Jump to content

ఖమ్మం జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 17°15′N 80°09′E / 17.25°N 80.15°E / 17.25; 80.15
వికీపీడియా నుండి
  ?ఖమ్మం
తెలంగాణ • భారతదేశం
దుమ్ముగూడెం ఆనకట్ట
దుమ్ముగూడెం ఆనకట్ట
దుమ్ముగూడెం ఆనకట్ట
అక్షాంశరేఖాంశాలు: 17°15′N 80°09′E / 17.25°N 80.15°E / 17.25; 80.15
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 4,360 చ.కి.మీ. కి.మీ² (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. చ.మై)
ముఖ్య పట్టణం ఖమ్మం
ప్రాంతం ఉత్తర తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
13,89,566 (2011 నాటికి)
• 175/కి.మీ² (453/చ.మై)
• 1391936
• 1406278
• 62.26 శాతం (2001)
• 73.20
• 57.85
ఖమ్మం ఖిల్లా

ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఖమ్మం దీని ముఖ్యపట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 1,389,566.

చరిత్ర

[మార్చు]

చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయం నుండి వచ్చినట్టుగా, కాలక్రమేణా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంబాధ్రిగా పిలువబడినట్టు తెలుస్తుంది. ఉర్దూ భాషలో కంబ అనగా రాతి స్తంభం కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణంలో కల రాతి శిఖరం నుండి వచ్చినట్టుగా మరొక వాదన. తెలంగాణాలో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఖమ్మంలో కల నరసింహాలయం త్రేతాయుగం నాటిదని నమ్మకం.

సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లందు పట్టణం ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పరచబడింది, అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, అశ్వారావుపేట, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. అయితే 2014 లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం భద్రాచలం పట్టణం, మండల కేంద్రం, మినహా ఆ మండలంలోని గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రంపచోడవరం డివిజన్ లో కలిసాయి.

పటం
ఖమ్మం జిల్లా

కౄరమయిన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో, అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.

భౌగోళిక స్వరూపం

[మార్చు]

ఖమ్మం భౌగోళికంగా 16-45, 18-35 ఉత్తర అక్షాంశాలు, 76-47, 80-47 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఉత్తరాన ఛత్తీస్‌గడ్ రాష్ట్రము, నైరుతి దిశలో నల్గొండ జిల్లా, తూర్పున ఉభయగోదావరి జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లా, ఈశాన్యాన ఒడిషా రాష్ట్రం, పశ్చిమాన వరంగల్లు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గోదావరి,కిన్నెరసాని, వైరా, పాలేరు, శబరి, మున్నేరు, తాలిపేరు, లంకా సాగరు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.

ఆర్ధిక స్థితి గతులు

[మార్చు]

2006 లో భారతప్రభుత్వం ఖమ్మం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించింది. దేశం మొత్తం మీద మొత్తం 640 జిల్లాలలో ఉన్న 250 వెనుకబడిన జిల్లాలలో ఇది ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన జిల్లాలకు అందించే నిధులను (బి ఆర్ జి ఎఫ్)అందుకుంటున్న 13 జిల్లాలలో ఖమ్మం ఒకటి.

వ్యవసాయం

[మార్చు]

ఖమ్మం జిల్లా భూములు వ్యవసాయానికి యుక్తమైనట్లు ఉంటాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కనుక విస్తృతశ్రేణిలో మిరప, పొగాకు, మామిడి, అరటి, ముంతమామిడి, కొబ్బరి, పామ్ అయిల్, కోకో, వరి, మిరియాలు మొదలైనవి పండిస్తారు. పండ్లు, కూరగాయలు, పూలు వాటి విత్తనాలు ఉత్పత్తి, వితరణ వంటి ప్రధాన కార్యకలాపాలకు తోటపని శాఖ (హార్ట్ కల్చర్ డిపార్ట్‌మెంట్) తోడ్పాటు ఉంది.

ప్రణాళికలు

[మార్చు]
  • నాగార్జున సాగర్ కాలువలు. (ప్రధానమైంది)
  • వైరా
  • తాలిపేరు.
  • బయ్యారం.
  • బాతుపల్లి.
  • లంకాసాగర్.
  • ముకమామిడి.
  • పెదవాగు.
  • పాలియర్ రిజర్వాయర్.

నీటి పారుదల వివరాలు

[మార్చు]

ఖమ్మం జిల్లాలో 4 మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.[1]

  1. వైరా రిజర్వాయర్: వైరా నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట పొడవు 1,320 అడుగులు. ఇది వైరా గ్రామం దగ్గర ఉంది. దీని మూలంగా సుమారు 25వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతున్నది.[2]
  2. పాలేరు ప్రాజెక్టు: ఇది ఒక మధ్య తరహా ప్రాజెక్టు. ఖమ్మం పట్టణానికి 30 కి.మీ. దూరంలో పాలేరు నదిపై కట్టబడింది. 1928లో 20.7 లక్షల రూపాయలతో కట్టబడింది. 19,694 ఎకరాలకు నీరు అందిస్తుంది.తరువాత దీనిని నాగార్జునసాగర్ ఎడమ కాళువ బాలన్సింగ్ రిజర్వాయిర్‌గా వాడుతున్నారు.
  3. లంకసాగర్ ప్రాజెక్టు: పెనుబల్లి మండలం అడవిమల్లాల వద్ద కొత్తలేరుపై కట్టబడిన నీరునిలువ రిజర్వాయిర్. దీనిని ----- (?)లో 101 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీని ఆయకట్టు 7,353 ఎకరాలు. అందులో 6,800 ఎకరాలకు ఇది జల వనరుగా ఉంది.
  4. కిన్నెరసాని ప్రాజెక్టు:కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలంలోని యానంబైలు వద్ద రిజర్వాయిర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
  5. ము క్కమామిడి ప్రాజెక్టు: గోదావరి ఉపనది పాములేరుపై ముక్కమామిడి వద్ద ఇది 1981లో పూర్తి చేయబడింది. వ్యయం 113.93 లక్షల రూపాయలు. ఆయకట్టు 3,262 ఎకరాలు.
  6. పెద్దవాగు ప్రాజెక్టు: ఇది అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద పెద్దవాగుపై కట్టారు. 1987లో 810 లక్షల వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టు ఆయకట్టు 16,005 ఎకరాలు. అందులో 6,501 ఎకరాలను అభివృద్ధి చేశారు.
  7. ఎల్.టి. బయ్యారం (L.T.BAYYARAM): మున్నేరు నదిలో కలిసే ఒక వాగుపై కట్టిన ప్రాజెక్టు ఇది. దీని ఆయకట్టు 6005 ఎకరాలు.
  8. తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project): ఇది ఒక మధ్య తరహా నీటిపారుదల పధకం. ఇది తాలిపేరు నది మీద చర్ల మండలంలోని పెద మిడిసిలేరు గ్రామం దగ్గర నిర్మించబడింది. దీని పూర్తి సామర్థ్యం ఐన సుమారు 24,710 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
పాలేరు జలాశయం
కిన్నెరసాని జలాశయం

రెవెన్యూ డివిజన్లు

[మార్చు]
పువర్య్వస్థీకరణకు మందు ఖమ్మం జిల్లా పరిధిలోని మండలాలతో కూడిన పటం

నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్వ్యవస్థీకరణ ముందు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లుగా ఉండేవి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లు భద్రాద్రి జిల్లాలో కలిశాయి.

ఖమ్మం జిల్లాలో ఒకటి పాత ఖమ్మం రెవెన్యూ డివిజను కాగా రెండవది కొత్తగా ఏర్పాటైన కల్లూరు రెవెన్యూ డివిజను.

పునర్వ్యస్థీకరణ తరువాత పాత మండలాలు

[మార్చు]

భౌగోళికంగా ఖమ్మం జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 46 రెవెన్యూ మండలాలుగా విభజించారు.[3]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) మండలాలతో పాటు అన్ని గ్రామాలు, భద్రాచలం మండలం లోని భద్రాచలం పట్టణం, మండల కేంద్రం మినహా మండలంలోని అన్ని గ్రామాలు, బూర్గంపాడు మండలం లోని సీతారామనగర్, శ్రీధర-వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం ఆరు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలలో కలిశాయి.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టింది. పూర్వపు ఖమ్మం జిల్లా లోని 46 మండలాలలో 5 పూర్తి మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ముప్పు మండలాల క్రింద విలీనంచేయగా మిగిలిన 41 పాత మండలాలలో లోగడ ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజను కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పరిపాలనాకేంద్రంగా 17 పాత మండలాలుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఏర్పడింది..[4]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేరిన మండలాలు

[మార్చు]

ఇతర జిల్లాలలో విలీనమైన మండలాలు

[మార్చు]

వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాలో [5] బయ్యారం, గార్ల మండలాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో [6] వెంకటాపురం, వాజేడు మండలాలు (ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా)లో కలిశాయి.

పునర్వ్యస్థీకరణ తరువాత జిల్లాలో మండలాలు

[మార్చు]

గమనిక:* పునర్య్వస్థీకరణలో కొత్తగా ఒక మండలం ఏర్పడింది.

జనాభా లెక్కలు

[మార్చు]

1981 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా:17,51,674, స్త్రీ, పురుషుల నిష్పత్తి:952:1000, అక్షరాస్యత:19.2 శాతం. (మూలం::ఆంధ్రప్రదేశ్ దర్శిని 1985)

2001 జనాభా గణను అనుసరించి ఖమ్మంజిల్లా జనసంఖ్య 2,798,214. ఇది సుమారుగా జమైకా దేశ జనసంఖ్య లేక అమెరికా లోని ఉటాహ్కు సమానము. భారతదేశ 640 జిల్లాలలో జనసంఖ్యలో ఖమ్మం జిల్లాది 13వ స్థానం. జిల్లా జనసాంద్రత కిలోమీటరుకు 175 మంది. జిల్లా వైశాల్యం 450 చదరపు మైళ్ళు. 2001-2011 వరకు జనసంఖ్య వృద్ధి శాతం 8.5%. స్త్రీ :పురుష నిష్పత్తి 1010:1000. అక్షరాస్యత 65.46%. చదరపు కిలోమీటరు జనసాంద్రత 51 నుండి 160 వరకు వృద్ధి చెందింది. మొత్తం జనాభా 3,60,154లో షెడ్యూల్డ్ కులాల సంఖ్య 5,58,958. జిల్లాలో 80% ప్రజలు పల్లెలలో నివసిస్తున్నారు. గ్రామీణ జనంఖ్యలో స్త్రీ:పురుషుల నిష్పత్తి 974:1000.జిల్లాలోని పట్టణాలు 9

జనాభా వివరాలు [7]
వర్గం ఇల్లు మనుషులు మగవారు ఆడవారు
మొత్తం 601,659 2,578,927 1,305,543 1,273,384
గ్రామీణ 486,856 2,068,066 1,047,248 1,020,818
పట్టణ 114,803 510,861 258,295 252,566

వారిలో పని చేయువారు 10.21 లక్షలు, పని చేయని వారు 11.94 లక్షలు,వ్యవసాయదారులు 2.59 లక్షలు, వ్యవసాయకూలీలు 4.60 లక్షలు, వెనకబడిన కులములు 3.60 లక్షలు, వెనకబడిన జాతులు 5.59 లక్షలు,

జీవన ప్రమాణం

[మార్చు]

2007-2008 మధ్య అంతర్జాతీయ శాస్త్రీయ జనసాంద్రతా సంస్థ (ఇంటర్‌నేషనల్ ఇన్‌స్టిటిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ) 38 గ్రామాలలో 1258 మందిని చేసిన జనాభిప్రాయ సేకరణలో వారు 85.8% మంది ప్రజలు విద్యుత్‌చ్ఛక్తి వసతిని, 92.2% ప్రజలు మంచినీరు వసతిని, 32.1% మరగుదొడ్డి వసతిని, 28.6 % శాశ్వత పక్కా గృహ వసతిని, వివాహ వయసైన 18 సంవత్సరాల కంటే ముందే వివాహమైన ఆడపిల్లల శాతం 33.6% ఉందని ఇంకా 81.7% మంది దారిద్ర్య రేఖకు దిగువ (B.P.L) కార్డులు కలిగిఉన్నట్లు కనుగొన్నారు.

సంస్కృతి

[మార్చు]

ఖమ్మంలో కొండజాతుల వారి సంఖ్య 5,58,958. ఆంధ్రప్రదేశ్ కొండజాతి వారిలో 13.29% ఖమ్మం జిల్లాలలో ఉన్నారు.

కోయలు

[మార్చు]

కోయలు అన్న శభ్దానికి అర్థం " కొండలు న దేశం ఒక మంచి వ్యక్తులు " . కోయలు అనబడే గిరిజనుల జనాభా దండకారణ్య అడవులలో నివసిస్తున్న 80%. సాధారణంగా, కోయలు పొట్టిగా సన్నని శరీరాలు కలిగి ఉంటారు. అలాగే కొంత వ్యత్యాసంగా కూడా ఉంటారు. కోయలు మాట్లాడే భాషకు లిపి ఉండదు. కోయలు శాబ్ధరూపంగా మాత్రమే ఉండే కోయ భాష మాట్లాడతారు. కోయ సమాజంలో స్వంత ఆస్తి కలిగి ఉండేవారు తక్కువ. సాధారణంగా కోయలలో నేర ప్రవృత్తి తక్కువ . కోయసమాజంలో మద్యపానం పానం చేయడానికి పురుషులతోపాటు స్త్రీలకు కూడా అనుమతి ఉంది.

కోయలు సంప్రదాయ గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా గోదావరి లోయ పరిమిత ప్రాంతాలలో అధికంగా ఉన్నారు. అలాగే ఒడిషా రాష్ట్రం జిల్లా మాల్కంగిరి, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ తెగ వారు ఉన్నారు. వారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా భద్రాచలం విభాగం (డివిజన్)లో గుర్తించవచ్చు. వారు మాట్లాడే భాషా యాస ఒక ప్రధాన ద్రావిడ గిరిజన సమూహం గోండ్ భాషలో ఒక మాండలికం గుర్తించారు. ఇది ఇంచుమించు ఆంధ్రుల అధికార భాష అయిన తెలుగు భాషను పోలి ఉంటుంది.

సంస్కృతిక కోయలు

[మార్చు]

సాంస్కృతిక కోయలు రాష్ట్రంలోని దేశవాళీ షెడ్యూల్ తెగలలలో ఒకటిగా భావించబడుతున్నారు. వారి స్థానిక భాష కోయి. ఇది అధికంగా తెలుగు నుండి పుట్టి ఉంటుంది లేదా వారు అనేక తెలుగు పదాలను అరువుగా తెచ్చుకొని ఉంటారు. కోయల పాటలు, నృత్యాలు, సంగీతం, క్రీడలు వారి జీవనశైలిని సంస్కృతి ప్రతిబింబిస్తాయి. వారు ఆధ్యాత్మికంగా మాజికో సంబంధమైన నమ్మకాలు అధికంగా కలిగి ఉన్నారు. అలాగే మాజికోను దేవతగా భావిస్తారు. వారు దేవతలు, దేవుళ్ళను దేవరలు అని పిలుస్తారు. అయినా అధికమైన గిరిజన తెగలు చాలా వరకు తమని తాము హిందువులుగా భావిస్తారు అలాగే హిందూమత దేవుళ్ళ, దేవతల ఆరాధన చేస్తారు. వారు సాధారణంగా వారి జాతి కొరకు మరణించిన అమరులకు జాతరలు జరుపుకుంటారు.అమరులను వారు వారి ఆధ్యాత్మిక నాయకులుగా భావించి ఆరాధిస్తారు. సమ్మక్క, సారక్కా వాటిలోఒకటి. వారి జన్మస్థానం ఇది అని భావించడమే వారు ఈ జాతర జరపడానికి కారణం. ఈ జాతరలో నృత్యాలు, గీతాలు ఉంటాయి. కోయ పురుషులు వారి సంప్రదాయ దుస్తులలో తల మీద ఎద్దు లేక దున్నపోతు కొమ్ములను ధరించి పెద్దపెద్ద డోళ్ళను వాయిస్తూ ఈ నృత్యాలలో పాల్గొంటారు. కోయమహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి చేతులలో అందమైన వలయాలు పట్టుకుని ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఈ నృత్యాలలో పాల్గొంటారు.

వారు సాధారణంగా ప్రబలమైన రేలా పాటలు పాడుతుంటారు. వారు సాధారణంగా రేలా రేలా రేలా రేలా రేలా రేరేరేలా అంటూ ప్రారంభిస్తారు. మరణం లేదా వివాహం మాంసం, ఇంటిలో తయారు మద్యం వినియోగం ఏ వేడుకలో అయినా ఈ నృత్యగీతాలు విస్తృతంగా చలామణిలో ఉన్నాయి. సాధారణంగా కోడి మాంసం లేదా మేక మాంసం వడ్డించబడుతున్నా కాని గొడ్డు మాంసం వినియోగం చాలా ఎక్కువగా ఉంది. కోయపురుషులు కొన్ని సంవత్సరాల క్రితం నుండి పురుషులు మాత్రమే అనేకంగా ఒక దశాబ్దం కింద నుండి మాత్రమే గోచీ ధరించే వాడుక ఉంది వారు గోచీ తప్ప మరే వ్స్త్రం ధరించరు. స్త్రీలు మాత్రం చీరెలను ధరించినా వారు చీరె ధరించే విధం మాత్రం సాధారణ భారతీయ స్త్రీలు ధరించే విధానికి వ్యత్యాసంగా ఉంటుంది. వయసైన స్త్రీలు మాత్రం ఇంకా వారి సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరిస్తున్నా స్త్రీలు మాత్రం అధునిక సమాజాలతో సంబంధాలు ఏర్పడిన తరువాత వారి సంప్రదాయక వస్త్రధారణ నుండి సాధారణ వస్త్రధారణకు మారుతున్నారు. ప్రభుత్వం వారిలో వేగంగా అభివృద్ధి తీసుకురావాలనే చర్యలు తీసుకుంటోంది. ఇతర సమాజాలతో సంబంధబాంధవ్యాలు ఏర్పడిన తరువాత వీరు పాతసంప్రదాయలను వదిలి అనూహ్యంగా జీవినసరళిని మార్చుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పాటికీ వీరిలో పేదవారి శాతం అధికంగానే ఉంది. వీరిలో అక్షరాస్యత శాతం కూడా చాలా స్వల్పంగా ఉంది. వీరిలో కొంత మంది మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధించారు. క్రైస్తవ మిషనరీలు చాలా చురుకుగా పనిచేస్తూ వీరినిని మతమార్పిడి చేసారు. బైబుల్‌ను కూడా కోయ భాషలోకి అనువదించి చదువడం విశేషం.

జీవనము

[మార్చు]

కోయప్రజలు అధికంగా వ్యవసాయజీవనం సాగిస్తుంటారు. వారు పొదు అనే (అంటే స్లాష్, బర్న్ సాంకేతికత) చేయబడిన చింతపండు తయారు చేస్తారు. అందువలన వారు చింతకాయలు, ఉసిరికాయలు, తేనె, పామ్ గింజల సేకరణ, లేత చింతపండు ఆకులు వంటివి చేసి జీవనాఅన్ని సాగిస్తారు. వీటిలో కొన్ని నేటి కాలంలో చూడడం చాలా అదుదై పోయింది. పెద్ద ఎత్తున అటవీ నిర్మూలన ఇందుకు ఒక కారణం. ఇప్పుడు వారు అటవీప్రాంతం ఇప్పటికే చాలావరకు తగ్గిపోవడంతో పొదు తయారీని సాగించడం చాలా వరకు మనారు. ఈ తెగలలో అధికులు కొద్దిపాటి భూములను కలిగి ఉన్నారు. ఇందుకు బద్రాచలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ధన్యవాదాలు చెప్పాలి. కనుక వారు వారి సంప్రదాయక వ్యవసాయం వదిలి ఆధునిక పద్ధతులు అవలంభిస్తున్నారు. స్వంత భూములు ఉన్న వారు హెచ్ వై వి విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, పవర్ స్ప్రేలు ఉపయోగం వంటి వ్యవసాయం ఆధునిక పద్ధతులను పాటిస్తున్నారు. కాలగతిలో ఏర్పడిన మార్పుల కారణంగా వన్యప్రాణి నివాస స్థానాలు ఉడిగి పోవడం, భూమి ఉత్పాదకత క్షీణించడం అటవీ నిర్మూలన, గిరిజన కాని వారు స్థావరాలు ఏర్పరచుకోవడం వంటి పరిణామాలు సంభవించడంతో కారణంగా సంప్రదాయ వ్యవసాయం స్థానంలో అధిక దిగుబడి ఇచ్చే ఆధునిక వ్యవసాయం చోటు చేసుకుంది. ఆధునికీకరణ ప్రక్రియ కారణంగా కోయ ప్రజల జీవనసరళిలో పెనుమార్పులు సంభవించాయి. వారు పందులను, ఎద్దులు, మేకలు, కోళ్ళ వంటి పక్షులు మొదలైన వాటిని పెంపుడు జంతువులుగా పోషిస్తున్నారు. ఈ జంతువులను తినడం ద్వారా ఆహారంలో మాంసకృత్తుల అవసరాన్ని భర్తీ చేసుకుంటారు.

అభిరుచులు

[మార్చు]

కోయప్రజల ప్రజల ఇష్టమైన వినోదాలలో వేట ఒకటి. వారు జంతువులు వేటాడేందుకు ప్రాణాంతకమైన విల్లు, బాణాలు ఉపయోగిస్తారు. కానీ ముందే చెప్పినట్లుగా అడవుల విస్త్రీణం క్షీణించడం, అడవి జంతువులను విపరీతంగా చంపి తినడం కారణంగా జంతువుల సంఖ్య మరింతగా క్షీణించింది. కనుక ప్రస్తుతం వీరు సాగించే వేట పూర్తిగా వ్యర్ధమైనదిగా ఉంటుంది. వారు అనుసరిస్తున్న ఆధునిక జీవితం శైలి కారణంగా చలనచిత్రాలను చూడడం వారి ప్రధాన వినోదం మారింది. గిరిజన నివాసాల సమీపంలో ఈత చెట్లుగా పిలువబడుతున్న పామ్ చెట్లు అధికంగా కనపడుతున్నాయి. కోయలు వీటి నుండి కల్లును తీసి త్రాగుతుంటారు. కోయలు విస్తృతంగా వినియోగించుకునే ప్రముఖ మత్తు పానీయాలలో ఇది ఒకటి. ఇదికాక వారు ఇంట్లో తయారుచేసే మద్యంకూడా సేవిస్తుంటారు. ఈ మత్తుపదార్ధాలు ఉపయోగం వారి ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఫలితంగా వారి జీవితకాలం ప్రత్యేకంగా పురుషులుకు తక్కువగా ఉంటుంది.

కోయతెగ ప్రజలు కోయి లేదా కోయా అనే ఒక భాష మాట్లాడతారు. కోయసమాజం యొక్క మూలాలు ఇప్పటికీ నిగూఢం అయినప్పటికీ వారు ద్రావిడ కుటుంబ గిరిజన సమూహలలో ఘనమైన గోండ్ సమాజానికి చెందినవారుగా చెబుతారు. కాబట్టి కోయ భాష గోండ్‌భాష యొక్క ఒక మాండలికం పరిగణించబడింది. కోయి భాషలో కూడా కొన్ని రూపాంతరాలు ఉన్నాయి. భద్రాచలం నుండి అంత దూరంకాని చింతూరు అనే చిన్న పట్టణం, కోయి భాష యొక్క భాషా సెంటర్ పరిగణించబడింది . అక్కడి వారు మాట్లాడే భాష కోయీభాష యొక్క అత్యుత్తమ రూపాంతరం పరిగణించబడింది. కోయి భాషకు పరిమిత పదాలను మాత్రమే కలిగి ఉంది. దాని పదనిఘంటువు చాలా పరిమితం. అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే కోయీలు ఆదిమ తెగలలో వేట ప్రధానంగా ఉన్న సమాజాల సమాహారం. వారి దినచర్యలు చాలా పరిమితంగా ఉంటాయి. కనుక వారికి లక్షల పదాలు కలిగిన ఆంగ్లం వంటి భాషాపదాల అవసరం వారికి లేదు. వారి భావవ్యక్తీకరణకు లక్షల పదాల అవసరం లేదు. ఈ తెగల ప్రజలు అనుసరించే చాలా సులభమైన, నిరాడంబర జీవనవిధానం కారణంగా వారికి స్థానిక పదాల అవసరం అతి తక్కువ సంఖ్యలో ఉంటుంది. ఉదాహరణకు వారి భాషకు ఒక లిపి లేదు. తెలుగు భాషకు దగ్గరగా ఉండే ఈ భాషకు తెలుగులిపి కూడా వాడుకలో లేదు. వేట ప్రధాన జీవితంగా జీవనం సాగించే వీరికి చెట్లు, జంతువులు, ఆయుధాలు, ఆహారం మొదలైన వాటితో సంబంధించి ఉంటాయి. చూడండి వారి స్వంత పదాలు కలిగి హంటర్ సంగ్రాహకులు ఉండటం సాధారణంగా ఈ భాష వ్రాయడానికి ఉపయోగిస్తారు. ఈ భాషకు ప్రత్యేక లిపి లేని కారణంగా కోయభాషను వ్రాయడానికి తెలుగు లిపిని వాడుకుంటారు. రాజీవ్ విద్యా మిషన్ అనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రణాళిక వారి మాతృభాషలో గిరిజన పిల్లలకు విద్యను అందజేయటంతో ఉద్దేశంతో మొదటి తరగతి నుండి ఐదవ తరగతి వరకు కొన్ని పాఠ్యపుస్తకాలు సిద్ధం చేసింది. ఆ పుస్తకాలు అన్ని తెలుగు లిపిలో వ్రాసారు.

కొండరెడ్లు

[మార్చు]

కొండరెడ్లు అధికంగా పర్వతాలు, మందపాటి అడవులలో నివసిస్తున్నారు. వీరు వర రామ చంద్ర పురం మండలంలో కొల్లూరు, గొందూరు గ్రామాల్లో నివసిస్తున్నారు వారు తెలుగు యొక్క పురాతన మాండలికం మాట్లాడుతారు. సాధారణంగా, వారు పరిమితమైన ప్రవర్తన కనబరుస్తారు. సధారణంగా మైదానాల నుండి వచ్చే ప్రజలు మీద విశ్వాసం ఉండదు. వారు చక్కని హస్థకళాకారులు. వారు వెదురుతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు.

లంబాడీలు

[మార్చు]

లంబాడీలను సుగాలీలు లేదా బంజారాలు అని పిలుస్తారు. వారు తరచుగా అద్దం, పూసలు, ఇతర అలంకరణ వస్తువులు నిండి ఉన్న రంగురంగుల దుస్తులను ధరించి ఉంటారు. పురుషులు తల తలపాగాలను దుస్తులు, క్రీడాస్ఫూర్తి కలిగి మందపాటి మీసాలను కలుగి ఉంటారు. కమ్మం జిల్లా మొత్తంలో మంగాపురంలో లంబాడీలు నూరు శాతం కలిగిన గ్రామపంచాయితీలు అధికంగా ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

వైద్య విద్య కొరకు మమత మెడికల్ కళాశాల (ప్రైవేటు) ఉంది. సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ పర్యవేక్షణలో గిరిజనుల కొరకు ప్రాథమిక పాఠశాలల నుండి కళాశాలల వరకు అనేక విద్య సంస్థలు నడుపబడుచున్నవి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
భద్రాద్రి రాముని గుడి

జిల్లా ప్రముఖులు

[మార్చు]
2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

2008 పునర్వ్యవస్థీకరణ తరువాత ఖమ్మం జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అవి:110. పినపాక · 111. ఇల్లందు · 112. ఖమ్మం · 113. పాలేరు · 114. మధిర · 115. వైరా · 116. సత్తుపల్లి · 117. కొత్తగూడెం · 118. అశ్వారావుపేట · 119. భద్రాచలం, ఒక లోక్ సభ నియోజకవర్గము ఉంది. అది ఖమ్మం. ఇంతకు ముందు భద్రాచలం కేంద్రంగా గల లోక్ సభ నియోజకవర్గం 2008 పునర్విభజన తరువాత వరంగల్ జిల్లా లోని మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కలిసింది.

జిల్లా కవులు

[మార్చు]

ఖమ్మం జిల్లాకు చెందిన ఆదికవి హరిభట్టు. ఇతను విష్ణుపురాణం అను గ్రంథాన్ని రచించాడు. దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, కౌముది, రావెళ్ళ వెంకటరామారావు, డాక్టర్ కె. కోదండ రామాచార్యులు, కె.దేవేంద్ర(నంది అవార్డు గ్రహీత) ముదిగొండ శ్రీరామశాస్త్రి,కె.దేవేంద్ర చిమ్మపూడి శ్రీరామమూర్తి, ఉమాదేవి, రాంప్రసాద్, ప్రసాద్‌బాబు ,గద్దపాటి శ్రీనివాసు , తదితరులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఖమ్మం జిల్లా నీటిపారుదల వివరాలు". Archived from the original on 2012-07-17. Retrieved 2008-10-07.
  2. "ఊరూరా వైరా నీరు". సాక్షి. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 3 July 2018.
  3. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఖమ్మం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2017-12-22.
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-12-22.
  7. భారత ప్రభుత్వ సైటు

బయటి లింకులు

[మార్చు]