Jump to content

సుభాష్ చంద్రబోస్

వికీపీడియా నుండి
(సుభాష్ చంద్ర బోస్ నుండి దారిమార్పు చెందింది)
సుభాష్ చంద్రబోస్
జననం(1897-01-23)1897 జనవరి 23
మరణం1945 ఆగస్టు 18
తైవాన్ (అని భావిస్తున్నారు)
మరణ కారణంవిమాన ప్రమాదం (అని భావిస్తున్నారు)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు . భారత జాతీయ సైన్యాధినేత
బిరుదునేతాజీ
రాజకీయ పార్టీభారత జాతీయ
ఫార్వర్డ్ బ్లాక్ (వామపక్ష పార్టీ)
జీవిత భాగస్వామిఎమిలీ షెంకెల్
పిల్లలుఅనితా బోస్
తల్లిదండ్రులుజానకీనాథ బోస్, ప్రభాబతి బోస్.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఆల్ ఇండియా యూత్ లీగ్) అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.

బోసు మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు అవును ఇలాగే చాలామంది అనుకుంటున్నారు.

బాల్యం, విద్య

[మార్చు]

సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారతదేశంలోని ఒడిషా లోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభాబతి బోస్. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై లోను సాగింది.

1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగాడు.

భారత జాతీయ కాంగ్రెస్‌లో

[మార్చు]

సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్‌ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలసి బోస్ బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు.

ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో క్రొత్త భావాలు చోటు చేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తరువాత Letters to Emilie Schenkl అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు.

బోస్ 1939 లో భారత జాతీయ కాంగ్రెసు సమావేశానికి వచ్చినప్పటి చిత్రం

1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్‌ నుండి వైదొలగాడు. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" (All India Forward Bloc) పార్టీని స్థాపించాడు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీ" (National Planning Committee) అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.

స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక

[మార్చు]

బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వాతంత్ర్యం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ (Giuseppe Garibaldi), మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ (Kemal Atatürk) నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్‌తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాతి కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.

ఒకసారి సుభాస్ చంద్ర బోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్ మీ నాయకుణ్ణి రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్, బోస్ ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంకా ఎవరికి లేదు అని జవాబిచ్చాడు.

బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్‌ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్‌రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఈ నిర్ణయం పట్ల బోసు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. వెంటనే బ్రిటిషు ప్రభుత్వం అతనిని కారాగారంలో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు. ముందుగా పెషావర్ చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్‌లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయవ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా, అగాఖాన్‌ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్‌తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్‌కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVDఅతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్ కి అప్పగించారు. అతను బోస్‌ను బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్‌కు రిబ్బెన్‌ట్రాప్ నుండిచ్విల్‌హెల్మ్‌స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారుల నుండి కొంత సఖ్యత లభించింది.[1]

తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన Special Operations Executive (SOE) ఈ పనిని చేపట్టింది.[2]

జర్మనీలో

[మార్చు]

ఇలా భారతదేశంనుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడినుండి రష్యా, అక్కడినుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొన్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్‌లో "స్వతంత్ర greengloryschool) స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇది మొదట Wehrmacht, తరువాత Waffen SS అనే సైన్య విభాగాలకు అనుబంధంగా ఉండేది.[3] అందులోని సైన్యం హిట్లర్‌కు, బో‍స్‌కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు - "భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్ కు, భారతదేశపు స్వాతంత్ర్యం కోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్‌కు విధేయుడనై ఉంటాను:("I swear by God this holy oath that I will obey the leader of the German race and state, Adolf Hitler, as the commander of the German armed forces in the fight for India, whose leader is Subhas Chandra Bose"). ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్‌కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు - అలా అగ్రరాజ్యాలు విజయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారతదేశం వదలి వెళతారని ఎలా అనుకొన్నాడని?.[4]

1941 - 43 మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్‌లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. 1943 లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29 లోకి మారాడు. ఆ రెండు దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతో సింగపూర్‌లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరచుకొన్నాడు.

భారత జాతీయ సైన్యం

[మార్చు]

భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్లో స్థాపించాడు. ఇది రాష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్ కు చెందిన హికారీ కికాన్ కు మోహన్ సింగ్ కు భేదాలు రావడం వల్లనూ, మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లనూ చేశారు. మోహన్ సింగ్ ను అదుపు లోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్ర బోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లైంది. అదే సంవత్సరంలో జూలైలో సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు.

మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ అజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జులై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచింది.

మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను

ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజ భరితంగా సాగింది.

ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ, పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మాలాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది.

అదృశ్యం , అనుమానాస్పద మరణం

[మార్చు]
రెంకోజీ ఆలయం (జపాన్)

అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.

1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.[5] అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది. .[6]

ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది.

అపరిచిత సన్యాసి

[మార్చు]

1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగ నమ్మేవారు

భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది.[7] ఏదైనప్పటికి భగవాన్ జీ జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.

ఇవి కూడ చూడండి

[మార్చు]

లీలా రాయ్

మూలాలు

[మార్చు]
  1. Kurowski, The Brandenburgers - Global Mission, p. 136
  2. Bhaumik S, British "attempted to kill Bose" BBC news. 15 August 2005. URL accessed on 6 April 2006
  3. Rudolf Hartog The Sign of the Tiger (Delhi: Rupa) 2001 pp159-60
  4. Sen, S. 1999. Subhas Chandra Bose 1897-1945. From webarchive of this URL Archived 2005-03-05 at the Wayback Machine. URL accessed on 7 April, 2006.
  5. "No crash at Taipei that killed Netaji: Taiwan govt. Outlook India". Archived from the original on 2013-11-10. Retrieved 2008-08-31.
  6. Netaji case: US backs Taiwan govt. Times of India. 19 Sep, 2005
  7. "HindustanTimes.com Exclusive, Netaji's death unraveled". Archived from the original on 2012-02-19. Retrieved 2008-08-31.

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.