రామావతారము

వికీపీడియా నుండి
(శ్రీ రాముడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాముడు
పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు మరియు పరివారం సమేతంగా
పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు మరియు పరివారం సమేతంగా
దేవనాగరిराम
కన్నడರಾಮ
తమిళ లిపిஇராமர்
సంప్రదాయభావంవిష్ణువుఅవతారము
ఆవాసంఅయోధ్య
మంత్రంమంత్రము
ఆయుధంధనుస్సు (కోదండము)
భార్యసీత

రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. అతను పురాతన భారతదేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొనెను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరిస్తారు.

ఆధార సాహిత్యం[మార్చు]

వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి.

భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపధ గాథల రూపంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.[1] ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి పంబన్ వ్రాసిన పంబ రామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసము.[2]

తెలుగులో లెక్క పెట్టడం కష్టమైనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము; గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము; భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షము.

రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. అగ్నేయాసియాలో అనేక జానపద గాథలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాథలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. జావా దీవి (ఇండొనీషియా) లోని కాకవిన్ రామాయణ, బాలి దీవిలోని రామకవచ, మలేషియాలోని హికయత్ సెరి రామ (Hikayat Seri Rama), ఫిలిప్పీన్స్లోని మరదియా లవన (Maradia Lawana), థాయిలాండ్‌లోని రామకీన్ - ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.బ్యాంగ్‌కాక్ నగరంలోని వాట్ ఫ్రా కేవ్ మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడిఇఉన్నాయి. మయన్మార్ దేశపు జాతీయ ఇతిహాసం యమ జత్‌దా కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కథలో రాముని పేరు యమ. కంబోడియాలోని రీమ్‌కర్ లో రాముని పేరు ఫ్రీ రీమ్ (Preah Ream). లావోస్కు చెందిన ప్ర లక్ ప్రా లామ్ కథలో రాముని అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పబడింది.

జీవితం[మార్చు]

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింప బడింది.

  • బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
  • అయోధ్యా కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
  • అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
  • కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
  • సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
  • యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
  • ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

బాలకాండము[మార్చు]

శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం

ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు.

కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.

అయోధ్యా కాండము[మార్చు]

భరద్వాజాశ్రమంలో సీతారామలక్ష్మణులు

దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు.

భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.

సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.

అరణ్యకాండము[మార్చు]

రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత - రాజా రవివర్మ చిత్రం

సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి 8శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మందిగల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.

కిష్కింధకాండము[మార్చు]

వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం

రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించిదక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు.

సుందరకాండము[మార్చు]

హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం.

హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు [ఇంద్రజిత్తు] వేసిన [బ్రహ్మాస్త్రము|బ్రహ్మాస్త్రానికి]వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.

"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

యుద్ధకాండము[మార్చు]

హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది. రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు.

రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు

ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.

అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు.

మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు.

పట్టాభిషిక్తులైన్ సీతారాములు

ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి, శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".

రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.

అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

రాముని నిర్యాణము[మార్చు]

రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు, ఆతని సోదరులెల్ల సరయూనదిలో దిగి వారి అవతారములు చాలించిరి.[3]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Fallon, Oliver. 2009. Bhatti’s Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: Clay Sanskrit Library[1]. ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 |
  2. Regional Ramayanas
  3. (పూర్వగాధాలహరి, వేమూరి శ్రీనివాసరావు)

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]