చక్రవర్తి రాజగోపాలాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవర్తి రాజగోపాలాచారి
మహాత్మాగాంధీతో రాజాజీ
జననండిసెంబరు 10, 1878
మరణండిసెంబరు 25, 1972 (వయసు: 94)
ఇతర పేర్లురాజాజీ, సి.ఆర్.
వృత్తిన్యాయవాది, రచయిత
మతంహిందూ

రాజాజీగా పేరొందిన చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబరు 10, 1878 - డిసెంబరు 25, 1972) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. అతను సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ తమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878, డిసెంబరు 10న జన్మించాడు.

బాల్యం[మార్చు]

రాజాజీ 1878 డిసెంబరు 10న సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. అతను స్వస్థలం తమిళనాడు, సేలం జిల్లాలోని దొరపల్లి అగ్రహారం అనే గ్రామం. ఇది పారిశ్రామిక పట్టణమైన హోసూరుకు దగ్గర్లో ఉంటుంది. అతను తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి మునసబు. అతను పాఠశాల విద్య హోసూరు లోనూ, కళాశాల విద్య చెన్నై, బెంగళూరు లోనూ జరిగింది. 1897లో బెంగళూరు లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.సేలంలో ఉండగానే అతను సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు.

భారత స్వాతంత్ర్యోదమం[మార్చు]

రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సేలం పట్టణానికి ప్రతినిధిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో జాతీయవాది బాలగంగాధర తిలక్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917లో సేలం పట్టణ మునిసిపాలిటీకి ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు.[1] సేలం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిధి కూడా అతను చొరవతోనే ఎన్నికయ్యాడు. తరువాత అతను భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించాడు. 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించాడు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై ఇతనుకు మంచి స్నేహితుడు. అనీబిసెంట్ కూడా రాజాజీని అభిమానించేది.

1919లో మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ కూడా అతను్ను అనుసరించాడు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశాడు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు.[1]

1923లో కాంగ్రెస్ విడిపోయినపుడు రాజాజీ సివిల్ డిసొబీడియెన్స్ కమిటీలో సభ్యుడు. గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపడానికి చేపట్టిన వైకోం సత్యాగ్రహంలో అతనుకు కుడిభుజంగా ఉన్నాడు. ఆ సమయంలో పెరియార్ ఈవీ రామస్వామి రాజాజీ నాయకత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరూ తరువాతి కాలంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందినా మంచి స్నేహితులుగా ఉన్నారు.

1930లో తమిళనాడు కాంగ్రెస్ లో రాజాజీ నాయకుడయ్యాడు. అదే సమయంలో మహాత్మా గాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్ళాడు. తరువాత రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1935 లో భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్ ను సాధారణ ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.

జీవితచరిత్ర పుస్తకం[మార్చు]

రాజాజీ స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించిన రాజనీతివేత్త. ప్రాథమికంగా కాంగ్రెసువాది అయినా పరిస్థితుల ప్రాభల్యం వల్ల కొన్ని పార్టీలు మారి, స్వాతంత్ర్యానంతరం నెహ్రూ సోషలిస్టు విధానల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక, దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్‌గా చరిత్రకెక్కారు. అతను జీవిత చరిత్ర వల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది. అయితే ఈ పుస్తకం ఆర్. నారాయణ మూర్తి 1944లో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల వరకూ దేశ చరిత్రలో చురుకుగా వ్యవహరించారు. దీనిని నెల్లూరు వర్ధమాన సమాజము ప్రచురించింది.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Mahmud, Syed Jafar (1994). Pillars of Modern India, 1757-1947. APH Publishing. p. 88. ISBN 9788170245865.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.