నాయకత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో నాయకత్వం నేర్పించే ఒక విద్యా సంస్థ

నాయకత్వానికి (ఆంగ్లం: Leadership) ప్రత్యామ్నాయ నిర్వచనాలు ఉన్నప్పటికీ, అందరికీ సంబంధించిన ఒక లక్ష్యాన్ని ఛేదించటానికి ఒక వ్యక్తి ఇతరుల సహాయం, మద్దతుతో ముందుకెళ్ళే ఒక సాంఘిక ప్రభావాత్మక ప్రక్రియగా నాయకత్వం వర్ణించబడింది. ఇతరులచే అనుసరించబడేవారే, ఇతరులకి దిశానిర్దేశం చేసేవారే నాయకుడు/నాయకురాలు అని కొందరు అనుకొంటే, "ప్రేరణని అందించటం , ఒక సమిష్టి లక్ష్యాన్ని ఛేదించటానికి జనాన్ని సమీకరించి వారిని నిర్విహంచటమే "నాయకత్వం" అని మరికొందరు నిర్వచించారు. నాయకత్వం పై అధ్యయనాలు అలవాట్లు, పరిస్థితుల సంకర్షణ, ధర్మం, ప్రవర్తన, అధికారం, విలువలు, సమ్మోహన శక్తి, మేధస్సు, ఇతర లక్షణాల ఆధారంగా జరిగాయి.ఆంగ్లంలో లీడరు అనే పదాన్ని లింగభేదం లేకుండానే వాడినా, తెలుగులో మాత్రం నాయకత్వం వహించే పురుషుడిని నాయకుడు అని, అదే మహిళ అయితే నాయకురాలు అని వ్యవహరిస్తారు. నాయకుల అలవాట్లు, లక్షణాలపై శోధన దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్లేటో నుండి ప్లూటార్క్ ల రచనల వరకు, "ఒక వ్యక్తిని నాయకుడిగా గుర్తించాలంటే అతనిలో ఉండవలసిన విశిష్టలక్షణాలేమిటి?" అనే ప్రశ్నను సంబధించినవే. నాయకత్వం అనేది ఒక వ్యక్తి లక్షణాలలోనే ఉందనే అనే భావనే దీనికి కారణం. విశిష్ట లక్షణాల నాయకత్వ సిద్ధాంతానికి దారి తీసినది ఈ భావనే.

పురాతన పాశ్చాత్య సిద్ధాంతం

[మార్చు]

19వ శతాబ్దంలో రాజుల, అధిపతుల, బిషప్ ల పెత్తనాలు పట్టు సడలుతున్నప్పుడు ఈ సిద్ధాంతాన్ని సుదీర్ఘంగా శోధించటం జరిగింది. 1841 లో థామస్ కార్లిలే రచించిన Heroes and Hero Worship (నాయకులు , వారి ఆరాధన)లో అధికారాన్ని సాధించిన పురుషుల ప్రతిభ, నైపుణ్యాలు, భౌతిక లక్షణాలను గుర్తించాడు. 1869 లో ఫ్రాన్సిస్ గాల్టన్ రచించిన Hereditary Genius (వంశపారంపరిక ప్రజ్ఞాశాలి)లో శక్తిమంతులైన పురుషుల కుటుంబాలలోని నాయకత్వ లక్షణాలని పరీక్షించాడు. నాయకత్వం వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని, పుట్టుకతోనే నాయకులు అవుతారే గానీ మలచితే నాయకులు కాజాలరని గాల్టన్ తేల్చాడు. ఈ రెండు ప్రధాన పరిశోధనలు నాయకత్వమనేది నాయకుడి లక్షణాలలోనే ఉంటుందనే వాదన చేశాయి. తొలినాళ్ళలో ఈ వాదన అమోదించబడటమే కాక, ప్రజల అభిమానాన్ని కూడా చూరగొన్నది.

సిద్ధాంతాలు

[మార్చు]

సిసిల్ రోడ్స్ (1853 - 1902) "సుగుణాలు, నైతిక శక్తి , నాయకత్వం వహించే స్వభావం" గల యువకులని గుర్తించి వారిని మలచినచో ప్రజాకర్షక నాయకత్వాన్ని పెంపొందిచవచ్చని, సందర్భానుసారంగా కళాశాల వాతావరణం (అంటే ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి వాటి) లో వారు విద్యను అభ్యసించేలా చేస్తే నాయకత్వ లక్షణాలు మరింత అభివృద్ధి చేయవచ్చని నమ్మారు. ఇటువంటి నాయకుల అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ స్థాయిలో సహృద్భావాన్ని నెలకొల్పి యుద్ధం చోటుచేసుకొనే అవకాశాలు తగ్గిస్తాయని తెలిపారు.

ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం

[మార్చు]

40వ దశకం చివరలో, 50వ దశకం ప్రారంభంలో పురాతన సిద్ధాంతాలపై జరిగిన ప్రామాణిక సమీక్షలు నాయకత్వాన్ని నడిపించే శక్తులపై పరిశోధకుల అభిప్రాయాలలో సమూలమైన మార్పులను తెచ్చాయి. చాలా మటుకు అధ్యయనాలలో లక్షణాలు ఒకదానిలో ఉన్నవే మరొకదానిలో ఉన్నా, ఆధారాలు మాత్రం ఒక పరిస్థితిలో నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి మరొక పరిస్థితిలో కచ్చితంగా నాయకుడిగా వ్యవహరించగలడు అని సూచించలేదు. తర్వాతి కాలంలో నాయకత్వం ఒక వ్యక్తి యొక్క లక్షణం కాదని, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిస్థితిలో నాయకుడవుతాడాని తేలినది. దీనితో దృష్టి నాయకుడి లక్షణాల పై నుండి నాయకుడి ప్రవర్తనా శైలి పైకి మళ్ళినది. తర్వాతి రెండు దశకాలలో నాయకత్వ సిద్ధాంతం పై పరిశోధన ఈ దిశగానే సాగినది.

రెండింటి కలయిక

[మార్చు]

తర్వాతి కాలంలో పై రెండు సిద్ధాంతాల కలయిక జరిగింది. నూతన ప్రక్రియల ప్రకారం నాయకత్వం ఈ క్రింది సత్యాలని వెలువరించినది

  • వివిధ పరిస్థితులలో, కార్యకలాపాలలో వ్యక్తులు నాయకులుగా ఆవిర్భవించగలరు/ఆవిర్భవించాలి.
  • నాయకత్వ ఆవిర్భావానికి ఈ క్రింది లక్షణాలకు ముఖ్యమైన సంబంధం కలదు
    • మేధస్సు
    • సర్దుబాటు
    • బహిర్వర్తనం
    • మనస్సాక్షి కలిగి ఉండటం
    • నూతన అనుభవాన్ని స్వాగతించటం
    • స్వీయ సామర్థ్యం

లక్షణ క్రమత విధానం

[మార్చు]

లక్షణ క్రమత విధానంలో సిద్ధాంతకర్తలు ఒక వ్యక్తి యొక్క లక్షణాలు, వివిధ పరిస్థితులలో వాటి వలన సంభవించే ఫలితాలను సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని కొన్ని ప్రత్యేక అంశాల సమాహారంగా పరిగణించటానికి బదులుగా అతనిని ఏకీకరించబడిన స్ంపూర్ణతగా పరిగణిస్తేనే సాధ్యపడుతుందని వాదించారు. అనగా ఒక్కొక్క అంశాన్ని పరిగణించటం కంటే, లేదా లక్షణాల సమూహాలను, వాటి కలయికలను పరిగణించటం కంటే, ఏకీకరించబడిన కూటములు, లేదా వ్యక్తిగత భేదాల కలయికలు నాయకుని ఆవిర్భావానికి, నాయకుని సామర్థ్యానికి మధ్య గణనీయమైన అంతర్భేదాన్ని విశదీకరిస్తాయి అని అర్థం.

ప్రవర్తన , శైలి సిద్ధాంతాలు

[మార్చు]

నాయకత్వం పై అదివరకు ఉన్న సిద్ధాంతాలు విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధాంతకర్తలు నాయకత్వాన్ని ప్రవర్తనల సమూహంగా పరిగణించే, సఫలీకృతులైన నాయకుల ప్రవర్తనలను విశ్లేషించే, ప్రవర్తన వర్గీకరణను నిర్దేశించే, నాయకత్వ శైలులను క్లుప్తంగా విశదీకరించే కోణంలో పరిశోధించారు. డేవిడ్ మెక్ క్లెలాండ్ నాయకత్వానికి బలమైన వ్యక్తిత్వం, పరిపూర్ణమైన సానుకూల దృక్పథం కావాలని సూత్రీకరించాడు. అధికార కేంద్రంగా ఉండగలగటం, ఆత్మ విశ్వాసంతో ఉండగలగటం, అత్యున్నత స్థాయిలో స్వాభిమానం కలిగి ఉండటం వంటివి ఉపయోగకరమే కాక, అవసరాలు కూడా అయి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు.

నాయకత్వ శైలుల, వాటి పనితీరుల ప్రభావాలపై పరిశోధనలు 1939 లో ప్రారంభమైనవి. పరిశోధకులు వివిధ రకాలైన కార్యాలయ పరిస్థితులలో పదకొండేళ్ళ బాలుర సమూహాల పనితీరును విశ్లేషించారు. సమూహ నిర్ణయ నిర్ధారణ, పొగడ్త, విమర్శ, సమూహ కార్యకలాపాల నిర్వహణ వంటి వాటిని, ఒక్కొక్క సమూహంలో నాయకుడు మూడు వివిధ నాయకత్వ శైలులలో ప్రయోగించాడు.

  • అధికారిగా
  • ప్రజాస్వామ్యబద్ధంగా
  • జోక్యం లేని (Laissez-faire)

1964లో నిర్వాహక చట్ర నమూనా కూడా ప్రవర్తనా సిద్ధాంతం పై ఆధారపడినదే. ఈ నమూనా జట్టులో ఉన్న సభ్యుల దిశ నుండి దానికి వ్యతిరేకంగా ఉండే లక్ష్య సాధన దిశ వరకూ ఐదు వివిధ నాయకత్వ శైలులను సూచించింది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=నాయకత్వం&oldid=4225603" నుండి వెలికితీశారు