శివానందమూర్తి
Kandukuri Sivananda Murty కందుకూరి శివానందమూర్తి | |
---|---|
![]() సద్గురు శివానందమూర్తి | |
జననం | శివానందమూర్తి 1928 డిసెంబరు 20 రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
నిర్యాణము | 2015 జూన్ 10 వరంగల్ | (వయసు 86)
తండ్రి | వీరబసవరాజు |
తల్లి | సర్వమంగళ |
కందుకూరి శివానంద మూర్తి ( 1928 డిసెంబరు 20 - 2015 జూన్ 10) మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ అతనికి ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసించేవారు. [1]సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించాడు.
జీవిత విశేషాలు[మార్చు]
అతని తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు[ఆధారం చూపాలి]. వీరు ఆరాధ్యబ్రాహ్మణులు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారికి సేవ చేయడం పట్ల, హిందూ ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.
సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మాల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల అతనికి అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమవంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో అతను ఒక విజ్ఞాన సర్వస్వం.
రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద అతను రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలు ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద అతను రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకుని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ "అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి" అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమబుద్ధ (2008) అతని ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ అతను రాసిన 450 పైగా వ్యాసాలు ఆంధ్రభూమిలో ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.
సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు అతను ప్రధాన ధర్మకర్త. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి సన్మానిస్తూ ఉంటారు.
భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్ అకాడెమీని స్థాపించారు. రికార్డింగుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ ను నిర్మించారు. ఇక్కడ వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా హైదరాబాదులో ఈ అకాడెమీ సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది. చెన్నైలోని శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అతనిని 2000 లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం తో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. తిరుపతినందు గల రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ బిరుదముతో సత్కరించింది.
అతని ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుంటాయి. సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుంటారు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంటారు.
సుప్రసిద్ధ ఆధ్యాత్మకవేత్త సద్గురు శివానందమూర్తి (87) తుదిశ్వాస విడిచారు. 10.06.2015 బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు అతను కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆనారోగ్యానికి గురైన శివానందమూర్తి వరంగల్‌లోని ములుగు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో శివైక్యం చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిసెంబరు 20న జన్మించిన శివానందమూర్తి, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించారు. శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలతో సహా ఎన్నో ప్రాంతాలలో సాంస్కృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు. శివానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతని కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
శివానందమూర్తి కళలను, సాహిత్యాన్ని సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా పునరుజ్జీవింపజేస్తూ ఒక మణిసేతువును నిర్మించాడు. ఆధ్యాత్మిక స్థాయిలో తత్వ రహస్యాలను ఉపదేశించి సాధుమార్గంలో నడిపించాడు.
గురు తత్వాన్ని గురించి సంగ్రహంగా క్రింది నాలుగు పద్యాలు తెలియజేస్తున్నాయి.
- గురువు ఈశ్వర లీలా రథ శిఖర వైజయంతి
గురువు ఆత్మారోహ గిరిశిఖరం మీది జ్యోతి
గురువు జిజ్ఞాసువుల దాహం తీర్చే ప్రపాశాల
గురువు సుషుమ్నాద్వారం, గురువు శివుని మారు రూపు
- సంసిద్ధమైన బ్రతుకులో తానై వచ్చే వినూత్తాతిథి
అతీత జీవానుభూతుల రహస్యాల భాండాగారం
సనాతన పరంపర తేజస్సును మన దాకా మోసుకువచ్చి
ఈ హృదయంలో ప్రతిష్ఠించి తాను మరుగయ్యే దివ్య తీర్థం
- అతి మనస్సులోనుంచి జలపాతమై దూకే కవిత
సమష్టి మనస్సులో నుంచి ప్రాకివచ్చే ప్రాగ్రూపం
ధ్యాన వేళ అభీప్సను ఊర్థ్వంగా మోసుకుపోయే జ్వలదగ్ని
పంచభూతాల సమష్టిని మనకోసం దయతో గ్రహించిన ఈశ్వరుడు
- ఆశ్రయం లభించితే చాలు అభ్యాసి తొలి ఘట్టం దాటినట్లే
గురు తేజస్సు హృదయంలో చేరి వృత్తులను నియమిస్తుంది.
ప్రలోభపెట్టే దృశ్యాలను, సిద్ధులను కట్టడి చేస్తుంది
గురుభావం భుజం మీద నిలుపుకొని చివరిదాకా తీసుకుని వెళుతుంది.
అనుగ్రహభాషణం[మార్చు]
"ఈ జగత్తు అంతా ఒక గ్రంథం. దాని గ్రంధకర్త ఆ ఈశ్వరుడే. ఈ జగత్తులో ఏ ఘటన చోటుచేసుకున్నా ఆ గ్రంథంలో వ్రాసి ఉన్నందునే సంభవిస్తోంది. వేలమంది పండితుల అనుభవాలను వ్రాసినా ఆ జగత్ గ్రంధకర్త అనుభవసారం అంతుచిక్కదు. జీవితంలో కష్టాలు, సుఖాలు, చరిత్ర, సనాతన సంప్రదాయం వంటి చెడు, తీపి ఘటనలన్నీ జగత్ గ్రంధకర్త వ్రాసిన గ్రంథంలోనివే. ఆ గ్రంథం మనం చదవకుండా ఉండలేం .. చదివి అర్ధంచేసుకోలేం .. ఎంత చదివినా పూర్తికాదు. గ్రంధకర్త వ్రాసింది సృష్టి, స్థితి, లయం అను మూడు అధ్యాయాలే. కానీ వాటి సారాన్ని తెలుసుకోవడం ఎవరికైనా గగనమే.
"అయితే గ్రంధకర్తని ధ్యానిస్తే చాలు. ఏం చేసినా ఈశ్వరునికి అర్పణ చేయాలి. అప్పుడే జీవితం ఈశ్వరునికి ఇచ్చిన హారతి అవుతుంది.
"దేనికీ ఇతరులపై ఆధారపడవద్దు. అలా ఆధారపడితే ఫలితం దక్కదు. ఎవరినుండీ ఏమీ ఆశించవద్దు. ఎదుటివారు విమర్శిస్తే ఆ మాట వినవద్దు.
"ఆత్మగౌరవంతో ఏది మంచి మార్గమో ఆలోచించి ఆ దిశగా పయనించాలి. ఆత్మవిశ్వాసం నుండి ఆత్మగౌరవం వస్తుంది.
"ఒకరి ఆమోదం కోసం యాచించవద్దు. ఒకరి నుండి కోరినది దక్కకపోతే బాధపడవద్దు.
"మన జీవితంలో ఏది చోటుచేసుకున్నా అది జగత్ గ్రంధకర్త నిర్ణయమే అని ఆమోదిస్తూ సనాతన ధర్మ మార్గంలో పయనించడం అందరి లక్ష్యం కావాలి.
"ఈశ్వరుని ఆరాధన, నామస్మరణ ఎన్నటికీ మరవకండి." Mare meru andaru chuse tarinchandi
మూలాలు[మార్చు]
- ↑ "Sanathana Dharma Charitable Trust – Bheemili". Retrieved 2022-12-26.
వెలుపలి లింకులు[మార్చు]
- The Dominating evil of Black Money Archived 2012-11-04 at the Wayback Machine, by K.Sivananda Murty, The Hindu, Sunday, Jun 07, 2009
- My humble salutations to Sadguru Sivananda Murty Article by Sri.V.Sundaram in Newstoday 29 May 2007
- https://web.archive.org/web/20160917181818/http://sdctbheemili.org/index.php
- Friend, Philosopher and Guide The Hindu dated 31.03.2003
- https://web.archive.org/web/20180607144525/http://sdctbheemili.org/latest_videos.php