జార్ఖండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఝార్ఖండ్
Map of India with the location of ఝార్ఖండ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
రాంచి
 - 23°25′N 85°20′E / 23.42°N 85.33°E / 23.42; 85.33
పెద్ద నగరం రాంచి
జనాభా (2001)
 - జనసాంద్రత
26,909,428 (13th)
 - 274/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
79,700 చ.కి.మీ (15th)
 - 22
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఝార్ఖండ్ |గవర్నరు
 - [[ఝార్ఖండ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
2000-11-15
 - ఎం.ఓ.హెచ్.ఫరూక్
 - అర్జున్ ముండా
 - ఒకే సభ (81)
అధికార బాష (లు) సంతాలి
పొడిపదం (ISO) IN-JH
వెబ్‌సైటు: www.jharkhand.gov.in

జార్ఖండ్ (ఝార్ఖండ్) (Jharkhand), భారతదేశంలో ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒడిషా రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్ ‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు.

2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ఝార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు.[1] చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది.

దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున ఝార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం అని చాలాసార్లు ఝార్ఖండ్ ను ప్రస్తావించారు.

చరిత్ర[మార్చు]

బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు (1928లో ఒలింపిక్ జట్టుకు కెప్టెన్, స్వర్ణపతక విజేత కూడాను[1]) ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న భారత పార్లమెంటులో "బీహారు పునర్వవస్థీకరణ బిల్లు" (Bihar Reorganization Bill) ఆమోదించబడింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం.

కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా ఝార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. మగధ సామ్రాజ్యంకాలం నుంచీ ఉంది. 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన "రాజా జైసింగ్" తనను ఝార్ఖండ్ రాజుగా ప్రకటించుకొన్నాడు. ముఘల్ సామ్రాజ్యంకాలంలో ఝార్ఖండ్‌ను "కుకర"ప్రాంతమనేవారు. బ్రిటిష్ పాలన సమయంలో ఎత్తుపల్లాల కొండలు, అడవులు, దిబ్బలతో నిండినందున ఝార్ఖండ్ అనే పేరు ఈ ప్రాంతానికి పరిపాటి అయ్యింది. ("ఝరీ" - అంటే పొద). చోటానాగపూర్ పీఠభూమి, సంథాల్ పరగణాలలో విస్తరించి ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము.

స్వాతంత్ర్యపోరాటంలో ఝార్ఖండ్ పాత్ర[మార్చు]

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దౌర్జన్యాలతో వేసారిన ఝార్ఖండ్ ఆదివాసుల తిరుగుబాటు 1857నాటి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంకంటే నూరేళ్ల ముందే ప్రారంభమైనది.

  • 1772-1780 పహారియా తిరుగుబాటు
  • 1780-1785 తిల్కా మంజీ నాయకత్వంలో తిరగబడిన ఆదివాసులు బ్రిటిష్ సైనికాధికారిని గాయపరచారు. 1785లో భగల్పూర్‌లో తిల్కా మంజీని ఉరితీశారు.
  • 1795-1800 తమర్ తిరుగుబాటు
  • 1795-1800 విష్ణు మనాకి నాయకత్వంలో "ముండా"ల తిరుగుబాటు.
  • 1800-1802 తామర్‌కు చెందిన దుఖాన్ మనాకి నాయకత్వంలో ముండాల తిరుగుబాటు.
  • 1819-1820 భుకన్ సింగ్ నాయకత్వంలో ముండాల తిరుగుబాటు
  • 1832-1833 భగీరధ్, దుబాయ్ గోసాయి, పటేల్ సింగ్‌ల నాయకత్వంలో ఖేవార్ తిరుగుబాటు.
  • 1833-1834 బీర్‌భమ్ కు చెందిన గంగా నారాయణ్ నాయకత్వంలో భూమ్జీ తిరుగుబాటు
  • 1855 లార్డ్ కారన్‌వాలిస్ రాచరిక పద్ధతులపై సంథాల్‌ల యుద్ధం
  • 1855-1860 బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పాలన సాగంచడానికి, పన్నులు వసూలు చేయడానికి, పోరాటానికి సిద్ధూ 10వేల సంథాల్‌లను కూడగట్టాడు. సిద్ధూను, అతని సోదరుడు కన్హూను పట్టుకొటే 10వేల బహుమానం అని బ్రిటిష్‌వారు ప్రకటించారు.
  • 1856-1857 మార్టియర్ షహీద్ లాల్, విశ్వనాధ సహదేవ్, షేక్ భిఖారి, గణపతిరాయ్, బుద్ధువీర్‌- అనే యోధులు 1857లోని మొదటి స్వాతంత్ర్య యుద్ధం, లేదా సిపాయి తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌వ్యతిరేక ఉద్యమాన్ని నడపారు.
  • 1874 భగీరథి మంజీ నాయకత్వంలో ఖేర్వార్ ఉద్యమం
  • 1895-1900 బిర్సా ముండా (జననం: 1875 నవంబరు 15) అనే యువకుని నాయకత్వంలో ఉద్యమం. తరువాత బిర్సాముండా రాంచీ జైలులో కలరా వ్యాధితో (1900 జూన్ 9) మరణించాడు.
  • బ్రిటిష్ పాలకులు పెద్దయెత్తున సైన్యాలను మొహరించి ఈ ఉద్యమాలనన్నిటినీ తీవ్రమైన దౌర్జన్యాలతో అణచివేశారు.
  • 1914- 26000 ఆదవాసీలు పాల్గొన్న తానా భగత్ ఉద్యమం. ఇది క్రమంగా మహాత్మా గాంధీ నాయకత్వంలోని సత్యాగ్రహోద్యమంలో విలీనమైంది.

భౌగోళికం, వాతావరణం[మార్చు]

రాష్ట్రంలో అధికభాగం ఛోటానాగపూరు పీఠభూమిలో ఉంది. కోయల్, దామోదర్, బ్రహ్మణి, ఖర్కాయ్, సువర్ణ రేఖ వంటి నదులకు ఇది జన్మస్థానం. రాష్ట్రంలో చాలా భాగం అటవీమయం. పులులు, ఏనుగులకు కొన్ని చోట్లు ఆవాసం.

ఎక్కువగా రాళ్ళు అరిగినందువల్ల ఏర్పడిన నేల. రాష్ట్రంలో ఉన్న నేలల రకాలు:

  1. ఎర్ర మట్టి నేల- దామోదర్ లోయ, రాజమహల్ ప్రాంతాలలో
  2. మైకేషియస్ నేల (Micacious soil - మైకా ఖనిజ రేణువులతో కూడిన నేల) - కోడెర్మా, ఝూమెరితిలైయా, బర్కాగావ్, మందర్ కొండలు ప్రాంతాలలో
  3. ఇసుక నేల - హజారిభాగ్, ధనబాద్ ప్రాంతాలలో
  4. నల్ల నేల - రాజమహల్ ప్రాంతం
  5. లేటరైట్ నేల (Laterite soil) -, పశ్చిమ రాంచీ, పలమూ, సంథాల్ పరగణాలు, సింగ్‌భమ్ ప్రాంతాలలో

వృక్ష, జంతు సంపద[మార్చు]

ఝార్ఖండ్ లో వైవిధ్యంగల వృక్ష సంపద, జంతుసంపద పుష్కలంగా ఉంది. చాలా జాతీయోద్యానవనాలు, జంతు ప్రదర్శన శాలలు ఉన్నాయి.

  • బెల్టా నేడనల్ పార్క్ - పలము - డాల్టన్‌గంజ్‌నుండి 25 కి.మీ.- వైశాల్యం 250 చ.కి.మీ. - పులులు, ఏనుగులు, "గౌర్" అనబడే అడవిదున్నలు (bison), సాంభార్‌లు (దుప్పి), అడవిపందులు, 15-20 అడుగుల పొడవుండే కొండచిలువలు, చుక్కల లేళ్ళు, చిరుతపులులు, కుందేళ్ళు, నక్కలు, లంగూర్లు, రీసెస్ కోతులు, నీలీగాయ్ లు, అడవి దున్నలు, ముళ్లపందులు, కుందేల్లు, అడవి పిల్లులు, తేనెకొక్కులు, తోడేళ్లు, మలబార్ రాక్షస ఉడుతలు, ముంగిస తోడేళ్ళు, దుప్పులు. 1974లో ఈ పార్కును "ప్రాజెక్ట్ టైగర్" రిజర్వు అడవిగా ప్రకటించారు.
ఝార్ఖండ్ వన్యసంపద ఎంత సంపన్నమైనదో తెలుసు కోవడానికి ఒక ఉదాహరణ: పలములోని ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులో ఒక్కో జాతికి ఎన్నిరకాలున్నాయో గమనించవలసింది - [2] -
క్షీరదాలు (39 రకాలు), పాములు (8వ రకాలు), తొండలు (4 రకాలు), చేపలు (6 రకాలు), కీటకాలు (21 రకాలు), పక్షులు (170 రకాలు), విత్తనపు మొక్కలు (97 రకాలు) , పొదలు (46 రకాలు), తీగెలు, పరాధీనమొక్కలు Climbers, పరాన్నజీవ మొక్కలు & అర్ధపరాన్నజీవులు (25 రకాలు), గడ్డి-వెదురులు (17 రకాలు).
  • హజారీబాగ్ వన్యప్రాణి అభయారణ్యము - రాంచీనుండి 135 కి.మీ. ఇదికూడా బెల్టా నేషనల్ పార్క్ వంటి పర్యావరణ వ్యవస్థలోనే ఉంది.
  • రాంచీ నుండి 16 కి.మీ.లో మరొక జంతు ప్రదర్శన శాల.

జనవిస్తరణ[మార్చు]

ఝార్ఖండ్ జనాభా 2కోట్ల 69 లక్షలు. మగవారు 1కోటి 39 లక్షలు. ఆడువారు 1కోటి 30 లక్షలు. (ఆడ:మగ నిష్పత్తి 941:1000) జనాభాలో 28% ఆదివాసీలు, 12% షెడ్యూల్డ్ కులాలవారు. 60% ఇతరులు. ప్రతి చదరపు కి.మీ.కు 274మంది జనాభా. (గుమ్లా జిల్లా జన సాంద్రత 148, ధన్‌బాద్ జిల్లా జనసాంద్రత: 1167)

ఎంతోకాలం నుండి చాలామంది ఆదివాసులకు ఝార్ఖండ్ ఆవాసంగా ఉంటూ వచ్చింది. కొన్ని జిల్లాలలో ఆదివాసుల జనాభా మెజారిటీగా ఉంది. మొత్తం ఝార్ఖండ్‌లో 32 ప్రధాన ఆదివాసి తెగలున్నాయి. అవి అసుర్, బైగా, బంజారా, బతుడీ, బెడియా, బింఝియా, బిర్‌హోర్, బిర్జియా, చెరో, చిక్-బరైక్, గోడ్, గొరైత్, హో, కర్మాలి, ఖర్వార్, ఖోండ్, కిసన్, కొరా, కోర్వా, లోహ్రా, మహిలి, మల్-పహారియా, ముండా, ఒరావొన్, పర్హైయా, సంతల్, సౌరియా-పహారియా, సవర్, భుమిజ్, కోల్, కన్వర్ తెగలు.

ఇంకా ఇక్కడి ఖనిజ సంపదల వల్లా, భారీ పరిశ్రమల వల్లా లభించే అవకాశాల కారణంగా చాలామంది బీహారు, బెంగాలు వగటి పొరుగు రాష్ట్రాలవారు (ఇంతకు ముందు బీహారు పొరుగు రాష్ట్రం కాదు. ఝార్ఖండ్ బీహారులో భాగం) ఇక్కడ. ముఖ్యంగా ధన్‌బాద్, జంషెడ్‌పూర్, రాంచీ వంటి పారిశ్రామిక నగరాలలో - స్థిరపడ్డారు.

హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం - ఇవి ఝార్ఖండ్‌లో ప్రధానమైన మతాలు.

ఆర్థిక రంగం[మార్చు]

పేద ప్రజలున్న ధనికరాష్ట్రమని ఝార్ఖండ్‌ను వర్ణింపవచ్చును. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడి జంషెడ్‌పూర్, ధన్‌బాద్, బొకారోలలో ఉన్నాయి.

  • దేశంలో మొదటి ఇనుము-ఉక్కు కర్మాగారం జంషెడ్‌పూర్‌లో నిర్మించారు.
  • సింద్రీలో ఒకప్పటి భారతదేశపు అతిపెద్ద ఎరువుల కర్మాగారం (ఇప్పుడు మూతపడింది)
  • గోమియాలో అతిపెద్ద ప్రేలుడు పదార్ధాల కర్మాగారం
  • మొదటి మిథేన్ గ్యాస్ కర్మాగారం.

కాని చాలా వెనుకబడిన పల్లెలు, పట్టణాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. పట్టణ జనాభా 22.5%. సగటు తలసరి వార్షిక ఆదాయం $90 మాత్రమే

ఝార్ఖండ్ రాష్ట్రం ఖనిజసంపదకు పెట్టింది పేరు.

  • ఇనుము (దేశంలో మొదటి స్థానం)
  • బొగ్గు (దేశంలో 3వ స్థానం)
  • రాగి (దేశంలో మొదటి స్థానం)
  • మైకా (దేశంలో మొదటి స్థానం)
  • బాక్సైటు (దేశంలో 3వ స్థానం)
  • మాంగనీస్
  • సున్నపు రాయి
  • కైనైటు (దేశంలో మొదటి స్థానం)
  • క్రోమైటు (దేశంలో 2వ స్థానం)
  • ఆస్బెస్టాస్ (దేశంలో మొదటి స్థానం)
  • థోరియం (దేశంలో మొదటి స్థానం)
  • సిల్లిమనైటు
  • యురేనియం (దేశంలో మొదటి స్థానం) - జాదుగుడా గనులు, నర్వా పహార్
  • బంగారం (దేశంలో 6వ స్థానం) - రఖా గనులు
  • వెండి

ప్రభుత్వం[మార్చు]

ఝార్ఖండ్ పాలనా వ్యవస్థ దేశంలో అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు

రాజకీయాలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి 33, భారతీయ జనతా పార్టీ కూటమి 36, ఇండిపెండెట్లు 12 స్థానాలలో విజయం సాధించాయి. ఎవరికీ పూర్తి మెజారిటీ దక్కలేదు. శిబూసోరెన్ రెండుసార్లు, స్వతంత్ర అభ్యర్థి మధుకోడా రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగు సంవత్సరాలలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం మారింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉంది. 2009 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. 2010లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకు చెందిన అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

జిల్లాలు[మార్చు]

ఝార్ఖండ్‌ మొదట బీహారు రాష్ట్రంనుండి వేరుచేసి 18 జిల్లాలతో ఏర్పరచారు. తరువాత జిల్లాలను పునర్వ్యవస్థకరించి, మరో 4 జిల్లాలను ఏర్పరచారు. లాతెహార్, సరైకెలా ఖరస్వాన్, జమ్‌తారా, సాహెబ్‌గంజ్ అనేవి ఆ క్రొత్త జిల్లాలు. ఇప్పుడు మొత్తం 22 జిల్లాలున్నాయి.

ముందుగా ఉన్న18 జిల్లాల గణాంకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

ఝార్ఖండ్ జిల్లాలు[మార్చు]

వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 BO బొకారో బొకారో 20,61,918 2,861 716
2 CH చత్రా ఛత్రా 10,42,304 3,700 275
3 DE దేవ్‌ఘర్ దేవఘర్ 14,91,879 2,479 602
4 DH ధన్‌బాద్ ధన్‌బాద్ 26,82,662 2,075 1,284
5 DU దుమ్కా దుమ్కా 13,21,096 4,404 300
6 ES తూర్పు సింగ్‌భుం జంషెడ్‌పూర్ 22,91,032 3,533 648
7 GA గఢ్వా గఢ్వా 13,22,387 4,064 327
8 GI గిరిడి గిరిడి 24,45,203 4,887 497
9 GO గొడ్డా గొడ్డా 13,11,382 2,110 622
10 GU గుమ్లా గుమ్లా 10,25,656 5327 193
11 HA హజారీబాగ్ హజారీబాగ్ 17,34,005 4,302 403
12 JA జాంతాడా జమ్తాడా 7,90,207 1,802 439
13 KH ఖుంటీ ఖుంటీ 5,30,299 2,467 215
14 KO కోడెర్మా కోడర్మా 7,17,169 1,312 427
15 LA లాతేహార్ లాతేహార్ 7,25,673 3,630 200
16 LO లోహార్‌దాగా లోహార్‌దాగా 4,61,738 1,494 310
17 PK పాకూర్ పాకూర్ 8,99,200 1,805 498
18 PL పాలము డాల్టన్‌గంజ్ 19,36,319 5,082 381
19 RM రాం‌గఢ్ రాంగఢ్ 9,49,159 1,212 684
20 RA రాంచీ రాంచీ 29,12,022 7,974 557
21 SA సాహిబ్‌గంజ్ సాహెబ్‌గంజ్ 11,50,038 1,599 719
22 SK సరాయికేలా ఖర్సావా సరాయికేలా 10,63,458 2,725 390
23 SI సిమ్‌డేగా సిమ్‌డేగా 5,99,813 3,750 160
24 WS పశ్చిం సింగ్‌భుం చైబాసా 15,01,619 7,186 209

జిల్లాల భౌగోళిక చిత్రపటం

భాష, సాహత్యం, సంస్కృతి[మార్చు]

మూడు ప్రధాన భాషా కుటుంబాలకు చెందిన భాషలు, యాసలు ఝార్ఖండ్‌లో మాట్లాడుతారు.

సామాజిక వ్యవస్థ[మార్చు]

ఆరోగ్యం

ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంవల్ల 1918లోనే రాంచిలో ప్రత్యేక మానసిక అవసరాలున్నవారికోసం మానసిక వైద్యసదుపాయ కేంద్రాన్ని నిర్మించారు (for treatment of mentally challenged) – కేంద్రీయ మానసిక వైద్య సంస్థ [3]

కొన్ని ప్రాంతాలలో పేదరికం, ఆహారలోపం వల్ల క్షయ వ్యాధి ప్రబలంగా ఉంది. రామకృష్ణామఠం వంటి సేవా సంస్థలు 1948నుండి అటువంటి వారికి కొన్ని వైద్య సదుపాయాలు నిర్వహిస్తున్నాయి.[4]. కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం జంషెడ్‌పూర్‌లో టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉత్తమసేవలను అందిస్తున్నది. [5]

అయినా వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపరచవలసిన అవసరం చాలా ఉంది.

విద్య

ఝార్ఖండ్‌లో అక్షరాస్యత 54.13% (2001) . ఆడువారిలో అయితే 39.38% మాత్రమే. విద్యా సదుపాయాలు ఒకోచోట బాగాను, చాలాచోట్ల అధమంగానూ ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సంస్థలు మారుమూల ప్రాంతాలలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నాయి.

ఝార్ఖండ్‌లో 5 విశ్వ విద్యాలయాలున్నాయి

ఇతర ముఖ్యమైన విద్యా సంస్థలు

కాని చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యలకోసం ఇతరరాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తున్నది.

వార్తాసాధనాలు[మార్చు]

రాష్ట్ర రాజధాని రాంచీ నుండి వెలువడే హిందీ పత్రికలు రాంచీ ఎక్స్‌ప్రెస్[6], ప్రభాత్ ఖబర్[7] ముఖ్యమైన వార్తా పత్రికలు. పెద్ద నగరాలలో దేశ నలుమూలలనుండి ప్రధానమైన పత్రికలు - ముఖ్యంగా హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషలవి- లభిస్తాయి. దేశంలో అన్ని ప్రాంతాలవలెనే రేడియో, టెలివిజన్, టెలిఫోన్ సౌకర్యాలున్నాయి.

క్రీడలు[మార్చు]

ఝార్ఖండ్ రాష్ట్రములో హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఆదరణ ఉంది. భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు జైపాల్ సింగ్, ప్రస్తుతం హాకీ జట్టు సభ్యుడు విమల్ లక్రా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని ఈ రాష్ట్రం వారే.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటిలింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 29 June 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=జార్ఖండ్&oldid=3850802" నుండి వెలికితీశారు