Jump to content

ఇండియన్ నేషనల్ అసోసియేషన్

వికీపీడియా నుండి
ఇండియన్ అసోసియేషన్ లోపల

ఇండియన్ అసోసియేషన్ బ్రిటిష్ భారతదేశంలో ఏర్పాటైన మొదటి జాతీయవాద సంస్థ. దీన్ని 1876 లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ లు స్థాపించారు. [1] ఈ సంఘపు లక్ష్యాలు "ప్రజల రాజకీయ, మేధో, భౌతిక పురోగతిని చట్టబద్ధమైన మార్గాలన్నిటి ద్వారా ప్రచారం చేయడం". అసోసియేషన్ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యావంతులైన భారతీయులను, పౌర నాయకులను ఆకర్షించింది. భారతదేశ స్వాతంత్ర్య ఆకాంక్షలకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా మారింది. తరువాతి కాలంలో ఇది, భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనమైంది.

కాలక్రమం

[మార్చు]

1876లో ఏర్పాటైన ఇండియన్ అసోసియేషన్ అఖిల భారత దృక్పథం కలిగిన అగ్రగామి రాజకీయ సంఘాలలో ఒకటి. 19వ శతాబ్దపు రెండవ భాగంలో భారతదేశం, సామాజిక, ఆర్థిక జీవితంలో గణనీయమైన మార్పులను చూసింది. ఈ కాలంలోని అద్భుతమైన పరిణామాలలో ఒకటి రాజకీయ స్పృహ పెరగడం. ఇది రాజకీయ సంఘాలు, స్వాతంత్ర్యం కోసం జాతీయ ఉద్యమాల పుట్టుకకు దారితీసింది. ఇండియన్ అసోసియేషన్‌కు ముందు, శిశిర్ కుమార్ ఘోష్, శంభు చరణ్ ముఖర్జీతో కలిసి 1875 సెప్టెంబరు 25 న కలకత్తాలో 'ది ఇండియా లీగ్'ని స్థాపించాడు. ఆనంద మోహన్ బోస్, దుర్గా మోహన్ దాస్, నబగోపాల్ మిత్రా, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలైన జాతీయవాద నాయకులకు ఈ సంస్థతో సంబంధం ఉండేది. లీగ్, మధ్యతరగతి వర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రజలలో జాతీయతా భావాన్ని ప్రేరేపించడానికి, రాజకీయ విద్యను ప్రోత్సహించడానికీ పనిచేసింది. అఖిల భారత దృక్పథంతో నాయకులు, ఈ సంస్థను ప్రాంతీయ, మత రాజకీయాలకు అతీతంగా నిర్వహించారు.

కానీ త్వరలోనే లీగ్ క్షీణించింది. కొంతకాలం తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ తన స్నేహితుడు ఆనంద మోహన్ బోస్‌, ఈ సంస్థతో సంబంధం ఉన్న నాయకులు శివనాథ్ శాస్త్రి, క్రిస్టోదాస్ పాల్, ద్వారకానాథ్ గంగూలీ, నరేంద్ర కిషోర్ తదితరులతో కలిసి 1876 జూలై 26 న ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించాడు. అసోసియేషన్ మొదటి అధ్యక్షుడిగా రెవ. కృష్ణ మోహన్ బెనర్జీ, కార్యదర్శిగా ఆనంద మోహన్ బోస్ ఎన్నికయ్యారు. లక్ష్యాలు, దృక్పథంలో ఇండియా లీగ్, ఇండియన్ అసోసియేషన్ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. రెండూ భారతదేశంలోని విద్యావంతులైన మధ్యతరగతి ప్రజల్లో జాతీయ భావనను మేల్కొలపడానికి, రాజకీయ ఐక్యతను పెంపొందించడానికీ కృషి చేశారు. 'ఇండియన్ అసోసియేషన్' అనే పేరు, జాతీయ ఉద్యమం అఖిల భారత పాత్రను సంతరించుకుందని సూచిస్తుంది.

అసోసియేషన్ తన కార్యక్రమాన్ని అనేక అంశాలతో ప్రారంభించింది: (a) దేశంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం; (బి) ఉమ్మడి రాజకీయ ఆసక్తి, ఆకాంక్షల ఆధారంగా భారతీయ జాతులు, ప్రజలను ఐక్యపరచడం; (సి) హిందువులు, ముస్లింల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడం, (డి) ఆనాటి గొప్ప ప్రజా ఉద్యమంలో ప్రజానీకాన్ని చేర్చుకోవడం.

సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ వంటి మితవాద నాయకుల నేతృత్వంలో ఉండడం వలన ఈ సంఘం, తీవ్రమైన, సంకుచిత హిందూ జాతీయవాదం, సంకుచితవాదాలకు అతీతంగా ఉండేది. ముస్లింల పట్ల స్నేహం, సద్భావన కోసం, వారు దాని రెండవ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించడానికి నవాబ్ మహమ్మద్ అలీని ఆహ్వానించారు. నిజానికి, ఇండియన్ అసోసియేషన్ జాతీయ మేల్కొలుపు, రాజకీయ స్పృహ పెంపుదలకు పునాది వేసింది, చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. దీనికి శ్రేయస్సు సురేంద్రనాథ్ బెనర్జీకి చెందుతుంది. నిజానికి, ఈ అసోసియేషనే కాంగ్రెస్‌ ఏర్పాటుకు ఆద్యురాలు.

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనతో, సంఘం క్రమంగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయింది. అయినప్పటికీ, ప్రతి ప్రావిన్స్ నుండి ప్రతినిధులతో అఖిల భారత సదస్సును నిర్వహించాలనే ఆలోచనను ప్రారంభించిన ఘనత దీనికి చెందుతుంది. 1883లో కలకత్తాలో దీని మొదటి భారత జాతీయ సమావేశం జరిగింది. అసోసియేషన్ నిర్వహించిన రెండవ జాతీయ సమావేశం 1885లో కలకత్తాలో జరిగింది. ఇది 1885 డిసెంబరులో బొంబాయిలో మొదటిసారిగా సమావేశమైన జాతీయ కాంగ్రెస్‌తో సమానంగా జరిగింది. 1886 డిసెంబరులో కలకత్తాలో నేషనల్ కాంగ్రెస్ తన రెండవ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇండియన్ అసోసియేషన్ తన సంఘీభావాన్ని వ్యక్తం చేసింది, కాంగ్రెస్‌లో విలీనం కావాలని నిర్ణయించి, ఆ మరుసటి సంవత్సరం విలీనమైంది.[2]

సభ్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Indian Associationpolitical organization, India". Britannica.com. Retrieved 2015-09-10.
  2. Independence of India and Pakistan. Internet Archive. Chicago : World Book. 2011. ISBN 978-0-7166-1506-4.{{cite book}}: CS1 maint: others (link)