సంస్థాగత సంస్కృతి
సంస్థాగత సంస్కృతి (ఆంగ్లం: Organizational Culture) సంస్థలలో సాంస్కృతిక విలువల పద్ధతుల మూలాలని, అభివృద్ధిని వివరించే సంస్థాగత సిద్ధాంతం లోని ఒకానొక అంశం. సంస్థలు, పరిపాలకులు ఈ ప్రక్రియనే Corporate Culture లేదా Administrative Culture (పరిపాలనా సంస్కృతి) అని కూడా వ్యవహరిస్తారు.
సంస్థాగత సంస్కృతి నిర్వహణ యొక్క అని అంశాల పై ప్రభావితం చూపుతుంది. ఉదా:
సంస్థ యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థవంతంగా లక్ష్యాలని చేరుకోవటంలో దోహదపడుతుంది. ఈ పరిజ్ఞానంతో బాహ్య జనులు కూడా సంస్థని అర్థం చేసుకొనటానికి అవకాశం ఉంది.
ప్రాథమిక అంశాలు
[మార్చు]సంస్థాగత సంస్కృతి యొక్క భావన, సాంస్కృతిక నృశాస్త్రంలో సంస్కృతి పై ఉన్న భావన నుండి ప్రసరిస్తుంది. అందుకే నిర్ధిష్ట సంస్కృతిని రూపుదిద్ది తద్వారా సామూహిక సంస్థాగత ప్రవర్తనని, సంస్థలలో వ్యక్తుల ప్రవర్తనలని ప్రభావితం చేయగలిగే సంస్థలే మనగలుగుతాయి. విలువల, ప్రమాణాల, ఆలోచనావిధానాల, నమూనాల పరస్పర సంకర్షణల వలన సంస్థాగత సంస్కృతి ఉద్యోగులని సమష్టిగా వర్గీకరిస్తుంది. సంస్థాగత సంస్కృతి పైన, సంస్థ యొక్క రూపురేఖల పైన బాహ్య ప్రపంచపు ప్రభావమే అధికం ఉంటుంది.
సంస్థాగత సంస్కృతిలో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో, భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా."
ఇతర నిర్వచనాలు:
- "సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983
- "సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల, ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985
- "పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997
సంస్థలో దాదాపు అన్నింటి గురించి ప్రస్తావించటం వలన పై నిర్వచనాలు సమస్యాత్మకంగా పరిగణించబడ్డాయి. సంస్కృతి యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉండటం వలన సంస్థాగత సంస్కృతి సార్వత్రిక నియమం వలె అనిపిస్తుంది. వివిధ పరిశోధనా పద్ధతులు వేర్వేరుగా ఉన్ననూ జాతీయ, స్థానిక సంస్కృతులు సంస్థాగత సంస్కృతిపై ప్రభావం చూపుతాయనటానికి, వీటి ప్రభావం సంస్థాగత లక్ష్యాల సాధన పై ఉంటుందనటానికి మాత్రం ఏకాభిప్రాయం ఉంది. దీనిపై పరిశోధనలు జరిగి, ఇది నిరూపించబడింది.
వేర్వేరు ప్రదేశాలలో, సంస్థ-సంస్థకి సంస్థాగత సంస్కృతిలో తేడా ఉండటం వలన దీనికి ఒక సార్వత్రిక విధానాన్ని ఆపాదించలేము. శ్రామికులు వారి అనుభవాలని ఒకరితో ఒకరు పంచుకోవటం వలన ఇది సృష్టించబడుతుంది. దీనిలో మార్పులు అంత వేగంగా చోటుచేసుకోవు. అంతేగాక సంస్థాగత సంస్కృతి సంస్థని సాంఘికంగా, ఆర్థికంగా సంస్థాగత నిర్మాణ పరంగా, వ్యూహ పరంగా ప్రభావితం చేస్తుంది.
వ్యాపార నిర్వహణలో సంస్థాగత సంస్కృతి
[మార్చు]సంస్థాగత సంస్కృతిని అన్ని సంస్థలు గుర్తించవు. సంస్థాగత సంస్కృతికి కారకాలు, ప్రభావాల యొక్క పరిశోధన సామాజిక శాస్త్త్రంతో కలిసిననూ నిర్వహణలో కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రవర్తనా నియమావళిలో సంస్థ యొక్క నియమాలు, నిర్దేశకాలు, అంతర్గత-బాహ్య సమాచార ప్రసారాలకి సిద్ధాంతాలు, ఉద్యోగి ప్రవర్తించవలసిన తీరు పేర్కొనబడి ఉంటాయి. సంస్థ కట్టుబడి ఉండే విలువలు, దినచర్యలో ఆచరించవలసిన కార్యాలు ప్రవర్తనా నియమావళికి మూలం.
సంస్థాగత సంస్కృతిని మార్చాలంటే వ్యాపార ధర్మాన్ని, వ్యాపార దృష్టిని మార్పు నిర్వహణ ద్వారా సమూలంగా మార్చవలసి ఉంటుంది. సారూప్య సంస్థాగత సంస్కృతి నెలకొనాలంటే వైవిధ్యత నిర్వహణలో వివిధ పద్ధతులని కలగలిపి వివిధ రకాల మనుషులని, సమూహాలని అనుసంధానం చేయవలసి ఉంటుంది.
సంస్థాగత సంస్కృతితో సంస్థ తన స్వంత ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తుంది. భావప్రకటన చేస్తుంది. అనుచరించబడుతుంది. శిక్షణ ద్వారా, మార్గదర్శక సూచనల ద్వారా నేర్పబడుతుంది. సంస్థాగత లక్ష్యాలైన అంతర్గత భావవ్యక్తీకరణ, నిర్ణయం తీసుకోవటంలో వేగం, ఫలితంగా లభార్జన దీని వలన పెరుగుతాయి.