కాటమరాజు కొమ్ము కథలు
కాటమరాజుకు నల్లసిద్దికీ జరిగిన యుద్ధం కథాంశమే కాటమరాజు కథ. దీనిని ఎక్కువగా కొమ్ములవారు పాడుతారు. వీరు మాదిగలలో ఒక తెగ. కొమ్ములవారే కాక, గొల్లలలో పూజ గొల్లలు, కందుకూరు తాలూకాలో పికిలి వారు విశాఖపట్టణం ప్రాంతాలలో పొడపోతుల వారు, రాయలసీమ ప్రాంతంలో భట్టువారు (మాదిగలు) ఎఱ్ఱ గొల్లలూ, తెలంగాణాలో ఎఱ్ఱ గొల్లలూ, మందుచ్చు వారూ, బీరన్నలవారూ, యాదవ కథలను చెపుతారు[1]
కథలు
[మార్చు]ఈ కాటమరాజు కథాచక్రమున 32 కథలు కలవు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు పరిష్కరించిన కాటమరాజు కథను మొదటగా 1953లో మదరాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయమువారు ప్రకటించియున్నారు. ఇందులో కాటమరాజుకు సంబంధించిన వీరగాథాలు క్రింద ఇవ్వబడినవి.
- కాటమరాజుకు పట్నంకట్టినకథ.
- పాపనూకకథ.
- ఆవులమేపు.
- పాలేటికథ.
- ఎర్రయ్య తరకవాదము.
- జన్నివాడకథ.
- భట్టురాయబారము.
- కోటిపాటి తాటివృక్షంతెచ్చే కథ.
- బొంగరాల కథ.
- ఎర్రగడ్డపాటి పోట్లాట కథ.
- చల్లవారి జగడము.
- బీర్నీడు యుద్ధము.
- కరియావులరాజు యుద్ధము.
- బాలరాజుల యుద్ధము.
- ఆవుల ఎద్దుల జగడము.
- కాటమరాజు యుద్ధము.
కాటమరాజు కథా ప్రసక్తి
[మార్చు]కాటమరాజుకు నల్లసిద్దికీ మధ్య జరిగిన యుద్ధాన్ని గూర్చి మెకంజీ స్థానిక చరిత్రలు పద్దెనిమిదవ సంపుటంలో విపులంగా ఉంది. కాటమరాజుకు పెద్ద గోవుల మంద వుండేది. ఆ మందను మేపటానికి పాలకొండ, నల్లమల అడవుల్లో మేతకు తోలుకు పోయేవారు. వర్షాలు లేక పోవటం వల్ల మేత లేక నెల్లూరు మండలానికి వచ్చి నల్ల సిద్ధి చోళ మహారాజునకు పుల్లరిగా తమ మందలోని కోడె దూడల్ని ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానిక చరిత్రలో ఉంది. యుద్ధం జరగటానికి మూడు కారణాలున్నాయి.
- నెల్లూరు సీమలో కూడా మేత కరువు రావటం వల్ల నెల్లూరు రాజ్యంలో పంట పొలాన్నీ కూడా కాటమరాజు ఆలమందను మేప సాగాడు. ఇది నల్ల సిద్ధికి కోప కారణమైంది.
- అడవుల్లో వున్న క్రూర మృగాల్ని యాదవులు వేటాడటం వల్లనూ, మందల్ని విస్తారంగా ఆడవుల్లో ప్రవేశపెట్టటం వల్లనూ, మృగ సంతతి నశించింది. అది కూడా ద్వేషానికి కారణమైంది.
- ఇది కాక మనుమసిద్ధి రాజు ఉంపుడుకత్తె పెంపుడు చిలుకను కాటమరాజు తండ్రి పోలుర్రాజు బాణంతో కొట్టి చంపటం వల్ల సిద్ధి తన మనుషులతో కాటమరాజు ఆవుల మందల్ని చంపించాడు. దానితో కాటమరాజు పుల్లరి ఇవ్వటం మానేశాడు. అందువల్ల ఇరువురి మధ్య యుద్ధం జరిగింది.
గానం చేసే కొమ్మువారు
[మార్చు]కొమ్ముల వారనే వారు గంగ దర్శనానికి సంబంధించిన మాదిగలు. వీరు తాము జాంబవంతుని తెగకు సంబంధించిన వారమని చెప్పుకుంటూ వుంటారు. వీరినే చిత్తూరు జిల్లాలో బట్టువారని పిలుస్తారు. కొమ్ముల వారు యాదవుల్ని యాచిస్తారు. వారి గోత్రాలను చెపుతూ కాటమరాజు కథల్నీ, విష్ణు భాగవతమనే నామాంతరం గల కంసుడు కథను వీరు చెపుతారు. వీరి ప్రదర్శనలో వీరణాన్నీ, తిత్తినీ, తాళాల్నీ, కొమ్ముల్నీ ఉపయోగిస్తారు. కాటమరాజుకు సంబంధించిన కథలన్నీ వీరి దగ్గర తాళపత్ర గ్రంథరూపంలోనూ కంఠస్థంగానూ ఉన్నాయి.
కొమ్ము అంటే ఇత్తడితో చేయబడిన కొమ్ము లాగా వంకరగా తిరిగి వుండే గొట్టాన్ని కొమ్ము అని పిలుస్తారు. కథను ప్రారంభించే ముందూ, గోత్రాలను చెప్పే ముందూ, తానకములు పాడుతూ వున్నప్పుడూ ఈ కొమ్ముల్ని వుత్తేజంతో ఊదుతారు. ఈ కొమ్ముల ధ్వని శంఖారావం మాదిరిగా వుద్రేకాన్ని కలిగిస్తుంది. కొమ్ముల ధ్వని వూరందరికీ వినబడుతుంది, ఈ నాదాన్ని విన్న వెంటనే ఎక్కడివారు అక్కడికి చేరుకుంటారు. కొమ్ము ధ్వని పిలుపు లాంటిది . కొమ్ములను ఊదే వారవటం వల్ల వీరిని కొమ్ముల వారని పిలవటం అలవాటై పోయింది.
అంకమ్మ కథల్లోనూ, పల్నాటి వీర కథలలోనూ ఉపయోగించే పంబ జోడు వంటివే ఈ వీరణాలు. ఇవి రెండుగా వుంటాయి. ఇకటి వేప చెక్కతో గాని, రేలచెక్కతో గాని చేయబడతాయి. రెండవది ఇత్తడితో తయారు చేస్తారు. రెంటి యొక్క శబ్దంలోనూ వైవిధ్యముంటుంది. కొయ్యతో చేయబడిన వీరణ శబ్దానికీ, ఇత్తడితో చేయబడిన శబ్దానికి వ్వత్యాసముండి, రెండు శబ్దాల కలయిక, కథకు సరి జోడుగా వుంటుంది.
ఎఱ్ఱగడ్డపాటి పోట్లాలో పాల్గొన్న ఒంటి కొమ్ము బొల్లావు బొమ్మ, యాదవులు ఒరిగారనే వార్తను దొనకొండకు తెచ్చిన బసవ దేవుడు బొమ్మను పూజిస్తారు.
కథకుల వేష ధారణ
[మార్చు]కాటమ రాజు కథలను గానం చేసే టప్పుడు వీరణాలనే కాక, వారి శ్రుతి కొరకు తోలు తిత్తిని, లయకు తాళాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధాన కథకుడు నిలువు టంగీ పన్నెండు మూరల తలపాగా, కాళ్ళకు గజ్జెలు, నడుముకు నటికట్టు, చేతిలో పిడి గుడ్డ మాత్రం వుంటాయి. గంగ తర్కం పాడే టప్పుడు, ఒకరు గంగ వేషాన్నీ, ఇంకొకరు కాటమ రాజు వేషాన్నీ ధరించి ఎదురెదురుగా నిలబడి, చేతిలో కత్తి పట్టుకుని, ఆ కత్తి చివర ఒక నిమ్మ పండును గుచ్చి కాళ్ళలు గజ్జెలు కట్టుకుని, గంతులు వేస్తూ, కత్తిని త్రిప్పుతూ, రెండు పాత్రలూ వాదించు కుంటూ నటిస్తారు. ప్రధాన కథకుడుతో పాటు వంతలు పాడువారు ముగ్గురుంటారు. వీరిలో ఒకడు కత్తిని పడతాడు. రెండవ వాడు వీరణాలను వాయిస్తాడు. మూడవవాడు తాళం వేస్తాడు. ఈ ముగ్గురి లోనూ ఇద్దరు కథకు వంతగా ఊ కొడతారు.
కొన్ని పాటలు
[మార్చు]గంగ పాట
[మార్చు]గంగను కొలిచేరూ, ఏరువ
గంగను కొలిచేరూ
ఆకసాన సళ్ళాడు తురగా
గంగను కొలిచేరు, పాలేటి
గంగను కొలిచేరు.
బొల్లావు పాట
[మార్చు]కనక రాళ్ళ బోటి మీద
కనక వర్షమూ ఆవుకు
కనక వర్షమూ.
ఉద్దాగేరి ముద్దాపసుపు
ఆవుకొచ్చెనూ
బొల్లావు కొచ్చెను
ఆవు ఆవు ఆవు ఆవు ఆవు జగడమే
బొల్లావు జగడమే
మూలాలు
[మార్చు]- ↑ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి (1992). " గడగడ లాడించే కాటమరాజు కొమ్ము కథలు". తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్.
బయటి లింకులు
[మార్చు]- తంగిరాల, వేంకట సుబ్బారావు, ed. (1976). కాటమరాజు కథలు-మొదటి సంపుటం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.
- తంగిరాల, వేంకట సుబ్బారావు, ed. (1978). కాటమరాజు కథలు-రెండవ సంపుటం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.