కాటమరాజు కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుస్తక ముఖచిత్రం

తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగిన వాటిల్లో కాటమరాజు కథ ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుదీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. ఈ పుస్తకానికి దిగుమర్తి సీతారామస్వామి ముందుమాట రచించారు. ఈ నాటకాన్ని స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై వారు పుస్తకంగా 1999 లో ప్రచురించారు. [1] కొమ్ము వారు ఈ కథను కాటమరాజు కొమ్ము కథలు గా ప్రదర్శిస్తారు.

సంక్షిప్త కథ[మార్చు]

కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. కాటమరాజు, యాదవరాజు నెల్లూరు సమీపానగల కనిగిరి ప్రాంతాల్ని పరిపాలించాడు. ఇతని కోట కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దిగువున వుండేది. అతడు గొప్ప పరాక్రమశాలి. అతనికి చాలా పశుసంపద వుండేది. అయితే ఒకసారి తీవ్రకరువు ఏర్పడితే, సరిహద్దులోని నెల్లూరు సీమను పాలించే నల్లసిద్ధి రాజు ప్రాంతంలోని అడవులలో పశువులను మేపుకొనేందుకు బదులుగా కొన్ని కోడెదూడలను ఇచ్చే ఒప్పందం కుదుర్చుకుంటాడు. నల్లసిద్ధిరాజు ఉంపుడుకత్తె కుందుమాదేవి (కన్నమదేవి) పెంపుడు చిలక ఆలమందలను బెదిరించడంతో దానిపై బాణం వేసిచంపుతారు కాటమరాజు అనుచరులు. దానికి ఆగ్రహించిన కన్నమదేవి తమ భటులతో వీరి పశువులను చంపిస్తుంది. దానికి కోపించి కాటమరాజు ఒప్పందాని ఉల్లంఘిస్తాడు. తదుపరి రాయభారం విఫలం కాగా యుద్ధం మొదలవుతుంది. నల్లసిద్ధి సేనాపతి ఖడ్గతిక్కన ఎర్రగడ్దపాటి పోరు క్రీ.శ 1280 – 1296 లో పరాజయం పొందుతాడు. వెనుతిరిగిన ఖడ్గ తిక్కన తన భార్య, తల్లి నిందించేసరికి మరల యుద్ధానికి వెళ్లి కాటమరాజు పక్షాన పోరులో పాల్గొన్న బ్రహ్మనాయుడు చేతిలో చనిపోతాడు. బ్రహ్మరుద్రయ్య చనిపాతాడు. ఆ తరువాత నల్లసిద్ధిరాజుకి కాటమరాజుకి జరిగిన యుద్ధంలో కాటమరాజు ఆవులు, ఎద్దుల, నల్లసిద్ధిరాజు గుఱ్ఝాలు, ఏనుగుల బలంతో తలపడతాయి. నల్లసిద్ధి చనిపోయి కాటమరాజుని విజయం వరిస్తుంది.

పల్నాటి యుద్ధం క్రీ.శ 12 వ శతాబ్దంలో జరగగా, కాటమరాజుమధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్నకాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకీ జరిగింది. కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది. దీనిని తొలుత శ్రీనాథకవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారమైనా, శ్రీనాథ విరచితమైన కథ దొరకలేదు.

మూలాలు[మార్చు]

  1. స్వాతికుమారి (2011-08-26). "ఆరుద్ర నాటకం 'కాటమరాజు కథ' – ఒక పరిచయం". poddu.