భోగరాజు పట్టాభి సీతారామయ్య
డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య | |
---|---|
జననం | భోగరాజు పట్టాభి సీతారామయ్య నవంబర్ 24, 1880 గుండుగొలను , కృష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సి |
మరణం | డిసెంబర్ 17, 1959 |
జాతీయత | భారతియుడు |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
భోగరాజు పట్టాభి సీతారామయ్య (నవంబర్ 24, 1880 - డిసెంబర్ 17, 1959) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు సీతారామయ్య నవంబర్ 24 1880 న మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రములోని కృష్ణా జిల్లా ( పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను ) గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17 న తుదిశ్వాస వదలాడు.
బాల్యం
[మార్చు]పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24 న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ఇతని తండ్రి భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం పంతులు గుండుగొల్లు గ్రామ కరణంగా పనిచేసేవాడు. సీతారామయ్యకు ఒక అన్న ఆరుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఇతని నాలుగవయేటనే తండ్రి మరణించడంతో కుటుంబభారం తల్లి గంగమ్మ మీద పడింది. పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆమె తన కుటుంబాన్ని ఏలూరుకు తరలించింది. ఇతడు తన ప్రాథమిక విద్యను ఏలూరు లోని మిషన్ హైస్కూలులో చదివాడు. అక్కడ మెట్రిక్యులేషను పూర్తి అయిన తరువాత బందరులోని నోబుల్ కాలేజీలో ఎఫ్.ఎ. పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అక్కడ రఘుపతి వెంకటరత్నం నాయుడుకు ఇతడు ప్రియశిష్యుడు. ఉన్నత విద్యకై మద్రాసు (నేటి చెన్నై) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ 1900లో పొందాడు. ఆ తరువాత ఇతడు మద్రాసులోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎం.బి.సి.ఎం. డిగ్రీ 1905లో సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు[1].
పిఠాపురం మహారాజావారి కోరికను కాదని బందరులో డాక్టరుగా జీవితాన్ని ఆరంభించాడు పట్టాభి. బందరు జీవితం పట్టాభిని బాగా తీర్చిదిద్దింది.
స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా
[మార్చు]చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటిషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్థి అయిన సుభాష్ చంద్రబోస్కు వ్యతిరేకముగా, మహాత్మా గాంధీ అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం, పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ 1948లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పురుషోత్తమ దాస్ టాండన్ పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించాడు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో కాంగ్రెసు పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు అహ్మద్ నగర్ కోటలో బయటి వ్యక్తులెవ్వరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రహింసల పాలు చేశారు. బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించాడు. దీనినే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు, రాళ్ళు) గా ప్రచురించారు.
పట్టాభి 1907 బాంబే కాంగ్రెస్ సభలకు హాజరై స్వదేశీ నినాదం మీదప్రసంగించారు.అదే సంవత్సరం లాల్, బాల్, పాల్ త్రయంలోని బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలోని పర్యటించారు. దాని ఫలితంగా కోస్తాఆంధ్రలో జాతీయోద్యమానికి నూతన్ ఉత్తేజం చేకూరింది.1908లో జరిగిన మొదతి మితవాద కాంగ్రెస్ కు పట్టాభి హాజరయ్యారు.బందరులో జాతీయ కళాశాల స్థాపన ఉద్దేశం ఏర్పడింది.1910లో బందరులో ఆంధ్రజాతీయ కళాశాల స్థాపించబడింది.ఆకళాశాలలో 1914లో కుటీర పరిశ్రమలూ, 1916లో చేనేత ప్రవేశపెట్టారు. గాంధీజీ ఆకళాశాలను 1921,29లలో దర్సించి సంతోషపడ్డారు.1916లో మొదటిసారిగా పట్టాభిగారు మద్రాసు కాంగ్రెస్ కమిటీ సహాయంలో సభ్యుడయ్యారు.రాజకీయాలకు, వృత్తి కుదరక 1916 సెప్టెంబరులో తన వృత్తికి స్వస్తి చెప్పారు.నాటికు ఆయన 26 సంవత్సరాలు.1927లో ప్రకాశం పంతులుగారు రెవెన్యూమంత్రి కావటంతోనే పట్టాభి ఏఇసిసి అధ్యక్షుడు అయ్యారు.ఆర్ధికంగా కార్యక్రమాలన్నీ ఏఇసిసి చాలా సమర్ధవంతంగా పనిచేసిందనుకుంటే పట్టాభి హయంలో మిగతా రంగాలలో అల్లకల్లోలం చెలరేగింది. పట్టాభి వ్యక్తిత్వము ముక్కుకు సూటిగాపోయే గుణము, మాటలలో పరుశ్హత్వము, అప్పుడప్పుడే చెలరేగుతున్న రెడి-కమ్మ భావాలు, చివరగా ఆయన చర్యలూ-ఈ అల్లకల్లోలానికి కారణాలు.1951లో సంజీవరెడ్డి చేతుల్లో 5కోట్ల తేడాలో ఆచార్య ఎన్.జి. రంగా ఓడిపోవడానికి పట్టాభి అదృశ్యహస్తం ముందంటారు కొందరు.1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడడంతో రాష్ట్ర రాజకీయాలలో పట్టాభి ప్రాబల్యం తగ్గింది. జాతీయ రాజకీయాలలో పట్టాభికి తుల్యమైన పాత్రను పోషించిన ఆంధ్రులు ఎక్కువమంది లేరనే చెప్పవచ్చును.ప్రథమంలో లాల్-బాల్-పాల్ ల అతివాద ధోరణిపట్ల మొగ్గుచూపినా రానురాను పట్టాభి గాంధీజీకి దగ్గర కాసాగారు.
ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి
[మార్చు]తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభి ఎంతగానో కృషిచేశాడు. పట్టాభి చొరవతోనే ఆంధ్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ 1908లో బందరులో జరిగింది. బందరు సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించారు. ఆ తరువాతనే 1913లో బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించాడు. పట్టాభి కృషి వల్లనే 1920లో కాంగ్రెసు పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.
వ్యాపారవేత్తగా
[మార్చు]పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంధ్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
తెలుగు అభిమానిగా
[మార్చు]ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు అయిననూ, గవర్నర్‌గా మధ్య ప్రదేశ్ వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.
గ్రంథకర్తగా
[మార్చు]పట్టాభి రచించిన గ్రంథాలలో కాంగ్రెసు చరిత్ర (History of Indian National Congress) అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెసు చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు. గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటుగా పంజాబు వధలు, ఖద్దరు, స్వరాజ్యము, భారత జాతీయ విద్య[1], మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలను కూడా రచించాడు.[2] విలియం టారెన్స్ వ్రాసిన Empire in Asia అనే గ్రంథాన్ని తెలుగు భాషాంతరీకరణ చేశాడు[1].
పాత్రికేయునిగా
[మార్చు]ఇతడు 1919లో మచిలీపట్నం నుండి జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. ఆ కాలంలో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆ కొరతను తీర్చడానికి ఇతడు జన్మభూమిని ప్రారంభించాడు. ఈ పత్రిక ఇతని సంపాదకత్వంలో 1930 వరకు వెలువడింది. ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఇతని ఆంగ్లభాషా నైపుణ్యాన్ని దేశానికి చాటింది[1]. నాటి త్రయం పట్తాభి రామయ్య, కొంపెల్ల హనుమంతరావు, ముట్నూరు కృష్ణారావు గారి త్రయం 1902లో కృష్ణాపత్రికను స్థాపించారు.
స్వాతంత్ర్యానంతరము
[మార్చు]స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించాడు. 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్ గవర్నరుగా పనిచేశాడు.
మరణం
[మార్చు]తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17న స్వర్గస్థుడయ్యాడు.
వీరి గౌరవార్దం 17 -12-1997 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 అడవి, లక్ష్మీ నరసింహారావు (1 February 2017). "డాక్టరు పట్టాభి సీతారామయ్య పంతులు గారి జీవిత సంగ్రహము". శ్రీ సాధన పత్రిక. 8 (22): 2, 10–11. Retrieved 20 July 2017.[permanent dead link]
- ↑ పట్టాభి సీతారామయ్య, భోగరాజు. మన నేత పరిశ్రమ. Retrieved 13 January 2015.
- ↑ "ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు-శ్రీ పట్టాభి సీతారామయ్య". STAMPS OF ANDHRA. 24 November 2015. Retrieved 25 August 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
[మార్చు]- All articles with dead external links
- CS1 maint: url-status
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- 1880 జననాలు
- 1959 మరణాలు
- పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు
- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గవర్నర్లు
- పశ్చిమ గోదావరి జిల్లా రచయితలు
- శ్రీబాగ్ ఒడంబడికలో పాలుపంచుకున్న వ్యక్తులు
- రాజ్యాంగ పరిషత్తు సభ్యులు
- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజ్యాంగ పరిషత్తు సభ్యులు
- తమ పేరిట స్మారక పోస్టల్ స్టాంపు విడుదలైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- మధ్య ప్రదేశ్ గవర్నర్లు