ధవళేశ్వరం ఆనకట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోదావరి డెల్టా విహంగవీక్షణం
పాత అనకట్ట యొక్క అక్విడక్ట్
కొత్త ధవళేశ్వరం ఆనకట్ట

తూర్పు గోదావరి జిల్లా లోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టయే ధవళేశ్వరం ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ థోమస్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847 లో ప్రారంభించి 1852 నాటికి పూర్తిచెయ్యబడింది.

గోదావరి నది[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించే ప్రధాన నదులలో గోదావరి ఒకటి. దీని పుట్టుక స్ధానము మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోగల త్రయంబకం వద్ద ఉన్న బ్రహ్మగిరి పర్వతం. ఇది అరేబియా సముద్రము నుండి 80 కి.మీ.ల దూరంలో, ముంబాయి నుండి 110 కి.మీ దూరంలో, సముద్రమట్టానికి 1067 మీటర్ల ఎత్తులో ఉంది. త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర గుండా 770 కి.మీ ప్రవహించి, బాసర వద్ద తెలంగాణ లోనికి ప్రవేశించి మంచిర్యాల, కాళేశ్వరం, పేరూరు, చర్ల, దుమ్ముగూడెం మీదుగా భద్రాచలం వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి కూనవరం, పోలవరం, పట్టిసీమ లను దాటుకొని, రాజమహేంద్రవరం వద్ద వెడల్పాటి నదిగా మారి, దిగువున ఉన్న ధవళేశ్వరం వద్ద తూర్పుగా, దక్షిణంగా రెండు పాయలుగాచీలి బంగాళాఖాతములో సంగమిస్తుంది. ధవళేశ్వరం వద్ద రెండుగా చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కి.మీ. ప్రవహించి, ప్రధానంగా వృద్ధగౌతమి, కోరింగ, నీలరేవు అను మూడు భాగాలుగా చీలి యానాం వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే దక్షిణ పాయను వశిష్ట అంటారు. ఇది దక్షిణంగా 40 కి.మీ. ప్రయాణించి వశిష్ట, వైనతేయగా చీలి అటు అంతర్వేది, ఇటు ఓడలరేవు వద్ద సముద్రంలో కలుస్తుంది.

ఆనకట్ట నిర్మాణానికి ముందు గోదావరి డెల్టా నేపథ్యము[మార్చు]

గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించకముందు, గోదావరి డెల్టా లోని రెండు జిల్లాలవారూ అతివృష్టి వలన, తుఫానుల వలన ముంపునకు గురై, అనావృష్టి వలన కరువుకాటకాలకు లోనై, ప్రజలు అష్టకష్టాలు పడుతూ, దుర్భర దారిద్ర్యానికి లోనై జీవించేవారు. 1833 లో అనావృష్టి వలన దుర్భరమైన క్షామం, కరువు వచ్చి, వేలసంఖ్యలో ఆకలి చావులు సంభవించాయి. దీనినే నందన క్షామము అంటారు. దాదాపు రెండు లక్షలమంది కరువు బారిన పడ్డారు. తిరిగి 1839 లో తీవ్రమైన తుఫానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై, క్షామ పరిస్థితులేర్పడి, వేలాది జనం కాందిశీకులుగా ప్రక్క జిల్లాలకు, ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళవలసివచ్చింది.

ఆనకట్ట స్థలం ఎంపిక[మార్చు]

గోదావరి జిల్లాల ప్రజల దుర్భర పరిస్థితులను గమనించిన అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రి మౌంట్, ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. ఆ నివేదికకు స్పందించిన బ్రిటిషు ఇండియా ప్రభుత్వం, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకుగల అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనా వేయడానికి ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్, గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు. కాటన్ గోదావరి తీరప్రాంతాన్ని గుర్రంపై పర్యవేక్షించాడు. సరియైన ఆహారం దొరకనప్పుడు అరటిపళ్లతోనే సరిపెట్టుకున్నాడు. గుర్రంపై స్వారీచేస్తూ, గోదావరి నది ప్రాంతాన్ని కూలంకషంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. మొదట కోయిదా-జీడికుప్ప ప్రాంతాన్ని, పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించాడు. పొపికొండలవద్ద గోదావరి సన్నబడి కేవలం 200మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆనకట్ట కట్టుటకుగల సాధ్యాసాధ్యాలను అంచనా వేశాక, పోలవరం దగ్గరనున్న మహానందికొండ-పొదలకొండ తీరప్రాంతాన్ని పరిశీలించాడు. చివరికి ధవళేశ్వరం, విజ్జేశ్వరము మధ్య నదివెడల్పుగా ఉండటం, లంకలు, ఇసుకతిప్పలు ఉండటం వలన, ఆనకట్ట నిర్మాణ సమయంలో నదినీటిని ప్రక్కకు మళ్లించుటకు అనుకూలంగా ఉంటుందని భావించి, అక్కడి పరిస్థితులను అధ్యయనము చేసి, ఆనకట్ట కట్టడానికి అనుకూలమైనదంటూ కాటన్ తన నివేదికను అప్పటి మద్రాసు గవర్నరు మార్కస్ ట్వేల్ డేల్ కు సమర్పించాడు. ఆయనకూడా దానిని ఆమోదించి, లండను లోని బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు పంపించాడు. వారు ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి, డిసెంబరు 23, 1846 న తమ ఆమోదం తెలుపుతూ, అనుమతి పత్రముపై సంతకంచేశారు. ఆలస్యం చెయ్యకుండా, కాటన్ ఆధ్యర్యములో 1847లో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

తొలి నిర్మాణం[మార్చు]

అర్ధర్ కాటను గోదావరిపై ఆనకట్ట నిర్మించుటకై ఎన్నుకున్న ప్రాంతములో నది వెడల్పు దాదాపు 6 కి.మీ. అందులో మూడోవంతు లంకలున్నాయి. నీటి మళ్ళింపుకై మొదట ఇసుకగట్లను కట్టారు. 1847 నాటికి ఆనకట్ట నిర్మాణం కోసం పదివేలమంది కూలీలను, ఐదువందల మంది వడ్రంగులను, ఐదువందల మంది కమ్మరులను నియమించారు. కూలీలు పనిచేయు సమయంలో కాటను సతీమణి ఎలిజెబెత్, కూలీల పిల్లలకు పాఠాలు చెప్పేవారు. 1847 అగస్టు మూడవ వారమునాటికి ఉక్కు రాగానే, యంత్రసామాగ్రితో నిర్మాణపు పనులు ముమ్మరమయ్యాయి. ఆనకట్టకు అవసరమైన రాయిని రైలు వ్యాగనుల ద్వారా నదిఒడ్దుకు చేర్చేవారు. నది ఒడ్డుకు చేర్చిన రాళ్లను పడవలద్వారా నదిలోని నిర్మాణప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వాడారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీగర్భములో నిర్మాణస్థలానికి తీసుకెళ్లేవారు, ఈ పడవలద్వారా. ఇదే సమయంలో తగినంత ఇటుక తయారుకాగానే, ఆనకట్ట పునాదులు, నూతులు త్రవ్వుట వంటిపనులు చురుకుగా ప్రారంభించి, 1847 జూలైలో నదిలో నీరుచేరువరకు కొనసాగించారు. నదిలో నీరుచేరగానే పడవలలో రాళ్లను నదిలోని లంకలకు చేర్చి, గట్లను గట్టిపరచే పనులు మొదలుపెట్టారు. లంకలోని అన్నిగట్లను ఏకకాలంలోనే కట్టడం మొదలుపెట్టారు. తగినంత ఆర్థికసహాయం అందుబాటులోకి రాగానే, 1849, ఫిబ్రవరిలో విజ్జేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు. 1852 లో ఆనకట్టనిర్మాణం పూర్తయ్యింది. కాటన్ చిత్తశుద్ధితో చేయడం వలన ఆనకట్ట నిర్మాణం అతితక్కువ సమయంలోనే పూర్తయ్యింది.

కాటన్ విచారణ[మార్చు]

1860లో కాటన్ రిటైర్ అయ్యి ఇంగ్లండు వెళ్ళిపోయాడు. ఆయన మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతడేశానికి రైళ్లకంటె కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని అతని ఉద్దేశం, అని పంటలకూ, ప్రయాణాలకూ పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. వారంతా ఇంగ్లండులో కాటన్ పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాలనివ్వలేదని, దండగ అనీ, కనుక విచారణ జరగాలన్నాడు. అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది.

ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలక్టు కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన యీ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి, కాటన్ ను పరీక్షించారు. ఐనా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికలలో జరిగిన వాదోపవాదాలకు, సెలక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్. కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక, ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమయింది. రైలుమార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలనూ కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపారు.

గోదావరి డెల్టా పితామహుడు[మార్చు]

దేశీయుల ఆదరాభిమానాలకు మన్ననలకు కాటన్ పాత్రుడయ్యాడు. కాటన్ ఆచరణలో దేశీయులపై ఉంచిన నమ్మకం, వారిచే పనిచేయించుకున్న తీరు, పల్లకి ఎక్కిన ప్రభువులాగాక తానూ ఒక కూలీగా అందరితో కలసి కష్టించిన ఫలితంగా ఆయనకు ఆదరణ లభించింది. వి.వీరన్న వంటి ఓవర్సీయర్లు కాటన్ కు లభించారు. వీరన్న తరువాత సబ్-ఇంజనీరుగా పైకివచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్ కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు. ఆనకట్టపై ఒకచోట అతని పేరిట ఫలకం ఉంది. 1867లో వీరన్న చనిపోయాడు.

1879-80లో కరువు విషయమై నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల అవశ్యకత, ప్రాధాన్యతను నొక్కిచెప్పి, కాటన్ వాదనను సమర్ధించాయి. వీటన్నిటి దృష్ట్యా నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు "గోదావరి డెల్టా పితామహు"డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు.

1899 జులై 14న ఆర్థర్ కాటన్ చనిపోయారు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా గోదావరివాసులకు బంగారుపంటల్ని యిచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ప్రజల దీనావస్థ కళ్ళారా చూచి, తెలుపు నలుపు అనే రంగు భేదం లేకుండా, మానవతాదృక్పధంతో ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్. అందుకనే ఆయన నాటికీ, నేటికీ ఆదర్శప్రాయుడు. వృధాగా పోతున్న నీటిని ప్రవహించే బంగారంగా మార్చిన కాటన్ ముందుచూపు గమనార్హమైనది. [1]

మార్పులు చేర్పులు[మార్చు]

తరువాతి కాలంలో, అదనంగా ఎక్కువపొలాలకు సేద్యపునీటిని అందించడానికీ, పడవల ప్రయాణ అవసరాలకూ 1862-67 మధ్య ఆనకట్ట ఎత్తు రెండు అడుగులు పెంచబడింది. మరలా 1897-99 లలో సిమెంటు కాంక్రీటుతో నిర్మించి తొమ్మిది అంగుళాలు పెంచారు. తిరిగి 1936 లో మూడు అడుగుల తలుపులు అమర్చి పదిలక్షల ఎకరాలకు సేద్యపునీరు అందిస్తున్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట వివరాలు[మార్చు]

ఆనకట్ట మధ్యలో లంకలు ఉండటం వలన ఆనకట్ట నాలుగు భాగాలుగా ఉంటుంది. ధవళేశ్వరం-పిచ్చుకలంక మధ్య ఉన్న ధవళేశ్వరం విభాగం ఆనకట్ట 1440.5 మీ పొడవు ఉండి 70 గేట్లను కలిగి ఉంది. ఆ తరువాత పిచ్చుకలంక-బొబ్బర్లంక మధ్య ఉన్న ర్యాలి విభాగం ఆనకట్ట 884.45 మీ. పొడవు ఉండి, 43 గేట్లను, బొబ్బర్లంక-మద్దూరులంక మధ్య ఉన్న మద్దూరు విభాగం 469.6మీ పొడవు ఉండి, 23 గేట్లను కలిగి ఉండగా, మద్దూరులంక-విజ్జేశ్వరం మధ్య ఉన్న విజ్జేశ్వరం విభాగం ఆనకట్ట 804.9 మీ.పొడవు ఉండి, 39 గేట్లను కలిగి ఉంది. ఈ ఆనకట్టల నిర్మాణం 3599 మీ. ఉండగా, లంకలతో కలుపుకొని ఆనకట్టమొత్తము పొడవు 5837మీటర్లు, మొత్తం గేట్లసంఖ్య 175, ఒక్కోగేటు పరిమాణం 19.29X3.35మీటర్లు, ఒకగేటు బరువు 27టన్నులుగా ఉంది.

ఈ ఆనకట్ట క్రింద తూర్పుడెల్టాకాలువ క్రింద 2.76 లక్షల ఎకరాలు, మధ్యడెల్టాకాలువ క్రింద 2.04 లక్షల ఎకరాలు, పశ్చిమడెల్టాకాలువ క్రింద 5.20 లక్షల ఎకరాలు సాగులో ఉంది. 1980 లో ఆనకట్టకు మరమత్తులు చేసి, ఆనకట్టను పటిష్ఠ పరచారు. ధవళేశ్వరము ఆనకట్టను చేర్చి రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు మీదుగా చిన్నవాహనాలు ఆర్.టి.సి.బస్సులు ప్రయాణిస్తాయి.

ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు[మార్చు]

ధవళేశ్వరం ఆనకట్టకు చేరువగా ఉన్న కాటన్ మ్యూజియంలో ఉంచిన, ఆనాడు ఆనకట్ట నిర్మాణంలో వాడిన యంత్రాలు, కృష్ణానది బ్యారేజి నిర్మాణంలో వాడినవి, కొన్ని యంత్రాల కూడా ఉన్నాయి.

మూలాలు[మార్చు]