కర్నూలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?కందనవోలు
కర్నూలు - کرنول
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E / 15.83; 78.05
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ప్రాంతం రాయలసీమ
జిల్లా(లు) కర్నూలు జిల్లా జిల్లా
కొండారెడ్డి బురుజు

కర్నూలు : (ఉర్దూ - کرنول )దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. కర్నూలు నగరము హైదరాబాదు నుండి 212 కి.మీ (అనగా 132 మై.) దూరంలో కలదు. ఆంధ్ర ప్రదేశ్ లోని అత్యధిక జనాభా గల నగరాలలో కర్నూలు ఏడవ స్థానములో నున్నది. రాయలసీమకి కర్నూలు పట్టణం ముఖద్వారముగా ఉంటుంది. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధాని గా కొనసాగింది. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వ్యుత్పత్తి[మార్చు]

ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో నదిలోకి బళ్లు దిగేముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది. కందెన రాయించుకునే ఈ ప్రదేశం పేరు బండ్ల మెట్ట. కాగా ఇప్పటికీ బండి మెట్ట అనబడు ప్రదేశం పాత నగరంలో కలదు. క్రీ.శ.1775లో ఆధ్యాత్మ రామాయణాన్ని రచించిన పెద్దన సోమయాజి కందెనవోలు అనే పదం వాడారు. విజయనగర సామ్రాజ్యం నాటి కైఫీయతుల్లో కందనోలు, కందనూలు అనే పేర్లు కనిపిస్తున్నాయి. అయ్యలరాజు నారాయణకవి తన హంసవింశతిలోని ఊర్ల పేర్ల జాబితాలో కందనూరు ఒకటి. పట్టణానికి 1830 ప్రాంతంలో కందనూరు అన్న పేరు వాడుకలో ఉండేదన్న సంగతి ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది[1].

చరిత్ర[మార్చు]

కర్నూలు పట్టణం నుండి 18 కి.మీ దూరంలో ఉన్న కేతవరం అనే ప్రదేశంలోని శిలలపై అతి ప్రాచీన చిత్రలేఖనాలు వెలువడ్డాయి. జుర్రేరు లోయ, కాతవాని కుంట మరియు యాగంటి లలో కూడా ఇటువంటి 35,000 నుండి 45,000 సంవత్సరాల ప్రాచీన చిత్రలేఖనాలు ఆ చుట్టుప్రక్కల కలవు.

కర్నూలు పట్టణం చుట్టుప్రక్కల కుగ్రామాలు 2,000 ఏళ్ళ క్రితం నుండి వెలిశాయి. చైనీసు ప్రయాణీకుడు హ్యూన్ ట్సాంగ్ కంచికి వెళ్ళే దారిలో కర్నూలు గుండా ప్రయాణించాడు. పదిహేడవ శతాబ్దంలో కర్నూలు బీజాపూరు సుల్తాను యొక్క అధీనంలో ఉండేది. మొగలు సామ్రాజ్యపు చివరి వాడైన ఔరంగజేబు 1687 లో దక్కన్ పీఠభూమిని ఆక్రమించి ఆంధ్రకు చెందిన హైదరాబాదు మరియు కర్నూలు లని తన అధ్యక్షులైన నిజాం లకి వాటి పరిపాలనా బాధ్యతలని అప్పగించాడు. హైదరాబాదు నిజాం, కర్నూలు నవాబు లిరువురూ స్వతంత్ర్యులు గా తమ రాజ్యాలని ఏలుకున్నారు. అలఫ్ ఖాన్ బహదూర్ అనబడే నవాబు కర్నూలు యొక్క మొట్ట మొదటి పరిపాలకుడు కాగా, అతని వంశీకులు 200 ఏళ్ళు కర్నూలు ని పరిపాలించారు. అందులో నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ ఒకడు. 18 వ శతాబ్దపు ప్రారంభంలోనే మైసూరు సుల్తానులతో చేతులు కలిపి బ్రిటీషు రాజ్యం పై యుద్ధం చేశారు.

కొండారెడ్డి బురుజు[మార్చు]

విజయనగర సామ్రాజ్య పాలకులు కొండారెడ్డి బురుజు అనబడు ఒక ఎత్తైన కోటని కట్టించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ కోట నుండి స్వరంగ మార్గం ఉన్నది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం ఆక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ స్వరంగ మార్గాన్ని మూసివేసినది.

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.

కర్నూలు mandal map[2]

1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.

18వ శతాబ్దం లో కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబు యొక్క జాగీరు లో భాగముగా ఉండేది. 1839 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. కర్నూలు నవాబు పరిపాలన అటు కడప జిల్లాలోని కొన్ని గ్రామాలు మొదలుకొని దాదాపుగా మొత్తం కర్నూలు జిల్లా అంతా, ఇటు ప్రకాశంలో కొంతభాగం వంటివి ఉండేవి. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో ఈ ప్రాంతంలో యాత్ర చేస్తూ తమ కాశీయాత్రచరిత్రలో సవివరంగా వ్రాసుకున్నారు. నవాబు తాలూకా ఉద్యోగస్థులుండే కసుబాస్థలమని వ్రాశారు. ఆ నవాబు తాలూకాను నాలుగు మేటీలుగా విభజించి ఒక్కొక్క మేటీ(పరిపాలన విభాగం)కి ఒక్కొక్క అములుదారుని ఏర్పరిచారని వ్రాశారు. తన వద్ద ఉన్న నౌకర్లకు జీతానికి బదులుగా జాగీర్లను కూడా ఇచ్చారని వ్రాశారు. నవాబు పరిపాలనలో ఉండే పలు హిందూ పుణ్యక్షేత్రాలైన మహానంది, అహోబిలం, శ్రీశైలం వంటి వాటిపై సుంకాలు వేసి, భారీ ఆదాయం స్వీకరించి క్షేత్రాలకు మాత్రం ఏ సదుపాయం చేసేవారు కాదు.[1]

1839 వేసవి కాలంలో హైదరాబాదు నగరంలో ఒక బీద ముస్లిం స్త్రీ మరణించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఒక వ్యక్తికి తానొక రహస్యం చెప్పదలిచాననీ, తనకొక పని చేసిపెట్టాలనీ కోరింది. ఆ పెద్దమనిషి ఆమెది ఆఖరి కోరిక కదాయని అందుకంగీకరించగా ఒక రక్షరేకు(తాయెత్తు) చేతికిచ్చి దీనిని మూసీనదిలో పారవెయ్యమన్నది. అది చేద్దామనుకుంటూనే ఆయన దీనిలో ఏదో రహస్యం వుందని అనుమానించి బ్రిటీష్ వారైన పై అధికారులకు తీసుకువెళ్లి ఇచ్చారు. దాన్ని వారు పరిశీలించి నిజాం నవాబు సోదరుడు కర్నూలు నవాబుకు రాసిన ఉత్తరమనీ, రక్షరేకుల్లో ఉన్న మతపరమైన విషయాల ద్వారా తిరుగుబాటుకు సిద్ధం చేస్తున్నారని తెలుసుకున్నారు. ఆపైన కర్నూలు నవాబు వద్దకు వెళ్ళి అతని వద్ద ఉండకూడని భారీ ఆయుధాగారం ఉందన్న అనుమానం మీద సోదా చేశారు. అన్ని విధాలుగానూ, ధైర్యంగా నవాబు సహకరించారు. మొదట ఎంత సోదా చేసినా పెద్దసంఖ్యలోని ఆయుధాలేవీ దొరకలేదు. ఇంగ్లీష్ అధికారులు పట్టువదలక సోదా చేస్తే జనానాలోని మైదానం వద్ద కోటగోడల్లో బోలుగా తయారుచేసి లోపల గొప్ప ఆయుధాగారాన్ని సిద్ధం చేశారు. దానితో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ ను బంధించి తిరుచునాపల్లి జైలులో రాజకీయఖైదీగా ఉంచారు. తర్వాత క్రైస్తవ మతంపై ఆసక్తి చూపుతూ చర్చికి వెళ్తున్న రోజుల్లో ఒక ముస్లిం ఫకీరు చర్చి వెలుపల 1940 జూలై నెలలో కత్తితో పొడిచి చంపారు.[3] నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది. 1947లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.

కర్నూలు ఎ.పి.ఎస్.ఆర్.టీ.సీ బస్టాండు రాష్ట్రములో మూడో పెద్ద బస్టాండు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రములో రెండో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి.

పరిపాలన[మార్చు]

కర్నూలు పట్టణం, మండల కేంద్రము మరియు ఆదాయ విభాగము. 1953 లోమద్రాసు రాష్ట్రం నుండి వేరు చేయబడ్డ ఆంధ్ర రాష్ట్రానికి 1-అక్టోబరు-1953 నుండి 31-అక్టోబరు-1956 వరకు కర్నూలు రాజధానిగా వ్యవహరించినది. ఆ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నాటి జిల్లా కోర్టు భవన సమూహాలు అప్పటి శాసన సభ గా వాడుకునేవారు.

భౌగోళిక మరియు వాతావరణ వివరాలు[మార్చు]

కర్నూలు 15°50′00″N 78°03′00″E / 15.8333°N 78.05°E / 15.8333; 78.05తుంగభద్ర నదీ తీరాన ఉన్నది. హంద్రీ, నీవా నదులు కూడా కర్నూలు గుండా పారుతాయి. డచ్ దేశస్తులచే ప్రయాణ సౌకర్యార్థం నిర్మిచబడ్డ కె సి కెనాల్ (కర్నూలు - కడప కాలువ) ప్రస్తుతము నీటి పారుదలకి వినియోగించబడుతున్నది.

రాయలసీమ లోనే అతిపెద్ద జిల్లా అయినా, కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ లో బాగా వెనుకబడ్డ ప్రాంతాలలో ఒకటి.

కర్నూలుది ఉష్ణ మండల వాతావరణం. వేసవులలో 26 నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడు, చలికాలం 12 నుండి 31 డిగ్రీల సెంటీగ్రేడు నమోదవుతుంది. వార్షిక సరాసరి వర్షపాతం 30 inches (762 mm) గా నమోదవుతుంది.

కర్నూలు పట్టణం లోని ప్రదేశాలు[మార్చు]

నంద్యాల చెక్ పోస్టు వద్ద నుండి రాజవిహార్ హోటల్ కూడలి వరకు ఉన్న రోడ్డు కర్నూలు పట్టణము కు వెన్నెముక వంటిది. రాజవిహార్ కూడలి వద్ద కుడి వైపు వెళ్ళే రోడ్డు కొండారెడ్డి బురుజు, పాత బస్టాండు, పెద్ద పార్కు వద్దకి దారి తీయగా, ఎడమ వైపు వెళ్ళేరోడ్డు రైల్వే స్టేషను, కొత్త బస్టాండు లకి దారి తీస్తాయి.

 • మాధవి నగర్
 • జయరాం నగర్
 • టెలికాం నగర్
 • ఆరోరా నగర్
 • వెంకటాద్రి నగర్
 • ఎన్ సి సి నగర్
 • సలాం నగర్
 • శ్రీ రామ నగర్
 • శ్రీ వెంకటేష్ నగర్
 • అబ్బాస్ నగర్
 • షరీన్ నగర్
 • కృష్ణా నగర్
 • న్యూ కృష్ణ నగర్
 • మద్దూర్ (సుబ్బారెడ్డి) నగర్
 • సి క్యాంప్
 • బి క్యాంప్
 • ఏ క్యాంప్
 • దేవ నగర్
 • గాయత్రి ఎస్టేట్
 • లక్ష్మీ నగర్
 • గణేష్ నగర్
 • సంపత్ నగర్
 • అల్లూరి సీతారామరాజు నగర్
 • బుధవార్ పేట్
 • బాకర్ కట్ట
 • కేవీఆర్ గార్డెన్ కాలనీ
 • ఖడక్ పుర
 • బొంగుల బజార్
 • పూలబజార్
 • గని గల్లి
 • వాసవీ నగర్

చూడదగ్గ ప్రదేశాలు[మార్చు]

కర్నూలు జిల్లాలో చూడదగిన ప్రదేశాలలో ఒకటి బెలూంగుహలు. ఇవి కర్నూలు జిల్లాలో యాగంటి పుణ్య క్షేత్రానికి దగ్గరలో కొలిమిగుండ్ల దగ్గర ఉన్నాయి. ఇక్కడ గుహలను చూడడానికి ప్రజలు దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసియా లోనే అతిపెద్ద సహజ గుహలు. కర్నూలు లో పుల్లారెడ్డి నేతిమిఠాయిలు ప్రఖ్యాతి గాంచినవి. . శ్రీశైలం కూడా చాలా ప్రసిద్ధి చెందినది. షిర్డీ తరువాత కట్టిన సాయిబాబ గుడి కర్నూలు నగరంలో ఉంది.

ఉన్నత విద్యా సంస్థలు[మార్చు]

 • ఉస్మానియా డిగ్రీ కళాశాల
 • రాయలసీమ యూనివర్సిటి
 • గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (పురుషులు)
 • మాంటిస్సోరి విద్యాసంస్థలు
 • కర్నూలు వైద్య కళాశాల
 • పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల
 • సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల
 • కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల (కశిరెడ్డి వెంకటరెడ్డి)
 • యస్.టి.బి.సి.కళాశాల,
 • బాలశివ డిగ్రీ కళాశాల
 • వాసవి డిగ్రీ కళాశాల,
 • కర్నూలు డిగ్రీ కళాశాల, కర్నూలు,
 • రవి జూనియర్ కళాశాల ,తిప్పా రెడ్డి పల్లె
 • కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు
 • సెయింట్ జోసెఫ్ కాలేజీ, కర్నూల్.
 • ఉషొదయ బి.ఈడి కళశాల,ఎమిగనూరు
 • శ్రి వైష్ణవి జూనియర్ కళాశాల,కర్నూలు
 • రామక్రిష్న డీగ్రీ కళాశాల,నంద్యాల
 • పుల్లారెడ్డి వైద్య కళాశాల
 • శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల

కర్నూలు పట్టణ చిత్రమాలిక[మార్చు]

సిల్వర్ జుబిలీ ప్రభుత్వ కళాశాల[మార్చు]

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల భవన ప్రవేశ ద్వారము

నగరంలోని బ్-క్యాంప్ లో సిల్వర్ జుబిలీ ప్రభుత్వ కళాశల కలదు. 1972 లో స్వతంత్ర్య ప్రాప్తి రజతోత్సవ సంబరాల సందర్భంలో ఈ కళాశాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థాపించినది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన బాలురకి మాత్రం ఇందులో స్థానం దక్కేది. వేర్పాటు (తెలంగాణ, ఆంధ్ర) ఉద్యమాల నేపథ్యంలో, రాష్ట్రం లోని మూడు ప్రాంతాల నుండి విద్యార్థులకు ప్రవేశం కల్పించి ప్రాంతీయ సయోధ్య కుదర్చాలనే తాపత్రయంతో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఐ ఏ ఎస్ అధికారి శ్రీ ఎం వి రాజగోపాల్ లు ఈ కళాశాల విద్యార్థులకు ఉచిత భోజన, ఉచిత విడిది మరియు ఉచిత బోధన అందించేవిధంగా రూపకల్పన చేశారు. ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి రాజధానిలో ఈ స్వప్నం సాకారమైనది. 42:36:22 నిష్పత్తి లో ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం మరియు రాయలసీమ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్త ప్రవేశ పరీక్ష లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించేవారు. 2005 లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ కళాశాల యొక్క స్వయంప్రతిపత్తిని ప్రదానం చేసినది. బెంగుళూరు కి చెందిన నేషనల్ అక్రెడిషన్ అండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ విద్యా సంబంధిత, మౌలిక సదుపాయాల పరీక్షించి . "ఏ" గ్రేడుని ప్రదానం చేసినది. ఈ కళాశాల ప్రారిశ్రామిక రసాయన శాస్త్రము, ఔషధ రసాయన శాస్త్రము, సూక్ష్మ జీవ శాస్త్రము, జీవ రసాయన శాస్త్రము, కంప్యూటర్ సైన్స్ మరియు ట్రావెల్ అండ్ టూరిజం వంటి వృత్తి విద్యా కోర్సులని పరిచయం చేసినది. ఆంగ్లం, తెలుగు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం మరియు అర్థ శాస్త్రం లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులని అందిస్తుంది.

అక్టోబరు 2009 వరదలు[మార్చు]

వరదల అనంతరం కర్నూలు పట్టణ దృశ్యం

అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.[4] హంద్రీ మరియు తుంగభద్ర నదుల తీరప్రాంతాలలోని ఇండ్లు రెండు అంతస్థులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ముంపుసమస్య మరింతగా పెరిగింది. రెండు నదులు పట్టణాన్ని రెండువైపున నుంచి ఉధృతరూపంలో ప్రవహించి పట్టణాన్ని చుట్టుముట్టడంతో ప్రజలు భీతిల్లిపోయారు. వరదనీరు చారిత్రక కొండారెడ్డి బురుజు వరకు వచ్చిచేరింది.[5] అక్టోబరు 1 తేది అర్థరాత్రికి మొదలైన వరద సమస్య తెల్లవారుజాము వరకు తీరప్రాంతాలకు వ్యాపించింది. రెండవ తేది మధ్యాహ్నం వరకు వరద నీరు ఉధృతరూపం దాల్చి దాదాపు 65 వేల ప్రజలు శిబిరాలలో తలదాచుకున్నారు.[6] అక్టోబర్ 3 సాయంత్రం తరువాత నీటిమట్టం తగ్గింది. ప్రాణనష్టంతో పాటు అపార ఆస్తినష్టం జరిగింది. రోడ్లపై చనిపోయిన పశువుల కళేబరాల దుర్గంధం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, నీటి సరఫరా మరియు పూర్తిగా మునిగిన ఇండ్లలోని సామాగ్రి, దుస్తులు పనికిరాకుండా పోవడంతో పట్టణ వాసులు తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

రవాణా[మార్చు]

బస్టాండు ఎదుట కర్నూలు పట్టణం దృశ్యం

హైదరాబాదు నుండి రాయలసీమలో ఏ జిల్లాకు వెళ్ళాలన్నా కర్నూలు గుండా ప్రయాణించవలసిందే! అందుకే దీనిని రాయలసీమ ముఖద్వారాము గా వ్యవహరిస్తారు. హైదరాబాదు, విజయవాడ ల తర్వాత కర్నూలు లో మూడవ అతిపెద్ద బస్టాండు కలదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చే మరియు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చే ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక కేంద్రాలతో బాటుగా బెంగుళూరు మరియు చెన్నై లకి కర్నూలు నుండి ప్రయాణ సౌకర్యాలు కలవు.

7వ జాతీయ రహదారి పై కర్నూలు నుండి హైదరాబాదు (210 కి.మీ ,4.5 గంటలు), అనంతపురము (140 కి.మీ, 3 గంటలు), హిందూపురం (245 కి.మీ, 5.5 గంటలు) మరియు బెంగుళూరు (360 కి.మీ, 6.5 గంటలు) గలవు. 18 వ జాతీయ రహదారిపై కర్నూలు-చిత్తూరు లకు మార్గంలో పాణ్యం, నంద్యాల, ఆళ్ళగడ్డ, అహోబిలం, మహానంది, మైదుకూరు, కడప, రాయచోటి, పీలేరు గలవు.

51వ రాష్ట్రీయ రహదారిపై కర్నూలుతో బాటు శ్రీశైలం, వినుకొండ, గుంటూరు, విజయవాడలు గలవు.

హైదరాబాదు-గుంతకల్లు రైలు మార్గంలో కర్నూలు పట్టణం కలదు. హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, చిత్తూరు, తిరుపతి, జైపూర్, మదురై, షిరిడీ మరియు బెంగుళూరు లకి ఎక్స్‌ప్రెస్ రైళ్ళు గలవు. హైదరాబాదు, గుంతకల్లు మరియు గుంటూరు లకి ప్యాసింజర్ రైళ్ళు కూడా కలవు.

కర్నూలు పట్టణం కాకుండా జిల్లాలోని ఆదోని, నంద్యాల మరియు డోన్(కూడలి)లలో రైల్వే స్టేషన్లు గలవు. ఆదోని చెన్నై-ముంబయి రైలు మార్గంలో గలదు. ప్రతి రోజు ఈ నగరాలతో బాటు న్యూ ఢిల్లీ కి పలు రైళ్ళు గలవు. గలవు. నంద్యాల గుంతకల్లు-విజయవాడ రైలు మార్గంలో కలదు. నంద్యాల నుండి ప్రతిరోజు హైదరాబాదు, విజయవాడ, బెంగుళూరు, విశాఖపట్టణం మరియు హౌరా లకి రైళ్ళు గలవు. డోన్ కూడలి గుంతకల్లు-సికింద్రాబాదు/విజయవాడ రైలు మార్గంలో కలదు. నంద్యాల, కర్నూలు గుండా వెళ్ళే ప్రతి రైలు ఈ కూడలి నుండి వెళ్ళవలసిందే.

కర్నూలు పట్టణానికి అతి సమీప విమానాశ్రయము హైదరాబాదు లోని శంషాబాదు లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము.

కర్నూలు పట్టణంలో చలనచిత్ర ప్రదర్శనశాలలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్ద ఆరు(6) థియేటర్లు గల హాల్ ఆనంద్ సినీ కాంప్లెక్స్ కర్నూల్లో ఉంది.

కర్నూలులో చూడవలసినవి[మార్చు]

ఇతర వివరాలు[మార్చు]

 • కర్నూలు యొక్క పిన్ కోడు: 518001
 • కర్నూలు యొక్క ఎస్ టీ డీ కోడు: 08518

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
 2. http://asihyd.ap.nic.in/kurnool/index.htm
 3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలూ-గాథలూ (మొదటి సంపుటం). 
 4. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 03-10-2009
 5. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
 6. ఈనాడు దినపత్రిక, తేది 04-10-2009

బయటి లింకులు[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కర్నూలు&oldid=1840646" నుండి వెలికితీశారు