భద్రాచలం
భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము వలన పుణ్యక్షేత్రం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారుఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ.,కొత్తగూడెం 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
భద్రాచలం పట్టణం[మార్చు]
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.[1] హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీగా మార్చుట జరిగింది.
గణాంక వివరాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019
రామాలయ ప్రశస్తి[మార్చు]
పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది.
గ్రామ చరిత్ర[మార్చు]
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను, ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు అన్ని గ్రామాలు, భద్రాచలం మండలం లోని భద్రాచలం పట్టణం తప్ప అన్ని గ్రామాలు , బూర్గంపాడు మండలం లోని సీతారామనగర్, శ్రీధర-వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు.[2]
గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా,1645 - 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.
దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.
భద్రాచలం మండలం[మార్చు]
రవాణా సౌకర్యాలు[మార్చు]
మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి మహబూబాబాద్, ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు , విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.
వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది
కొన్ని వివరాలు[మార్చు]
భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్థిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.
- లోక్సభ నియోజకవర్గం: మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం (పునర్విభజన అనంతరం)
- శాసనసభ నియోజకవర్గం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం
- రెవిన్యూ డివిజను: భద్రాచలం
- చూడదగ్గ ప్రదేశాలు
- భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు[మార్చు]
- కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
- పర్ణశాల: భద్రాచలం పట్టణం నుండి కేవలం 35కి.మీ.ల దూరంలో వున్నది ఈ పవిత్రమైన పర్ణశాల. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
- పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.
- భద్రాచలం పరిసరప్రాంతాలలో సుందరమైనటువంటి అడవి,జలపాతాలు ఉన్నవి .
- భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా నృత్యం కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు.
- భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు సీతా రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు.
- సీత రాముల వనవాసం పర్ణశాలలో జరిగింది, శ్రీ రామ పాదాలు, సీత నారచీర
గ్రామానికి చెందిన వ్యక్తులు[మార్చు]
- పోరిక మౌనిక - 2022 సివిల్స్ ఫలితాల్లో 637వ ర్యాంకు సాధించింది.[3]
మూలాలు[మార్చు]
- ↑ "భద్రాచలం అధికారిక వెబ్‌సైటు". Archived from the original on 2009-01-16. Retrieved 2008-07-24.
- ↑ "THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) ORDINANCE, 2014 (NO. 4 OF 2014)" (PDF). Archived from the original (PDF) on 2020-11-28. Retrieved 2019-04-04.
- ↑ Andhra Jyothy (30 May 2022). "సివిల్స్లో భద్రాద్రి వాసికి 637వ ర్యాంకు" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
బయటి లింకులు[మార్చు]
- శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వెబ్‌సైటు Archived 2011-02-02 at the Wayback Machine
- భద్రాద్రి రామదర్శనీ వెబ్‌సైటు Archived 2011-02-02 at the Wayback Machine