బిర్సా ముండా
బిర్సా ముండా | |
|---|---|
బిర్సా ముండా, రాయ్ తీసిన ఛాయాచిత్రం | |
| జననం | 1875 నవంబరు 15 |
| మరణం | 1900 జూన్ 9 |
బిర్సా ముండా / బిర్సా భగవాన్ (1875 నవంబరు 15 – 1900 జూన్ 9)[2] భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897)లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించాడు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక గిరిజన నాయకుడు బిర్సా ముండా.[3]
బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైనది.
బాల్యం
[మార్చు]బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 నవంబరు 15, గురువారం రోజున జన్మించాడు.[4] అప్పట్లో ఆచరణలో ఉన్న ముండా ప్రజల ఆచారం ప్రకారం ఆయన పుట్టిన రోజును బట్టి పేరు పెట్టారు. జానపద గేయాలలో కూడా ఈయన జన్మస్థలం ఉలిహటు లేదా చల్కడ్ అన్న అయోమయం నెలకొన్నది. బిర్సా తండ్రి సుగణ ముండా జన్మస్థలం ఉలిహటు. ఉలిహటులో బిర్సా అన్న కొమ్టా ముండా నివసించి ఉండటం వల్ల, ఆయన ఇల్లు ఇంకా అక్కడ శిథిలావస్థలో ఉండటం వల్ల, ఈయన ఉలిహటులో జన్మించాడన్న వాదన ఉంది.
బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు,[5] బిర్సా ముండా చిన్నతనంలో పిన్ని ఇంట్లో ఉంటూ గొర్రెలు మేపుకొని వచ్చేవాడు. అతని తమ్ముడు, పస్నా ముండా, ఉలిహటును వదిలి కూలిపని కోసం బీర్బంకీ వద్ద ఉన్న కురుంబ్దాలో స్థిరపడ్డాడు. కురుంబ్దాలో, బిర్సా అన్న కొమ్టా, అక్క దస్కిర్ పుట్టారు. అక్కడి నుండి వారి కుటుంబం బంబాకు తరలి వెళ్ళింది. అక్కడే బిర్సా అక్క చంపా, బిర్సా పుట్టారు.
విద్యాభ్యాసం
[మార్చు]అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ దగ్గర్లోని సాల్గా అనే గ్రామంలోని పాఠశాలలో చేరాడు. తర్వాత బూర్జు మిషన్ స్కూలుకు మారాడు. అప్పుడే అతని కుటుంబం క్రైస్తవాన్ని స్వీకరించింది. అతని ప్రతిభను గమనించి పశ్చిమ సింగ్ భూం జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు స్కూలు యాజమాన్యం. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు.
ముండా తిరుగుబాటు నాయకత్వం
[మార్చు]1858-94 నాటి సర్దారీ ఉద్యమం బిర్సా ముండా తిరుగుబాటుకు ఆధారం, ఇది భూమిజ్-ముండా ముఖ్యనాయకుల నాయకత్వంలో పోరాడింది. బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల 1894లో సర్దారీ యుద్ధం విజయవంతం కాలేదు. ఆ తర్వాత గిరిజనులు బిర్సా ముండా తిరుగుబాటు దళంలో చేరారు.[6].
1894 అక్టోబరు 1న, బిర్సా ముండా ముండాలందరినీ సమీకరించి, బ్రిటిష్ వారి నుండి పన్ను మాఫీ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1895లో అతన్ని అరెస్టు చేసారు. హజారీబాగ్ సెంట్రల్ జైలులో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 1897, 1900 మధ్య ముండాలు, బ్రిటీష్ సైనికుల మధ్య యుద్ధాలు జరిగాయి.[7]. 1897 ఆగస్టులో, బిర్సా, అతని నాలుగు వందల మంది సైనికులు, బాణాలు, విల్లులతో ఆయుధాలు ధరించి, ఖుంటి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 1898 లో, ముండాలు టాంగా నది ఒడ్డున బ్రిటీష్ దళాలతో ఘర్షణ పడ్డారు. దీనిలో బ్రిటిష్ సైన్యం మొదట ఓడిపోయింది. కానీ తరువాత ఆ ప్రాంతంలోని అనేక మంది గిరిజన నాయకులను అరెస్టు చేశారు. చక్రధర్‌పూర్‌లోని జామ్‌కోపాయ్ అడవి నుండి 1900 ఫిబ్రవరి 3న బిర్సాను కూడా బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. 1900 జూన్ 9న బ్రిటిష్ వారిచే విషప్రయోగం జరిగిన తరువాత బిర్సా తుది శ్వాస విడిచాడు.

గుర్తింపు
[మార్చు]- బిర్సా ముండా గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. బిర్సా ముండా జయంతిని భారత ప్రభుత్వం జన జాతీయ గౌరవ్ దివస్ గా ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది.
- ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ పేరు 'బిర్సా ముండా చౌక్'గా ఇటివల మార్చబడింది[8]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "THE 'ULGULAAN' OF 'DHARATI ABA' Birsa Munda". cipra.in. 2009. the original నుండి 21 April 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 October 2012.
He was lodged in Ranchi jail, for trial along with his 482 followers where he died on 9 June 1900
- ↑ today, Team Ambedkarite (2019-11-15). "About Birsa Munda [ 1875-1900 ] Biography & Life History". The Ambedkarite Today - The Voice Of Voiceless (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-30.
- ↑ K S Singh, Birsa Munda and His Movement 1872-1901, 1983, 2002, Seagull Publication
- ↑ "ఈనాడు - విపుల". vipula.eenadu.net. the original నుండి 2020-06-04 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-08.
- ↑ Birsa Mumda commemorative postage stamp and biography India Post, 15 November 1988.
- ↑ today, Team Ambedkarite (2019-11-15). "About Birsa Munda [ 1875-1900 ] Biography & Life History". The Ambedkarite Today - The Voice Of Voiceless (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-30.
- ↑ "Birsa Munda: ఆదివాసీల ఆరాధ్యదైవం". Sakshi. 2022-11-15. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-30.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". ఒరిజినల్ నుండి 29 June 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 July 2018.