అగ్ని పురాణం
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
అగ్ని పురాణములో శ్రీమహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది. పురాణానికి కావలసిన ఐదు లక్షణాలు ఈ పురాణంలో ఉన్నాయి. అగ్ని వశిష్ఠుడికి చెప్పగా అదే విషయాన్ని వశిష్ఠుడు వ్యాసుడికి చెప్పగా, వ్యాసుడు తన శిష్యుడైన రోమ మహర్షి చేత సత్రయాగం జరుగుతున్నప్పుడు అవే విషయాలు అక్కడ ఉన్న ఋషులకు చెప్పాడని ఈ పురాణం చెబుతోంది. ఇందులో విష్ణువు అవతారాల గురించి, విశేషించి రామావతార౦, కృష్ణావతారాలగురించి, పృథ్వి గురించి ఉంది. యాగ పూజావిధానాలు, జ్యోతిశ్శాస్త్ర విషయాలు, చరిత్ర, యుద్ధము, సంస్కృత వ్యాకరణము, ఛందస్సు, న్యాయం, వైద్యం, యుద్ధ క్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చోటు చేసుకొన్నాయి.
ఇది 8 - 9 శతాబ్దాల మధ్యలో రూపు దిద్దుకొన్నదని ఒక అభిప్రాయం ఉంది.[1][2] 10-11 శతాబ్దాల మధ్య అని కూడా కొందరంటారు,[3] ఈ కాలంలో ప్రస్తుత రూపానికి పరిణమించినా కాని, అసలు పురాణం అంతకంటే చాలా పురాతనమైనదని భావించవచ్చును.
శ్లోకాలు
[మార్చు]అసలు ఈ పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయని ప్రథమ అధ్యాయం లోనూ, 15,000 శ్లోకాలు ఉన్నాయని చివరి అధ్యాయం లోనూ చెప్పబడింది. కాని ప్రస్తుత కాలములో 11,457 శ్లోకాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఈ పురాణంలో కొంత గద్య భాగంకూడా ఉంది. మధ్యయుగములో జరిగిన శైవ వైష్ణవ ఘర్షణ ల వల్ల కొన్ని శ్లోకాలు చొప్పించబడ్డాయనే వాదన కూడా లేకపోలేదు. వైష్ణవ పంచరాత్రము, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చొప్పించబడ్డాయని, వైష్ణవచ్చాయ కల్పించబడిందనే వాదన కూడా ఉంది. మెదటి అధ్యాయంలో అగ్నిని విష్ణువుగా, రుద్రుడుగా, కాలాగ్నిగా వర్ణించారు. తరువాత అధ్యాయాలలో అగ్నిని విష్ణువుగా వర్ణించారు.
పురాణములో విశేషాలు
[మార్చు]అగ్ని పురాణాన్ని తామాస పురాణంగా చెబుతారు. మొదటి అధ్యాయాలలో మత్య్స కూర్మ వరాహా అవతారాల గురించి చెప్పబడుతుంది, తరువాత రామాయణం చెప్పబడుతుంది, మోహిని అవతారం గురించి, కల్కి అవతారం గురించి సృశించబడుతుంది. శైవ, వైష్ణవ, శాక్త, సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. నారద, అగ్ని, హయగ్రీవ, భగవంతుల మధ్య సంవాదము ఉంటుంది. వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణ పూజావిధానము చెప్పబడింది. శివలింగ, దుర్గా, గణేశాది దేవత పూజావిధానాలు చెప్పబడ్డాయి.
విషయ సంగ్రహం
[మార్చు]ఇప్పుడు లభిస్తున్న అగ్ని పురాణంలో 383 అధ్యాయాలున్నాయి. పురాణంలో చెప్పబడిన 50 విషయాల జాబితా చివరి అధ్యాయంలో మళ్ళీ చెప్పబడింది..
- 1వ అధ్యాయము - ఉఫద్ఘాతము, విష్ణువు అవతారాల వర్ణన
- 2-4 అధ్యాయాలు - మత్స్య, కూర్మ, వరాహావతారాలు
- 5-11 అధ్యాయాలు - రామాయణం ఏడు కాండల సంక్షిప్త కథనం
- 12వ అధ్యాయము - హరివంశము
- 13-15 అధ్యాయాలు - మహాభారత కథ
- 16వ అధ్యాయము - మోహిని, కల్కి అవతారాలు
- 17-20 అధ్యాయాలు - పురాణం యొక్క ఐదు ముఖ్య లక్షణాలు
- 21-70 అధ్యాయాలు - నారదుడు, అగ్ని, హయగ్రీవుడు, భగవానుడు - వీరి మధ్య జరిగిన సంవాదము. ఇందులో స్నానాది కర్మ నియమాలు, హోమగుండం నిర్మాణము, ముద్రలు (పూజలో వ్రేళ్ళు ఉంచవలసిన విధానం), వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను (చతుర్వ్యూహాలు) పూజించే విధానం, విగ్రహాలను ప్రతిష్ఠించే విధానం, విగ్రహ లక్షణాలు, సాలగ్రామ పూజా విధానం, ఆలయాలను బాగుచేసే విధం తెలుపబడినాయి.
- 71వ అధ్యాయము - గణేశ పూజా వీధానం
- 72-105 అధ్యాయాలు -లింగారాధన, దేవి రూపాలు, హోమాగ్నిప్రజ్వలన, చందపూజ, కపిల పూజ, ఆలయాల పవిత్రీకరణ
- 106వ అధ్యాయము - నగరాలలో వాస్తు గురించి
- 107వ అధ్యాయము - స్వయంభూ మను వృత్తాంతము
- 106వ అధ్యాయము - భువన కోశము (విశ్వము యొక్క స్వరూపము)
- 109-116 అధ్యాయాలు - వివిధ తీర్ధాల గురించి
- 117వ అధ్యాయము - పితృదేవతల పూజల గురించి
- 118-120 అధ్యాయాలు - పురాణముల ప్రకారం భూగోళ వర్ణన, వివిధ ద్వీపాల మధ్య దూరం
- 121-149 అధ్యాయాలు - ఖగోళ, జ్యోతిష్య శాస్త్రముల విషయాలు
- 150వ అధ్యాయము - మన్వంతరములు, మనువుల నామములు
- 151-167 అధ్యాయాలు - వివిధ వర్ణముల విధులు
- 168-174 అధ్యాయాలు - వివిధ పాపముల పరిహారముల గురించి
- 175-207 అధ్యాయాలు - వివిధ వ్రతములను ఆచరంచే విధానము
- 218-248 అధ్యాయాలు - రాజ్యపాలనా విధానములు
- 249-252 అధ్యాయాలు - ధనుర్విద్య, వివిధ అస్త్రముల ప్రయోగము
- 254-258 అధ్యాయాలు - వ్యవహారము (చట్టము, న్యాయము). మితాక్షరి అనే గ్రంథంలో ఉన్న విషయం చాలావరకు ఈ యధాతధంగా ఈ అధ్యాయంలో ఉంది.
- 259-271 అధ్యాయాలు - వేదముల గురించిన కొన్ని వియాలు
- 272వ అధ్యాయము - పురాణపఠన సమయంలో ఇవ్వవలసిన బహుమానముల గురించి. ఈ అధ్యాయంలోనే పురాణముల జాబితా, ఒక్కొక్క పురాణంలో ఉన్న శ్లోకాల సంఖ్య చెప్పబడింది.
- 273-278 అధ్యాయాలు - పురాణ వంశ చరిత
- 279-300 అధ్యాయాలు - వైద్యశాస్త్రంలో విభాగాలు
- 301-316 అధ్యాయాలు - సూర్యారాధన, వివిధ మంత్రాలు. ఇందులో 3009 నుండి 314వ అధ్యాయం వరకు త్వరితాదేవి ఆరాధనా మంత్రాలగురించి ఉంది.
- 317-326 అధ్యాయాలు - స్కందునితో ఈశ్వరుడు చెప్పిన విషయాలు - శివగణాల పూజ, వాగీశ్వరి, అఘోర, పశుపత, రుద్ర, గౌరి పూజ
- 327వ అధ్యాయము - దేవాలయంలో లింగ ప్రతిష్ఠాపన గురించి
- 328-335 అధ్యాయాలు - ఛందస్సు గురించి [పింగళ సూత్రాలు, వాటిపై వ్యాఖ్య
- 336వ అధ్యాయము - వేదాలలో నాదం గురించి కొంత చర్చ
- 337వ అధ్యాయము - కవిత్వం, ఉపదేశాలు
- 338వ అధ్యాయము - సంస్కృత నాటకాల గురించి
- 339-340 అధ్యాయాలు - నాటక రీతులు, నటనలో భావాల వ్యక్తీకరణ
- 341-342 అధ్యాయాలు - నాటకాలలో చలన విధానాలు - చేతులు వంటి అంగాల ద్వారా నటనను కనబరచే విధం
- 343-345 అధ్యాయాలు - వివిధ అలంకారముల గురించి. దండి రచించిన కావ్యదర్శనంలో ఉన్న విషయమే ఇక్కడ ఉంది.
- 346-347 అధ్యాయాలు - కావ్యనిర్మాణం
- 348వ అధ్యాయం - ఒకే శబ్దంతో ఉన్న మాటల గురించి (monosyllabic words).
- 349-359 అధ్యాయాలు - సంస్కృత వ్యాకరణం
- 360-367 అధ్యాయాలు - అమరకోశం లాంటి పదవివరణ
- 369-370 అధ్యాయాలు - మానవ శరీర నిర్మాణ శాస్త్రము
- 371వ అధ్యాయము - వివిధ నరకముల గురించి.
- 372-376 అధ్యాయాలు - రాజయోగము, హఠయోగము గురించి
- 377-380 అధ్యాయాలు - వేదాంతము, బ్రహ్మజ్ఞానము
- 381వ అధ్యాయము - భగవద్గీత సంగ్రహము
- 382వ అధ్యాయము - యమగీత
- 383వ అధ్యాయము - అగ్నిపురాణ ప్రశంస.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు, వనరులు
[మార్చు]- ↑ J. R. Svinth (2001). Martial Arts of the World: An Encyclopedia.
- ↑ Phillip B. Zarrilli. Paradigms of Practice and Power in a South Indian Martial Art. University of Wisconsin-Madison.
- ↑ Werba, Verba Indoarica 1997:6.
- ↑ Shastri, P. (1995) Introduction to the Puranas, New Delhi: Rashtriya Sanskrit Sansthan, pp.98-115
- అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)