శ్రీశైలం ప్రాజెక్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీశైలం ఆనకట్ట 2005 నాడు గేట్లు తీసినప్పటి దృశ్యం
సూర్యాస్తమయం కృష్ట్ణానది.శ్రీశైలం.

కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ లో నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. ఇటీవలి కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు గా మార్చారు. అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోని ప్రవేశించింది.[1] భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటె 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది.

స్థలము[మార్చు]

శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉన్నది. ఈ పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టానికి 0.8 కి.మీ. దిగువన డ్యాము నిర్మించబడింది. ఇది హైదరాబాదు కు 200 కి.మీ., విజయవాడకు 250 కి.మీ., కర్నూలుకు 180 కి.మీ. దూరంలో ఉన్నది.

చరిత్ర[మార్చు]

<శ్రీశైలం ప్రాజెక్టు/center>

ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది. 1964లో రూ.39.97 కోట్లు గా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి రూ.567.27 కోట్లయింది. డ్యాము నిర్మాణం క్రెస్టుగేట్లతో సహా 1984 డిసెంబర్ నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోని ప్రవేశించింది.[2] భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటె 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది.

అక్టోబరు 2009 వరదలు[మార్చు]

ప్రాజెక్టు చరిత్రలోనే ఊహించడానికి కూడా వీలులేని విధంగా అక్టోబరు 2, 2009న ప్రాజెక్టు సామర్థానికి మించి వరదనీరు వచ్చిచేరింది. మూడుదశాబ్దాల క్రితం 13 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని 25 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించడంతో ప్రాజెక్టు అధికారులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తిననూ ఇన్‌ఫ్లో చాలా అధికస్థాయిలో అవుట్‌ఫ్లో కంటె రెట్టింపు స్థాయిలో ఉండటంతో ఒకదశలో ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించవచ్చని ప్రాజెక్టు లోతట్టు గ్రామాలు మునిగిపోవచ్చని భావించారు. దీనితో విద్యుత్తు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాలలోని జనావాసాలను పూర్తిగా ఖాళిచేయించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా అక్టోబరు 2, 2009 మధ్యాహ్నం నాటికి 896 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం దాటితే ఏ క్షణమైనా వరద ఉధృతితో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని భావించిన ఇంజనీర్లు సైతం ప్రాజెక్టు శక్తిని చూసి నివ్వెరపోయారు.[3] అక్టోబరు 2 అర్థరాత్రి నుంచి వరద కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రతిగంటకు రెండు అంగుళాల నీటిమట్టం తగ్గడంతో అక్టోబరు 3 సాయంత్రం నాటికి భయాందోళనలు తగ్గాయి.


కుడిగట్టు విద్యుత్కేంద్రం కూడా డ్యాము నిర్మాణంలో భాగంగానే నిర్మించారు. ఈ విద్యుత్కేంద్రంలోని 7 యూనిట్లు 1982లో మొదలుకొని 1987 నాటికి అన్నీ పని ప్రారంభించాయి. ఎడమగట్టు విద్యుత్కేంద్రంలోని 6 యూనిట్లు మాత్రం ప్రాజెక్టు నిర్మాణంలో భాగం కావు. వీటిని తరువాతి కాలంలో రూ.2620 కోట్ల ఖర్చుతో జపాను ఆర్థిక సహాయంతో నిర్మించారు. 2001, 2003 మధ్యకాలంలో ఈ యూనిట్లన్నీ పని ప్రారంభించాయి.

ప్రాజెక్టు గణాంకాలు[మార్చు]

శ్రీశైలం ఆనకట్ట 2005 నాడు గేట్లు తీసినప్పటి దృశ్యం

డ్యాము[మార్చు]

 • డ్యాము పొడవు:512మీ.
 • క్రెస్టుగేట్ల సంఖ్య:12
 • జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం:263 టి.ఎం.సి
 • ఇందులో వాడుకోగలిగే నీరు:223 టి.ఎం.సి

కుడిగట్టు విద్యుత్కేంద్రం[మార్చు]

 • మొత్తం ఉత్పత్తి సామర్థ్యం: 770 మె.వా.
 • యూనిట్ల సంఖ్య: 7 x 110 మె.వా.

ఎడమగట్టు విద్యుత్కేంద్రం[మార్చు]

ఎడమగట్టు విద్యుత్కేంద్రం భూగర్భంలో నిర్మింపబడింది. జపాను ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కేంద్రం దేశంలోనే అరుదైనది.

 • మొత్తం ఉత్పత్తి సామర్థ్యం:900 మె.వా.
 • యూనిట్ల సంఖ్య: 6 x 150 మె.వా.


సాగునీటి సరఫరా వివరాలు[మార్చు]

శ్రీశైలం రిజర్వాయిర్

కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుండి తీసుకునే ఏర్పాట్లతో ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలకు మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ రాయలసీమ ప్రాంతాలకు నీరు తిసుకువెళ్తుంది. ఎడమ కాలువ నల్గొండ జిల్లాకు నీటి సరఫరా చేస్తుంది.


కుడి ప్రధాన కాలువ: కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద గల హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాశయం నుండి బయలుదేరే 16.4 కి.మీ. పొడవైన ఈ కాలువ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరి అంతమవుతుంది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మూడు రెగ్యులేటర్ల కలయిక. కుడి రెగ్యులేటర్ నుండి కుడి బ్రాంచి కాలువ ద్వారా కడప, కర్నూలు జిల్లాలకు నీరు సరఫరా అవుతుంది. ఈ కాలువ 50 కి.మీ. దూరంలోని గోరకల్లు బాలెన్సింగు జలాశయం (పూర్వ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు పేరిట దీనికి నరసింహరాయ జలాశయం అని పేరు పెట్టారు) కు, 112.7 కి.మీ. దూరంలోని అవుకు జలాశయంకు నీటిని చేరుస్తుంది. కృష్ణలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద లభించే అదనపు నీటిని ఈ జలాశయాల్లోకి మళ్ళించే పథకమిది. కర్నూలు, కడప జిల్లాల్లో 1,90,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్టిది.


బనకచర్ల ఎడమ రెగ్యులేటర్ నుండి తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ బయలుదేరి వెలుగోడు జలాశయానికి, అక్కడి నుండి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జలాశయానికి, సోమశిల ప్రాజెక్టుకు చేరుతుంది. మధ్య రెగ్యులేటర్ ద్వారా వరద సమయంలో వెల్లువెత్తే నీటిని నిప్పులవాగులోకి వదిలే ఏర్పాటు ఉంది. జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా, పెన్నా నదులను కలిపే ప్రణాళికలో ఈ రెగ్యులేటర్ ద్వారా నిప్పులవాగు, గాలేరు, కుందేరు, పెన్నాలను కలిపే ప్రతిపాదన ఉన్నది.


శ్రీశైలం ఎడమ కాలువ: తొలి ప్రతిపాదనలను అనుసరించి, ఎడమ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి, నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 30 టి.ఎం.సి నీటిని సరఫరా చేస్తుంది. అయితే తరువాతి కాలంలో ఈ ప్రతిపాదన వెనక్కుపోయి, దాని స్థానంలో ఎత్తిపోతల పథకం పరిశీలన లోకి వచ్చింది. అదే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నుండి నీటిని పంపుచేసి, నల్గొండకు తాగు, సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. భారతదేశపు అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన ఈ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు, 212 ఫ్లోరైడు ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం నుండి నీటిని పుట్టంగండి వద్ద కొండపైనున్న జలాశయంలోకి నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోస్తారు. అక్కడినుండి 10 కి.మీ. దూరంలోని అక్కంపల్లి బాలెన్సింగు జలాశయం లోకి నీరు చేరుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుండి 143 కి.మీ. సొరంగం తవ్వి సహజంగా నీటిని పారించే ప్రతిపాదనపై సర్వే జరుగుతున్నది.

ముంపు, పునరావాసం[మార్చు]

జలాశయంలో మునిగిపోయే గ్రామాల ప్రజల పునరావాసానికి సంబంధించి, శ్రీశైలం ప్రాజెక్టు ఎంతో వివాదాస్పదమైంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని 100 గ్రామాలు, 17 శివారు పల్లెలు జలాశయంలో మునిగిపోయాయి.


 • టి.ఎం.సి:(Thousand Million Cubic Feet) శతకోటి ఘనపుటడుగులు. ఘనపరిమాణపు కొలత.
 • క్యూసెక్కు: క్యూబిక్ ఫుట్/సెకండు. ప్రవాహపు రేటు యొక్క కొలత. 1 క్యూసెక్కు = 28.317 లీటర్లు/సెకండు

దృశ్యమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. సాక్షి దినపత్రిక, తేది 04-10-2009
 2. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
 3. సాక్షి దినపత్రిక, తేది 04-10-2009