శాంతా సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shantha Sinha
జననం (1950-01-07) 1950 జనవరి 7 (వయసు 74)
Nellore
Chairperson, National Commission for Protection of Child Rights, India.

ఆచార్యిణి శాంతా సిన్హా, సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌కు చైర్‌ పర్సన్‌. పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్ స్థాపకురాలు. శాంతాసిన్హా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. జనవరి 7వ తేదీ 1950 సంవత్సరంలో పుట్టారు. బాల్యంలో సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ హైస్కూలులోనూ, కీస్ హైస్కూల్లోనూ విద్యాభ్యాసం చేశారు.[1] 1972 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేసారు. 1976లో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1981 సంవత్సరంలో ఎంవీ ఫౌండేషన్‌ (మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌) స్థాపించారు.

మొదట్లో సామాజిక మార్పుకోసం, పేదలకు విద్యనందించే దృక్ఫథంతో ఆరంభించిన ఈ ఫౌండేషన్‌ 1991 తర్వాత బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వీధిబాలలకు విద్యాబుద్ధులు చెప్పించింది. ఈ సంస్థలో 80 వేలకు పైగా స్వచ్ఛందసేవకులు ఉన్నారు.

కుటుంబం

[మార్చు]

శాంతా సిన్హా విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె పితామహుడు మామిడిపూడి వెంకటరంగయ్య గొప్ప విద్యావేత్త, సమాజవాది, చరిత్ర ఆచార్యుడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో వినూత్న విద్యావిధానానికి కృషిచేసిన సంస్కర్త. తండ్రి మామిడిపూడి ఆనందం చార్టెడ్‌ ఎకౌంటెంట్‌. ఆయన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడుగా ఎంపికయ్యారు. శాంత సోదరుడు నాగార్జున ఐఎయస్‌ ఆధికారిగా పదవిలో ఉండగానే 47వ ఏట మృతి చెందాడు.

వివాహ జీవితం

[మార్చు]

శాంతా సిన్హా 60 దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో తనకు కాబోయే భర్త అజొయ్ కుమార్‌ను కలిసింది. ఆ తరువాత శాంతా సిన్హా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసే రోజుల్లో ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అజొయ్ కుమార్‌ తీవ్రవాద భావజాలం వల్ల జైలుకు వెళతాడన్న భయం, ఆయన కుటుంబం అతివాద ఉద్యమ నేపథ్యం కలదన్న భావనతో శాంతా సిన్హా కుటుంబం అందుకు అంగీకరించలేదు. అజొయ్ కుమార్‌ తండ్రి బిజయ్ కుమార్ సిన్హా భగత్ సింగ్ అనుయాయి, బ్రిటీషు వారిపై బాంబు విసిరాడన్న అభియోగంపై జీవతకాల శిక్ష అనుభవించాడు. ఆయన తల్లి రాజ్యం సిన్హా కూడా జాతీయవాది. 1972 డిసెంబరు 3న, పెద్దలను వ్యతిరేకించి రహస్యంగా పెళ్ళి చేసుకున్న దంపతులకు 1973లో పెద్ద కూతురు సుధ జన్మించడంతో పుట్టింటివారితో తిరిగి సంబంధాలు నెలకొన్నాయి. 1978లో రెండవ కూతురు దీప జన్మించింది. ఆ తరువాత సంవత్సరం అకస్మాత్తుగా అజొయ్ మూర్ఛ వచ్చి, మెదడులో అంతఃస్త్రావంతో మరణించాడు. కొన్నాళ్ళు కూతుళ్ళతో పాటు అజొయ్ తల్లితండ్రుల వద్ద నివసించిన శాంతా సిన్హా, చివరకు మారేడ్‌పల్లిలోని పుట్టింటికి చేరింది.

అవార్డులు

[మార్చు]
  • 1999లో పద్మశ్రీ అవార్డు
  • 2003లో రామన్‌ మెగసేసే అవార్డు
  • అంతర్జాతీయ విద్యాసంస్థ ఆల్బర్ట్‌ శంకర్‌ పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. "- Shanta Sinha Profile - Ramon Megassey Foundation" (PDF). Archived from the original (PDF) on 2011-06-11. Retrieved 2013-06-22.