జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి | |
---|---|
![]() జిడ్డు కృష్ణమూర్తి (1920లలో) | |
జననం | మే 12 1895 ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె, |
మరణం | ఫిబ్రవరి 17 1986 ఓజై, కాలిఫోర్నియా |
వృత్తి | తత్వవేత్త, ఆధ్యాత్మిక ప్రాసంగికుడు, రచయిత, వక్త |
తల్లిదండ్రులు | జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ |
జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. అతను స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.
ఆరంభ జీవితం[మార్చు]
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లెలో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, అతను తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.[3]
జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు[మార్చు]
అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని అతను అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ అతను ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద అతనుకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా అతనుకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ అతనుకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో అతను దృక్పథం మరింత బలీయమైంది.
తత్వవేత్త గా[మార్చు]
కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను కృష్ణమూర్తినా లేక జగద్గురువునా అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు. సోదరుని మరణం అతనులో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి అతనులో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది అతనులోకి. అతనులో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు అతనుకు జరగసాగేయి. అతను నడచేదారిలో గులాబిపూలు పోసేవారుకూడా. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, అతను ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ "ను రద్దుపరచాడు.
ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు. చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.
బోధనలు[మార్చు]
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
ఇతరములు[మార్చు]
కృష్ణమూర్తిని అతను బాల్యంలో చూచిన లెడ్ బీటర్ (దివ్యజ్ఞాన సమాజోద్యమనేత. మేడమ్ బ్లావెట్స్కీతో పని చేసినవారు), ఆ బాలుని చుట్టూ కనిపించిన అసాధారణ కాంతివలయాన్ని గమనించి అతడు మహాపురుషుడవుతాడని ప్రకటించారు. కృష్ణమూర్తినీ, అతను సోదరుడినీ చేరదీసిన లెడ్‌బీటర్ చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొని రావాలనుకొన్నారు. కృష్ణమూర్తి స్వతంత్ర భావాలు త్వరలోనే బయటకొచ్చి అతను విశిష్టమూర్తిమత్వం లోకానికి వెల్లడైంది. కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాలలో గడిపారు. కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. తెలుగువారైనా తెలుగు దాదాపు మరచిపోయారు. ఈ గ్రంథకర్త ‘‘ఆంధ్రప్రభ’’ సచిత్ర వార పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కృష్ణమూర్తితో ఒక ఇంటర్వ్యూ ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. కృష్ణమూర్తిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రీ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుండేవారు. కృష్ణమూర్తి జీవితం చివరి సంవత్సరం వరకు ఈ ఇంటర్వ్యూల ప్రచురణ కొనసాగింది. ఒక సారి ‘‘మీరు తెలుగువారు కదా. తెలుగు ఏమైనా జ్ఞాపకం ఉందా?’’ అని ప్రశ్నిస్తే ఒంట్లు లెక్కించడానికి ప్రయత్నించి, మూడు - నాలుగు అంకెలు పలికి, ఇటాలియన్ భాషలోకి మారిపోయారు. తాను గురువును గానీ, ప్రవక్తను గానీ కానని అతను చాలా సార్లు ఖండితంగా ప్రకటించారు. అతను బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల అతను కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. తనదంటూ ఏ వస్తువునూ అతను ఏర్పరచుకోలేదు, మిగుల్చుకోలేదు.[ఆధారం చూపాలి]
కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం[మార్చు]
“ | అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. | ” |
“ | రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. | ” |
తెలుగులో వెలువడిన కొన్ని రచనలు[మార్చు]
- కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం.
- శ్రీలంక సంభాషణలు.
- గతం నుండి విముక్తి
- ఈ విషయమై ఆలోచించండి (1991) [4], [5]
- ముందున్న జీవితం
- ధ్యానం
- విద్య, అందు జీవితమునకుగల ప్రాధాన్యత
- మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
- స్వీయజ్ఞానం
- స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
- నీవే ప్రపంచం [6]
- గరుడయానం
- నిరంతర సత్యాన్వేషణ [7]
- చేతన [8]
మూలాలు[మార్చు]
- ↑ "Achyut Patwardhan".
- ↑ "Dada Dharmadhikari Biography".
- ↑ హెర్జబెర్గర్, రాధికా (1998). "
కృష్ణమూర్తి : వికాసోదయం".
కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం. కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. వికీసోర్స్.
- ↑ ఈ విషయమై ఆలోచించండి, మొదటి భాగము.
- ↑ ఈ విషయమై ఆలోచించండి, రెండవ భాగము.
- ↑ నీవే ప్రపంచం.
- ↑ నిరంతర సత్యాన్వేషణ.
- ↑ చేతన.
బయటి లింకులు[మార్చు]
- Infobox person using influence
- మూలాలు లోపించిన వాక్యాలు కల వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with SBN identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- మదనపల్లె వ్యక్తులు
- 1895 జననాలు
- 1986 మరణాలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- తత్వవేత్తలు
- 20వ శతాబ్దపు తత్వవేత్తలు
- చిత్తూరు జిల్లా తత్వవేత్తలు