శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

వికీపీడియా నుండి
(నెల్లూరు జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


  ?శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, India
అక్షాంశరేఖాంశాలు: 14°26′07″N 79°58′11″E / 14.435345°N 79.969826°E / 14.435345; 79.969826
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13,076 కి.మీ² (5,049 చ.మై)
దూరాలు
చెన్నై నుండి
ఒంగోలు నుండి
తిరుపతి నుండి

• 165 కి.మీలు ఉ (భూమార్గం)
• 125 కి.మీలు ద (భూమార్గం)
• 135 కి.మీలు ఈ (భూమార్గం)
ముఖ్య పట్టణము నెల్లూరు
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
29,66,082 (2011 నాటికి)
• 227/కి.మీ² (588/చ.మై)
• 1493254
• 1472828
• 65.9(2011)
• 74.45
• 57.24

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం నెల్లూరు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును పొట్టి శ్రీరాములు గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా జూన్ 1, 2008 నుండి [1] మార్చారు. నెల్లూరు జిల్లా ప్రస్తుత జిల్లా అధికారి (కలెక్టర్) రేవు ముత్యాలరాజు.[2]

విషయ సూచిక

జిల్లా పేరు వెనుక చరిత్ర[మార్చు]

బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయం

మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లి ( తమిళ భాషలో వరి అని అర్ధం) పేరుమీదుగా నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

నెల్లూరు సింహపురమని, విక్రమసింహపురమని కూడా వ్యవహరింపమడేది. ఈ పట్టణ సమీపంలోని అడవులలో సింహలు పరిమితంగా ఉన్నందువలననే యీ పేరు వచ్చిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. విక్రమసింహుడనే వాని ఆధీనంలో యీ ప్రాంతం వున్నదని, అందువలననే అతని పేరు తోనే ఈ ప్రాంతం అలా పిలువబడివుండవచ్చునని యింకొందరు భావిస్తున్నారు.

పూర్వం త్రినేత్రుడు లేక ముక్కంటిరెడ్డి అనే వ్యక్తికి నెల్లిచెట్టు అనగా ఉసిరిచెట్టు క్రింద వున్న శివలింగం వున్నచోట దేవాలయాన్ని నిర్మించమని కలలో వాణి తెలియచేసిందని, ఆ మేరకు ఆలయాన్ని ఆయన నిర్మించాడని చెబుతారు. కాల క్రమేణా నెల్లి నామం నెల్లూరుగా రూపాంతరం చెందిందంటారు.

జిల్లా చరిత్ర[మార్చు]

మౌర్యులు, చోళులు మరియు పల్లవులు[మార్చు]

ఘటిక సిద్ధేశ్వరం ఆలయ ధ్వజస్తంభం
సంగం ఆలయ రథం

మౌర్యసామ్రాజ్యం అవతరించిన పిమ్మట ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల మాదిరి నెల్లూరు కూడా మౌర్యుల ఆధీనంలోకి వచ్చింది. అప్పటి వరకు నెల్లూరు క్రీ.పూ 3వ శతాబ్దం నుండి అశోకసామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. నెల్లూరు ప్రాంతంలో ఉన్న గుహలలో చెక్కబడిన శిలాక్షరాలు అశోకచక్రవర్తి సమంలో ఉపయోగించిన బ్రాహ్మీ లిపిలో ఉండడం ఇందుకు ఆధారము. భారతదేశ దక్షిణ ద్వీపకల్పంలో చోళుల సామ్రాజ్యం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. చోళులు ప్రారంభదశ క్రీ.శ 1వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు సాగింది. చోళులు ప్రారంభ శిలాశాసనాలు క్రీ.శ 1096 నుండి కనిపెట్టబడ్డాయి. జమ్మలూరులో లభించిన శిలాశాసనాలు ఇందుకు నిదర్శనం. మొదటి చక్రవర్తి అలాగే చాలా ప్రఖ్యాతి కలిగిన కరికాలచోళుని సామ్రాజ్యంలో ఈ జిల్లాను ఒక భాగంగా ఉండేది. కరికాలచోళుడు కావేరీనది మీద అద్భుతమైన కల్లణై ఆనకట్టను నిర్మించి తన నిర్మాణ కౌశలాన్ని చాటుకున్నాడు.

పల్లవ, చేర, పాండ్య రాజ్యాల నుండి 9వ శతాబ్దం వరకు సాగించిన నిరంతర దాడుల వలన చోళ సామ్రాజ్య పతన దశ ఆరంభం అయింది. సింహవిష్ణు పల్లవ రాజు చోళులను బయటకు తరిమి క్రీ.శ 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు నెల్లూరు మీద తన ఆధిపత్యం ప్రతిష్ఠించాడు. పల్లవుల రాజకీయ అధికార కేంద్రం ఉత్తర భూభాగంలో క్షీణించి అక్కడి నుండి దక్షిణ భూభాగం వైపు కొనసాగింది. ఉదయగిరిలో పలు పాలవ, చోళ ఆలయాలు నిర్మించబడ్డాయి. గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలలో పల్లవ మరియు చోళుల పాలనగురించిన అనేక శిలాశాసనాలు లభించాయి. వీటిలో ఉండవల్లి గుహలలో ఉన్న నాలుగంతస్థుల గుహలు ఉన్నాయి. భైరవకోనలో ఉన్న పాలవ శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తున్న 8 గుహాలయాలు మహేంద్రవర్మ పాలనా కాలంలో నిర్మించబడ్డాయి.

బుద్ధుని కాలమునందు నెల్లూరు గుత్తి, కడప, కందవోలు మండలములును కృష్ణానదికి దిగువనుండు దేశమును కృష్ణాగోదావరుల నడుమనుండు దేశమును వజ్రభూమిగా (Diamond fields) వ్యవహారమునందుండెను. ఆ కాలమునందు నాంధ్రదేశము లోని జనులును, కళింగా దేశము లోని జనులును నొక్క తెగలోనివారుగ గన్పట్టుచున్నారు. కళింగదేశమునందు ప్రసిద్ధములయిన రెండు రేవుపట్టణములు గలవని చీనా బర్మాదేశస్థులు వ్రాసిన చరిత్రము వలన దెలియుచున్నది. మఱియు ఉత్తర పినాకినీ నదీ ముఖద్వారమున నొక రేవుపట్టణముండినట్లుగ బౌద్ధుల గాథలయందు దెల్పబడియున్నది. బుద్ధుని శిష్యుడగు పూర్ణుడను బ్రాహ్మణుని సోదరుడొకడు మూడు వందల జనులతో సూర్పరాక పట్టణమునుండి (పశ్చిమతీరము లోని కొంకణదేశము లోనిది) యోడనెక్కి లంకాద్వీపమును జుట్టివచ్చి పై జెప్పిన ఉత్తర పినాకినీ ముఖద్వారము లోని రేవుపట్టణము కడ దిగెనని బౌద్ధులగాథలవలన దెలియుచున్నది. బుద్ధుని కాలమునందాంధ్రదేశమిట్టి నారగికతా చిహ్నములను వహించియుండినను దేశము విశేషభాగమరణ్యభూమిగానే యుండెనని చెప్పవలసియున్నది. ఇంతకన్న బుద్ధునికాలమునందాంధ్రదేశమును గూర్చిన చారిత్రము సవిస్తరముగా దెలియరాదు.

నెల్లూరు చోళరాజులు[మార్చు]

నెల్లూరు రాజకీయపరంగా శిఖరాగ్రాన్నందుకున్న సమయంలో మంత్రిగా పనిచేసిన తిక్కన సోమయాజి ప్రఖ్యాతి చెందిన కవిగా కూడా పేరుపొందాడు. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించి చరిత్రలో తనకూ తనకుంటుంబానికి శాశ్వత కీర్తిసంపాదించాడు. ఆయన ఇతర రచనలు నిర్వచనోత్తర రామాయణము. తెలుగు చోళులలో ఒక శాఖ మరియు కల్యాణీకి చెందిన చాళుక్యులు కలిసి ఐక్యంగా వీరిని చోళ, చాళుక్య యుద్ధాలలో సహాయం చేసె నిమిత్తం ఇక్కడ పాకనాడు పాలకులుగా నియమించారు. వారు నెల్లూరు (విక్రమసింహపురిని)ను రాజధానిగా చేసుకుని నెల్లూరు, కడప, చిత్తూరు మరియు చెంగల్పట్టు ప్రాంతాలను పాలించారు.

తిక్కా (1223-1248) హొయశిల మరియు పాండ్యులను ఓడించి తొండైమండలాన్ని స్వాధీనపరచుకుని చోళస్థాపనాచార్యా బిరుదును పొందాడు. రెండవ మనుమసిద్ధి తరువాత వచ్చిన రాజ్యపాలకుడు తిక్కా కుమారుని పరిపాలనా కాలంలో (1223-1248) నెల్లూరు ఇతర చోళ మరియు చాళుక్యుల దాడులను అనేమమార్లు ఎదుర్కొంది. తిక్క కాకతీయ రాజైన గణపతిదేవుడిని కలుసుకుని రాజుకు సైన్యసహకారం సంపాదించాడు. 1260లో మనుమసిద్ధికి కనిగిరికి చెందిన ఎర్రగడ్డపాడు రాజప్రతినిధి కాటమరాజుకు మధ్య వంశకలహాలు చెలరేగాయి. ఇద్దరి రాజకుమారుల మధ్య పచ్చిక భూములలో పశువులను మేపడానికి హక్కుల కొరకు వివాదాలు చెలరేగాయి. ఈ కలహాలు చివరకు పెన్ననది తీరంలో ముత్తుకూరు సమీపంలో ఉన్న పంచలింగాల వద్ద జరిగిన ఘోరయుద్ధానికి దారితీసింది. మనుమసిద్ధి సైన్యాలు ఖడ్గతిక్కన సైన్యాధ్యక్షతలో సాగాయి. కవి తిక్కన మేనల్లుడైన ఖడ్గతిక్కన యుద్ధంలో విజయం సాధించాడు కాని నాయకుడు పరమపదించాడు. ఈ వంశకలహాలు యుద్ధఫలితాలు కాటమరాజు కథ అనే యక్షగానరూపంలో ప్రజలమధ్య ప్రచారం అయింది. ఈ యుద్ధానికి అనంతరం కొద్ది కాలానికే మనుమసిద్ధి మరణంతో నెల్లూరు తన ప్రత్యేక గుర్తింపును కోల్పోయింది.

కాకతీయులు, పాండ్యులు, విజయనగరవాసులు[మార్చు]

ఉదయగిరి కోట

కాకతీయులు, పడమటి కల్యాణీ చాళుక్యుల పాలెగాళ్ళు బలంపుంజుకుని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. కాకతీయసామ్రాజ్యానికి చెందిన గణపతిదేవా అత్యధికమైన తెలుగు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకువచ్చాడు. 13వ శతాబ్దంలో నెల్లూరు కాకతీయసామ్రాజ్యంలో ఒక భాగం అయింది. రెండవ ప్రతాపరుద్రుడు పాండ్యుల చేత ఓడించబడే వరకు నెల్లూరు ఆధిపత్యం కాకతీయులు మరియు పాండ్యుల మధ్య మారుతూ వచ్చింది. కాకతీయసామ్రాజ్యపతనం తరువాత నెల్లూరు భూభాగం మీద తుగ్లక్ ఆధిపత్యంలోకి వచ్చింది. తరువాత నెల్లూరు కొండవీటి రెడ్ల ఆధిపత్యంలోకి మారింది.

14వ శతాబ్ధానికి నెల్లూరు జిల్లాలోని అధికప్రాంతం విజయనగర సామ్రాజ్యపు సంగమరాజ్యంలో చేరింది. క్రీ.శ 1512లో మిగిలి ఉన్న ఉదయగిరిని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు జయించి స్వాధీనపరచుకున్నాడు. విజయనగర రాజుల చేత నిర్మింపబడిన శిథిలమైన కోటభాగాలు ఇంకా ఉన్నాయి.

నెల్లూరు మండలములోని దర్శి వంశపు రాజులు కూడా నాగజాతి వారని తెలియుచున్నది. పదునేనవ శతాబ్ద ప్రారంభమున దర్శి పట్టణపు రాజగు ఆసనదేవమహారాజు తన తల్లి ఆర్యమదేవి పేరిట నొక చెఱువు త్రవ్వించి శాలివాహన శకము 1357వ సంవత్సరముననగా క్రీస్తు శకము 1435-36వ సంవత్సరమున నొక శాసనము వ్రాయించెను. దానిలో గొంకరాజు మొదలుకొని తన వంశమును వర్ణించుకొనియుండెను. ఆ శాసనమునందు గొంకరాజును ఫణీంద్రవంశజుడనియు, నాగవంశోద్భవుడనియు నభివర్ణించెను. ఈ గొంకరాజు యొక్క మనుమడయిన నాగరాజును కాకతీయ గణపతి రాజులకు సామంతుడుగనుండిన నాగదేవుడును నిరువురు నొక్కరేయై యుందురేమో యింకను విచారింపవలసియున్నది. ఈ పైన వ్రాసిన యంశములనుబట్టి నాగులనియెడి యొక జాతివారు పూర్వకాలమున నుండిరనియు, ఒకప్పుడు వారలీ భరతఖండమునంతయు నాక్రమించి పాలించి యుండిరనియు దేటపడకమానదు. ఇంకను వారలకును నాంధ్ర దేశానికినుగల సంబంధమును దెలిపెడి గాథలను దెలిసికొన్నచో నాగులను గూర్చి యభిప్రాయము మఱికొంత బలపడకమానదు.

నవాబులు మరియు బ్రిటిష్ కాలం[మార్చు]

విజయనగరసామ్రాజ్య పతనం తరువాత ఈ ప్రాంతం నవాబుల ఆధీనంలోకి చేరింది. 1753లో నెల్లూరు అర్కాటు నవాబు తమ్ముడైన నజీబుల్లాహ్ పాలనలోకి మారింది. మచిలీపట్నం నుండి ఫ్రెంచి వారు మద్రాసు నుండి బ్రిటిష్ వారు నజీబుల్లాహ్ మరియు ఆర్కాటునవాబులకు సహకరించగా నెల్లూరు ప్రాంతం అనేక యుద్ధాలకు సాక్ష్యంగా నిలబడింది. 1762లో బ్రిటీష్ సైన్యాలు నెల్లూరును స్వాధీనపరచుకొనడంతో ఆర్కాటునవాబు హస్తగతం అయింది. 1781 నాటికి అదాయ పంపిణీ వ్యవహారంలో భాగంగా నవాబు అజమ్ ఉద్ దౌలా మిగిలిన నెల్లూరు భాగాన్ని ఈస్టిండియా కంపెనీకి తిరిగి ఇచ్చాడు. నెల్లూరు జిల్లాను స్వాధీనపరచుకున్న ఈస్టిండియా కంపెనీ డైటన్‌ను మొదటి కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు జిల్లా ఆదాయకేంద్రంగా ప్రకటించబడింది. 1838లో కర్నూలు నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉదయగిరి జాగీరు విషయంలో పన్నిన కుట్ర మినహా నెల్లూరు జనజీవితంప్రంశాంతగా సాగింది . బ్రిటిష్ ప్రభుత్వాధీనంలోకి వచ్చిన తరువాత నెల్లూరు జిల్లా న్యాయవ్యవస్థలో అంతగా మార్పులు జరుగ లేదు. 1904లో ప్రత్యేక గుంటూరు జిల్లా ఏర్పడిన తరుణంలో ఒంగోలు ప్రాంతం గుంటూరులో చేర్చబడింది.

స్వాతంత్ర్యం ముందు[మార్చు]

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఒకడైన,కవి బ్రహ్మ,ఉభయ కవిమిత్రుడు కవి తిక్కన, ఇతని వద్దే ప్రధాన మంత్రిగా పనిచేశాడు. ఖడ్గ తిక్కన ఇతని రక్షణామాత్యుడు.

ఈ ప్రాంతంలో క్వార్త్జైట్‌ అనే ఒక ప్రత్యేక తరహా ఫ్లింటు రాళ్లు విరివిగా లభిస్తాయి. వీటితో ఆదిమానవులు తమ ఆయుధాలు, పనిముట్లు తయారు చేసే వారు. మగధ సామ్రాజ్య స్థాపన తరువాత ఈ ప్రాంతం మీద కూడా మగధ ప్రభావం ఉండినట్లు తెలుస్తున్నది. క్రీ.శ.3వ శతాబ్దములో నెల్లూరు అశోకుని సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తరువాత 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు జిల్లా పల్లవుల పాలనలో ఉంది. 7వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తరాన పల్లవుల ప్రాభవం తగ్గి, అధికారం క్షీణించి, దక్షిణానికి పరిమితమైపోయారు. ఆంగ్లేయుల పరిపాలనలో జిల్లా శాంతియుతంగా ఉంది. ఈ కాలంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ఒకే ఒక సంఘటన 1838లో బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా కర్నూలు నవాబు పన్నిన తిరుగుబాటు కుట్రలో పాలుపంచుకొన్నందుకు ఉదయగిరి జాగిర్దారు నుండి ఉదయగిరి జాగీరును లాగివేసుకోవటం. జిల్లా నేరుగా బ్రిటిషువారి పాలనలో వచ్చిన తర్వాత, 1904లో ఒంగోలు తాలుకాను అప్పుడే కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాకు బదిలీ చేయటం తప్ప జిల్లాలో పెద్ద మార్పులేమీ జరగలేదు.

స్వాతంత్ర్యం తరువాత[మార్చు]

నెల్లూరు జిల్లా, 1953 అక్టోబర్ 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉంది. 1956 నవంబర్‌ 1 న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కిందికి వచ్చింది. నెల్లూరు 1953 అక్టోబర్ 1 వరకు సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఒక భాగం. 1956 నవంబర్ 1వ తారీఖున భాషాప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో నెల్లూరు ప్రధాన పాత్ర వహించింది. తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశభక్తుడు అయిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష వహించి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అవతరణతో సంయుక్త భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసింది.

నెల్లూరు ప్రజలు స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడమే కాక తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి పాటుపడ్డారు. గుర్తించతగిన స్వాతంత్ర్య సమరయోధులు ముతరాజు గోపాలరెడ్డి మరియు పొట్టి శ్రీరాములు. నెల్లూరు ప్రజలు రాజకీయాలలో సైతం చురుకు అయిన పాత్ర వహంచారు. నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు ముఖ్య మంత్రులు రాష్ట్రపాలన సాగించారు. బెజవాడ గోపాలరెడ్డి మరియు నేదురుమల్లి జనార్ధన రెడ్డి నెల్లూరు నుండి ముఖ్యమంత్రులుగా నియమించబడ్డారు. నెల్లూరు జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం. పొరుగు జిల్లాలు అయిన ఒంగోలు మరియు వైఎస్ఆర్ జిల్లాలతో పోలిస్తే నెల్లూరులో కమ్యూనిస్ట్ పార్టీ అనుచరులు అధికమే. ప్రముఖ కమ్యూనిష్టు అయిన పుచ్చపల్లి సుందరయ్య తనజీవితాన్ని మరియు ఆస్తులను కూడా నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా అంతగా బలంగా లేని కమ్యూనిష్టు పార్టీకి అంకితం చేసాడు.

నెల్లూరు జిల్లాలో ప్రజాసేవకు కావలసిన మహారాజ పోషకులు ఉన్నారు. వారిలో గుర్తించతగిన వారు టౌన్ హాలు మరియు శిశు వైద్యశాల నిర్మాణం చేసిన రేబాల లక్ష్మీనరసా రెడ్డి ఒకరు. రెండ వారు నెల్లూరు జిల్లాలో మొదటి కళాశాల నిర్మాణం చేసిన వెంకట గిరి రాజు మరొకరు.

 • 1919 సెప్టెంబరులో జరిగిన నెల్లూరు జిల్లా సదస్సులో 1919 ఏప్రిల్‌ 13న జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ మారణ కాండకు నిరసనగా టంగుటూరి ప్రకాశం ప్రాథమిక హక్కుల్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశాడు.

భౌగోళిక స్వరూపం[మార్చు]

నెల్లూరు బంగాళాఖాతము పశ్చిమతీరములో ఉంది. నెల్లూరుకు దక్షిణ సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం ఉంది. పడమటి సరిహద్దులో వైఎస్ఆర్ జిల్లా ఉంది. ఉత్తర సరిహద్దులలో ప్రకాశం జిల్లా ఉంది. తూర్పు కనుమల తూర్పుదిశగా సముద్రతీరంవైపు విసరించి ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం వైశాల్యం 13,076 చరరపు కిలోమీటర్లు (5,049 చదరపు మైళ్ళు). పడమటి సరిహద్దులలో వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వెలిగొండ కొండలు ఉన్నాయి. జిల్లా పెన్నానది వలన రెండుగా చీల్చబడి ఉంది. పెన్నానది ఉత్తర మరియు దక్షిణ తీరాలు రెండూ జిల్లాలోనే ఉన్నాయి. ఇది సరాసరి ఫిలిప్పైన్ ద్వీపానికి సమానము. నెల్లూరు జిల్లా సముద్రమట్టానికి 19 మీటర్ల (62 అడుగుల)ఎత్తులో ఉంది.

నెల్లూరు జిల్లాలోని సగభాగం మాగాణి పంటలకు అనువైనది. మిగిలిన సగభాగం రాళ్ళతో కూడిన భూమి. నెల్లూరు సముద్రతీర ప్రాంతం ఇసుక భూములతో అడవులతో నిండి ఉంటుంది. అవి ప్రయాణానికి అనువైనవి కాదు. వీటిని ఎక్కువగా నీటి పారుదలకు మాత్రమే ఉపయోగిస్తారు. పెన్నానది ఉపనది అయిన కండలేరు మరియు బొగ్గేరు మిగిలిన ప్రాంతాన్ని సారవంతం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా ప్రాచీనమానవుడు ఆయుధాలకు మరియు అగ్నిని రగల్చడానికి ఉపయోగించే చెకుముకి రాళ్ళ ఖనిజాలకు ప్రసిద్ధి.

వాతావరణము[మార్చు]

 • శీతాకాలం : జనవరి నుండి ఫిబ్రవరి వరకు.
 • వేసవి : మార్చి నుండి మే.
 • నైరుతీ ఋతుపవనాలు : జూన్ నుండి సెప్టెంబరు వరకు.
 • ఈశాన్య ఋతుపవనాలు : అక్టోబర్ నుండి డిసెంబరు వరకు.

వేసవి అత్యధిక ఉష్ణోగ్రత (36-46)సెంటీగ్రేడ్. శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత (23-25)సెంటీగ్రేడ్. నైరుతీ ఋతుపవనాల వర్షపాతం 700-1000 మిల్లీమీటర్లు. నెల్లూరు తరచూ ఆయా కాలాలలో కరువుకు, వరదకు గురికావడం సహజంగా జరుగుతూ ఉంటుంది.

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

నెల్లూరు జిల్లా పెన్ననదీ ప్రవాహక ప్రాంతం కనుక ఇక్కడ వ్యవసాయం ప్రధాన అదాయ వనరుగా ఉంది. క్రిష్ణపట్నం ఓడరేవు క్రమంగా అభివృద్ధి పధంలో సాగుతుంది. రహదారి మార్గాలు మాత్రమే రవాణాలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

వ్యవసాయం, ఆక్వా కల్చర్, నీటి వనరులు[మార్చు]

దామరమడుగు వద్ద పంటపొలాలు
నెల్లూరు జిల్లాలో ఒక రొయ్యల చెరువు

నెల్లూరు జిల్లా వరి సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని భారతదేశ ధాన్యాగారం అని అంటారు. 70% ప్రజల ప్రధాన అదాయ వనరు వ్యవసాయమే ఇందులో 60% వరిని సాగు. వ్యసాయము లేక వ్యవసాయ సంబంధిత పనులు మరియు వ్యవసాయ సంబంధిత వాణిజ్యం మొదలైనవి 70% ప్రజల జీవనోపాధిగా ఉంటుంది. ప్రధాన పంటలు వరి మరియు చెరకు. నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా మొలగొలుకులు అనే నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి పేరు పొందింది. ఇతర పంటలలో పత్తి, నిమ్మకాయలు, నూనె గింజలు మరియు తోటసంస్కృతి గింజల ఉత్పత్తి ప్రధానమైనవి.

బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి. నెల్లూరు జిల్లా అత్యధికంగా రొయ్యల పెంపకం చెయ్యడ కారణంగా భారతదేశ రొయ్యల కేంద్రంగా ప్రసిద్ధి పొందింది.

నీటి వనరులు వెలికొండలు (తూర్పు కనుమలు) వద్ద పెన్నా నది మీద నిర్మించబడిన సోమశిల ఆనకట్ట, నెల్లూరు వద్ద ఆనకట్ట, సంగం వద్ద ఆనకట్ట మరియు పెన్నా నది ఉపనది అయిన పెన్నేరు మీద గండిపాలెం (ప్రస్తుత ప్రకాశం జిల్లా) వద్ద నిర్మించబడిన ఆనకట్టలు జిల్లాలోని అనేక గ్రామాలలోని వ్యవసాయానికి చక్కగా ఉపయోగపడుతున్నాయి.

జిల్లాలోని నదులు మరియు వాగులు : పిల్లివాగు, పైడేరు, పెన్న,ఉప్పుటేరు,స్వర్ణముఖి,కాళంగి,కఁడలేరు,బొగ్గేరు

పరిశ్రమలు[మార్చు]

వ్యవసాయం తరువాత అధికమైన ప్రజలు చేనేత పని మీద అధారపడి జీవిస్తున్నారు. స్వచ్ఛమైన జరీతో నేయబడిన వెంకటగిరి మరియు పాటూరి నూలు మరియు సిల్కు చీరలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. నెల్లూరుజిల్లాలో వెంకటగిరి మరియు పాటూరు సాంస్కృతిక చేనేతవస్త్రాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలు. ప్రధాన పరిశ్రమలు :-

 • శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం.
 • కోవూరు ధర్మల్ ప్లాంటు. (ప్రస్తుతం పని చేయడం లేదు)
 • నెల్లూరు నిప్పో బ్యాటరీస్ ఫ్యాక్టరీ.
 • బాలాజీ స్టీల్, నెల్లూరు.
 • గూడూరు మరియు సైదాపూరు మైకా గనులు.
 • అడిదాస్ ఆపాచే, తడ.
 • కృష్ణపట్నం ధర్మల్ స్టేషను.
 • కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్.
 • శ్రీ సిటీ,తడ,సూళ్ళూరుపేట
క్రిష్ణపట్నం పోర్ట్

నెల్లూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిష్ణపట్నం ఓడరేవు ప్రధాన రేవుపట్టణమే కాక వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఓడరేవు ప్రపంచ ప్రసిద్ధ డీప్- వాటర్ పోర్ట్ (లోతైన నీటి రేవు)గా ఔతుందని ఎదురు చూడబడుతుంది. ఇనుప మిశ్రమ లోహం మరియు గ్రానైట్ క్రిష్ణపట్నం నుండి చైనా వంటి ఇతర దేశాలకు ఎగుమతి ఔతున్నాయి. వెంకటా చలం నుండి ప్రధాన రైలు మార్గానికి ఇక లింకు ఉంది. నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తడ వద్ద అడిదాస్ ఫ్యాక్టరీ మరియు టాటా లెదర్ పార్క్ కొత్తగా నెల్లూరు జిల్లాలో స్థాపించబడిన పరిశ్రమలు.

అభివృద్ధి పధంలో సాగుతున్న ప్రణాళికలు[మార్చు]

శ్రీ సిటీ,తడ,సూళ్ళూరుపేట, నెల్లూరు జిల్లా

క్రిష్ణపట్నం వద్ద లెదర్ పార్క్ అభివృద్ధి చేయబడుతుంది. ఈ రేవును ప్రధాన రైలు మార్గంతో కలపడానికి క్రిష్ణపట్నం నుండి నిర్మించబడుతున్న రైలు మార్గం ఓబులవారి పల్లె వద్ద ప్రధాన రౌలు మార్గంలో కలపబడుతుంది. ఈ రైలు మార్గం వెంకటాచలం వద్ద ప్రధాన రైలు మార్గంతో కలుపబడుతుంది. మధుకాన్ గ్రూప్‌కు చెందిన 900 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్న సింహపురి పవర్ ప్లాంటు, 1000 మెగావాట్ల విద్యుతుపత్పత్తి చేస్తున్న కెసిపి పవర్ ప్లాంట్, 1000 మెగావాట్ల విద్యుతుపత్తి చేయగలిగిన మీనాక్షీ & ఇతరాలతో ఒక్కోటి 4000 మెగా వాట్ల వద్యుత్తును ఉత్పత్తి చేయకలిగిన రెండు విద్యుద్తుపత్తి కేంద్రాల నిర్మాణం క్రిష్ణపట్నం సమీపంలో జరుగుతుంది. సమీపకాలంలో నెల్లూరులోని రేగడి చిలక వద్ద ఐఎఫ్‌ఎఫ్‌సి ఎరువుల కర్మాగారానికి ప్రభుత్వ అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం క్రిష్ణపట్నం వద్ద పెట్రో కెమికల్ టెర్మినల్ స్థాపించడానికి ప్రణాళిక వేస్తుంది. నాయుడు పేట వాద్ద ఉన్న వెంకటగిరి సమీపంలో ఉన్న మేనకూరు వద్ద రెండు టెక్స్‌టైల్ పార్క్ (వస్త్ర ఉద్యానవనం)లని నిర్మించే ప్రణాళిక ఆలోచనలో ఉంది. ఐఎఫ్‌ఎఫ్‌సి త్వరలో నెల్లూరులో వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రొసెసింగ్ స్పెషల్ జోన్ (సెజ్)స్థాపించాలని ప్రణాళిక వేస్తున్నది. లార్డ్ స్వరాజ్ పౌల్ మార్గదర్శం చేస్తున్న కపారో గ్రూప్ 3,500 కోట్ల ఆటో స్పెషల్ ఎకనమిక్ జోన్ స్థాపించాలని ఆలోచిస్తుంది. అలాగే కార్లు మరియు ఏరో స్పేస్ కాంపొనెన్ట్స్ తయారీ సంస్థ స్థాపన కొరకు ప్రణాళిక చేస్తున్నది. ఆర్‌కెకెఆర్ స్టీల్స్ లిమిటెడ్ పొడవైన చదునైన స్టీల్ తయారీ మరియు అమ్మకం చేస్తున్నది. అలాగే 6,200 కోట్ల పెట్టుబడితో అంకులపాటూరు వద్ద ఎస్‌బిఒ స్టీల్ ప్లాంట్ స్థాపించాలని ఆలోచిస్తుంది.

నెల్లూరు జిల్లా లోని నాయుడు పేట వద్ద హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1,000 కోట్ల పెట్టుబడితో కంటైనర్ గ్లాస్ మరియు ఫ్లోట్ గ్లాస్ తయారీ చేయాలని ఆలోచిస్తున్నది. దినముకు 600 టన్నుల ఫ్లోటింగ్ గ్లాస్ ఉత్పత్తి చేసే కర్మాగార నిర్మాణం 2012-2014 వరకూ సాగుతుందని ఊహించబడుతుంది.

నెల్లూరు జిల్లాలోని కోట టౌన్ వద్ద యోగానంద్ కుమార్ చేత కొత్త బైయోటెక్ లాబరేటరీ లాబరేటరీ తయారీలు నిర్మించాలని ప్రణాళిక ఆలోనలో ఉంది. ఈ చిన్న తరహా పరిశ్రమ 2015 నాటికి పూర్తి కాగలదని ఊహించబడుతుంది.

ఖనిజాలు[మార్చు]

అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి,ముడి ఇనుము,జిప్సం,సున్నాపురాయి నిధులున్నాయి.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు[మార్చు]

రెవెన్యూ విభాగాలు - 5 
నెల్లూరు,కావలి,గూడూరు.నాయుడుపేట,ఆత్మకూరు
లోక్ సభ స్థానం - 1
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజక వర్గాలు - 10
కావలి,ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు పట్టణ, నెల్లూరు గ్రామీణ, సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట,వెంకటగిరి, ఉదయగిరి
మండలాలు - 46

జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించారు.[3]

విజయనగరం జిల్లా మండలాలు, రెవెన్యు విభాగాలు

రవాణా వ్వవస్థ[మార్చు]

విజయవాడ, చెన్నై నగరాల మధ్యన నెల్లూరు ఉండటం వల్ల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది.

రోడ్ మార్గము

నెల్లూరు నగరం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉంది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉంది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్నం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి.

రైలు మార్గము
కావలి రైలు సముదాయము
గూడురు రైలు సముదాయము హౌరా-చన్నై మార్గంలో ఒక ముఖ్య కూడలి

నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.

జనాభా లెక్కలు[మార్చు]

2011 జనసంఖ్య గణాంకాలలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జనాభా 2,966,082. ఇది సుమారుగా ఆర్మేనియా జనసంఖ్యతో సమానం లేక అమెరికా మిసిసిపి రాష్ట్రజనాభాతో సమానం. 640 భారతీయ జిల్లాలలో నెల్లూరు జనసంఖ్యా పరంగా 12వ స్థానంలో ఉంది. నెల్లూరుజిల్లా నివాసితుల జనసాంధ్రత 1 చదరపు కిలోమీటరుకు (590/చదరపు మైలుకు)227. 2001-2011 వరకు దశాబ్ద జసంఖ్య పెరుగుదల శాతం 11.15%. స్త్రీ పురుషుల నిష్పత్తి 986:1000. అక్షరాస్యత శాతం 69.155.

జిల్లాలోని మొత్తం జనాభా 29,66,082 లో 22.45% నగరపురాలలో నివసిస్తున్నారు. సమీపకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం నగర జనాభా 7 లక్షలకు చేరుతున్నట్లు అంచనా. జిల్లాలో అత్యధిక ప్రజలు తెలుగు మాతృభాషా మరియు వ్యవహార భాషగా మాట్లాడుతుంటారు. అదేవిదంగా దక్షిణ ప్రాంతాలు మరియు దక్షిణ తీరప్రాంతాల ప్రజలు తమిళం మాట్లాడుతుంటారు. తెలుగు మాట్లాడే వారి శాతం 92.5% ఉన్నా తమిళభాష మాట్లాడే వారి శాతం కూడా గుర్తించతగినంత ఉంది. తమిళ భాషతో కలిసిన తెలుగు భాషను మాట్లాడే వారు కూడా గుర్తించతగినంత మంది ఉన్నారు.

 • 2001 జనాభా లెక్కల ప్రకారము జిల్లా జనసంఖ్య 26.68 లక్షలు. వీరిలో పురుషులు 13.45 లక్షలు, స్త్రీల జనసంఖ్య 13.23 లక్షలు. గ్రామీణ జనాభా 20.69 లక్షలు, పట్టణ జనాభా 5.99 లక్షలు. స్త్రీ పురుషుల నిష్పత్తి 1000 : 984.[4]

సంస్కృతి[మార్చు]

నెల్లూరు రుచికరమైన ఆహారాలకు కళాత్మ వసతులు కలిగి పెద్ద నగరాలకు సమానమైన సినిమా ధియేటర్లకు పేరుపొందినది. నెల్లూరు స్వర్ణమసూరి మరియు నెల్లూరు చేపల పులుసు అంతర్జాతీయ నాణ్యత కలిగిన ఆహారంగా గుర్తింపు పొందింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా నెల్లూరు మెస్ పేరుతో భోజనశాలలు ఉన్నాయి. భారతదేశం లోని ఇతర రాష్ట్రాలలో కూడా వీటిని చూడవచ్చు. నెల్లూరు హోటల్స్ (భోజన శాలలు) నాణ్యత కలిగిన ఆహారాన్ని అందచేయడంలో ప్రసిద్ధి చెందాయి.

పురాణప్రశస్థి[మార్చు]

తమిళపురాణాలను అనుసరించి ఈ నగర చరిత్ర గురించి వివిధ విశ్వాసాలు వాడుకలో ఉన్నాయి. శివుడు ఒక ఉసిరిక చెట్టు (దీనిని తమిళ భాషలో నెల్లిమరమ్ అంటారు) లింగరూపంలో దర్శనం ఇచ్చాడని విశ్వసిస్తున్నారు. పురాణ కథనం అనుసరించి ముక్కంటి రెడ్డి అనే ఆయన తన పశువులలో ఒక పశువు ప్రతి రోజూ పాలను ఇవ్వడం లేదని గమనించి ఆ పశువు పాలు ఏమౌతున్నాయని తెలుసుకోవడానికి ఆ పశువు వెంట అడవికి వెళ్ళాడు. అక్కడ ఆ పశువు ఒక రాతి మీద తన పాలను తనకు తానే కార్చడం గమనించాడు. ముక్కంటి రెడ్డికి అక్కడ శివుడు తన నిజరూపంతో ప్రత్యక్షం అయ్యాడు. ముక్కంటి రెడ్డి ఆ శిల ఉన్న ప్రదేశంలో ఆలయనిర్మాణం చేసి అక్కడి శివలింగానికి మూలశాంత ఈశ్వరుడు అని నామకరణం చేసాడు. ఈ కారణంగా ఈ నగరం నెల్లూరు అయిందని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం నెల్లూరు లోని మూలపేటలో ఉంది.

జిల్లాలోని అధిక ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. మగవారు ట్రౌజర్లు మరియు సూట్లు ధరిస్తారు. అలాగే చాలా మంది పంచలు, లుంగీలు మొదలైన సంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తారు. స్త్రీలు అధికంగా చీరెలు ధరిస్తారు.

కళలు సాహిత్యము[మార్చు]

నెల్లూరు జిల్లా ప్రముఖ కళాకారులను దేశానికి అందించింది. ప్రాచీన కవి తిక్కన సోమయాజి మరియు ఆధునిక కవి ఆత్రేయలు ఈ జిల్లావారే. ప్రాచీన కవులైన తిక్కన, మొల్ల, మారన్న, కేతన్న ఇక్కడ జన్మించిన వారే. మహాభారతఅన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో తిక్కన రెండవ వాడు. రామాయణాన్ని తెలుగించిన రెండవ కవయిత్రి మొల్ల. తిక్కన శిష్యుడైన కేతన్న దశకుమారచరితం రచన చేసి తన గురువైన తిక్కనకు అంకితమిచ్చాడు. కేతన ఆంధ్ర భాషా భూషణం అన్న వ్యాకరణ గ్రంథరచన కూడా చేసాడు. తిక్కన మరొక శిష్యుడైన మారన్న మార్కండేయ పురాణం రచన చేసాడు. ఈ జిల్లాలో జన్మించిన రామరాజభూషణుడు కృష్ణదేవరాయుని భక్తుడు. బ్రిటిష్ కాలంలో నెల్లూరు ఒక్కటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని విద్యాకేంద్రంగా ఉండేది. జిల్లాలో ప్రధాన వినోదం చలనచిత్రాలు. చలన చిత్ర గాయకుడైన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లావాసియే. ప్రఖ్యాత చలనచిత్ర పాటల రచయిత ఆత్రేయను అందించిది నెల్లూరు జిల్లానే. ప్రముఖ కవి మరియు చలన చిత్ర దర్శకుడు అయిన పట్టాభి రామి రెడ్డి డజన్ మెలోడీస్ పేరిట పన్నెండు పాటల రికార్డులో చోటుచేసుకున్న పాటలను నెల్లూరులోనే రచించాడు. ఆయన ఆ పాటలను మద్రాసు మరియు నెల్లూరు నగరాలను పరిశీలించి వ్రాసాడు. ఆయన పెళ్ళినాటి ప్రమాణాలు అనే తెలుగు చలన చిత్రాన్ని నిర్మించాడు. ఆయన జాతీయ అవార్డు గ్రహీత. ఆయన సంస్కార, చండమారుత, శ్రింగారమాస మరియు దేవరకాడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటులైన రాజనాల, రమణారెడ్డి మరియు వాణిశ్రీ మొదలైన నెల్లూరు జిల్లా వాసులే. చలనచిత్ర గాయని ఎస్.పి శైలజ కూడా నెల్లూరు జిల్లా వాసియే. ప్రముఖ వాడకం దారుల ఉద్యమ కర్త అయిన వి టి వెంకట్రామ్ ఇక్కడి వాడే. ప్రముఖ నాటకరంగ రచయిత నిర్మాత జాగాబత్తిన నవనాధరావు నెల్లూరు జిల్లాకు చెందిన వాడు.

వాస్తుకళ[మార్చు]

 • వెంకటగిరి కోట, నెల్లూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 • ఉదయగిరి కోట, నెల్లూరు నుండి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 • రంగనాయక ఆలయం, పెద్దదైన 29 మీటర్ల గాలి గోపురం కలిగిన 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం.
 • భైరవకొండ గుహలు.
 • శ్రీ రుక్మిణీసమేత వేణుగోపాలస్వామి ఆలయం, మూలపేట, నెల్లూరు.
 • శ్రీ మహావిష్ణు & మహాలక్ష్మీ ఆలయం, వెంకటాపురం వద్ద.
 • క్షేత్రం, క్రిష్ణారెడ్డి పల్లె గ్రామం, సిద్ధాఒపురం మండలం, రాపూరు తాలూకా, నెల్లూరుకు 64 కిలోమీటర్ల దూరంలో.
 • సద్గురు శ్రీ తాతయ్య స్వామి ఆశ్రమం. వెంకటాపురం వద్ద.
 • దిగువ శ్రీశైలంగా పిలువబడిన శివాలయం. ప్రస్తుతం దీనిని పంత్రంగం అని పిలుస్తున్నారు. నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో బంగాళ ఖాతం సముద్ర తీరంలో ఉంది.

పండుగలు /తిరునాళ్ళు[మార్చు]

నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:సంక్రాంతి,ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి, శ్రీరామనవమి రంగనాద స్వామి తిరునాళ్ళు, బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ.

పశుపక్ష్యాదులు[మార్చు]

నెల్లూరు వృక్షజాలతో మరియు జంతుజాలంతో సమృద్ధి కలిగి ఉంది. తూర్పు కనుమల భాగం మరియి సముద్రతీరం, తడి లేని అడవులు మరియు పొదలు కలిగి ఉండడం ఇందుకు కారణం. ఇక్కడ ఉన్న జంతుజాలం అద్భుతం. నెల్లూరుకు 70-80 కిలోమీటర్ల దూరంలో సూళ్ళూరు పేట వద్ద ఉన్న పులికాట్ సరస్సు ఒక విధమైన జలసంబంధిత వలస పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్ట్రోక్స్, గ్రే పెలికాన్స్ మరియు సీగల్స్ ఇవి కాక అనేక పక్షులకు ఇది ఆలవాలం. పులుకాట్ సరస్సు తీరంలో నేలపట్టు పక్షి సంరక్షణకేంద్రము 486 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. సైబేరియన్ కొంగల జాతులు 160 ఇక్కడ ఉన్నట్లు ఇది గర్వంగా చెప్పుకుంటున్నది. నేలపట్టు ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఉత్సవం జరుపుకుంటుంది.

నెల్లూరు జిల్లా ప్రఖ్యాత సరస్సులకు, సముద్రతీరాలకు మరియు ఉద్యానవనాలకు ప్రసిద్ధి పొందింది. నెల్లూరు నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త కోడూరు వద్ద సముద్రతీరం బహుసుందరమైనది. నెల్లూరుకు 14 కిలోమీఓటర్ల దూరంలో ఉన్న మైపాడు బీచ్ ఇసుక తిన్నెలకు రాక్షస అలలకు ప్రసిద్ధి. పొదలకూరు రోడు వద్ద ఉన్న నెల్లూరు లేక్ పార్క్ వద్ద బోటు సర్వీసులు మరియు రెస్టారెంట్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నెల్లూరుకు 9 కిలోమీటర్ల దూరంలో మైపాడు బీచ్ మార్గంలో ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు సాయిబాబా మందిరం బాబా భక్తుల ప్రత్యేక ఆకర్షణ.

విద్యాసంస్థలు[మార్చు]

NBKR ఇంజనీరింగు కళాశాల
నారాయణా ఇంజనీరింగ్ కాలేజులు

నెల్లూరు ఉత్తమ నాణ్య కలిగిన విద్యను అందించే స్కూల్స్ కళాశాలలకు ప్రసిద్ధి. ఒక పక్క ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యా సౌకర్యాలను చక్కగా విస్తరిస్తంది. ప్రస్తుతం అన్ని కళాశాలలు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నకు అనుసంధానించబడి ఉన్నాయి. మెడికల్, డేంటల్ మరియు నర్సింగ్ ఇన్స్‌టిట్యూట్స్ విజయవాడ లోని డాక్టర్ ఎన్ టి ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్థ్ సైన్సెస్తో అనుసంధానించబడ్డాయి.

ప్రముఖ నారాయణా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన కార్యాలయం నెల్లూరు లోనే ఉంది. నారాయణా మెడికల్ కాలేజ్ యు జి మరియు పీ జి ఉన్నత విద్యను అందిస్తున్నాయి. నారాయణా డెంటల్ కాలేజ్ తొమ్మిది వైవిధ్యమున్న విభాగాలలో డెంటల్ యు జి మరియు పీ జి విద్యలను అందిస్తుంది. నారాయణా నర్సింగ్ ఇన్స్‌టిట్యూట్స్, నారాయణా యోగా & నేచురోపతీ కాలేజ్, నారాయణా ఫార్మసీ, నారాయణా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరఫీ, నారాయణా ఇంజనీరింగ్ కాలేజులు, జూనియర్ కాలేజులు మరియు స్కూల్స్ దేశమంతా ఉన్నాయి. నెల్లూరు చింతారెడ్డి పాలెంలో విడిగా మెడికల్, డెంటల్ మరియు నర్సింగ్ ఇన్స్‌టిట్యూట్స్ స్పెషల్ ఆసుపత్రులకు అనువైన ప్రదేశం. ముప్పవరపు వెంకయ్య నాయుడు కాలేజ్ చాలా పేరున్న కాలేజి. జగన్స్ డిగ్రీ మరియు పీజి కాలేజీ కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినది. దీని స్థాపకుడు జగన్మోహన రెడ్డి. ప్రస్తుతం ఈ కాలేజి మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. వారికి ఎమ్ సి అ, ఎమ్ బి ఎ మరియు ఫార్మసీకి చెందిన కాలేజులు ఉన్నాయి.

విద్యాలయాలు[మార్చు]

 • విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
 • వెంకటగిరి రాజా కళాశాల
 • సర్వోదయ డిగ్ర్రీ కాలేజి
 • దొడ్ల కౌ శల్యమ్మ మహిళా కళాశాల
 • జవహర్ భారతి కాలేజి, కావలి
 • ఎమ్ఎస్ఆర్ కాలేజి, కావలి.

ఆకర్షణలు[మార్చు]

అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు
నెల్లూరు దగ్గరలో సముద్రతీరం
పులికాట్ సరస్సు
శ్రీహరికోటలో అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం

జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉన్న రంగనాధ స్వామివారి ఆలయం, దగ్గరలోనే గొలగమూడిలో ఉన్న వెంకయ్యస్వామి మందిరం,ఉదయగిరి కోట, నరసింహ కొండ, పెంచల కోన, వెంకటగిరి రాజుల కోట, పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమం, పల్లిపాడు, మైపాడు బీచ్‌, శ్రీహరికోట వద్ద ఉన్న విఖ్యాతిగాంచిన రాకెట్‌ ప్రయోగ కేంద్రం,శ్రీ కామాక్షితాయి ఆలయం జొన్నవాడ, కృష్ణపట్నం రేవు, నేలపట్టు మొదలైన అనేక చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.

  • పులికాట్ సరస్సు: 500 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఉప్పునీటి సరస్సు.
  • నెల్లూరు
  • పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమం, పల్లిపాడు
  • శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రం
  • మైపాడు బీచ్
  • నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం: సూళ్ళూరుపేట దగ్గర బూడిదరంగు పెలికన్స్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
  • రంగనాధ స్వామివారి ఆలయం
  • గొలగమూడిలో వెంకయ్యస్వామి మందిరం
  • ఉదయగిరి కోట
  • నరసింహ కొండ
  • పెంచలకోన
  • వెంకటగిరి రాజుల కోట
  • శ్రీ కామాక్షితాయి ఆలయం జొన్నవాడ
  • కృష్ణపట్నం రేవు.
  • సంగం ఆనకట్ట
  • శ్రీవెంగమాంబ పేరంటాళ్ళ దేవాలయం నర్రవాడ
దేవాలయాలు

క్రీడలు[మార్చు]

నెల్లూరు జిల్లాలో అధికంగా చూడబడుతున్న మరియు ఆడబడుతున్న క్రీడ క్రికెట్. కబడి, బాడ్మింటన్ మరియు వాలిబాల్ మొదలైనవి ఈతర ప్రబలమైన క్రీడలు. చెస్ మరియు కేరమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా నగరంలో ప్రాబల్యత సంతరించుకున్నాయి. 1982 మరియు 1996 జాతీయ అవార్డును సాధించి అలాగే 1982 మరియు 1996 ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొని ల్యూసెన్నె మరియు ఆర్మేనియా టి ఎన్ పరమేశ్వరన్ నెల్లూరు వాసియే. ప్రత్యేక సందర్భాలలో చిన్న గ్రామాలలో కోడిపందాలు మరియు ఎద్దుల పందాలు జరుగుతుంటాయి.

జిల్లాకు చెందిన ప్రముఖులు[మార్చు]

అవధూతలు / యోగులు
స్వాతంత్ర్య సమర యోధులు
వైద్య రంగ ప్రముఖులు 


సాంఘిక ఉద్యమ ప్రముఖులు 
శాస్త్రవేత్తలు, పరిశోధన రంగ ప్రముఖులు 
ప్రముఖు పాత్రికేయలు
కవులు -సాహితి కారులు
రాజకీయ రంగ ప్రముఖులు


నాటక రంగ ప్రముఖులు


సినీరంగ ప్రముఖులు
పారిశ్రామికరంగ ప్రముఖులు
ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు

మాధ్యమం[మార్చు]

నెల్లూరు జిల్లాలో ప్రాంతీయ పత్రికలు అనేకం ఉన్నాయి. అవి వరుసగా నెల్లూరు ఎక్స్‌ప్రెస్, లాయర్, జామిన్రియాట్, నెల్లూరు న్యూస్, గూడూర్ న్యూస్, నగరభేరి ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో అనేకం సాక్షి, ఈనాడు, వార్త మరియు ఆంధ్రజ్యోతి వంటి పత్రికల వలన తుడిచి పెట్టుకు పోయినా లాయర్ మరియు జామిన్రియాట్ మాత్రం ఇప్పటికీ ప్రజాదరణతో ముందుకు సాగుతున్నాయి. నెల్లూరులో తెలుగు సినిమాలకు విపరీతమైన అభిమాన వర్గం ఉంది. పట్టణంలో చాలా సినిమా థియేటర్లు ఉన్నాయి. అదే విధముగ నెల్లూరు లోని సినిమా హాళలో ఫెసిలిటిస్ చాలా బాగుంటాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]


 1. GO ఉత్తర్వు Ms No. 676, మే 22, 2008 న విడుదలైన హిందూ పత్రికలో వార్త
 2. హై, అలర్ట్ (11 December 2016). "నెల్లూరు జిల్లా ట్యాబ్లాయిడ్". ఆంధ్రజ్యోతి. Retrieved 11 December 2016.
 3. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నెల్లూరు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.
 4. http://nellore.ap.nic.in/profile.htm http://nellore.ap.nic.in/profile.htm. Retrieved 23 September 2016. Missing or empty |title= (help); External link in |website= (help)