వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వరి
ఒరైజా సెటైవా
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
జాతులు
  • Oryza glaberrima
  • ఒరైజా సటైవా

భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి బియ్యం వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం. క్రీస్తు పూర్వం 1400 లోనే దక్షిణ భారతదేశంలో వరి పండిస్తున్నట్టు పురావస్తు శాఖ అంచనాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఉన్న 50 శాతం పంటభూములలో వరి పండిస్తున్నారు.[1] ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. భారతదేశంలో పంటలకు ఒరైజా సటైవా ఇండికా (Oryza sativa indica) రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ధాన్యంపై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి. ఇడ్లీ, దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది. హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు.

పండించే విధానం

[మార్చు]
గుట్టకింద వరి పొలం, దామలచెరువు దగ్గర తీసిన చిత్రం

ముందుగా నాణ్యమైన వడ్లను విత్తనాలుగా ఎంచుకుంటారు. తరువాత మొలకలు రావడం కోసం వాటిని నీళ్ళలో నానబెడతారు. నానబెట్టేటపుడు తొందరగా మొలకలు రావడానికి వాటిలో వావిలాకు వంటివి వేస్తారు. ఈ విత్తనాలు నారు పోయడానికి ఉపయోగిస్తారు. నేల ఎంత మెత్తగా ఉంటే నారు అంత ఏపుగా ఎదుగుతుంది. అందుకోసం గింజలు మొలకెత్తుతుండగా నారు పోయడానికి ఎంచుకున్న భూమిని పలు మార్లు దున్నడం, నీటితో తడపటం, ఎరువులు వెయ్యడం లాంటి పనులు చేస్తారు. పొలాన్ని మూడు సార్లు మడకతో దున్ని, చివరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. నీళ్లలో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అని, నీళ్లు లేకుండా మెట్ట పొలాలలో దున్నే దుక్కిని వెలి దుక్కి అని అంటారు. వెలి దుక్కికి తగుమాత్రం తేమ వుండాలి. తేమ ఎక్కువగా వుంటే దున్నరు. ఆ తేమ శాతాన్ని పదును అంటారు. అడుసు దుక్కి దున్నిన తర్వాత ఒకపెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒక సారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురద లోనికి తొక్కుతారు. ఆకు అనగా, కానుగ, వేప, గంగరావి, జిల్లేడు మొదలగు ఆకు తెచ్చి అడుసులో వేసి తొక్కుతారు. పొలాల గట్ల మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి మోపులుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు. ఇది పంటకు చాల సారవంత మైన సేంద్రియ ఎరువు. తర్వాత అది వరకే నారు పోసి వుంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు.

మొలకలు వచ్చిన గింజలను నారు మడిలో చల్లుతారు. గింజలు మరీ పలుచనగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా చల్లుతారు. కొద్ది కాలానికి గింజలు చిన్న చిన్న వరి మొక్కలుగా ఎదుగుతాయి. తరువాత ఈ నారును ముందుగా సిద్ధం చేసుకున్న నేలలో నాటుతారు. దీన్నే నారు నాటడం అంటారు. ఈ పనిని మనుషలైనా చేయవచ్చు, లేదా యంత్ర సహాయం తీసుకోవచ్చు. ఈ పని చేయడానికి ముఖ్యంగా ఆడవారు చేయడం ఆనవాయితీ. నాటేటపుడు వరి మొక్కలను కుచ్చులుగా తీసుకుని ఒక్కో దానికి సరైన దూరంలో ఉండేలా నాటుతారు. దూరం తగ్గితే పంట ఎదుగుదల, పంట దిగుబడి పెద్దగా ఉండదు.

పొట్టకర్ర మీదున్న వరి పొలము

పైరు కొంచెం పెరగగానే మధ్యలో కలుపు మొక్కలు పెరుగుతాయి. వాటిని ఏరివేసే ప్రక్రియను కలుపుతీయడం అంటారు. మధ్యలో పైరు బాగా ఎదగడానికి, తెగుళ్ళు రాకుండా ఉండటానికి కొన్ని రసాయనిక ఎరువులు వాడతారు. వీటిని నేరుగా పొలంలో చల్లడంకానీ, పిచికారీ చేయడం పరిపాటి. గింజలు మొలకెత్తి పక్వానికి వచ్చిన తరువాత పైరు కోత ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం చాలావరకు పైరుకోత యంత్రాల సహాయంతోనే జరుగుతుంది. ఇందులో బయటకు వచ్చిన ధాన్యాన్ని ఇళ్ళకు తరలిస్తారు.

వరి మోపులు ఇంటికి తరలిస్తున్న చిత్రం

వరి గింజ

[మార్చు]
వరి కంకి
వరి
A: Rice with chaff
B: Brown rice
C:Rice with germ
D: White rice with bran residue
E:Musenmai (Japanese:無洗米), "Polished and ready to boil rice", literally, non-wash rice
(1) :Chaff
(2) :Bran
(3) :Bran residue
(4) :Cereal germ
(5) :Endosperm

వరిగింజ పరిమాణములో చిన్నగా ఉండి గట్టిగా ఉంటుంది. వరి గింజలో పాలు ఉత్పత్తి జరిగి, అవి గట్టి పడుటద్వారా తయారవుతుంది.

వరి గడ్డి

[మార్చు]

వరి గడ్డి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది.

ప్రపంచ దేశాలలో వరి

[మార్చు]
అత్యధిక వరి ఉత్పత్తిదారులు — 2005
(మిలియన్ మెట్రిక్ టన్ను)
 China 182
 భారతదేశం 137
 Indonesia 54
 Bangladesh 40
 Vietnam 36
 Thailand 27
 Burma 25
 పాకిస్తాన్ 18
 Philippines 15
 Brazil 13
 జపాన్ 11
World Total 700
Source:
UN Food & Agriculture Organisation (FAO)
[1] Archived 2006-06-19 at the Wayback Machine

ప్రపంచ వరి ఉత్పాదకత[2] 1960లోని 200 మిలియన్ టన్నుల నుండి 2004లోని 600 మిలియన్ టన్నులకు చేరింది. 2004 సంవత్సరంలో వరి అత్యధికంగా పండించే దేశాలు చైనా (29%), భారతదేశం (20%), ఇండోనేషియా (9%).

ప్రపంచంలో ఉత్పత్తి అయిన వరిలో 5-6% మాత్రమే ఎగుమతి అవుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా వరి ఎగుమతి చేసే దేశాలు థాయిలాండ్ (26%), వియత్నాం (15%), అమెరికా (11%). ఇండోనేషియా (14%), బంగ్లాదేశ్ (4%), బ్రెజిల్ (3%) ఎక్కువగా వరి దిగుమతి చేసుకుంటున్నాయి. వరి అత్యధికంగా పండించే దేశాలలో కంబోడియా మొదట్లో ఉంది. ఇక్కడి మొత్తం వ్యవసాయంలో 90 % వరినే సాగుచేస్తారు.

ఆహార పదార్థాలు

[మార్చు]
అనకాపల్లి జిల్లా శంకరంలో వరి పొలాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యల్లాయపాళెంలో వరి పొలాలు
Rice, raw
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి1,506 కి.J (360 kcal)
79 g
0.6 g
7 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ బి6
12%
0.15 mg
ఇతర భాగాలుపరిమాణం
Water13 g
Percentages are roughly approximated using US recommendations for adults.

పండిన ధాన్యాన్ని మొదట మిల్లులో ఆడించి ఊకను గింజ నుండి వేరుచేస్తారు. తరువాత వరి గింజల నుండి తవుడును వేరుచేసి తెల్లని బియ్యాన్ని తయారుచేస్తారు. దీనిని పాలిషింగ్ అంటారు. ఇలా చేయడం వలన వరి యొక్క పోషక విలువలు కోల్పోతున్నాము. విటమిన్ బి ఎక్కువగా ఈ పై పొరలలో ఉంటుంది. దీని లోపం మూలంగా బెరి బెరి (beriberi) అనే వ్యాధి సోకుతుంది.

తవుడు నుండి ఈ మధ్య కాలంలో తవుడు నూనె (Rice bran oil) తీస్తున్నారు.

బియ్యాన్ని దంచి లేదా మిల్లులో ఆడించి బియ్యపు పిండి, ఉప్పుడు బియ్యం, బియ్యపు రవ్వ, ఉప్పుడు రవ్వ లాంటివి తయారుచేస్తారు. దీనితో దోసెలు, అట్లు, ఇడ్లీలు మొదలైనవి తయారుచేస్తారు.

బియ్యాన్ని నీరు లేదా ఆవిరిలో ఉడికించి వివిధ ఆహారపదార్థాలతో కలిపి మనం తింటాము. దీనిని తిరిగి నూనెలో గాని నెయ్యిలో గాని వేయించి బిర్యానీ, పులావు మొదలైనవి తయారుచేస్తారు.

శ్రీ వరి

[మార్చు]

"శ్రీ వరి " అనేది వరి సాగులో ఒక రకమైన సాగు పద్ధతి .

మూలాలు

[మార్చు]
  1. https://www.bbc.com/telugu/india-54061767
  2. all figures from UNCTAD 1998–2002 and the International Rice Research Institute Archived 2006-07-11 at the Wayback Machine 2005 గణాంకాల ప్రకారం
"https://te.wikipedia.org/w/index.php?title=వరి&oldid=4223555" నుండి వెలికితీశారు