ్ (ఉపాధ్యక్షుడు)
  3. కర్తార్ సింగ్ శరభ (ఎడిటర్, పంజాబీ గదర్)
  4. బాబా జవాలా సింగ్ (ఉపాధ్యక్షుడు)
  5. భగవాన్ సింగ్ జ్ఞానీ
  6. బల్వంత్ సింగ్
  7. పిటి కాన్షి రామ్ (కోశాధికారి)
  8. హర్నామ్ సింగ్ తుండిలాట్
  9. జిడి వర్మ
  10. లాలా థాకర్ దాస్ (దురి) (వైస్ సెక్రటరీ)
  11. మున్షి రామ్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
  12. భాయ్ పర్మానంద్
  13. నిధాన్ సింగ్ చుఘా
  14. సంతోఖ్ సింగ్
  15. మాస్టర్ ఉధమ్ సింగ్
  16. బాబా చత్తర్ సింగ్ అహ్లువాలియా (జెతువాల్)
  17. బాబా హర్నామ్ సింగ్ (కరి చీర)
  18. మంగూరామ్ ముగోవాలియా [6][7]
  19. కరీం బక్ష్
  20. అమర్ చంద్
  21. రెహమత్ అలీ
  22. VG పింగిల్
  23. సంత్ బాబా వసాఖా సింగ్
  24. మౌలవి బర్కతుల్లా
  25. హర్నామ్ సింగ్ సైనీ
  26. తారక్ నాథ్ దాస్
  27. పాండురంగ సదాశివ్ ఖంఖోజే
  28. గందా సింగ్ ఫంగూరే
  29. కరీం బక్స్
  30. బాబా పృథ్వీ సింగ్ ఆజాద్
  31. గులాబ్ కౌర్

మూలాలు

[మార్చు]
  1. "Ghadr (Sikh political organization)". Encyclopædia Britannica. Retrieved 8 May 2021.
  2. Ogden, Joanna (Summer 2012). "Ghadar, Historical Silences, and Notions of Belonging: Early 1900s Punjabis of the Columbia River". Oregon Historical Quarterly. 113 (2): 164–197. doi:10.5403/oregonhistq.113.2.0164. JSTOR 10.5403/oregonhistq.113.2.0164.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-07. Retrieved 2018-08-13.
  4. Ramnath, Maia (2011). Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire. Berkeley, Los Angeles, London: University of California Press. p. 2.
  5. Haryana Samvad Archived 2018-08-27 at the Wayback Machine, Jan 2018.
  6. "Manguram Muggowal, a former Ghadar Party member, later joined the Dalit [the proper term for so-called untouchables] emancipation movement". Georgia Straight Vancouver's News & Entertainment Weekly. 26 July 2013. Retrieved 7 October 2015.
  7. "There were not many Scheduled Caste persons in the Ghadar movement, however; Mangoo Ram recalls only one other Chamar besides himself".