Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం

వికీపీడియా నుండి
భారతదేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యం
శాతవాహనులు
తొలి మధ్య యుగపు రాజ్యాలు
చివరి మధ్య యుగపు రాజ్యాలు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యం
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్యోద్యమం
భారతదేశ గణతంత్ర చరిత్ర

భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో బుడతగీచు (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. వీరు మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా పోరాడారు.

20వ శతాబ్దం మెదట్లో ఈ పద్ధతులలో మౌలికమైన (విప్లవాత్మకమైన) మార్పులు వచ్చాయి. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల లోని భారత స్వాతంత్ర్య యోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.

జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్ 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు.[1] అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్ర బోస్, సాయుధ సంగ్రామం సరైందిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యానికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృతరూపం దాల్చాయి. నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది.

ఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వతంత్ర దేశాలయినాయి.1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించినప్పటకీ 1950 జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది. ఉపఖండంలో మరో దేశం పాకిస్తాన్ 1956 లో ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ ఆ దేశంలో అనేక అంతర్గత అధికార పోరాటాల కారణంగా ప్రజాస్వామ్యం అణిచివేయబడింది, ఈ పరిణామాలు చివరకి 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో తూర్పుపాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఆవిర్భవించేందుకు దారితీశాయి

భారత జాతీయోద్యమం అనేక దేశాలలో వలసపాలనలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసి, బ్రిటీష్ సామ్రాజ్య పతనానికీ కామన్ వెల్త్ ఆవిర్భావానికీ దారితీసింది. తరువాత జరిగిన అనేక ఉద్యమాలకు అహింసాయుత గాంధేయవాదం మార్గదర్శకం అయింది. 1955-1968 మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికా పౌరహక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం, మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటాలాను అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆయితే ఈ నాయకులందరూ గాంధేయవాదాలయిన అహింస, సత్యాలని తుచ తప్పక పాటించారని చెప్పలేము.

ప్లాసీ యుద్ధం తరువాత మీర్ జాఫర్‌తో రాబర్ట్ క్లైవ్

లాభదాయకమైన సుగంధద్రవ్యాల వ్యాపారార్థం 1498 లో వాస్కోడగామా కాలికట్ లోని కోజికోడ్ ఓడరేవులో కాలిడినప్పటినుంచీ ఐరోపా వర్తకుల రాకపోకలు భారత ఉపఖండంలో ప్రారంభమయ్యాయి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించటంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. ఈ యుద్ధం తరువాత బెంగాల్, బీహార్‌లు ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 1765 లో బక్సర్ యుద్ధంలో ఒడిషా కూడా కంపెనీ వశమైంది. 1839 లో మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1845-46 లో జరిగిన మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం తరువాత 1848-1849 లో జరిగిన రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల పర్యవసానంగా పంజాబ్, కంపెనీ వశమైంది. ఈ కాలంలో బ్రిటీష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకోబడిన రాజ్యాల పరిపాలనార్థమై అనేక శాసనాలు చేసింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 లో చేసిన ఇండియా చట్టం, 1833 చార్టర్ చట్టం మెదలైన చట్టాలు భారతదేశంలో బ్రిటీష్ అధికారాన్ని సుస్థిరం చేసాయి. 1835 లో ఇంగ్లీషును ఆధికారిక భాషగా గుర్తించారు. ఈ సమయంలో ప్రాచ్యవిద్యని అభ్యసించిన హిందూ విద్యావేత్తలు హిందూ ధర్మంలోని సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం, కులవివక్ష, బాల్య వివాహాలను రూపుమాపటానికి ఉద్యమించారు. ఈ విధంగా బొంబాయి, మద్రాసులలో ఏర్పడిన సంఘాలు రాజకీయసంఘాలుగా పరిణతి చెందాయి. ఉన్నత విద్యనభ్యసించిన నాటి తొలి సంస్కర్తలు పత్రికలను మిక్కిలి సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం కారణంగా ఆనాటి సామాజిక విలువలు, మతసంప్రదాయాలకు ఎక్కువ విఘాతం కలగకుండానే సంస్కరణలు సాధ్యమయ్యాయి.

బ్రిటీష్ పాలన వలన పరోక్షంగా ఆధునిక భావజాలం వ్యాప్తిచెందినప్పటికీ, భారతీయులు బ్రిటీష్ వారి వలసపాలన పట్ల వ్యతిరేకతను పెంచుకో సాగారు. నైన్త్ లాన్సర్స్ లో నిక్షిప్తమైన హెన్రీ ఔరీ జ్ఞాపకాలు, సుగంధద్రవ్య వ్యాపారి ఫ్రాంక్ బ్రౌన్ తన మేనల్లునికి వ్రాసిన ఉత్తరాలు బ్రిటీష్ పాలనలో భారతీయులపై జరిగిన దాష్టీకాలను తెలియజేస్తాయి. ఉపఖండంలో బ్రిటీష్ వారి అధికారం పెరిగేకొద్దీ వారు భారతీయుల ఆచారాలను హేళన చెయ్యడం ఎక్కువయింది. మసీదులలో పార్టీలు చేసుకోవడం, తాజ్ మహల్ పై సైనిక నృత్యాలను ప్రదర్శించటం, రద్దీగా వుండే దారులలో, సంతలలో తమకు అడ్డువచ్చిన వారిని కొరడాలతో కొట్టడం (ఆధారం హెన్రీ బ్లేక్ జ్ఞాపకాలు), సిపాయిలను అగౌరవంగా చూడటంవంటి ఆగడాలు పెచ్చుమీరాయి. 1849 పంజాబ్ ఆక్రమణ తరువాత అనేక చిన్నచిన్న తిరుగుబాట్లు జరిగాయి, అయితే వీటిని బలవంతంగా అణచివేసారు.

1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం

[మార్చు]
తిరుగుబాటు సమయంలో గల రాజ్యాలు.
93 వ హైలాండర్స్, 4 వ పంజాబ్ రెజిమెంట్ తిరుగుబాటుదారులతో పోరాడిన తరువాత సెకండ్రా బాగ్, నవంబరు 1857

1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాట్లని 'ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకీ బ్రిటీష్ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీసాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్లగల నిర్లక్ష్య వైఖరి మరియూ ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం, మొగలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటీష్ వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.

1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, మంగళ్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటీష్ వారు మంగళ్ పాండేని, జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్ల్-కీ-సరైలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహెబ్, రావ్ సాహిబ్ పరివారం, తాంతియా తోపే, అజిముల్లాఖాన్‌, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, బీహారులోని రాజపుత్ర నాయకుడైన జగదీష్‌పూర్ మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, బహదూర్షా 2, ప్రాణ్ సుఖ్ యాదవ్, రెవారి బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.

తిరుగుబాటు తదనంతర పరిణామాలు

[మార్చు]

1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా భారతదేశం నేరుగా బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటీష్ రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిష్ వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.

బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేసారు. బహదూర్‌షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించారు. 1862 లో అతను బర్మాలో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.

సంఘటిత ఉద్యమాలు

[మార్చు]

సిపాయిల తిరుగుబాటు తరువాతి దశాబ్దాల్లో భారతదేశంలో రాజకీయ చైతన్యం హెచ్చింది. రాజకీయాలలో భారత ప్రజల వాణి విన్పించసాగింది. అంతేకాక, జాతీయస్థాయిలోను, ప్రాంతీయస్థాయిలోను అనేకులు భారత ప్రజలకు నాయకత్వం వహించసాగారు. దాదాభాయి నౌరోజీ 1867 లో ఈస్ట్ ఇండియా ఆసోసియేషన్ (తూర్పు భారతీయ సంఘం ) బు స్థాపించాడు. 1867 లో సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ (భారత జాతీయ సంఘం) స్థాపించాడు. పదవీవిరమణ చేసిన బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగి అలన్ ఆక్టేవియస్ హ్యూమ్ ప్రోత్సాహంతో బొంబాయి (ముంబాయి) లో సమావేశమైన 73 మంది భారత ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించారు. వివిధరాష్ట్రాలకు చెందిన వీరిలో చాలామంది పాశ్చాత్యవిద్య నభ్యసించి న్యాయ, పాత్రికేయ, విద్యారంగాల వంటి వృత్తులలో ఉన్నవారు. కాంగ్రెస్ ఏర్పాటైన కొత్తలో ఏవిధమైన సిద్ధాంతాలు లేక, కేవలం అనేక అంశాలపై చర్చలకు పరిమితమై బ్రిటిష్ పాలన పట్ల అనుకూలతను వ్యక్తంచేయటానికే పరిమితమైంది. ప్రతి వార్షిక సమావేశాలలో ప్రాథమిక హక్కులు, పౌరసేవలలో, ప్రభుత్వంలో భారతీయ భాగస్వామ్యం మెదలైన తక్కువ వివాదాస్పదమైన విషయాలలో అనేక తీర్మానాలను చేయటానికి పరిమితమైంది. ఈ తీర్మానాలను వైస్రాయికి, కొన్నిసార్లు బ్రిటిష్ పార్లమెంటుకూ నివేదించేవారు. అయితే తొలినాళ్ళలో కాంగ్రెస్ సాధించింది చాలా స్వల్పం. భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకున్నప్పటికీ, కేవలం నగరాలలో నివసించే శిష్టజనవర్గానికే కాంగ్రెస్ పరిమితమైంది. ఇతరవర్గాలకి కాంగ్రెస్‌లో ప్రాతినిధ్యం నామమాత్రమేనని చెప్పవచ్చు.

ఆర్య సమాజము, బ్రహ్మ సమాజం మొదలైన మతసమాజాలు సంఘసంస్కరణలకు మిక్కిలి కృషి చేసాయి. మతసంస్కరణలు, సాంఘిక గౌరవం మెదలయిన విషయాలలో వీరి బోధనలు జాతీయతాభావనకు పునాదులు వేసాయి. ప్రజలు తమను భారత జాతిగా గుర్తించసాగారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీ అరబిందో, సుబ్రహ్మణ్య భారతి, బంకించంద్ర ఛటర్జీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రవీంద్రనాథ్ టాగూర్, దాదాభాయి నౌరోజీ మెదలయినవారి కృషి జాతి పునరుత్తేజం పట్ల, స్వేచ్ఛ పట్లా ప్రజల్లో ఇచ్ఛను వ్యాపింపజేసింది.

1900 నాటికి కాంగ్రెసు అఖిల భారత స్థాయిని చేరుకున్నప్పటికీ, ముస్లిములను ఆకట్టుకోలేకపోయిన వైఫల్యం దాని విజయాల స్థాయిని తగ్గించింది. మతమార్పిడిపై హిందూ సంస్కర్తల దాడులు, గోసంరక్షణ, ఉర్దూను అరబిక్ లిపిలోనే ఉంచడం మొదలైన కారణాలవల్ల ముస్లిములు తమ అల్పసంఖ్యాక గుర్తింపు, హక్కులు కోల్పోతామన్న భయంతో కాంగ్రెసును భారతీయుల ఏకైక ప్రతినిధిగా అంగీకరించలేదు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిమ్ పునరుత్తేజ ఉద్యమం, 1875లో, అలీఘర్ లో మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజి (నేటి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ) స్థాపనకు దారితీసింది. దాని ముఖ్యోద్దేశం ఇస్లాం మరియూ నూతన పాశ్చాత్య విజ్ఞానాల మేళవింపుతో విద్యాబోధన చేయడం. కాని, భారత ముస్లిములలో ఉన్న భిన్నత్వం వారిలో సాంస్కృతిక, సైధ్ధాంతిక ఏకత్వాన్ని సాధించలేక పోయింది.

భారత జాతీయవాద పుట్టుక

[మార్చు]

ప్రభుత్వ సంస్థలలో ప్రాతినిధ్యం, తమ వాణిని వినిపించే అవకాశం, శాసనాలను రూపొందిచడంలోనూ భారతదేశ పరిపాలనా వ్యవహారాలలోనూ ఓటు సంపాదించడం లాంటివి కాంగ్రెసు సభ్యులలో జాతీయవాదానికి అంకురార్పణ చేశాయి. కాంగ్రెసు వాదులు తమను తాము స్వామిభక్తులుగా భావిస్తూ, బ్రిటిషు సామ్రాజ్య భాగంగానే, తమ దేశ పరిలపాలనలో భాగస్వామ్యాన్ని ఆశించారు. దాదాభాయి నౌరోజీ, బ్రిటిషు వారి హౌస్ ఆఫ్ కామన్స్ కు పోటీచేసి గెలిచిన మొదటి భారతీయుడిగా, ఈ ఆలోచనావిధానానికి ఒక మూర్తిభవించిన ఉదాహరణగా నిలిచారు.

బాల గంగాధర తిలక్ మొదటిసారిగా "స్వరాజ్య" వాదాన్ని వినిపించిన జాతీయవాది. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యావ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేక పోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి "స్వరాజ్యమే" సహజమైన, ఏకైక మార్గమని నమ్మాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు" అనే అతను నినాదం భారతీయులందరికి స్ఫూర్తిదాయకమైంది.

తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావింపబడ్డాయి. ప్రజలు, బ్రిటిషు వారిపై తిరుగబడటమే స్వరాజ్య సాధనా మార్గంగా భావించారాయన. బ్రిటిషు వారివైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు. బిపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ వంటి వర్ధమాన ప్రజానాయకులు అతనును సమర్ధించారు. ఈ ముగ్గురూ "లాల్, బాల్, పాల్"గా ప్రసిధ్ధులు. భారత దేశపు అతి పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, బెంగాల్, పంజాబులు భారత ప్రజల ఆకాంక్షలకు, జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి.

హింస, అవ్యవస్థలను తిలక్ ప్రోత్సహిస్తున్నారని గోఖలే విమర్శించారు. కాంగ్రెసులో ప్రజా ప్రాతినిధ్యం లేనందున తిలక్ అతను అనుయాయులు కాంగ్రెసును విడువవలసి వచ్చింది. దీనితొ కాంగ్రెసు 1907లో రెండు ముక్కలయింది.

తిలక్ అరెస్టుతో భారతీయ తిరుగుబాటుపై అన్ని ఆశలు అడుగంటాయి. కాంగ్రెసు ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. రాబోతున్న రాజ్యాంగ సవరణలలో మినహాయింపులను, ప్రభుత్వ ఉద్యోగాలలోను, నియోజకవర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపును కోరుతూ ఒక ముస్లిమ్ ప్రతినిధి దళం వైస్రాయి గిల్బర్ట్ ఇలియట్-ముర్రే-కైన్‌మౌండ్, 4 వ ఎర్ల్ ఆఫ్ మింటోని కలిసింది. బ్రిటిషు ప్రభుత్వం వారి కొన్ని కోరికలను మన్నిస్తూ, ముస్లిములకై ప్రత్యేకించిన ప్రతినిధిత్వ స్థానాలను పెంచింది. భారత ప్రభుత్వ శాసనం 1909. ముస్లిం లీగ్, హిందువులతో నిండిన కాంగ్రెసు నుండి తాము వేరని, తమ వాణి "దేశంలో దేశంయొక్క" వాణి అని నొక్కి చెప్పింది.

బెంగాల్ విభజన

[మార్చు]

ప్రాంతీయ మరియూ రాష్ట్రీయ రాజకీయాలపై బెంగాలీ సంస్థానంలోని హిందూ మేధావుల ప్రభావం చాల ఎక్కువగా ఉండేది. జనాభా ఎక్కువగా ఉన్న ఈ చాలా పెద్ద సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం పేరుతో, అప్పటి వైస్రాయి, గవర్నర్-జనరల్ (1899-1905) అయిన కర్జన్ రెండు భాగాలుగా చేయాలని ఆదేశించాడు. దరిమిలా ఢాకా రాజధానిగా, అస్సాంతో చేరి తూర్పు బెంగాలు, అప్పటికే బ్రిటిషు రాజధానిగా ఉన్న కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాలు ఆవిర్భవించాయి. ఈ ఆదేశం పై బెంగాలీలు మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా వీధి వీధినా ఉద్యమాలు జరిగాయి. పత్రికల ద్వారా ఆ ఉద్యమాలకు ప్రాచుర్యం లభించింది. ప్రజాభీష్టానికి విరుధ్ధంగా, వారి భావాలకు విలువనివ్వకుందా చేసిన ఈ పని బ్రిటిషు వారి "విభజించి పాలించే" పద్ధతికి అద్దం పట్టింది. కాంగ్రెసు "స్వదేశీ" నినాదాన్నిచ్చి, బ్రిటిషు వస్తువుల బహిష్కారానికి పిలుపునిచ్చింది. ప్రజలు ఒకరికొకరు రక్షాబంధనాలను కట్టుకొని తమ సమైక్యతను ప్రదర్శించారు. ఈ రోజుల్లో రవీంద్రనాధ టాగోర్ దేశభక్తి గీతాల్ని రచిస్తూ, ఆలపిస్తూ ప్రజలను ముందుకు నడిపారు.

బెంగాలు విభజనకాలంలో కొత్త పద్ధతులలో ఉద్యమాలు జరిగాయి. ఇవే స్వదేశీ, బహిష్కరణ మార్గాలు. కాంగ్రెసువారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం, సిపాయిల తిరుగుబాటు స్థాయిలో బ్రిటిషు వారిపై ప్రజా వ్యతిరేకతను పెంచగలిగింది. హింస, అణచివేతల చక్రభ్రమణం దేశంలో పలుచోట్ల జరిగింది (అలీపూర్ విస్ఫొటం). బ్రిటిషు వారు ఈ సంకట స్థితిలో నుండి బయటపడడానికి కొందరు మితవాదులకు రాజాస్థాన, సంస్థాన పదవులు ఇచ్చి, 1909లో కొన్ని రాజ్యాంగ సవరణలను తెచ్చారు. ఐదవ జార్జి రాజు 1911లో జరిపిన, బ్రిటిషు వారు సుహృద్భావ పర్యటనగా భావించే పర్యటనలో దర్బారు (దాసులు సార్వభౌమునికి విధేయతను ప్రకటించే నిండు పేరోలగం) లో బెంగాల్ విభజన రద్దును, రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి దక్షిణాన ఒక పధకం ప్రకారం నిర్మింపబడుతున్న నగరానికి మార్పును ప్రకటించాడు.

1912 డిసెంబరు 23న రాజధాని మార్పు సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది.

మొదటి ప్రపంచ యుద్ధం

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటిషు వారు భారతదేశంలో తిరుగుబాటును శంకించారు. వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశంలోని ముఖ్య నాయకులందరూ బ్రిటిషు వారికి అపూర్వమైన సహాయ సహకారాలనందించారు. మానవ, మానవేతర వనరులను సమకూర్చి భారత్ బ్రిటిషు యుధ్ధ ప్రయత్నానికి కొడంత అండగా నిలిచింది. సుమారు 13 లక్షల మంది భారతీయులు సైనికులుగానో, పనివారలగానో ఐరోపా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యాలలో పనిచేశారు. భారత ప్రభుత్వము, అప్పటి రాజవంశాలు పెద్ద ఎత్తున భోజన వస్తువులను, ధనాన్ని, మందుగుండు సామగ్రిని అందజేశాయి. కాని పంజాబు, బెంగాలులలో బ్రిటిషు వ్యతిరేకాగ్ని రగులుతూనే ఉంది. బెంగాలు జాతీయ వాదం, పంజాబులో అశాంతి చేతిలో చేయిగా స్థానిక పరిపాలనను స్తంభింపజేశాయి.[2][3] యుధ్ధ ప్రారంభం నుండి ప్రవాసభారతీయులు, ముఖ్యంగా అమెరికా, కెనడా మరియూ జర్మనీలలో ఉన్నవారు, బెర్లిన్ కమిటీ, గదర్ పార్టీల ఆధ్వర్యంలో భారతదేశంలో ఐరిష్ రిపబ్లిక్, జర్మనీ, టర్కీల సహాయంతో 1857 తరహా తిరుగుబాటు జరుప తలపెట్టిన భారీ ప్రయత్నం హిందూ-జర్మన్ కుట్రగా పేరొందింది.[4][5][6] ఈ కుట్రలో భాగంగా ఆఫ్ఘనిస్థానును కూడా బ్రిటిషు భారత్ పై ఉసిగొల్ప ప్రయత్నం జరిగింది.[7] తిరుగుబాట్లకు జరిగిన అనేక ప్రయత్నాలలో ఫిబ్రవరి తిరుగుబాటు, సింగపూరు తిరుగుబాటు ముఖ్యమైనవి. ఈ ప్రయత్నాలన్నీ గట్టి అంతర్జాతీయ గూఢచర్యంతోనూ, కౄరమైన చట్టాల (భారత రక్షణ చట్టం 1915) తోనూ పది సంవత్సరాలపాటు అణచివేయబడ్డయి.[8][9]

మొదటి ప్రపంచ యుధ్ధానంతరం, యుధ్ధంలో జరిగిన భారీ ప్రాణనష్తం, పెరిగిన పన్నులతో మరింత పెరిగిన ద్రవ్యోల్బణం, సర్వవ్యాపకమైన ఫ్లూ మహమ్మారి, మందగించిన వ్యాపారాలు భారత ప్రజల బ్రతుకులను మరింత కష్టతరం చేసాయి. బ్రిటిష్ పాలననంతమొందిచడానికి భారత సైనికులు దేశంలోకి ఆయుధాలను దొంగతనంగా తెచ్చారు. కాంగ్రెసు లోని మితవాద, అతివాద గుంపులు మరల కలసి పనిచేయడంతో యుధ్ధపూర్వ జాతీయవాదం పునర్జీవితమైంది. 1916లో రాజకీయాధికారాల పంపిణీ, దేశంలో ఇస్లాం భవితవ్యాలపై కాంగ్రెసు, ముస్లిం లీగ్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనికి లక్నో ఒప్పందం అని పేరు.

బ్రిటిషర్లు మొదటి ప్రపంచ యుద్ధంలోభారత దేశ సహాయానికి ప్రతిఫలంగా భారత జాతీయవాద కోర్కెలపై చూద్దాం, చేద్దాం పద్ధతినే అవలంబించారు. 1917 ఆగస్టులో భారత ప్రభుత్వ కార్యదర్శి అయినఎడ్విన్ శామ్యూల్ మోంటగు, భారత చట్టసభలో ఈ క్రింది ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు. "భారతదేశంపై ఆంగ్లేయుల దృక్పథం ఏమిటంటే ప్రతి నిర్వహణా శాఖలోనూ భారతీయుల సంఖ్యను, ప్రాముఖ్యతనూ పెంచుతూ, స్వయం నిర్వహణా వ్యవస్థలని క్రమంగా అభివృద్ధి చేసి ఒక అభివృద్ధి కాముకమైన ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటుచేసి,ఈ దేశాన్ని బ్రిటిష్ సార్వభౌమాధికార సామ్రజ్యంలోని అవిభాజ్య భాగంగా తయారు చెయ్యడం". ఈ కలని సాకారంచేసే ప్రయత్నం భారత్ ప్రభుత్వ చట్టం1919 లోకనిపించింది.ఆ చట్టం ద్వంద నిర్వహణా విధానాన్నిప్రవేశపెట్టింది. దీంట్లో భారతదేశం నుండి ఎన్నుకోబడిన శాసనకర్తలు, బ్రిటీషు ప్రభుత్వం నియమించిన అధికారులు అధికారాన్నిపంచుకుంటారు. ఈ చట్టం కేంద్రీయ, ప్రాంతీయ శాసనసభలనీ, వోటు హక్కునీ విస్తృత పరచింది. ద్వంద నిర్వహణా విధానం అమలు కాగానే ప్రాంతీయ పరిధిలో అనేక మార్పులు వచ్చాయి.అనేకమైన అవివాదాస్పద మంత్రిత్వ శాఖలు, వ్యవసాయం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఆరోగ్యం, విద్య, ప్రజా పనులు లాంటివి భారతీయులకి ఒప్పచెప్పి, సున్నితమైన ఆర్థిక శాఖ, పన్నులు, శాంతి భద్రతలు మాత్రం ప్రాంతీయ బ్రిటీషు నిర్వాహకులు అట్టిపెట్టుకున్నారు.

భారత్ కు గాంధీ ఆగమనం

[మార్చు]

మోహన్ దాస్ గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. భారతదేశంలో నిరంకుశమైన రౌలట్ చట్టం, కూలీల పట్ల వివక్షనూ వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించాడు. ఈ ఆందోళనల సమయంలో గాంధీజీ సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు. దీనికి స్ఫూర్తి పంజాబ్ ప్రాంతంలో 1872 లో బాబా రామ్ సింగ్ ప్రారంభించిన కూకా ఉద్యమం. ఈ ఉద్యమాలు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికాలో జాన్ స్మట్స్ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంకుశ చట్టాలను అధికారికంగా వెనక్కు తీసుకుంది.

ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగివచ్చిన గాంధీకి ఇక్కడి పరిస్థితులు, రాజకీయాలు కొత్త. అప్పట్లో కాంగ్రెస్ కావాలని అడుగుతున్న ఉమ్మడి వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్ధించాడు. ఆంగ్లేయులు భారతదేశానికి తీసుకువచ్చిన పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి అప్పుడు దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భావించాడు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతయైన గోపాలక్రిష్ణ గోఖలే గాంధీకి మార్గదర్శకుడిగా మారారు. గాంధీజీ ప్రతిపాదించిన అహింసా పూరిత సహాయ నిరాకరణ ఉద్యమం మొదట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు రుచించలేదు. గాంధీ మాటల్లో చెప్పాలంటే సహాయ నిరాకరణ అంటే అధర్మపూరితమైన ప్రభుత్వ పరిపాలనను నిరసిస్తూ పౌరులు తమ వెల్లడించే అభిప్రాయం. దాన్ని అహింసాయుతంగా నిర్వహించాలి". అలా గాంధీ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్నో లక్షలమంది సామాన్య ప్రజల్లో స్పూర్తి రగిల్చగలిగాడు.

గాంధీజీ దూరదృష్టి ఎంతో మందిని జాతీయ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోకి ఆకర్షించింది. ఈ ఉద్యమంలో భారతీయ వృత్తులు, పరిశ్రమలు వాటి మీద ఆధారపడి జీవితున్న ప్రజల పరిరక్షణ కూడా ఒక భాగం. ఉదాహరణకు బీహార్ లోని చంపారన్ లోవాణిజ్య పంటలను బలవంతంగా పండించమని పేదరైతులను బలవంతం చేస్తూ, వారి నుంచి అన్యాయంగా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ వారికి ఆహార ధాన్యాలు కూడా సరిగా అందుబాటు లో లేకుండా చేసే ప్రభుత్వ విధానాలపై పోరాడి విజయం సాధించారు.

రౌలట్ చట్టం దాని తదనంతర పరిణామాలు

[మార్చు]

1919 లో చేయబడిన రౌలట్ చట్టం సంస్కరణల సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్వతిరేకంగా జరిగిన హిందూ-జర్మన్ కుట్ర, భారతదేశంలో మొదలయిన సాయుధ పోరాటాలలో జర్మన్ , బోల్ష్విక్ ల పాత్ర ల పై విచారణచేయటానికి సాంమ్రాజ్య విధాన మండలి (ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్)చే నియమించ బడిన రౌలట్ అధికార సంఘం (రౌలట్ కమీషన్) సిఫార్సులకణుగుణంగా రౌలట్ పేరుపై ఈ చట్టం చేయబడినది. చీకటి చట్టంగా పరిగణింపబడిన రౌలట్ చట్టం వైస్రాయి ప్రభుత్వానికి కుట్రని విచ్ఛినం చేయటానికనే సాకుతో వార్తాపత్రికలపై ఆంక్షలువిధించటం, రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే బహిష్కరించటం, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతునారనే అనుమానంపై ఏ వ్యక్తినైనా ధృవీకరించకనే నిర్భంధించటం లాంటి విశేష అధికారాలను దకలు పరిచింది. ఈ చట్టానికి నిరసనగా హర్తాళ్ కి పిలుపునివ్వటంతో దేశవ్యాప్తంగా కాక పోయినప్పటికీ విస్తృతంగా వ్యతిరేకత ప్రభలింది..[10][11][12]

1919 ఎప్రల్ 13న ఈ ఆందోళనలకు పరాకాష్ఠగా జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది, ఈ దురంతానికే అమృత్సర్ మారణకాండ అని కూడా పేరు. పంజాబ్ లోని అమృత్సర్ లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపటానికి నాలుగు గోడల మధ్య జలియన్ వాలాభాగ్ లో సమావేశమైన 5000 మంది అమాయక నిరాయుధ ప్రజలపై రెజినాల్డ్ డైయ్యర్ అనే బ్రిటీష్ సైనికాధికారి ప్రధాన ధ్వారాన్ని మూసివేసి విచక్షణా రహితంగా కాల్పులకు ఆదేశించాడు. మొత్తం 1,651 మార్లు చేసిన కాల్పులలో 379 మంది ప్రజలు మరణించారని 1,137 మంది గాయపడినారని బ్రిటీష్ వారి అధికారిక అంచనా. అయితే మొత్తం 1,499 మందిదాకా మరణించారని భారతీయుల అంచనా.ఈ దారుణ మారణకాండతో స్వపరిపాలనపై మొదటి ప్రపంచ యుద్ధసమయంలో భారతీయులలో చిగురించిన ఆశలు అడియాశలైనాయి.[13])

సహాయ నిరాకరణోద్యమాలు

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధసమయంలో జరిగిన మొదటి స్వాతంత్ర్యోద్యమము వ్యాపారాత్మక ప్రదేశాలకే పరిమితమై దేశ ఏకీకరణకు పిలుపునివ్వక సామాన్య ప్రజలకు దూరంగానే నిలిచిపోయిందని చెప్పవచ్చు. 1930వ దశకంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారత రాజకీయాలలోకి ప్రవేశించటంతో దేశ ఏకీకరణ ప్రారంభమైనది.

మెదటి సహాయ నిరాకరణోద్యమం

[మార్చు]

మెదటి సత్యాగ్రహ ఉద్యమము బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే మిల్లు వస్త్రాలకు మారుగా భారతదేశంలో తయారయిన ఖద్దర్ని ఉపయోగించాలని పిలుపునిచ్చింది, అదియే కాక బ్రిటీషు విద్యాసంస్థలను , న్యాయస్థానాలని బహిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను విడనాడాలని, పన్ను చెల్లింపులు నిలిపివేయాలని, బ్రిటీష్ వారి సత్కారాలను, బిరుదులను తిరస్కరించాలని పిలుపునిచ్చింది. 1919 లో చేయబడిన నూతన భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రభావితం చేయటంలో చాలా ఆలస్యంగా ప్రారంభమైన సత్యాగ్రహోద్యమము విఫలమైనప్పటికీ భారతదేశంలో విస్తృత ప్రజాదరణ పొందింది. తత్ఫలితంగా పెద్దయెత్తున పాలనను స్తంభింపజేసి విదేశీ పాలనకు తీవ్రమైన ఒడిదుడుకులను కలిగించింది.అయితే ప్రజాగ్రహానికి గురియై 21 మంది రక్షకబటులు మరణించిన చౌరి చౌరా సంఘటనతో గాంధీ మెదటి సత్యాగ్రహోద్యమాన్ని విరమించాడు

1920 లో కాంగ్రెస్ ను పునర్వ్యవస్థీకరించి నూతన విధివిధానాలు రూపొందించారు. స్వరాజ్యం వీటి లక్ష్యం.కాంగ్రెస్ సభ్యత్వనమోదు సరళీకరింపబడి నామమాత్రపు రుసుము చెల్లించటానికి అంగీకరించిన వారందరికీ అందుబాటులోకి పచ్చింది. స్వేచ్ఛాయుత విధానాల స్థానే నిర్ధిస్ట నియంత్రణ కలిగి క్రమశిక్షణను పెంపొదించేందుకు అనేక స్థాయిలలో సంఘాలను ఏర్పరిచారు. వీటన్నిటి ఫలితంగా శిష్ఠజన వర్గాలకే పరిమితమైన సంస్థ నుండి జనాధరణ , జన భాగస్వామ్యం గల రాజకీయ పక్షంగా కాంగ్రెస్ రూపాంతరం చెందింది.

1922 లో గాంధీకి ఆరుసంత్సరాల కారాగార శిక్ష విధించారు, కానీ రెండు సంవత్సరాల కారాగార వాసానంతరం విడిచి పెట్టారు. కారాగారవాసం తరువాత గాంధీ సబర్మతీ నదీ తీరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. అచటినుండి యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నడపటంతో పాటు హిందూ సమాజంలో వెనకబడిన, దళిత, అస్పృశ్య, పేద ప్రజల కోసం అనేక సంఘ సంస్కరణలను ప్రారంభించారు.

ఈ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి క్రొత్త తరం ప్రవేశించింది. చక్రవర్తి రాజగోపాలాచారి, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వీరిలో కొందరు. తరువాతి కాలంలో వీరు గాంధేయవాద విలుపలననుసరించినా వాటితో విభేదించినా (భారత జాతీయ సైన్యం) భారత స్వాతంత్ర్య వాణిని స్పష్టంగా వినిపించారు.

భారత రాజకీయాలు స్వరాజ్య పార్టీ, హిందు మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి అనేక మితవాద, అతివాద సంస్థల ఆవిర్భావంతో విస్తృతమయ్యాయి. మద్రాసులో బ్రాహ్మణేతరుల, మహారాష్ట్రలో మాహరుల, పంజాబులో సిక్కుల ప్రయోజనాలకు ప్రాంతీయ రాజకీయ పక్షాలు ప్రాతినిధ్యం వహించాయి. మహాకవి సుబ్రహ్మణ్య భారతి, వన్చినాథన్, నీలకండ బ్రహ్మచారి వంటీ బ్రాహ్మణ ప్రముఖులు కూడా తమిళనాడులో స్వాతంత్ర్య సాధనకు, అన్ని కులాల ప్రజల సమానత్వానికై పోరాడారు.

సంపూర్ణ స్వతంత్ర్యం

[మార్చు]

భారతీయులు 1928 మేలో సైమన్ సంఘం (సైమన్ కమిషన్) సిఫార్సులను తిరస్కరించి బొంబాయిలో సర్వ పక్ష సభను నిర్వహించారు.ప్రజలలో బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతను పెంపోందించటం ఈ సభ ముఖ్య ఉద్దేశం.ఈ సభ భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘాన్ని నియమించింది. కాంగ్రెస్ కలకత్తా సమావేశాలలో 1929 డిసెంబరు లోగా బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశానికి స్వపరిపాలన హోదా నివ్వాలని లేదా దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాని ప్రారంభిస్తామని తీర్మానించింది.ఆయితే 1929 కల్లా పెరిగిన రాజకీయ అసంతృప్తి, ప్రాంతీయ ఉద్యమాలలో పెరిగిన హింస కాంగ్రెస్ నాయకులలో సంపూర్ణస్వరాజ్యం కోరకు పిలుపునివ్వాలనే కోరికను పెంచాయి. జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929లో జరిగిన చారిత్రాత్మక లాహోర్ సమావేశం సంపూర్ణ స్వాతంత్ర్యమునకు పిలుపునిచ్చింది. 1930 జనవరి 26న భారతదేశంమెత్తం సంపూర్ణ స్వాతంత్ర్యదినంగా పాటించాలని నిర్ణయించింది. భారతదేశంలోని వివిధ రాజకీయపక్షాలు, విప్లవకారులు సంపూర్ణ స్వతంత్రదినోత్సవాన్ని సగర్వంగా, సగౌరవంగా జరుపుకోవటానికి ఒక్కటైనారు.

శాసనోల్లంఘనోద్యమం

[మార్చు]

భారత స్వాతంత్ర్యోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై, 1934 వరకూ సాగింది. ఉద్యమానికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెసు పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించే విషయంలో బ్రిటిషు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించి, నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన విధానాలను అవలంబించింది. దాంతో కాంగ్రెసు నాయకులు ఆశాభంగం చెంది ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగమే శాసనోల్లంఘన.

ప్రజా క్షేమం దృష్ట్యా బ్రిటిషు ప్రభుత్వం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలను ప్రకటించి, ఆ చర్యలు తీసుకోకపోతే, శాసనోల్లంఘన చెయ్యక తప్పదని గాంధీ, 1930 జనవరి 31 న యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించాడు. ఉద్యమంలో భాగంగా చేపట్టదలచిన కార్యక్రమాల నన్నిటినీ అహింసా పద్ధతిలో జరగాలని అతడు నిర్దేశించాడు. ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు, మద్యం దుకాణాల వద్ద పికెటింగు, సారా దుకాణాల వేలం పాటలు జరిగే చోట పికెటింగు, బ్రిటిషు వస్తువుల బహిష్కరణ, పన్నుల ఎగవేత, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, కల్లు తీసే తాడి, ఈత చెట్లను నరకడం వంటివి కూడా ఈ ఉద్యమంలో భాగం. అంతకు మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్దయెత్తున పాల్గొనడం ఈ ఉద్యమ ప్రత్యేకత.

ఈ ఉద్యమం రెండు దశల్లో నాలుగు సంవత్సరాల పాటు జరిగింది. మధ్యలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఉద్యమాన్ని ఆపారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిషు ప్రభుత్వం పెద్ద యెత్తున దమనకాండకు పాల్పడింది. ప్రత్యేకంగా ఆర్డినెన్సులను జారీ చేసింది. కాంగ్రెసును దాని శాఖలనూ చట్టవిరుద్ధమైనవని ప్రకటించి, వాటి ఆస్తులను జప్తు చేసింది. 75,000 మందికి పైగా నాయకులను, ఉద్యమకారులనూ అరెస్టు చేసింది. పోలీసు కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జైళ్ళలో అమానవీయ పరిస్థితులు కల్పించింది. పోలీసులు మహిళలపై అత్యాచారాలు, హింస చేసారు.

పెద్ద యెత్తున జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంతో ఉవ్వెత్తున మొదలై, పేలవంగా, పెద్దగా ఏమీ సాధించకుండానే ముగిసింది. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తూ గాంధీ, "ఈసారి శాసనోల్లంఘన అంటూ మొదలైతే, ఇక దాన్ని ఆపలేం. ఒక్క కార్యకర్తైనా బతికి ఉన్నంతవరకు, ఒక్క కార్యకర్తైనా స్వేచ్ఛగా ఉన్నంతవరకూ ఆపకూడదు కూడా" అని అన్నాడు. కానీ 1933 మే 8 న గాంధీయే స్వయంగా ఉద్యమాన్ని సస్పెండు చేయమని కాంగ్రెసు పార్టీ తాత్కాలిక అధ్యక్షుణ్ణి కోరాడు. 1933 మే 9 న ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేసారు. 1933 జూలైలో సామూహిక ఉద్యమం కాస్తా వ్యక్తిగత శాసనోల్లంఘనగా మారి, రూపు కోల్పోయింది. ఆ తరువాత 1934 ఏప్రిల్ 7 న ఉద్యమం అధికారికంగా ముగిసింది.

ఉప్పు సత్యాగ్రహం

[మార్చు]

ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమంలో భాగం. దీర్ఘకాల ఏకాంతాన్ని విడిచి గాంధీ ప్రసిద్ధి చెందిన దండి యాత్రను ప్రారంభించారు, 1930 మార్చి 12 - ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండి వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండి యాత్రగా, ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది. దండిలో బ్రిటీష్ వారు ఉప్పుపై విధించిన సుంకానికి వ్వతిరేకంగా గాంధీ అతని అనుచరులు చట్టాన్ని వ్యతిరేకించి సముద్రపు నీటి నుండి ఉప్పును వండారు.

1930 ఏప్రిల్ మాసంలో కలకత్తాలో రక్షక భటులకీ, ప్రజలకీ మధ్య హింసాత్మకమైన కొట్లాటలు జరిగాయి. 1930-31 మధ్యకాలంలో సత్యాగ్రహం కారణంగా సుమారు లక్షమంది ప్రజలు కారాగారం పాలైనారు. పెషావర్ లోని కిస్సా ఖ్వాని బజారు మారణకాండలో అనామక ప్రజలపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనతో అప్పుడే క్రొత్తగా పుట్టిన ఖుదాయి ఖిద్మత్ గార్ ఉద్యమ స్థాపకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా దేశ తెరపైకి వచ్చాడు. 1930 లో గాంధీ కారాగారంలో ఉండగా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యంలేని మెదటీ రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరిగింది. సత్యాగ్రహం కారణంగా ఎదురైన ఆర్థిక విషమ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పై నిషేధం తొలగింపబడింది. గాంధీతో సహా కాంగ్రెస్ కార్యనిర్వాహణ సంఘం ప్రతినిధులు జనవరి 1931 లో విడుదలైనారు.

1931 మార్చిలో గాంధీ-ఇర్విన్ ఒప్పందం కుదిరింది, ప్రభుత్వం రాజకీయ ఖైదీలనందరినీ విడిచిపెట్టటానికి అంగీకరించింది అయితే కొందరు ముఖ్య తిరుగుబాటు దారులను విడిచిపెట్టకపోవటం, భగత్ సింగ్, అతని ఇరు సహచరులకు విధించిన మరణ శిక్షని వెనక్కి తీసుకోక పోవటంతో ఇంటా బైటా కాంగ్రెస్ మీద నిరసనలు ఏక్కువైనాయి. ప్రభుత్వ చర్యలకు బదులుగా సత్యాగ్రహాన్ని విరమించటానికి, కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనటానికి గాంధీ అంగీకరించారు. అయితే డిసెంబరు 1931లో జరిగిన ఈ సమావేశం విఫలమవ్వటంతో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చి జనవరి 1932 లో సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు.

తరువాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్, ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టం పై అంగీకారం కుదిరేవరకూ ఘర్షణ-చర్చల పరంపరలో మునిగి తేలాయి అయితే అప్పటికే కాంగ్రెస్-ముస్లింలీగ్ మధ్య పుడ్చలేనంతగా అగాధం ఏర్పడి ఒకదానినినొకటి తీవ్రంగా వేలెత్తి చూపుకోసాగాయి. భారత ప్రజలందరికీ పాతినిధ్యం వహిస్తున్న సంస్థగా కాంగ్రెస్ చేస్తున్న వాదాన్ని ముస్లింలీగ్ ఖండిస్తే, భారతదేశంలోని ముస్లింలందరి వాణికి ఆకాంక్షలకీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్ధగా ముస్లింలీగ్ చేస్తున్న వాదాన్ని కాంగ్రెస్ త్రోసిపుచ్చింది.

ఎన్నికలు , లాహోర్ తీర్మానం

[మార్చు]
జిన్నా, గాంధీ, 1944.

1935 వ సంవత్సరంలో చేయబడిన భారత ప్రభుత్వ చట్టం చివరిసారిగా బ్రిటీష్ ఇండియాని పాలించటానికి చేయబడిన మహా ప్రయత్నము అది ముఖ్యముగా మూడు లక్ష్యాలను నిర్ధేశించింది. ఆ లక్ష్యాలు

  • సరళమైన సమాఖ్య వ్వవస్థని స్థాపించటం
  • రాష్ట్రాల స్వయం పతిపత్తిని సాధించటం
  • అల్పసంఖ్యాక ప్రజల ఆకాంక్షలను రక్షించటానికి వీలుగా వేరువేరుగా నియోజకవర్గాలను ఏర్పరచటం

సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనంచేయటానికి ఏర్పరిచిన నిబంధనలను అప్పటికే ఉన్న సంస్థానాధీశుల హక్కుల రక్షణ పై ఏర్పడిన సందేహాల కారణంగా అమలు చేయలేదు. ఆయితే 1937 లో ఎన్నికలు నిర్వహించేనాటికి సంస్థానాధీశుల స్వయంప్రపత్తి వాస్తవరూపం సంతరించుకుంది. ఐదు రాష్ట్రాలలో స్పష్టమైన ఆధిక్యతను కలిగి మరి రెండు రాష్ట్రాలలో అతిపెద్దపక్షంగా అవతరించిన కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. అయితే ముస్లింలీగ్ నిరాశాజనకమైన ఫలితాలను మాత్రమే సాధించింది.

1939 లో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రధించకుండానే వైస్రాయి విక్టర్ అలెక్సాండర్ జాన్ హోపె భారతదేశం యుద్ధంలో ప్రవేశించిందని ప్రకటించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ తన ఎన్నికైన ప్రతినిధులను ప్రభుత్వంనుండి రాజీనామా చేయాల్సిందిగా కోరింది. ముస్లింలీగ్ అధ్యక్షుడు జిన్నా 1940లో లాహోర్ లో జరిగిన వార్షిక సమావేశాలలో భారతదేశాన్ని రెండుగా విభజించమని కోరుతూ తీర్మానించవలిసిందిగా అందలి పాల్గొను ప్రతినిధులను ఒప్పించాడు. ఇదే తరువాతి కాలంలో లాహోర్ తీర్మానంగా వెలుగులోకి వచ్చింది. కొన్నిసార్లు దీనినే ధ్విజాతి సిద్ధాంతమని కూడా పేర్కొంటారు. పాకిస్తాన్ అనే భావాన్ని 1930 లోనే పరిచయం చేసినప్పటికీ చాలా తక్కువమంది మాత్రమే స్పందిచారు అయితే హిందూ ముస్లింల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ వాతావరణం ఘర్షణ భావాలు పాకిస్తాన్ అనే భావనను గట్టి కోరికగా మార్చాయి.

విప్లవ పోరాటాలు

[మార్చు]
బాఘా జతిన్

చెదురుమదురుగా జరిగిన కొన్ని సంఘటనలను మినహాయిస్తే, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ఉధ్యమం 20వ శతాబ్ద ప్రారంభం వరకూ సఘటితమవలేదు. మహారాష్ట్ర, బెంగాల్, ఒడిషా, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, నేడు దక్షిణభారతంగా పిలవ బడుతున్న మద్రాస్ ప్రెసిడెన్సీ లలో అనేక విప్లవ సంస్థల ఆవిర్భావంతో 1900ల మెదటి దశకంలో భారత విప్లవ భావాలు వూపందుకున్నాయి. అయితే ఈ విప్లవ సంస్థలు అసంఘటితంగా ఉడటం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోదగిన ఉధ్యమాలు 1905 లో జరిగిన బెంగాల్ విభజనకు వ్వతిరేకంగా బెంగాల్ లో, పంజాబ్ లో ఉద్భవించాయి. 'చదువుకున్న నిబద్ధత కలిగిన మేధావులు బెంగాల్ లో గొప్ప భారత విప్లవాలకు కారణమైతే, గ్రామీణ సైనిక సమాజం పజాబ్ లో విప్లవాని గట్టి ఊతం ఇచ్చింది. జుగంతర్, అనుషీలన్ సమితి లాంటి సంస్థలు 1900 మెదట్లో పుట్టుకొచ్చాయి. వాటి విప్లవ సిద్ధాంతాలు, ప్రయత్నాలు 1905లో వాటి ఉనికిని చూపెట్టాయి. అరబిందో ఘోష్ అతని తమ్ముడు బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్త మెదలయిన వారు 1906 ఎప్రల్ మాసంలో జుగంతర్ స్థాపనతో విప్లవవీరులని సంఘటితపరచటానికి మెదటి అడుగులు వేశారని చెప్పవచ్చు. అప్పటికే బెంగాల్ లో వ్యాయామ సంఘం ముసుగులో వున్న అనుషీలన సమితి అనే విప్లవ సమాజం అంతర్గత వర్గంగా జుగంతర్ ని స్థాపించారు. జుగంతర్, అనుషీలన సమితి బెంగాల్, భారతదేశంలోని అనేక ప్రాంతాలలో విస్తృతంగా శాఖలను ఏర్పరిచి అనేక మంది యువతీ యువకులను విప్లవంలో కార్యకలాపాలకై చేర్చుకొన్నాయి. అనేక హత్యలు, దోపిడీలు జరిపి అనేక మంది విప్లవకారులు బంధీలైనారు.జుగంతర్ పక్షానాయకులైన బరిన్ ఘోష్, బాఘా జెతిన్ పేలుడు పదార్ధాలను తయారీ ప్రారంభించారు.అనేక ఎన్నదగిన తీవ్రవాద చర్యలలో భాగంగా జరిగిన విమాన పేల్చివేత, ముఘాఫర్ పూర్ హత్యాకాండ విచారణలో అనేక మంది కార్యకర్తలు ఆజన్మ దేశ బహిష్కృతులవగా ఖుదీరాం బోస్ ఉరితీయబడినాడు. 1905 లండన్ లో శ్యామ్‌జీ కృష్ణ వర్మ నేతృత్వంలో స్థాపింపబడిన ఇండియా హౌస్, ది ఇండియన్ సోషలిష్ట్ సంస్థల వలన తీవ్రవాద కార్యకలాపాలు బ్రిటన్ లో కూడా వ్యాపించాయి. 1909 జూలై 1 వతారీకున ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థి విలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు.1912 సంవత్సరంలో రష్ బిహారి బోస్ నేతృత్వంలో అప్పటి భారత వైస్రాయి చార్లెస్ హార్డిన్గెని హతమార్చుటకు పన్నిన ఢిల్లీ-లాహోర్ కుట్ర వెలుగు చూసింది.1912 డిసెంబరు 12వ తారీకున బ్రిటీష్ రాజ్య రాజదానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చుటకు వుద్దేశించిన కార్యక్రమంలో వైస్రాయి పరివారంపై విస్పోటక దాడికి జరిగిన విఫల యత్నంలో కుట్ర విచ్ఛిన్నం అయినది. ఈ సంఘటానానంతరం బ్రిటీష్ ఇండియా అంతర్గత రక్షణ శాక ప్రచ్చనంగా విస్తరించిన విప్లవ ఉద్యమాన్ని నాశనం చేయటానికి తీవ్రమైన పయత్నం చేసింది. ఈ కాలంలో బెంగాల్ పంజాబ్ లలో విప్లవ ఉద్యమం తీవ్ర వత్తిడికి లోనైనది. రష్ బిహారి బోస్ 3 సంవత్సరాల పాటు బ్రిటీవారికి దొరకకుండా తప్పించుకో గలిగినాడు అప్పటికి ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం పారంభమవ్వటంతో బెంగాల్ లో విప్లవ ఉద్యమం తిరిగి స్థానిక పాలనని స్తంభింపచేసేంత శక్తి పుంజుకో గలిగినది.

[14][15][3][2]

మెదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత విప్లవకారులు భారత-జర్మన్ కుట్రలో భాగంగా జర్మనీనుండి ఆయుధాలను, మందుగుండును దిగుమతి చేసుకొని బ్రిటీష్ వారికి వ్వతిరేకంగా సాయుధ విప్లవానికి వ్యూహం పన్నినారు. విదేశాలనుండి కార్వకలాపాలు సాగిస్తూ ఘదార్ పక్షం విప్లవకారులకు సహకరించింది. భారతవిప్లవకారులు విదేశీ ఆయుధాలను సమకూర్చుకొనుటకు సాధనమైనది. మెదటిప్రపంచ యుద్ధానంతరం ముఖ్యనేతలు బందీలుకావటంతో క్రమంగా విప్లవ కార్యకలాపాలు క్షీణింపసాగాయి. 1920 సంవత్సరంలో కొందరు విప్లవకారులు పునర్వవస్థీకృతమవటం ప్రారంభించారు. చంద్రశేఖర్ అజాద్ నేతృత్వంలో హిందూస్తాన్ సోషలిష్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (భారత సామ్యవాద స్వాతంత్ర్య సంఘం) స్థాపించబడింది. 1929 సంవత్సరము ఎప్రల్ 8వ తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బటుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభలోకి బాంబులు విసిరారు. 1931లో కేద్రీయ విధాన సభ పెల్చివేత నేర విచారణానంతరం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ఉరితీయ బడ్డారు. ముస్లింలను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం చేయటానికి అల్లమ మష్రిక్వి (Allama Mashriqi) ఖక్‌సర్ తెహ్రీక్ అనే సంస్థను స్థాపించాడు.[16]

1930 ఎప్రల్ 18వ తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు. 1932 లో ప్రీతీలతా వడ్డెదార్ యూరపియన్ క్లబ మీద జరిగిన దాడికి నాయకత్వం వహించారు. బీనా దాస్ కలకత్తా విశ్వవిధ్యాలయం కాన్వోకేషన్ సభప్రాంగణంలో బెంగాల్ గవర్నర్ స్టాన్లి జాక్సన్ని హతమార్చేందుకు విఫలయత్న చేశాడు. చిట్టగాంగ్ అయుధాగార ముట్టడి అనంతరం సూర్య సేన్ ఉరితీయ బడగా అనేకమంది ఆజన్మాత ప్రవాస శిక్షకై అండమాన్ ధ్వీపంలోని సిల్యులర్ జైలుకు తరలింపబడ్డారు. 1928 లో బెంగాల్ వాలంటీర్స్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ పక్షంలోని బినోయ్ బసు-బాదల్ గుప్తా-దినేష్ గుప్తా అనే త్రయం కలకత్తా లోని సెక్రటేరియేట్ (విధాన సౌధము) లోని రచియతల (వ్రైటర్స్) భవనంలోకి ప్రవేశించి ఇన్సెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కల్నల్ ఎన్.ఎస్.సింప్సన్ ని హత్యచేసింది.

1940 మార్చి 13వ తారీకున, ఉధమ్ సింగ్ అమృత్సర్ మారణ కాండకు బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని లండన్ లో కాల్చి చంపాడు. అయితే 1930 దశకం చివరి సంవత్సరాలలో ప్రధాన స్రవంతిలోని నాయకులు బ్రిటీష్ వారు ప్రతిపాదించిన అనేక మార్గాలను పరిగణించటంతో, మతరాజకీయాలు తెరపైకి రావటంతో రాజకీయ పరిస్థితులలో మార్పు వచ్చి విప్లవ కార్యకలాపాలు క్రమంగా తగ్గుముకం పట్టాయి. అనేక మాజీ విప్లవకారులు ప్రధాన రాజకీయ స్రవంతిలోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్, అనేక ఇతర ముఖ్యంగా కమ్యునిష్ఠ్ పక్షాలలోకి ప్రవేశించగా మిగిలిన అనేక మంది దేశంలోని వివిధ జైళ్ళలో బంధీలైనారు.

అంతిమ ఘట్టం

[మార్చు]

యుద్ధం, క్విట్ ఇండియా, ఐ.ఎన్.ఎ, యుద్ధానంతర తిరుగుబాట్లు

భారతదేశం మెత్తంమీద భారతీయులు రెండవ ప్రపంచయుద్ధంలో విభజింప బడ్డారు. ఎన్నికైన భారత ప్రతినిధులను సంప్రధించకుండా ఏక పక్షంగా బ్రిటీష్ వైస్రాయి భారతదేశం మిత్ర రాజ్యాల తరుపున యుద్ధాలోకి దుమికిందని ప్రకటించటంతో నిరసనగా మెత్తం కాంగ్రెస్ నాయకత్వం స్థానిక ప్రభుత్వ సంస్థలనుండి వైదొలిగింది. అయితే బ్రిటీష్ వారికి యుద్ధంలో సహాయ పడాలని చాలామంది భావించారు. 205,000 మంది పరివారంతో యుద్ధంలో పాల్గొన్న పెద్ద సైన్యాలలో ఒకటైన భారత బ్రిటీష్ సైన్యం ఇందుకు నిదర్శనం. బ్రిటన్ కొరకు జరిగిన పోరు సమయంలో గాంధీ సహాయ పెద్ద యెత్తున సహాయ నిరాకరణానికి పిలుపునివ్వాలని ఇంటా బైటా వచ్చిన వత్తిడులను తాను బ్రిటన్ శిథిలాలనుండి భారత స్వాతంత్ర్యయాన్ని కాంక్షించటంలేదంటూ వ్యతిరేకించారు. అయితే యుద్ధంలో మారిన జాతకాలకు అనుగుణంగా వచ్చిన రెండు ఉద్యమాలు వంద సంవత్సరాల భారత స్వతంత్ర ఉద్యమాన్ని పతాక ఘట్టానికి తీసుకు వెళ్ళాయి.

దీనిలో మెదటిది నేతాజీ సుభాస్ చంద్ర బోస్ నేతృత్వంలో అజాద్ హింద్ ఉద్యమం ప్రపంచ యుద్ధ మెదటి అంకంలో ప్రారంభమై అంక్షరాజ్యాల సహకారాన్ని అర్ధించింది. రెండవది 1942లో యుద్ధానంతరం అధికార బదిలీకి భారత నాయకత్వంతో ఏకాభిప్రాయానికి రావటానికి జరిగిన క్రిప్స్ రాయబారం విఫలమవటంతో ప్రారంభమైనది

భారత జాతీయ సైన్యం

[మార్చు]
సుభాష్ చంద్రబోస్

ఏకపక్షంగా జరిగిన భారత యుద్ధ ప్రవేశాన్ని 1937, 1939 లలో రెండు సార్లు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సుభాస్ చంద్ర బోస్ తీవ్రంగా వ్వతిరేకించాడు. యుద్ధంలో పాల్గొనటానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దత్తుకు గట్టి ప్రయత్నం చేసి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే నూతన పక్షాన్ని స్థాపించారు.యుద్ధం విరుచుకు పడటంతో బ్రిటీష్ ప్రభుత్వం అతనిని 1940లో కలకత్తాలో గృహ నిర్భందం చేసింది. ఐరోపా, ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో సుభాస్ చంద్ర బోస్ తప్పించుకుని భారత జాతీయ సైన్యాన్ని సమీకరించి బ్రిటీష్ సృంఖలాల పై పోరాడటానికి అంక్ష రాజ్యాల సహకారాన్ని కోరుటకు అఫఘనిస్తాన్ మీదగా జర్మనీ చేరుకున్నారు. అచ్చట రొమ్మెల్ యొక్క పట్టుబడిన భారత బ్రిటీష్ సిపాయిలతో స్వతంత్ర పటాలాన్ని సమకూర్చాడు. ఇదే ఫ్రీ ఇండియన్ లీజున్గా పేరొందింది. భారత విముక్తి సైన్యాన్ని స్థాపించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మొలకెత్తుతున్న బోస్ కలలనుండి ఈ స్వతంత్ర పటాలం ఉద్భవించింది. అయితే ఐరోపాలో మారుతున్న యుద్ధ పరిణామాల కారణంగా బోస్ జపాన్ చేరి జపాన్ ఆక్రమిత ఈశాన్య ఆసియా నుండి ప్రవాస స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించి జపాన్ వారి సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించారు. పోరాట శక్తిగా భారతదేశం చేరి ప్రజలలో తీవ్ర బ్రిటీష్ వారిపై వ్యతిరేకతను పెంచి భారత సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించి బ్రిటీష్ పాలనను అంతమొందించటం దాని ముఖ్య ఉద్దేశం.

ఐ.ఎన్.ఎ అప్పటికి భారత బ్రిటీష్ సైన్యంతో కలసిన మిత్రరాజ్యాల మిత్రరాజ్యాల బలగాలతో జపాన్ వారి 15వ దళంతో కలిసి బర్మా, అస్సాం అడవులలో పోరాటం చేసి ఇంఫాల్, కోహిమా లను చేజిక్కించుకో వలిసి ఉంది.యుద్ధంలో జపాన్ అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి ఐ.ఎన్.ఎకి అప్పగించటం జరిగింది.సుభాస్ చంద్ర బోస్ వాటికి షాహిద్, స్వరాజ్ అని నామకరణం చేసారు.

అయితే ఐ.ఎన్.ఎకి జపాన్ వారినుండి సరియైన ఆయుధ సరఫరా, శిక్షణ లేనికారణంగా అపజయాల బాట పట్టింది.అంతు చిక్కని రీతిలో సుభాస్ చంద్ర బోస్ మరణించటంతో ఆజాద్-హిద్ ఉద్యమం అంత్యదశకు చేరింది. యుద్ధంలో జపాన్ లొంగు బాటుతో భారత జాతీయ సైన్యానికి చెందిన సిపాయిలను భారత దేశానికి తీసుకురావటంతో పాటు వారిలో అనేకురి పై రాజద్రోహం ఆరోపింపబడింది. అయితే ఈ అప్పటకి బోస్ సాహస కృత్యాలు, క్రియాశీల కార్యకలాపాలు ప్రజల దృష్టిలో ఆదరణ పొందటంతో దేశీయ సిపాయల విశ్వాసం బ్రిటీష రాణి పట్లనుండి దూరమై భారత జాతీయ సైన్యానికి సహకరించిన వారిగా బ్రిటీష్ వారిచే భావించబడినవారిపైకి మరలింది. భారత జాతీయ సైనికుల పై విచారణ జరపటం ద్వారా బ్రిటీష్ భారత సైన్యంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిచవచ్చన్న బ్రిటీష్ ప్రభుత్వ భావన ఆచరణలో ఆశాంతిని రేకెత్తించి సైనికులలో బ్రిటీష్ వారికి సహకరించామనే అపరాధ భావనను రేకెత్తించింది. బోస్, భారత జాతీయ సైన్యం న్యాయం కోరకు పోరాడిన వీరులుగా యావత్తు భారతదేశం భావించటంతో బ్రిటీష్ భారత సైన్యం అన్యాయం వైపు పోరాడీన పక్షంగా పరిగణింప బడింది. ఈ పరిణామాలతో బ్రిటీష్ ప్రభుత్వ అస్థిత్వానికి వెన్నెముకైన భారత బ్రిటీష్ సైన్యం ఇంకెత మాత్రము విశ్వసింపదగినది కాదని ప్రభుత్వానికి తేటతెల్లం మయ్యింది. చివరకి ఈ పరిణామాలు ఎలా పరిణమించాయంటే సుభాస్ చంద్ర బోస్ ఆత్మ బ్రిటీష్ వారిని ఎర్రకోట బురుజులవరకూ వెంటాడిందని చెప్పటం ఆతిశయోక్తి కాజాలదు. అప్పటి కప్పుడు ఆకాశానికి ఎత్తబడిన సుభాస్ చంద్ర బోస్ వ్వక్తిత్వం బ్రిటీష్ వారిని ఆలోచనా విదానంలో గణనీయమైన మార్పుతీసుకు వచ్చి చర్చలద్వారా స్వతంత్రానికి బాటలు పరిచింది. యుద్ధం తరువాత భారత జాతీయ సైనికులపై జరిగిన విచారణలో అజాద్ హింద్ ఉద్యమం, భారత జాతీయ సైన్యం గురించిన కథలు ప్రజల్లోకి వచ్చాయి. అవి ఎంత భావోద్వేగాన్ని కలిగించాయంటే 1945లో భారతదేశంలోనే కాక ఇతర వలస రాజ్యాలలో తిరుగుబాటుకు భయపడి ప్రభుత్వం వాటి ప్రసారాన్ని నిలిపివేయవలసిందిగా బి.బి.సిని కోరింది. వార్తా పత్రికలు భారత జాతీయ సైనికులకు మరణ దండన విధించటాన్ని ప్రజలకు తెలియచెప్పాయి. తత్ఫలితంగా తరువాతి కాలంలో అనేక తిరుగుబాట్లు తలెత్తాయి. కోదరు చరిత్ర కారులు భారత జాతీయ సైన్యం, అజాద్ హింద్ ఉద్యమం చే ప్రేరణ పోదబడిన బ్రిటీష్ భారత సైన్యం భారత దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాయని భావిస్తారు.

క్విట్ ఇండియా

[మార్చు]

భారతీయులను రెండవ ప్రపంచ యుద్ధంలోకి పంపిచటానికి నిరసనగా భారతదేశ స్వాతంత్ర్యానికి గాంధీ ఇచ్చిన పిలుపు నందుకుని 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమము ప్రారంభమైనది.యుద్ధం ప్రారంభమైన తరువాత 1939 సెక్టెంబరు మాసంలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ పక్ష కార్యనిర్వహణ సంఘ సమావేశాలలో ఫాసిజానికి వ్యతిరేకంగా షరతులతో కూడిన మద్ధతునిస్తూ కాంగ్రెస్ తీర్మానించింది.అందుకు ప్రతిఫలంగా కోరిన యుద్ధానంతర భారత స్వాతంత్ర్యయాన్ని బ్రిటీష్ వారు త్రిరస్కరించటం జరిగింది.

1942 లో ఐరోపా, ఆగ్నేయ ఆసియాలో ప్రతికూలించిన యుద్ధ పరిస్ధితులలో భారత ఉపకండం అన్యమస్కంగా యుద్ధంలో పాల్గొనటం, బ్రిటీష్ భారత సైన్యంలో, భారతీయులలో పెరిగిన అసంతృప్తి బ్రిటీష్ వారిని భారతదేశాన్ని బుజ్జగించేదుకు ప్రేరేపించాయి. యుద్ధానంతరం భారతీయులకు అధికార బదలాయింపుకు ప్రతిఫలంగా యుద్ధంలో భారతీయుల సంపూర్ణ మద్దత్తు కూడగట్టటానికి బ్రిటీష్ వారు క్రిప్స్ ఆధ్వర్యంలో రాయబార బృందాన్ని భారతదేశానికి పంపించటం జరిగింది. అయితే స్వపరిపాలనకు నిర్ధిష్ట సమయాన్ని సూచించలేకపోవటం, ఆధికార బదలాయింపుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేక పోవటంతో పరిమితమైన పాలనాధికారాన్ని మాత్రమే ఇవ్వజూపిన క్రిప్స్ రాయబారం భారత ఉధ్యమకారులకు ఆమోదయోగ్యంకాలేదు.దీనితో చర్చ విఫలమైనాయి.కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటీషు ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో చేసిన సహాయాన్ని అడ్డంపెట్టుకుని బేరసారాలకి దించడమే.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో కాంగ్రెస్ బ్రిటీష్ ప్రభుత్వం భారత ప్రజల కోరికలను ఆమోదించనట్లయితే దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. బొంబాయి లోని గొవలియ టాంక్ మైదానంలో (తరువాత క్రాంతి మైదానంగా మార్చబడినది) ఆగస్టు 8న సత్యాగ్రహంతో చావో-బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఉద్యమంమీద అతను నమ్మకానికి మచ్చుతునక. ఆ ఉపన్యాసంలో ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటీష్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని పిలుపునిచ్చారు. అప్పటికే భారత-బర్మా సరిహద్దులలో జాపాన్ సైన్య పురోగతితో అప్రమత్తమైన ప్రభుత్వం గాంధీని అఘాకాన్ పాలెస్లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని, జాతీయ నాయకత్వాన్ని అహ్మద్ నగర్ కోటలో బంధించింద. కాంగ్రెస్ ని నిషేధించటంతో పాటు గాంధీ గారి ఉపన్యాసం తరువాత 24 గంటల లోపే దాదాపు అందరు కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం నిర్బందించింది, వీరందరూ యుద్ధం సమయంలో జైలు జీవితం గడిపారు. దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున ప్రదర్శనలు అందోళనలు జరిగాయి. కార్మికులు పెద్దయెత్తున సమ్మె చేసారు. ఉద్యమంలో పెద్దయెత్తున హింస చోటుచేసుకుంది. భారత విప్లవ సంఘాలు మిత్రరాజ్య సరఫరా వ్యవస్థలమీద బాంబు దాడులు చేశారు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ ముస్లింలీగ్ వంటి ఇతర రాజకీయ శక్తుల మద్దత్తు పోందలేక పోయినప్పటికీ పెద్దయెత్తున ముస్లింల మద్దత్తు సంపాదించింది. బ్రిటష ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దేశ వ్యాప్తంగా లక్షమందికి పైగా జైళ్ళకు పంపింది. ప్రజాందోళన మీద లాఠీ దాడి చేయటంమే కాక అపరాధ రుసుమును విధించింది. త్వరలోనే ఉద్యమం నాయకత్వంలేని ఆందోళనగా మారి అనేక ప్రాంతీయ విప్లవ సంఘాల చేతులలోకి మళ్ళంది.గాంధీ గారి అహింసాయుత సిద్దాంతాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే 1943 వ సంవత్సరానికి క్విట్-ఇండియా ఉధ్యమం నీరసించింది

రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు

[మార్చు]

1946 ఫిబ్రవరి 18లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny) గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.

నావికాదళంలోని సాధారణ పరిస్థితులు, భోజన సదుపాయాల కారణంగా మొదలైన ఈ సమ్మెకు, బ్రిటిషు అధికారుల జాతి వివక్ష, జాతీయ వాద సమర్ధకులపై క్రమశిక్షణా చర్యలు అంతర్వాహినులుగా ఉన్నాయి. 18న మొదలైన ఈ సమ్మెకు, 19 సాయంత్రానికల్లా "కేంద్ర నావికా సమ్మె కమిటీ" ఎన్నికయింది. సిగ్నల్ మాన్ లలో ముఖ్యుడైన ఎం. ఎస్. ఖాన్ అధ్యక్షుడిగాను, పెట్టీ ఆఫీసర్ టెలిగ్రాఫిస్టు మదన్ సింగ్ ఉపాధ్యక్షుడిగాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[17]. భారత జాతీయ సైన్యపు కథనాలతో ఉత్తేజితులైన భారతీయులు ఈ సమ్మెకు భారీ మద్దతునిచ్చారు. పలు ప్రదర్శనల ద్వారా ఈ తిరుగుబాటుకు మద్దతు లభించింది. వీటిలో బోల్షివిక్-లెనినిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిలోన్ అండ్ బర్మా వారి పిలుపుతో జరిగిన ఒక రోజు ముంబయ్ సార్వత్రిక సమ్మె కూడా ఒకటి. ఈ సమ్మె ఇతర నగరాలకు వ్యాపించింది. వాయుసేన, ఆయా నగరాల ప్రాంతీయ పోలీసులు కూడా సమ్మెలో దిగారు. నావికాదళ సభ్యులు తమను తాము "భారత జాతీయ నావికాదళం"గా ప్రకటించుకొని, బ్రితిషు అధికారులకు ఎడమచేతి అభివాదాలు (సెల్యూట్) చేయనారంభించారు. కొన్ని చోట్ల, భారత బ్రిటిషు సైన్యంలోని, నాన్ కమిషన్డ్ అధికార్లు (NCOs) బ్రిటిషు ఉన్నతాధికార్ల ఉత్తర్వులను బేఖాతరు చేసి ఉల్లంఘించారు. చెన్నై, పూనెలలోని బ్రిటిష్ సైనిక శిబిరాలలో సైతం తిరుగుబాటు గాలులు వీచాయి. కరాచి మొదలుకొని కలకత్తా వరకు భారీ విధ్వంసకాండ జరిగింది. ఓడలపై మూడు జండాలు (కాంగ్రెసు, ముస్లిం లీగు, కమ్యునిస్టు పార్టి ఆఫ్ ఇండియా ల), తిరుగుబాటుదారుల సామరస్యానికి ప్రతీకగా ఎగురవేయబడటం ప్రఖ్యాతిగాంచింది..

ఉద్యమాల ప్రాధాన్యత

[మార్చు]

స్వతంత్ర్య పోరాటంలో భాగాలైన వివిధ ఉద్యమాలు, సంఘటనల ప్రాధాన్యం, వాటి విజయాలు, వైఫల్యాలు చరిత్రకారుల చర్చలో భాగం. కొందరు చరిత్ర కారులు క్విట్-ఇండియా ఉద్యమాన్ని వైఫల్యంగా భావిస్తారు. వీరు అప్పటి బ్రిటిష్ ప్రధాని భారతదేశాన్ని వదిలి వెళ్ళటానికి భారతీయ సైన్యంలో ప్రబలిన అసంతృప్తిని ముఖ్యకారణంగా పేర్కొంటూ క్విట్-ఇండియాని బలహీనమైన కారణంగా వర్ణించారు.[18][19] అయితే కొందరు భారత చరిత్రకారులు "క్విట్-ఇండియా" నే విజయం సాధించిందని భావిస్తారు. యుధ్దానంతరం సన్నగిల్లిన బ్రిటిషు సామ్రాజ్య ఆర్థిక, సైనిక, రాజకీయ వనరులతో పాటు, క్విట్-ఇండియా ద్వారా వ్యక్తమైన భారత ప్రజల బలమైన వ్యతిరేకత బ్రిటీష్ ప్రభుత్వ స్థైర్యాన్ని దెబ్బతీసిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే వారు 1947లో జరిగిన అధికార బదలాయింపుకు విప్లవ పోరాటాల పాత్రను విస్మరిస్తారు. ఏది ఏమైనప్పటికీ[20][21] కోట్లాది ప్రజలు, చరిత్రలో అపూర్వమైన విధంగా, ఒక త్రాటిపై నిలచి, ఏకకంఠంతో స్వాతంత్ర్యమే వారి ఏకైక లక్ష్యమని ప్రకటించడమే స్వాతంత్ర్యసాధనకు ముఖ్యకారణమని విస్మరించరాదు. ప్రతి తిరుగుబాటు, ఎదిరింపు చర్యలు ఆ అగ్నికి ఆజ్యం పోశాయి. దీనికి తోడుగా అప్పుడే యుధ్ధపరిణామాల నుండి తేరుకుంటున్న తమ సామ్రాజ్యంలో, అణచివేతకు బ్రిటిషు ప్రజల, సైన్యాల మద్దతు లేకపోవటం కూడా ఒక కారణం.

స్వాతంత్ర్యం, 1947 - 1950 మధ్య పరిణామాలు

[మార్చు]

చివరి బ్రిటీష్ గవర్నర్ జనరలైన విస్కౌట్ లూయీస్ మౌంట్బాటెన్ 1947 జూన్ 3 న బ్రిటీష్ ఇండియాని లౌకిక భారతదేశంగాను, ఇస్లామిక్ పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15 న భారతదేశం స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. స్వాతంత్ర్యయానంతరం హిందూ ముస్లిం ల మధ్య తీవ్ర మతఘర్షణలు తలెత్తాయి. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, ఉపప్రధాని వల్లభాయ్ పటేల మౌంట్బాటెన్ ని గవర్నర్ జనరల్ గా కొనసాగవలసిందిగా కోరారు. 1948 లో అయన స్థానంలో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ గా నియమితులైనారు. 565 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను పటేల్ స్వీకరించారు. అతను తన ఉక్కు సంకల్పం నిజాయితీలతో కూడిన విధానాలతో ఏకీకరణ సాధించారు. బలప్రయోగంతో జూనాఘడ్, జమ్మూ-కాశ్మీర్, హైదరాబాద్ ఆపరేషన్ పోలో సంస్థానాల విలీనాలు అతను ఉక్కు సంకల్పానికి మచ్చుతునకలు.

1949 నవంబరు 26 లో రాజ్యంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1950 జనవరి 26 వ భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది.రాజ్యాంగ పరిషత్ డా| రాజేధ్ర ప్రసాద్ ని ప్రథమ రాష్ట్రపతికా ఎన్నుకోవటంతో అతను రాజగోపాలా చారినుండి బధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర సర్వసత్తాక భారతదేశంలో గోవా 1961, పాండిచ్చేరి 1953-54, సిక్కింలు 1975 లో విలీనమయ్యాయి. 1952 లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 62 శాతం పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పాదపీఠికలు

[మార్చు]
  1. Nicholas F. Gier (2004). The Virtue of Nonviolence: From Gautama to Gandhi. SUNY Press. p. 222. ISBN 978-0791459492.
  2. 2.0 2.1 Gupta 1997, p. 12
  3. 3.0 3.1 Popplewell 1995, p. 201
  4. Strachan 2001, p. 798
  5. Hoover 1985, p. 252
  6. Brown 1948, p. 300
  7. Strachan 2001, p. 788
  8. Hopkirk 2001, p. 41
  9. Popplewell 1995, p. 234
  10. Tinker 1968, p. 92
  11. Lovett 1920, p. 94, 187-191
  12. Sarkar 1921, p. 137
  13. Ackerman, Peter, and Duvall, Jack, A Force More Powerful: A Century of Nonviolent Conflict p. 74.
  14. Fraser 1977, p. 257
  15. Banglapedia article Archived 2011-05-25 at the Wayback Machine by Mohammad Shah
  16. Khaksar Tehrik Ki Jiddo Juhad Volume 1. Author Khaksar Sher Zaman
  17. Encyclopaedia of Political Parties. By O.P Ralhan pp1011 ISBN 81-7488-865-9
  18. Banglapædia
  19. Dhanjaya Bhat, writing in The Tribune, Sunday, 12 February 2006. Spectrum Suppl.
  20. WWII Asia, Le Monde Diplomatique, 2005-05-13.
  21. Tribune India 2006-02-12.

తెలుగు పుస్తకాలు

[మార్చు]
  • ఇక్కడ స్వతంత్రోద్యమం గురించిన తెలుగు పుస్తకాలు మాత్రమే వ్రాయండి.

ఇవి కూడ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]