Jump to content

అహ్మదుల్లా షా

వికీపీడియా నుండి
అహ్మదుల్లా షా
జననం
సికందర్ షా

1787
విజాగపటం, ఆర్కాటు రాజ్యం, దక్షిణ భారతదేశం
మరణం1858 జూన్ 5(1858-06-05) (వయసు 70–71)
ఇతర పేర్లుమౌలవీ, డంకా షా, నక్కార్ షా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం
తల్లిదండ్రులు
  • గులామ్ హుసేన్ (తండ్రి)

అహ్మదుల్లా షా (1787 - 1858 జూన్ 5) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, 1857 భారత తిరుగుబాటు నాయకుల్లో ఒకడు. అతడు ఫైజాబాద్ మౌలవీగా ప్రసిద్ధుడు. మౌలవీ అహ్మదుల్లా షా అవధ్ ప్రాంతంలో తిరుగుబాటుకు దిక్సూచిగా పేరుపొందాడు.[1] జార్జ్ బ్రూస్ మల్లెసన్, థామస్ సీటన్ వంటి బ్రిటిష్ అధికారులు అహ్మదుల్లా ధైర్య, శౌర్యాలను, వ్యక్తిగత, సంస్థాగత సామర్థ్యాలను తమ రచనల్లో ప్రస్తావించారు. జి. మల్లెసన్ 1857 లో భారత తిరుగుబాటును కవర్ చేస్తూ 6 సంపుటాల్లో రాసిన హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ పుస్తకంలో అహ్మదుల్లాను పదేపదే ప్రస్తావించాడు.[2][3] థామస్ సీటన్ అహ్మదుల్లా షాను ఇలా వర్ణించాడు:

అతడు గొప్ప శక్తి సామర్ధ్యాలు, మొక్కవోని ధైర్యం, దృఢ సంకల్పాలు కలిగినవాడు. తిరుగుబాటుదారులలో అత్యుత్తమ సైనికుడతడు

ఇస్లాం మతాన్ని అనుసరించే అహ్మదుల్లా మత సామరస్యతకు, ఫైజాబాద్ లోని గంగా-జమున సంస్కృతికీ ప్రతిరూపంగా ఉండేవాడు. 1857 తిరుగుబాటులో, నానా సాహిబ్, ఖాన్ బహదూర్ ఖాన్ వంటి రాచవంశీకులు అహ్మదుల్లాతో కలిసి పోరాడాడు.[4]

బ్రిటిష్ వారు మౌలవీని సజీవంగా పట్టుకోలేక పోయారు. అతడిని పట్టుకోవడానికి 50,000 వెండి నాణేల బహుమానాన్ని ప్రకటించారు. చివరగా పొవయన్ రాజా జగన్నాథ్ సింగ్ మౌలవీని చంపి, శిరచ్ఛేదం చేసి, అతడి తలను బ్రిటిష్ వారికి సమర్పించాడు. తాము ప్రకటించిన బహుమతిని బ్రిటిషు వారు రాజా జగన్నాథ్‌కు ఇచ్చారు.[5] మరుసటి రోజు, కొత్వాలిలో మౌలవీ తలను వేలాడదీసారు.[6]

కుటుంబం

[మార్చు]

అహ్మదుల్లా కుటుంబం హర్దోయ్ ప్రావిన్స్‌లోని గోపమన్‌కు చెందినది. అతని తండ్రి గులాం హుస్సేన్ ఖాన్ హైదర్ అలీ సైన్యంలో సీనియర్ అధికారి. అతని పూర్వీకులు ఆయుధ సంచాలనంలో నేర్పరులు. జిబి మల్లెసన్ మౌలవీ వ్యక్తిత్వాన్ని ఇలా వర్ణించాడు

మౌలవీ గొప్ప వ్యక్తి. అతని పేరు అహ్మద్-ఉల్లా. అతని స్వస్థలం ఔధ్ లోని ఫైజాబాద్. వ్యక్తిగతంగా, అతను పొడవుగా, సన్నగా, కండలు తిరిగి, పెద్ద లోతైన కళ్ళతో, వత్తైన కనుబొమలతో, గద్ద ముక్కుతో, వెడల్పాటి దవడలతో ఉంటాడు.

మౌలవీ సున్నీ ముస్లిం. సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతనికి ఇంగ్లీషు మీద మంచి పట్టు ఉంది. సాంప్రదాయిక ఇస్లామిక్ విద్యను అభ్యసించినన తరువాత మౌలవీ, సంక్షేమంపై శిక్షణ కూడా పొందాడు. అతను ఇంగ్లాండ్, రష్యా, ఇరాన్, ఇరాక్, మక్కా, మదీనా పర్యటించాడు. హజ్ యాత్ర కూడా చేశాడు.

1857 తిరుగుబాటుకు ముందు

[మార్చు]

సాయుధ తిరుగుబాటు విజయానికి, ప్రజల సహకారం చాలా ముఖ్యమని మౌలవీ విశ్వసించాడు. అతను ఢిల్లీ, మీరట్, పాట్నా, కలకత్తాలతో పాటు అనేక ఇతర ప్రదేశాలకు వెళ్లి ప్రజల్లో స్వాతంత్ర్య బీజాన్ని నాటాడు. ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీతో కలిసి మౌలవీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించాడు. 1857 లో తిరుగుబాటు చెలరేగకముందే, బ్రిటిషర్‌పై జిహాద్ చేసేందుకు అవసరమైన ప్రణాళికతో అతను ఫతే ఇస్లాం అనే కరపత్రాన్ని కూడా రచించాడు.

జిబి మల్లెసన్ ప్రకారం, "1857 తిరుగుబాటు ప్రణాళిక వెనుక, మౌలవీ మేధ, అతడి ప్రయత్నాలూ ముఖ్యమైనవనే విషయంలో ఏ సందేహమూ లేదు. దండయాత్రల సమయంలో రొట్టె పంపిణీ చేసిన చపాతీ ఉద్యమానికి అతనే కర్తా కర్మా. " [7]

పాట్నాలో అరెస్టు

[మార్చు]

జిబి మల్లెసన్ ప్రకారం, మౌలవీ పాట్నాలో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం లేకుండా, ఒక అధికారి పంజాబ్ నుండి పాట్నాకు వచ్చాడు. అహ్మదుల్లా షాపై రష్మీ కుమారి రాసిన పుస్తకంలో అతడి పేరు లెఫ్టినెంట్ థర్స్‌బర్న్ అని రాసింది. తన జేబులో వారెంట్‌తో, అతను పాట్నాలోని సాదిక్‌పూర్‌ అనే పేటకు వెళ్లాడు. అహ్మదుల్లా షా ఇంట్లోకి ప్రవేశించి, పోలీసుల సహాయంతో అతణ్ణి అరెస్టు చేశాడు.[8] బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై మౌలవీకి మరణశిక్ష విధించారు. తరువాత ఆ శిక్షను జీవిత ఖైదుగా తగ్గించారు.

1857 మే 10 న తిరుగుబాటు చెలరేగిన తరువాత, జూన్ 7 న అజమ్‌గఢ్, బనారస్, జౌన్‌పూర్‌ల నుండి తిరుగుబాటు సిపాయిలు పాట్నా చేరుకున్నారు. అప్పటికే పరారీలో ఉన్న ఆంగ్ల అధికారులకు చెందిన బంగళాలపై వారు దాడి చేశారు. నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, తిరుగుబాటుదారులు ప్రభుత్వ ఖజానాను స్వాధీనం చేసుకున్నారు. వారు జైలు వైపు వెళ్ళి, మౌలవీని ఇతర ఖైదీలనూ విడుదల చేశారు. రాజా మాన్‌సింగ్‌ను పాట్నా రాజుగా ప్రకటించి, మౌలవీ అవధ్ కు సాగిపోయాడు.

1857 - 1858 భారత తిరుగుబాటు

[మార్చు]

అవధ్ తిరుగుబాటు సైన్యానికి బర్కత్ అహ్మద్, మౌలవీ అహ్మదుల్లా షాలు నాయకత్వం వహించారు. చిన్హాట్ యుద్ధంలో, బర్కత్ అహ్మద్ తిరుగుబాటుదారులకు సేనాధిపతి అయ్యాడు. బ్రిటిష్ సైన్యానికి హెన్రీ మోంట్‌గోమేరీ లారెన్స్ నాయకత్వం వహించాడు. ఈ భీకర యుద్ధంలో బర్కత్ అహ్మద్, మౌలవీ అహ్మదుల్లా షా నాయకత్వంలో తిరుగుబాటు సైన్యం గెలిచింది.[9] లారెన్స్, లక్నోలోని రెసిడెన్సీలో మరణించాడు.

అహ్మదుల్లా షా బెలిగరాడ్‌పై జరిగిన దాడికి కూడా నాయకత్వం వహించాడు. రచయిత కైసరుత్ తవారిఖ్ ఇది తిరుగుబాటుదారుల భారీ విజయం అని పేర్కొంటూ -

మౌలవీ మొక్కవోని ధైర్య, సాహసాలతో పోరాడాడు. అతను బ్రిటిష్ వారిని బెలిగరాడ్‌కి పారదోలాడు. ఆపై "మచ్చి భవన్" అనే పెద్ద ఇంటిని కూడా పేల్చేసాడు.

తిరుగుబాటుదారులు లక్నోను స్వాధీనం చేసుకున్నాక, వాజిద్‌ ఆలీ షా, బేగం హజ్రత్ మహల్ ల పదేళ్ళ కుమారుడు బిర్జిస్ కదర్‌ను రాజుగా ప్రకటించారు. కొత్త పరిపాలనలో భాగంగా ఉండేందుకు మౌలవీ తిరస్కరించాడు. అతను రాజభవన రాజకీయాల నుండి దూరంగా జరిగాడు. గోమతి నదికి అవతల ఒడ్డున ఉన్న బాద్ షా బాగ్‌లో ఘమాండి సింగ్‌తో కలిసి, సుబేదార్ ఉమ్రావ్ సింగ్‌కు చెందిన 1000 మంది సైనికులతో తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

1858 మార్చి 6 న, బ్రిటిష్ వారు ప్రముఖ బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ కోలిన్ కాంప్‌బెల్ నాయకత్వంలో లక్నోపై మళ్లీ దాడి చేశారు. తిరుగుబాటు సైన్యానికి బేగం హజ్రత్ మహల్ నాయకత్వం వహించింది. బ్రిటిష్ వారు లక్నోను స్వాధీనం చేసుకోవడంతో, తిరుగుబాటుదారులు ఫైజాబాద్ వెళ్లే రహదారి గుండా మార్చి 15, 16 తేదీల్లో తప్పించుకున్నారు. నగరం మధ్యలో ఉన్న ఒక కోటలో అహ్మదుల్లా షా నాయకత్వంలో ఉన్న 1,200 మంది చివరి తిరుగుబాటుదారులను మార్చి 21 న బ్రిటిషు వారు తరిమికొట్టారు. ఈ తేదీన నగరాన్ని క్లియర్ చేసినట్లు బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

లక్నో పతనం తరువాత, మౌలవీ తన స్థావరాన్ని రోహిల్‌ఖండ్‌లోని షాజహాన్‌పూర్‌కు మార్చాడు. షాజహాన్‌పూర్‌లో, నానా సాహిబ్, ఖాన్ బహదూర్ ఖాన్ ల బలగాలు కూడా బ్రిటిష్ వారిపై దాడి చేయడంలో మౌలవీతో కలిసారు.

కొలిన్ కాంప్‌బెల్ షాజహాన్‌పూర్ నుండి మే 2 న బరేలీకి బయలుదేరాడు. మహ్మదీ రాజు తోనూ అనేక వేల మంది సైనికులతోనూ కలిసి మౌలవీ, షాజహాన్‌పూర్‌పై దాడి చేశాడు. బ్రిటిష్ సైన్యానికి ఈ సమాచారం అందింది. జనరల్ బ్రిగేడియర్ జాన్, మే 11 న షాజహాన్‌పూర్ చేరుకున్నాడు.[10] మౌలవీపై దాడి చేయడానికి జోన్స్ ధైర్యం చేయలేక, బరేలీ నుండి మరింత సహాయం కోసం ఎదురు చూసాడు. జార్జ్ బ్రూస్ మల్లెసన్ ఇలా వ్రాశాడు:

సర్ కొలిన్ కాంప్‌బెల్‌ని రెండుసార్లు ఓడించే సాహసం చేయగలిగినది మౌలవీ ఒక్కడే

1858 మే 15 న తిరుగుబాటుదారుల ప్లాటూన్‌కు, జనరల్ బ్రిగేడియర్ జోన్స్ రెజిమెంటుకూ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఇరుపక్షాలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది కానీ తిరుగుబాటుదారులు అప్పటికే షాజహాన్‌పూర్‌ను తమ నియంత్రణలో ఉంచుకున్నారు. కోలిన్ మే 20 న షాజహాన్‌పూర్ చేరుకుని, షాజహాన్‌పూర్‌పై అన్ని వైపుల నుండి దాడి చేశాడు. ఈ యుద్ధం ఆ రాత్రంతా కొనసాగింది. మౌలవీ, నానా సాహిబ్లు షాజహాన్పూర్ విడిచి వెళ్ళిపోయినపుడు, కోలిన్ స్వయంగా మౌలవీని వెంటాడాడు గానీ అతణ్ణి పట్టుకోలేకపోయాడు. షాజహాన్పూర్ పతనం తరువాత మౌలవీ, అక్కడికి 18 మైళ్ళ ఉత్తరాన షాజహాన్పూర్ ఉన్న పొవయాన్‌కు వెళ్ళాడు

మరణం

[మార్చు]

బ్రిటిష్ వారు మౌలవీని సజీవంగా పట్టుకోలేక పోయారు. వారు మౌలవీని పట్టుకోవడానికి 50,000 వెండి నాణేలను బహుమతిగా ప్రకటించారు. మౌలవీ అహ్మదుల్లా షా, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయటానికి పొవయాన్ రాజైన రాజా జగన్నాథ్ సింగ్‌ను ప్రోద్బల పరచాలని అనుకున్నాడు. కాని రాజా, మౌలవీ కోరికను అంగీకరించలేదు. మౌలవీ తన యుద్ధ ఏనుగుపై తన రాజభవన ద్వారాలకు చేరుకున్నప్పుడు, రాజు ఫిరంగులతో అతనిపై దాడి చేశాడు. ఆ దాడిలో మౌలవీ మరణించి, ఏనుగు పై నుండి పడిపోయాడు. GB మల్లెసన్ అతని మరణాన్ని ఇలా వర్ణించాడు:[11]

ఆ విధంగా ఫైజాబాద్ మౌలవీ అహ్మద్ షా మరణించాడు. పరాయి పీడనలో ఉన్న తన జాతి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రణాళిక వేసి పోరాటం చేసేవాడు దేశభక్తుడే అయితే, మౌలవీ కచ్చితంగా సిసలైన దేశభక్తుడు.[12]

—జి.బి. మల్లెసన్

పొవయన్ రాజా జగన్నాథ్ సింగ్ సోదరుడు కున్వర్ బల్దేవ్ సింగ్, మౌలవీ అహ్మదుల్లా షాను చంపి, అతని తలను తెగవేసి, మేజిస్ట్రేట్‌కు సమర్పించాడు. ప్రకటించిన బహుమతి అతనికి చెల్లించారు. అతడు బ్రిటిష్ వారి ప్రాపకం పొందాడు.[12] మరునాడు కొత్వాలి వద్ద మౌలవీ తలను వేలాడదీసారు. 1857 విప్లవకారుల్లో ఒకడైన ఫజల్-ఎ-హక్ ఖైరాబాదీ మౌలవీ మరణాన్ని చూశాడు.[6]

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో నిర్మించబోయే మసీదుకు అహ్మదుల్లా షా పేరు పెడతారు.[13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

 

  1. "Maulavi Ahmad Ullah Shah and Great revolt of 1857". National Book Trust, India website (Book by Rashmi Kumari). Retrieved 27 August 2019.
  2. "History of the Indian Mutiny, 1857-1858". George Bruce Malleson (1858).
  3. "Muslim Freedom Fighters Missing in the Indian History Books". 15 August 2017. Retrieved 27 August 2019.
  4. "1857 The First Challenge: The Rising". The Tribune (India newspaper). Retrieved 27 August 2019.
  5. "Revisiting the great Rebellion of 1857". The Daily Star (newspaper). 14 July 2014. Retrieved 27 August 2019.
  6. 6.0 6.1 "The Indian Muslim Legends (Ahmadullah Shah)". Archived from the original on 31 January 2018. Retrieved 27 August 2019.
  7. Madhulika Dash (8 January 2015). "Food Story: How India's favourite flatbread Roti was born". Retrieved 27 August 2019.
  8. "1857 The First Challenge: The Rising". The Tribune (India newspaper). Retrieved 27 August 2019.
  9. Sonal Gupta. "Battle of Chinhat: A Wilful Amnesia?". Archived from the original on 8 December 2017. Retrieved 27 August 2019.
  10. Forrest, George W. (2006). A History of the Indian Mutiny, 1857-58. ISBN 9788120619999. {{cite book}}: |work= ignored (help)
  11. "अंग्रेज़ों ने जंगे आज़ादी में अपना सबसे बड़ा दुश्मन मौलवी अहमदुल्लाह शाह फ़ैज़ाबादी को माना था". wordpress.com website. Retrieved 27 August 2019.[dead link]
  12. 12.0 12.1 "Revisiting the great Rebellion of 1857". The Daily Star (newspaper). 14 July 2014. Retrieved 27 August 2019.
  13. "Ahmadullah Shah: Ayodhya Mosque to be named after the maulana who died for India's Independence". The Times of India (in ఇంగ్లీష్). 25 January 2021. Retrieved 2021-01-26.{{cite web}}: CS1 maint: url-status (link)