గోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?గోవా
 • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°29′35″N 73°49′05″E / 15.493°N 73.818°E / 15.493; 73.818Coordinates: 15°29′35″N 73°49′05″E / 15.493°N 73.818°E / 15.493; 73.818
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 3,702 కి.మీ² (1,429 sq mi)
రాజధాని పనజి
పెద్ద నగరం వాస్కోడిగామా
జిల్లా(లు) 2
జనాభా
జనసాంద్రత
14,00,000 (25th)
• 363/కి.మీ² (940/చ.మై)
భాష(లు) కొంకణిಕನ್ನಡ,
గవర్నరు ఎస్.సి.జమీర్
ముఖ్యమంత్రి లక్ష్మికాంత్ పర్సెకర్
Established 1987-05-30
Legislature (seats) ఒకే సభ (40)
ISO abbreviation IN-GA
వెబ్‌సైటు: goagovt.nic.in
"↑"కొంకణి ఏకైక అధికారిక భాష కానీ మరాఠీని అధికారికావసరాలకు వాడుకోగలెగే సౌలభ్యం కల్పించారు.[1].
Seal of గోవా
Seal of గోవా

గోవా (गोवा, Goa ) భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం[2]. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి[3].

గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది.[4][5]

చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.

గోవా పేరు[మార్చు]

గోవా లేదా గోమాంటక్ అని పిలిచే ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పషష్టమైన ఆధారాలు లేవు. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంథాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.[6]

చరిత్ర[మార్చు]

గోవాలో హిందూ దేవాలయాలు రంగులు విరబోసుకొని ఉంటాయి. స్థానిక సాంప్రదాయిక నిర్మాణ శైలి వీటిలో కనిపిస్తుంది
అందమైన సముద్ర తీరాలకు గోవా ప్రసిద్ధం

గోవా ప్రాంతాన్ని చరిత్రలో మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హార వంశస్తులు, దక్కన్ నవాబులు పాలించారు. 1312 లో ఇది ఢిల్లీ సుల్తానుల వశమైనది. 1370లో విజయనగరరాజు మొదటి హరిహర రాయలు గోవాను జయించాడు. 1469లో బహమనీ సుల్తానులు దీనిని కైవసం చేసుకొన్నారు. అనంతరం బీజాపూర్ నవాబు ఆదిల్‌షా తన రెండవ రాజధానిగా చేసుకొన్నాడు.[7][8]

1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కో డ గామా కేరళలో కోజికోడ్లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ (Afonso de Albuquerque) అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం.

ఉత్తర గోవాలో అగూడా కోట(Fort Aguada) శిథిలాలు. ఫోర్చుగీసువారు తమ రక్షణ కోసం నిర్మించిన స్థావరాలలో ఒకటి.

1560-1812 మధ్య గోవా ఇంక్విజిషన్ క్రింద స్థానికులు బలవంతంగా క్రైస్తవ మతానికి మార్చబడ్డారు. ఈ నిర్బంధంనుండి తప్పుకోవడానికి వేలాదిగా ప్రజలు ఇరుగుపొరుగు ప్రాంతాలకు తరలిపోయారు. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు.[9]

1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. ప్రపంచ సంస్థలు భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.[5]

భౌగోళికం, వాతావరణం[మార్చు]

గోవాకు పొడవైన సముద్ర తీరం ఉంది. అక్కడి బీచిలు అందమైనవి.

పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉంది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి.

గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు[10].

ఉష్ణవాతావరణ మండలంలో, అరేబియా సముద్రతీరాన ఉన్నందున గోవా వాతావరణం వేడిగాను, తేమగాను ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు వెళతాయి. వర్షాకాలం (జూన్ - సెప్టెంబరు) పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. డిసెంబరు - ఫిబ్రవరి కాలం చలికాలం. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు సెంటీగ్రేడు వరకు జారుతుంది.

ఆర్ధిక రంగం[మార్చు]

ఓడలపై రవాణా గోవాలో ఒక ముఖ్యమైన జీవనోపాధి.
చపోరా నదిపై చేపలు పట్టడం

ప్రజల తలసరి సగటు ఆదాయం తక్కిన భారతదేశంలో కంటే గోవాలో ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గోవా ఆర్థికరంగం వృద్ధికూడా 1990-2000 కాలంలో 8.23% సాదింపబడింది. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంతంలో యాత్రికులు ఎక్కువ[11].

లోపలి భాగంలో మంచి ఖనిజ సంపద ఉంది. ముడి ఇనుము, బాక్సైటు, మాంగనీసు, సిలికా వంటి ఖనుజాలు బాగా లభిస్తున్నాయి.

వ్యవసాయం కూడా చాలామందికి జీవనోపాధి. వరి, జీడిమామిడి, పోక, కొబ్బరి ప్రధానమైన వ్యవసాయోత్పత్తులు. చాల మందికి వ్యవసాయం రెండవ ఆదాయపు వనరుగా ఉంటున్నది. 40 వేలవరకూ జనాభా మత్స్య పరిశ్రమ ఆధారంగా జీవిస్తున్నారు.

పురుగు మందులు, ఎరువులు, టైరులు, ట్యూబులు, చెప్పులు, రసాయనములు, మందులు వంటి మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఇంకా చేపలు, జీడిమామిడి, కొబ్బరి వంటి ఉత్పత్తులపై ఆధారపడిన వ్యసాయిక పరిశ్రమలున్నాయి. ఆల్కహాలుపై తక్కువ పన్ను ఉన్నందున గోవాలో మద్యం ఖరీదు తక్కువ.

విదేశాలలో పనిచేసే కార్మికులు స్వదేశంలో తమ కుటుంబాలకు పంపే ధనం కూడా గోవా ఆదాయంలో ముఖ్యమైనది.

ప్రభుత్వం, రాజకీయాలు[మార్చు]

మండవి నది ఎడమ ఒడ్డున ఉన్న పనజి లేదా పంజిమ్‌లో గోవా అధికార కార్యాలయాలున్నాయ. మాండవి నది అవతలి ఒడ్డున ఉన్న పోర్వీరిమ్లో గోవా శాసన సభ ఉంది. న్యాయ విషయాలకొస్తే గోవా ముంబై, (బొంబాయి) హైకోర్టు పరిధిలోకి వస్తుంది. పనజిలో ఒక హైకోర్టు బెంచి ఉంది. జాతీయ స్థాయి పార్లమెంటులో గోవానుండి రెండు లోక్‌సభ స్థానాలు, ఒకరాజ్యసభ స్థానము ఉన్నాయి. గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. అన్ని రాష్ట్రాలలాగానే గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసన సభ్యులుతో కూడిన పాలనా వ్యవస్థ ఉంది.

1990 వరకు నిలకడగా ఉన్న గోవా ప్రభుత్వాలు తరువాత వడివడిగా మారడం మొదలయ్యింది. 1990-2005 మధ్యకాలంలో 15 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారాయి [12].

గోవాలో ముఖ్యమైన రాజకీయ పార్టీలు:

మిగిలిన రాష్ట్రాలలో బ్రిటిష్ పద్ధతిలో మతం ప్రకారం పౌర చట్టాలు(civil laws) అమలులో ఉన్నాయి. కాని గోవాలో పోర్చుగీసు వారి పద్ధతి ప్రకారం యూనిఫాం సివిల్ కోడ్ అమలులో ఉంది.

ముఖ్యమంత్రులు[మార్చు]

రాష్ట్ర గణాంకాలు[మార్చు]

 1. అవతరణము. 1977 మే 30

వైశాల్యము.3,702 చ.కి.

 1. జనసంఖ్య. 1,457,723 స్త్రీలు. 717,912 పురుషులు. 740,711 నిష్పత్తి . 968. అక్షరాస్తత. స్త్రీలు. 87.40 పురుషులు.92.81
 2. జిల్లాల సంఖ్య. 2
 3. గ్రామాలు. 359 పట్టణాలు.44
 4. ప్రధాన భాష. కొంకణి, మరాఠి ప్రధాన మతం. హిందు. క్రీస్తు.
 5. పార్లమెంటు సభ్యుల సంఖ్య, 3 శాసన సభ్యుల సంఖ్య.40
 6. మూలము. మనోరమ యీయర్ బుక్

జన విస్తరణ[మార్చు]

గోవాలో హిందూ దేవాలయాలు రంగులు విరబోసుకొని ఉంటాయి. స్థానిక సాంప్రదాయిక నిర్మాణ శైలి వీటిలో కనిపిస్తుంది

గోవా నివాసిని ఆంగ్లంలో గోవన్ అని, కొంకణిలో గోయెంకర్ అని, మరాఠీలో గోవేకర్ అని, పోర్చుగీసు భాషలో మగవారిని గోయెస్ Goês అని, ఆడువారిని గోయెసా Goesa అని అంటారు.

ఇప్పుడు గోవా జనాభా 13,47,668 - ఇందులో 6,87,248 మంది పురుషులు మరియు 6,60,420 స్త్రీలు. మిగిలిన వివరాలు

 • చదరపు కిలోమీటరుకు జనాభా: 364
 • పట్టణ జనాభా: 49.8%
 • ఆడు, మగ నిష్పత్తి 960 స్త్రీలు: 1000 పురుషులు
 • అక్షరాస్యత: 82.0 % (పురుషులు 88.4%, స్త్రీలు 75.4%) [13]
 • హిందువులు 65%, కాథలిక్కులు 30%[14],
 • ముఖ్య నగరాలు: వాస్కో డ గామా, మడగావ్, మార్మగోవా, పంజిమ్, మపుసా
 • ప్రధాన భాషలు: కొంకణి, మరాఠీ, (ఇండియన్) ఇంగ్లీష్, హింది. (పోర్చుగీసు భాష వాడకం క్రమంగా క్షీణిస్తున్నది). అధికార భాషగా మరాఠీ, కొంకణి భాషలు కావాలనుకొనే వారి మధ్య బలమైన స్పర్ధ ఉంది.

జిల్లాలు[మార్చు]

గోవా తాలూకాలు. ఉత్తర, దక్షిణ గోవాల తాలూకాలు వేర్వేరు రంగులలో చూపబడ్డాయి.

గోవాను రెండు జిల్లాలుగా విభాజించారు.

ఈ రెండు జిల్లాలను మొత్తం 11 తాలూకాలుగా విభజించారు. ఉత్తర గోవాలో బార్డేజ్, బికోలిం, పెర్నెం, పోండ, సతారి మరియు తిస్వాది తాలూకాలు ఉంటే దక్షిణ గోవాలో కనకోన, మోర్ముగోవ, క్వేపెం, సాల్సెటె, మరియు సాంగ్వెం.

రవాణా సౌకర్యాలు[మార్చు]

ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు గోవాలో ప్రధానమైన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలోను, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోను బస్సులు నడుపుతుంది. కాని ఎక్కువ మంది ప్రయాణాలకు తమ స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ.

ఇంకా టాక్సీలు, ఆటో రిక్షాలు ప్రజల ప్రయాణాలకు అద్దెకు దొరికే వాహనాలు. మోటారు సైకిలు టాక్సీ అనేది గోవాకు ప్రత్యేకమైన అద్దె టాక్సీ - ఇవి పసుపు, నలుపు రంగుల్లో ఉండే మోటారు సైకిళ్ళు. వీటిని నడిపేవారిని "పైలట్లు" అంటారు. ప్రయాణీకుడు వెనుక సీటులో కూర్చుంటాడు. ఇవ్వాల్సిన కిరాయి ముందుగానే బేరమాడుకుంటారు.

కొన్ని చోట్ల నదులు దాటడానికి ఫెర్రీలు వాడతారు. గోవాలో రెండు రైల్వే లైనులున్నాయి - ఒకటి స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన వాస్కో డ గామా - హుబ్లీ మార్గం. మరొకటి 1990 దశకంలో నిర్మించిన కొంకణ్ రైల్వే మార్గం.

ఎక్కువగా మిలిటరీ అవసరాలకు వాడే దబోలిమ్ ఎయిర్‌పోర్టు మాత్రమే గోవాలో ఉన్న ఎయిర్‌పోర్టు. మార్ముగోవా నౌకాశ్రయం ఎక్కువగా గోవాలో లభించే ఖనిజ సంపద రవాణాకు ఉపయోగపడుతుంది. పనజి పోర్టునుండి ముంబైకి ప్రయాణీకులను చేరవేసే స్టీమర్లు బయలుదేరతాయి.

సంస్కృతి[మార్చు]

గోవా సాంప్రదాయిక నిర్మాణానికి ఒక ఉదాహరణ

గణేష్ చతుర్ధి, క్రిస్టమస్, ఆంగ్ల సంవత్సరాది, షిగ్మో పండుగ, గోవా కార్నివాల్ (కార్నివాల్ అంటే తిరనాళ్లు) - ఇవి గోవాలో పెద్ద ఎత్తున జరుపుకొనే ఉత్సవాలు.

సాంప్రదాయిక కొంకణి జానపద గీతాలు, సాంప్రదాయిక "మందో" సంగీతం, పాశ్చాత్య సంగీతం, గోవా ట్రాన్స్ సంగీతం (గోవా ట్రాన్స్ సంగీతం) - వీటన్నింటికీ గోవాలో మంచి ప్రజాదరణ ఉంది.

వరి అన్నము, చేపల కూరా - ఇవి గోవా వాసుల ప్రధాన దైనిక ఆహారము. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారుచేసే ఎన్నో రుచికరమైన వంటలు గోవా ప్రత్యేకం. జీడి మామిడి పండునుంచి, కొబ్బరి కల్లునుంచి తయారు చేసే ఫెని అనే మద్యం గోవాలో అత్యంత సామాన్యం.

గోవాలో రెండు ప్రపంచ వారసత్వ స్థలాలు (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) ఉన్నాయి. బామ్ జీసస్ బసిలికా (Bom Jesus Basilica). ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహమును భద్ర పరచారు. ప్రతి పదేళ్ళకూ ఒకసారి ఈ శరీరాన్ని పూజకై వెలికి తీసి ప్రజలు చూసేందుకు అనుమతిస్తారు. 2004లో ఈ కార్యక్రమం జరిగింది.

భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలు గోవాలో మరొక ఆకర్షణ. కాని ఇవి ప్రస్తుతం చాలావరకు శిథిలమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. పాంజిమ్‌లోని ఫౌంటెన్‌హాస్ (Fontainhas) అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తింపబడింది. గోవా జీవనాన్నీ, నిర్మాణాలనూ ప్రతిబింబించే పేట అని దీనిని చెప్పవచ్చును. కొన్ని హిందూ దేవాలయాలలో (ఉదాహరణ - మంగ్వేషి మందిరం) కూడా ఈ శైలి కనిపిస్తుంది.

క్రీడా రంగం[మార్చు]

గోవాలో ఫుట్‌బాల్ బాగా జనాదరణ ఉన్న ఆట. మైదానాల్లోనూ, పొలాల్లోనూ వర్షాలు లేనపుడు ఫుట్‌బాల్ ఆట బాగా ఆడుతారు. గోవాలో చాలా ఫుట్‌బాల్ క్లబ్బులున్నాయి. ఇటీవలి కాలంలో క్రికెట్ పట్ల జనాకర్షణ బాగా పెరుగుతున్నది. మార్‌గావ్ లోని 'ఫటోరా స్టేడియమ్' ఈ ఆటల పోటీలకు ఉన్న మంచి వసతి. హాకీ మూడవ ప్రజాదరణ గల ఆట.

వృక్ష సంపద[మార్చు]

చపోరా నది ఒడ్డున సలీంఆలీ రక్షిత పక్షి ఆవాసం (Salim Ali Bird sanctuary)

గోవాలోని 1,424 చ.కి.మీ. అరణ్యంలో ఎక్కువ భాగం ప్రభుత్వాధీనంలో ఉన్నది[11]. ముఖ్యంగా పడమటి కనుమలలోని వనాలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ ప్రాంతపు అరణ్యాలలాగానే వివిధ వృక్ష, జంతు జాలానికి ఆవాసమైన ఉష్ణమండలపు వనాలు. వెదురు, మరాఠా బార్క్స్s, chillar barks and the bhirand వంటి వన్యోత్పత్తులు ఈ అడవులలో లభిస్తాయి.

గోవా అంతటా కొబ్బరి చెట్లు, తోటలు సర్వ సాధారణం. ఇంకా జీడి మామిడి, టేకు, మామిడి, పనస, పైనాపిల్, నేరేడు వంటి చెట్లుకూడా అడవులలో గాని, తోటలలో గాని బాగా ఉన్నాయి.

గోవా అడవులలో నక్కలు, అడవి పందులు, వలస పక్షులు, కింగ్ఫిషర్ పక్షులు, మైనాలు, చిలుకలు వంటి జంతు సంపద ఎక్కువ. వివిధ రకాలైన చేపలు, సరోవర జీవులు, సముద్ర జీవులు ఉన్నాయి. గోవాలో పాములు కూడా ఎక్కువే. ఇవి ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచుతాయి.

గోవాలో పెక్కు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని

వార్తా సాధనాలు[మార్చు]

అన్ని ప్రాంతాలలాగానే ఆల్ ఇండియా రేడియో సర్వీసు, ప్రధాన టెలివిజన్ సర్వీసులు ఉన్నాయి. అన్ని ముఖ్యమైన మొబైల్ సెల్‌ఫోను సర్వీసులు ఉన్నాయి.

ముఖ్యమైన వార్తా పత్రికలు: ఆంగ్లంలో హెరాల్డ్ (ఇది గోవాలో బాగా పాత పత్రిక. 1983 వరకు ఓ హెరాల్డో అనే పోర్చుగీసు పత్రిక) ), గోమంతక్ టైమ్స్, నవహింద్ టైమ్స్. ఇవి కాక జాతీయ వార్తా పత్రికలు చదువుతారు.

విద్యా రంగం[మార్చు]

ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యా సదుపాయాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో ఎక్కువగా మరాఠీ, కొంకణి మాధ్యమాలున్నాయి. దేశమంతటావలెనే ఇంగ్లీషు మీడియం చదువుకు జనాదరణ పెరుగుతున్నది.

ఉన్నత విద్యకు కాలేజీలున్నాయి. గోవా విశ్వ విద్యాలయం అనేది గోవాలో ఒకే ఒక విశ్వ విద్యాలయం. రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజి ఉన్నాయి. మెరైన్ ఇంజినీరింగ్, హోటల్ మానేజిమెంట్, టూరిజమ్ వంటి కోర్సులకు గోవా ప్రసిద్ధం.

కొన్ని స్కూళ్ళలో పోర్చుగీసు భాష మూడవ భాషగా బోధిస్తారు.

మూలాలు[మార్చు]

 1. గోవా, డామన్ మరియు డయ్యూ అధికారిక భాషా చట్టం, 1987 వలన కొంకణి ఏకైక అధికారిక భాష అవితుంది, కానీ మరాఠీని మాత్రం అధికారికావసరాలకు వాడుకోగలిగే సౌలభ్యం కల్పించారు. ప్రభుత్వం కూడా మరాఠీలో వచ్చిన ఉత్తరాలకు మరాఠీలోనే సమాధానం ఇస్తాయి. Commissioner Linguistic Minorities. "42nd report: July 2003 - June 2004". Retrieved 2007-06-06. Cite web requires |website= (help) అయితే, మే 2007 నుండి మరాఠీని కూడా అధికారిక భాషగా గుర్తించాలని పలువురు కోరారు, అయినా కొంకణీ ఏకైక అధికారిక భాషగా మిగిలింది. UNI (May 30, 2007). "Marathi vs Konkani debate continues in Goa". Retrieved 2007-06-06. Cite web requires |website= (help)
 2. భారతదేశం రాష్ట్రాల వివరాలు స్టాటైడ్స్ నుండి డిసెంబర్ 5 2006న సేకరించబడినది. దీని ప్రకారం గోవా వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం
 3. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ రాష్ట్రాలలో గోవా నాలుగవ అతిచిన్న రాష్ట్రం.
 4. గోవా ప్రభుత్వ పాలిటెక్నిక్ కలాశాలలో గోవా స్వాతంత్ర్యం గురించి
 5. 5.0 5.1 గోవా స్వాతంత్ర్యం పొందిన విధానం వివరిస్తున్న భారత్-రక్షక్‌లోని ఒక వ్యాసం.
 6. గోవా చరిత్ర వివరిస్తున్న గోవా పర్యాటకశాఖ సైటు.
 7. గోవాలో హిందూరాజుల పరిపాలన గురించి
 8. గోవాలో ముస్లిముల దండయాత్రలు, విజనరగర రాజుల పరిపాలన.
 9. పోర్చుగీసు వశమైన గోవా
 10. The Goa that you may not know, Dr. Nandkumar Kamat, Colaco.net, జులై 6, 2007న సేకరించారు.
 11. 11.0 11.1 గోయెంకార్.కాం వెబ్‌సైటు నుండి, Economy of Goa, ¹ భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు, ² ప్రభుత్వాధీనంలోని అరణ్యం సుమారుగా 1224.38 చ.కి.మీ, పైవేటు వ్యక్తుల చేతులలో 200చ.కి.మీ ఉంది. సందర్శించిన తేదీ: ఏప్రిల్ 2, 2005.
 12. హిందూ పత్రికలో జనవరి 31, 2005 పరికార్ ప్రభుత్వంపై, అనీల్ శాస్త్రి రాసిన కథనం, సేకరించిన తేదీ: జులై 6, 2007.
 13. Manorama YearBook 2007 — pg 614 – ISBN 0542-5778
 14. గోవా పర్యాటక శాఖ వెబ్‌సైటులో గోవా ప్రజల గురించి సమాచారం, పరిశీలించిన తేదీ: జులై 6, 2007.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గోవా&oldid=2756251" నుండి వెలికితీశారు