Jump to content

లలిత కళలు

వికీపీడియా నుండి

అనాది కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు.వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును.ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు.వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును, రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని, రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు.

లలితకళలను మాట ఆంగ్లభాషయందలి FINE ARTS అను పదమునకు పర్యాయపదమునకు వాడబడుచున్నది.చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము అను ఐదు ఈ తెగకు చెందినట్టివి.

చిత్రలేఖనము

[మార్చు]
చిత్రలేఖనము

ఇది చక్షురింద్రియముద్వారా మానసమునకు ఆనందము చేకూర్చును.చిత్రలేఖనమున మనము చిత్రిత వస్తువుయొక్క సంపూర్ణమైన ఆకారమునుగాక అందలి ఏకదేశమును మాత్రమే దర్శింపజాలుదుము.అదియుగాక చిత్రకారుడు దృశ్యమును బాగుగా పరిశీలించి తన చిత్రమున రూపొందించును.ఆ క్షణము గడిచిపోయినచో ఆ దృశ్యము యొక్క స్థితియందు కొంతమార్పు సంఘటిల్లును.ఈ మార్పునుకూడా సూచింపదలచినచో చిత్రకారుడు మఱియొక్క చిత్రమును రచింపవలచినదే.

శిల్పము MPT

[మార్చు]
శిల్ప కళ

ఇదికూడా కొంచెం ఇంచుమించుగా చిత్రలేఖనము వంటిదే.చక్షురింద్రియముద్వారా మానసమునకు ఆనందము చేకూర్చును.ఇందును వస్తువుయొక్క కించిత్కాలస్థీయమైన ఏకైక విన్యాసమే ప్రగర్శింపబడును.కాని శిల్పియందు వస్తువును సంపూర్ణాకృతిగా ప్రగర్శింపజాలును.శిల్పి చెక్కిన సమగ్ర విగ్రహములందు మనము ముందవెనుకలను పార్శ్వాములను కూడా దర్శింపజాలుదుము.చిత్రలేఖనముని మనము స్పృశించి చూచినచో అందలి విశేషణమును ఏమియు దర్శింపజాలము.శిల్పమున అట్లుకాక స్పర్శచే అందలి నిమ్నోన్నతభాగములను గుర్తించి పరిశీలింపగలము.అంధుడు చిత్రలేఖనముని గురించి విని విషయమును ఇలా ఉంటుందని గ్రహించడానికి మాత్రమే అర్హుడు.కాని శిల్పమైనచో అతడు చేతితోతాకి స్పర్శప్రభావముతో దాని రమణీయమును అంతనూ కాకపోయిననూ కొంచెమైననూ గ్రహించి ఆనందించుటకు అవకాశమున్నది.

సంగీతము

[మార్చు]
సంగీత సాధన

ఇది శ్రవణేంద్రియములద్వారా మానసమునకు ఆనందం ఉత్పాదించును.కేవల స్వరమయమైనది.స్వరాశ్రయమైనట్టిది.తాళ, లయ ఆశ్రయమైన నృత్యము వంటిది.ఇది మానవులనేకాక ప్రాణవంతమైన జంతుజాలమునంతను తనవైపు ఆకర్షించుకొనగలదు.అందుచేతనే ...శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః...అను నానుడి ఏర్పడినది.పాశ్చాత్యులు లలితకళలన్నింటికి సమానమైన ప్రాధాన్యమునే ఇచ్చారు.భారతీయులు అట్లుకాక చిత్రలేఖన, శిల్పములకంటే సంగీతమునకును, సంగీతముకంటే నృత్యమునకు అధికప్రాధాన్యత ఇచ్చారు.

నృత్యము

[మార్చు]
నృత్య శిక్షణ

ఇది భావాశ్రయమైనది.ఇది పదార్థాభినయాత్మకమైన మార్గమని ప్రసిద్ధినొందియున్నది.జనులు సామాన్యముగా నృత్యము, నాట్యము అందలి భేదము తెలియక రెండింటిని సమానార్థకములుగా వాడుచుందురు.దశరూపకారుడు ...అన్యద్భావాశ్రయం నృత్యమ్..అనియు, ధనికుడు ...రసాశ్రయాన్నాట్యాద్భావాశ్రయం నృత్యమన్య దేశమ్...అనియు ఈ రెండింటికి భేదము నిరూపించారు.నాట్యము రసాశ్రయమైనది.ఇందు కావ్యార్థాభినయము గోచరించును.నృత్యము ఆంగికాభినయము ప్రాధాన్యము వహింపుచున్నది.నాట్యము సాత్వికాభినయ బహుళమై ఒప్పుచుండును.నృత్యముకూడా నృత్తమువలెనే శ్రవణేంద్రియమునకంటే చక్షురింద్రియమునకే ఎక్కువ ప్రీతికలిగించును.నృత్యము క్షణక్షణాంచల్యమున దళావిపర్యయమును కూడా సూచింపజాలియుండెను.

కావ్యము

[మార్చు]
కవితలు రాయుట

ఇది శ్రవణేందియమునకు అపారప్రీతిని కలిగించి మానసమునకు అధికముగా ఆనందము కలిగించి, ఆకర్షించును.ఇతర లలితకళలందెచటను లేని వాక్సాహాయ్యము దీనికి ఉంది. ఈ సాహాయ్యముచే కవి దృశ్యములను వర్ణించి, వానిని బఠితుల మనః ఫలకముల సాక్షాత్కరింపజేయును. ఈ విధముగా ఇందు సంగీతమును, చిత్రలేఖనమును ఆశ్రితములైయుండి మానసమునకు ఆనందమును అందించును. ఈ వాక్కే లలితకళలలో కావ్యమునకు అగ్రస్థానమును ఒసంగుచున్నది.

సప్తసంతానములందే కాక లలితకళలలో కూడా ప్రశస్తిగాంచి, ఖిలముగాకుండ శాశ్వతముగా ఉండునది కవిత్వమే. సంగీత, నాట్యములు రెండును తత్కర్తలు పాడుచు, ప్రదర్శించుచు ఉండునంతకాలమే మనకానందమును ఒసంగును. చిత్రలేఖనము కాలక్రమమున మాసిపోవుటకు అవకాశము ఉంది. శిల్పము శిలామయమగుటచే, కొంత దీర్ఘకాలము ఉండజాలిననూ, శాశ్వతము మాత్రము కాదు. కవిత్వము శబ్దమయమగుటచే శబ్దముండునంతకాలము అక్షరమై యుండజాలును. ఈ విధముగా శాశ్వతత్వమును బట్టి చూచినను లలితకళలలో కవిత్వమునకే అగ్రస్థానము.

లలితకళలలో కావ్యమునకు అగ్రస్థానము ఉన్నట్లే కావ్యములలో నాటకమునకు అగ్రతాంబూలము లభించుచున్నది. కావ్యేషు నాటకం రమ్యం .

"https://te.wikipedia.org/w/index.php?title=లలిత_కళలు&oldid=4319198" నుండి వెలికితీశారు