Jump to content

బార్డోలి సత్యాగ్రహం

వికీపీడియా నుండి
1928లో బార్డోలీ సత్యాగ్రహానికి సంబంధించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ, వల్లభ్ భాయి పటేల్

బార్డోలీ సత్యాగ్రహం ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో 1928లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రధానమైన సహాయ నిరాకరణోద్యమ, సత్యాగ్రహ ఉద్యమ ఘటన. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఇది ఒకనొక ప్రధాన ఘట్టంగా పేరొందింది. వల్లభ్ భాయి పటేల్ బార్డోలీ సత్యాగ్రహాన్ని ప్రారంభించి, నేతృత్వం వహించారు. ఈ ఉద్యమ విజయంతో వల్లభ్ భాయ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ లోనూ, జాతీయోద్యమంలోనూ ప్రధాన నాయకుల్లో ఒకరిగా నిలిచారు.

నేపథ్యం

[మార్చు]

బీహార్లోని చంపారన్, గుజరాత్లోని ఖేడా ప్రాంతాల్లో పేద భారతీయ రైతులపై బ్రిటీష్ ప్రభుత్వం, వారికి సన్నిహితులైన భూస్వాముల (చంపారన్ లో యూరోపియన్లు) క్రూరత్వం, నిరంకుశత్వాలను నిరసిస్తూ మహాత్మా గాంధీ అక్కడి రైతులకు నాయకత్వం వహిస్తూ రెండు గొప్ప అహింసాయుతమైన తిరుగుబాట్లకు నేతృత్వం వహించారు. రెండు పోరాటాల్లోనూ విజయం సాధించడం వల్ల అక్కడి రైతులకు ఆర్థిక, పౌర హక్కుల విషయంలో మెరుగుదల కనిపించగా, భారతదేశ ప్రజలు ఉత్తేజితులయ్యారు.

1920ల్లో గాంధీ నాయకత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించింది. లక్షలాదిగా భారతీయులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో న్యాయవాదులు, ప్రభుత్వ ద్యోగులు వృత్తులు వదిలేశారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నుంచి బయటకు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పెన్షన్లు, విదేశీ వస్త్రాలు, సరుకలు విడిచిపెట్టారు. బ్రిటీష్ చట్టాల నియంతృత్వాన్ని శాంతియుతంగా ధిక్కరించి భారత స్వరాజ్యం కోసం పోరాడారు. వేలాదిమంది దెబ్బలు తిని, అరెస్టయ్యారు.

ఈ నేపథ్యంలో 1920లో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలన్న నిర్ణయానికి గాంధీ వచ్చారు. ఐతే గతంలోలాగా ఆర్థికపరమైన కారణాలతోనూ, లక్ష్యాలతోనూ కాకుండా స్వరాజ్యం కోసం పన్నుల నిరాకరణ సత్యాగ్రహాన్ని చేయబూనారు. వల్లభ్ భాయ్ ను సంప్రదించి మహాత్మా గాంధీ ఈ ఉద్యమం బార్డోలీ తాలూకాలో కానీ, ఆనంద్ తాలూకాలో కానీ చేయవచ్చని ఆయన ప్రకటించారు. ఐతే ఇరు ప్రాంతాల నుంచి నాయకులు కోరుకున్నా, చివరకు అవకాశం బార్డోలీనే వరించింది. 1921లో వల్లభ్ భాయ్ ఈ ప్రాంతంలో నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా, స్ఫూర్తి రగిలించడం ద్వారా సంసిద్ధపరచడం ప్రారంభించారు. ప్రధానంగా ఏమాత్రం హింసకు పాల్పడకుండా ప్రజలను ఆందోళన పథంలో నడపడంపై దృష్టి కేంద్రీకరించారు.

ఉద్యమానికి సర్వం సంసిద్ధమై ఉండగా సత్యాగ్రహులైన ప్రజలు అదుపుతప్పి చౌరీచౌరా అన్న ప్రాంతంలో అల్లర్లు చెలరేగి బ్రిటీష్ వారు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా హింస జరిగింది. ప్రజలు ఇంకా సత్యాగ్రహ స్ఫూర్తిని, అహింస ఆవశ్యతను, అందుకు అవసరమైన నిగ్రహాన్ని సాధించలేదంటూ ఉద్యమాన్ని వాయిదా వేశారు.[1]

సమస్య

[మార్చు]

బార్డోలీ ప్రాంతంలో పన్నులను 1922లో ప్రభుత్వం 22శాతం పెంచింది. తాలూకాలోని 22 గ్రామాలను అధిక ఆదాయ వర్గంలో చేర్చడంతో శిస్తు మరింత పెరిగింది. ఈ భారాన్ని కొందరు ప్రభుత్వాధికారులే వ్యతిరేకించినా, రైతులు తాము కట్టలేమన్నా బొంబాయి ప్రెసిడెన్సీకి నాటి రెవెన్యూ కమిషనర్ ఆండర్సన్ గట్టి సంకల్పం కలవాడు కావడంతో తగ్గించలేదు.

మూలాలు

[మార్చు]
  1. గాంధీ, రాజ్ మోహన్ (మే 2016). "అనుచరుడు". వల్లభ్ భాయ్ పటేల్ జీవిత కథ (in తెలుగు (అనువాదం)). హైదరాబాద్: ఎమెస్కో బుక్స్.{{cite book}}: CS1 maint: unrecognized language (link)