జయప్రకాశ్ నారాయణ్

వికీపీడియా నుండి
(లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జయప్రకాశ్ నారాయణ్
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్
జననంఅక్టోబర్ 11, 1902
మరణంఅక్టోబర్ 8, 1979
భారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ
ఉద్యమంస్వాతంత్ర్య సంగ్రామం, సర్వోదయా, ఎమర్జెన్సీ

జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ (జ:1902 అక్టోబరు 11 - మ:1979 అక్టోబరు 8) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఇతనిని ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు.భారత ప్రభుత్వం ఇతని 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది.

ప్రారంభ జీవితం[మార్చు]

జయప్రకాశ్ నారాయణ్ ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లాకు, బీహారు లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించాడు. అటుపిమ్మట అమెరికాలో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.1920లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూరిబాయి గాంధీ అనుచరురాలు ప్రభావతీ దేవిని వివాహమాడాడు.

ఇజ్రాయేల్ ప్రధాని డేవిడ్ భెన్ ఘురియన్ తో నారాయణ్

స్వాతంత్ర్య సమరయోధుడిగా[మార్చు]

అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో చేరి త్వరలోనే మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడుగా మారాడు. 1932 లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన కారణంగా జైలు పాలైన తరువాత, నారాయణ్ నాసిక్ జైలులో ఖైదు చేయబడ్డాడు. అక్కడ అతను రామ్ మనోహర్ లోహియా, మినూ మసాని, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా, బసవోన్ సింగ్ (సిన్హా), యూసుఫ్ దేశాయ్, సికె నారాయణస్వామి, ఇతర జాతీయ నాయకులను కలిశాడు. విడుదలైన తరువాత కాంగ్రెసులో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెసు సోషలిష్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెసు నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ రాంమనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు. స్వాతంత్ర్యానంతరం జె.పి, ఆచార్య నరేంద్ర దేవ్, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది.

సర్వోదయ[మార్చు]

1954లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి, దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరితగతిన భారతదేశంలో మహాత్మా గాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.

సంపూర్ణ క్రాంతి[మార్చు]

1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహారు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించాడు. 1974లో బీహారులో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆతర్వాత బీహారు ఉద్యమంగా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జె.పి. పిలుపునిచ్చాడు.

ఎమర్జెన్సీ[మార్చు]

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీని దోషిగా పేర్కొంటూ అలహాబాదు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి, పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ 1975 జూన్ 25 అర్థరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని, ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆఖరికి కాంగ్రెసు పార్టీ లోనే యంగ్ టర్క్‌లుగా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు. జె.పి. ఛండీఘడ్లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. బీహారు వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు. చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెసును ఓడించి, ఇందిరను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది.

భారత రత్న[మార్చు]

భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అక్టోబరు 8, 1979లో మరణించాడు. మరణానంతరం 1998లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న ను ప్రకటించింది. ఇదిగాక జె.పి. చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965లో మెగసెసే అవార్డు ప్రకటించబడింది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]