పుచ్చలపల్లి సుందరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుచ్చలపల్లి సుందరయ్య
సుందరయ్య విగ్రహం
జననంపుచ్చలపల్లి సుందరయ్య
1913 మే 1
అలగానిపాడు, నెల్లూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్)
మరణం1985 మే19
మరణ కారణంసహజ మరణం
నివాస ప్రాంతంనెల్లూరు
వృత్తిరాజకీయ నాయకుడు
ప్రసిద్ధికామ్రేడ్ పి.యస్
రాజకీయ పార్టీసిపిఎం
వెబ్‌సైటు
http://www.sundarayya.org/

పుచ్చలపల్లి సుందరయ్య (19131985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. సహచరులు ఇతనును "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు.[1] ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు. స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు.

జీవితం[మార్చు]

హైదరాబాదులో సుందరయ్య విగ్రహం

పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913, మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు ఇతనికు సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్యను వీధిబడిలోనే పూర్తిచేసాడు. తరువాత అక్కయ్య వాళ్ళ ఇంటివద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసు లలో చదివాడు. ఇతనిని "కమ్యూనిస్టు గాంధీ" అంటారు. పార్లమెంటు భవనంలో చప్రాసీల సైకిళ్లతోపాటు ఇతని సైకిలు కూడా స్టాండులో ఉండేది. రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిలును ఉపయోగించాడు. పెళ్ళి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్ళికాగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నాడు.[2] తండ్రినుంచి వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశాడు.1985, మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశాడు. హైదరాబాద్ భాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి. గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని పాతతరం నాయకులు వర్ణిస్తారు.[2]

రాజకీయాలు, కమ్యూనిస్టు ఉద్యమం[మార్చు]

గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై, సుందరయ్య 1930లో తన 17వ యేట ఉన్నత పాఠశాల రోజుల్లోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలలోను, ఉప్పు సత్యాగ్రహం లోను, సహాయ నిరాకరణోద్యమం లోను పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతనిని నిజామాబాద్, బోర్స్టల్ స్కూలు‌లో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదల అయినాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశాడు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, సోలీ బాట్లివాలా వంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ జాతీయ కార్య నిర్వాహక వర్గం సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి, క్రమంగా కాంగ్రేస్ సోషలిస్టు పార్టీ కార్యదర్శి అయ్యాడు.

అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తరువాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్యకు అప్పగించింది. ఈ సమయంలోనే కేరళకు చెందిన నంబూద్రిపాద్, కృష్ణ పిళ్ళై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీనుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు. సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించాడు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చాడు. 1936లో అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించిన వారిలో సుందరయ్య ఒకడు. ఆ సభకు సంయుక్త కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీషు ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినపుడు, 1939 నుండి 1942 వరకు, నాలుగేళ్ళు అజ్ఞాతంలో గడిపాడు.

1943లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేశారు. బొంబాయిలో మొదటి పార్టీ కాంగ్రెస్ జరిగింది. తరువాత రెండవ పార్టీ కాంగ్రెస్ కలకత్తాలో జరిగింది. రెండుసార్లు కేంద్ర కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యాడు. కలకత్తా సమావేశంలో పార్టీ సాయుధ పోరాటంను సమర్ధిస్తూ తీర్మానం చేసింది. దీనిని "కలకత్తా థీసిస్" అంటారు. అప్పటి సాధారణ కారదర్శి బి.టి.రణదివే ఈ తీర్మానాన్ని బలంగా సమర్ధించాడు. తత్ఫలితంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించారు. త్రిపుర, తెలంగాణ, తిరువాన్కురు ప్రాంతాలలో సాయుధ పోరాటాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది తెలంగాణా సాయుధ పోరాటం

తెలంగాణా పోరాటం[మార్చు]

ఈ విధంగా తలెత్తిన పోరాటాలలో నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ పోరాటానికి ముఖ్యమైన నాయకులలో సుందరయ్య ఒకడు. ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడు. 1952 లో ప్రత్యేక పార్టీ సమావేశంలో మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. పార్టీ అత్యున్నత స్థాయి సంఘమైన "పాలిట్ బ్యూరో" సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. విజయవాడలో జరిగిన మూడవ పార్టీ కాంగ్రెసులోను, పాలక్కాడ్‌లో జరిగిన నాలుగవ పార్టీ కాంగ్రెసులోను కూడా కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

తరువాత అమృత్‌సర్‌లో జరిగిన ఐదవ పార్టీ కాంగ్రెస్‌లో సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కమిటీకి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ సమయంలోనే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 1962 లో చైనా భారతదేశం యుద్ధం‌ సందర్భంగా, పార్టీ నాయకత్వంలో ఎస్.ఎ. డాంగే వర్గం భారత ప్రభుత్వాన్ని సమర్ధించింది. అంతే కాకుండా చైనా, రష్యా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాంగే వర్గం రష్యాకు అనుకూలమైన పంథాను సమర్ధించింది. అయితే పి.సి.జోషి, రణదివే వంటి నాయకుల వర్గం ఈ విధానాన్ని రివిజనిస్టు మార్గంగా భావించింది. డాంగే వర్గాన్ని లెఫ్టిస్టులనీ, రణదివె వర్గాన్ని రైటిస్టులనీ అన్నారు.

లెఫ్టిస్టు వర్గంలో ఉన్న ప్రముఖ నాయకుడైన సుందరయ్య అమృత్‌సర్ సమావేశం సమయంలో పార్టీ నాయకత్వంలో అధికుల (డాంగే వర్గం) ధృక్పథాన్ని వ్యతిరేకిస్తూ, తన బాధ్యతలన్నింటికీ రాజీనామా చేశాడు. 1962 నవంబరులో, చైనా యుద్ధం సమయంలో సుందరయ్యను అరెస్టు చేశారు.

"తెలంగాణా ప్రజల పోరాటం - దాని పాఠాలు" అన్న నివేదికలో సుందరయ్య అప్పటి పరిస్థితులనూ, పార్ఠీ విధానాలనూ, పోరాట క్రమాన్నీ విశదంగా విశ్లేషించాడు. సుందరయ్య తయారు చేసిన ఈ నివేదికను భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 1972 డిసెంబరు నెలలో విడుదల చేసింది.[3]

కమ్యూనిస్టుల విభజన[మార్చు]

1969 లో రొమేనియా అధ్యక్షుడు నికొలస్ చాచెస్క్యూ (మధ్యన) తో సుందరయ్య (ఎడమవైపు వ్యక్తి)

పైన చెప్పిన విభేదాల ఫలితంగా అక్టోబరు-1964 నవంబరులో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్‌లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అందులో లెఫ్టిస్టులనబడేవారు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేరుతో క్రొత్త పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీకి సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఈ సమావేశం జరిగిన కొద్ది కాలంలోనే భారత జాతీయ కాంగ్రెసు పాలనలో ఉన్న భారత దేశ ప్రభుత్వం అనేక "సి.పి.ఐ-ఎమ్" నాయకులను అరెస్టు చేసింది. సుందరయ్య కూడా అలా అరెస్టయిన వారిలో ఒకడు. 1966 మే వరకు నిర్బంధంలో ఉన్నాడు. 1975-1977 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించినపుడు అరెస్టును తప్పించుకోవడానికోసం సుందరయ్య అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

1976 వరకు సుందరయ్య సి.పి.ఐ-ఎమ్ పార్టీ సాధారణ కార్యదర్శిగా అవిచ్ఛిన్నంగా కొనసాగాడు. 1976 లో, ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో, పార్టీలో పొడసూపుతున్న "రివిజనిస్టు" భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య సాధారణ కార్యదర్శి పదవికి, పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు.[4]

చట్ట సభలలో ప్రాతినిధ్యం[మార్చు]

1952 లో సుందరయ్య మద్రాసు నియోజిక వర్గం నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటులో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యాడు. తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 1967 వరకు శాసన సభా సభ్యునిగా కొనసాగాడు. మళ్ళీ కొంత కాలం విరామం తరువాత 1978 లో శాసన సభకు ఎన్నికై, 1983 వరకు శాసన సభ సభ్యునిగా ఉన్నాడు.

తను మరణించే సమయానికి సుందరయ్య ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ సాధారణ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. అతని భార్య లీల సుందరయ్య కూడా సి.పి.ఐ.-ఎమ్ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు.

మరణం[మార్చు]

సుందరయ్య 1985, మే 19న మరణించాడు.[5][6]

రచనలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు, మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-05. Retrieved 2020-01-08.
  2. 2.0 2.1 తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు - 2006
  3. http://www.igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G4.pdf[permanent dead link]
  4. pp. 21-33P, My Resignation, by Sundarayya, P. 1991, Published by India Publishers and Distributors, New Delhi,
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-05. Retrieved 2020-01-08.
  6. "'Political background must for presidential candidate' - Newindpress.com". Archived from the original on 2007-09-27. Retrieved 2008-07-07.

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. [1] Archived 2008-03-15 at the Wayback Machine History on the verge of collapse in Hindu on 03-May-2006.
  2. [2] Remembrance, P. Sundarayya in Marxist daily Ganashakthi website.
  3. [3][permanent dead link] P. Sundarayya, Telengana People's Struggle and Its Lessons, December 1972, Published by the Communist Party of India (Marxist), Calcutta-29.