Jump to content

పుపుల్ జయకర్

వికీపీడియా నుండి
పుపుల్ జయకర్
జననం
పుపుల్ జయకర్

(1915-09-11)1915 సెప్టెంబరు 11
మరణం1997 మార్చి 29(1997-03-29) (వయసు 81)
బంధువులుఅదితి మంగళదాస్

పుపుల్ జయకర్ (1915 సెప్టెంబరు 111997 మార్చి 29) భారతదేశ ప్రముఖ కళాకారిణి, రచయిత్రి.

నేపధ్యము

[మార్చు]

ఈవిడ రచయితగానే కాకుండా ఇతర రంగాలలో కూడా విశేష ప్రతిభను ప్రదర్శించింది. స్వాతంత్ర్యానంతరం అంతరించి అవసాన దశకు చేరిన సాంప్రదాయ గ్రామీణ కళలను, హస్త కళలను పునరుజ్జీవింపజేయడంలో ఈమె విశేష కృషి చేసింది.1980 లలో ఈవిడ ఫ్రాన్స్, అమెరికా, జపాన్ దేశాలలో భారతీయ చిత్రకళా ప్రదర్శనలను ఏర్పాటు చేసి, పశ్చిమ దేశాలలో భారతీయ చిత్రకళకు అంతర్జతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. గాంధీ, నెహ్రూ, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి లకు ఈవిడ మంచి స్నేహితురాలు. అంతే కాకుండా వారి జీవిత చరిత్రలను కూడా గ్రంథస్తం చేసింది. భారతదేశ ముగ్గురు ప్రధాన మంత్రులు నెహ్రూ ఆయన కూతురు ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ లకు ఈవిడ ఆప్తురాలుగా మెలిగింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లకు సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరించింది. 40 ఏళ్ళపాటు భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేసింది. మన దేశ సాంప్రదాయక కళలను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటికి ఘనమైన కీర్తిని తద్వారా గిరాకీని తీసుకువచ్చింది.[1][2]

1950లో అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు మనదేశ చేనేత రంగంపై అధ్యయనం చేసింది. తర్వాత ఏర్పాటైన జాతీయ చేనేత సంఘమునకు అధ్యక్షురాలిగా సేవలు అందించింది. ఈ కాలంలోనే అంతరించిపోతున్న భారతీయ మధుబని చిత్రకళని పునరుజ్జింపజేసింది.[3] 1956 లో జాతీయ కళా నైపుణ్య సంగ్రహాలయం, 1984 లో భారత జాతీయ కళా, సాంస్కృతిక కేంద్రము భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఐఎన్టిఏసిహెచ్) లను స్థాపించింది.[1] అంతే కాకుండా 1985లో ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రము (ఐజీఎన్సీఏ), 1990 లో జాతీయ కళాపోషణ కేంద్రము నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లను కూడా స్థాపించింది.[2][4] ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వము ఈమెను 1967లో పద్మభూషణ్ పురస్కారం సత్కరించింది.[5]

బాల్యము, విద్యాభ్యాసము

[మార్చు]

ఈవిడ ఉత్తర ప్రదేశ్ లోని ఎతావాలో 1915న జన్మించింది. ఈమె తండ్రి భారత ప్రభుత్వంలో ఉదారభావాలు గల ఉన్నతాధికారి. తల్లి గుజరాత్ లోని సూరత్కు చెందిన బ్రాహ్మణ స్త్రీ. పుపుల్ తన బాల్యంలో వేసవి సెలవులను అక్కడే గడిపేది. ఈవిడకు ఒక సోదరుడు కుమరిల్ మెహతా, నలుగురు సోదరీమణులు పూర్ణిమ, ప్రేమలత, అమరగంత, నందిని మెహత. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం భారతదేశంలోని పలు ప్రదేశాలలో గడిపింది. దీనివలన ఆమెకు బాల్యం నుండే ఆయా ప్రాంతాల స్థానిక హస్త కళలు, సంస్కృతులను పరిశీలించే అవకాశం వచ్చింది.

పదకొండేళ్ళ వయస్సులో ఈవిడ కాశీ వెళ్ళి అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు అనీ బిసెంట్ స్థాపించిన పాఠశాలలో చేరింది. తర్వాత ఈమె తండ్రికి అలహాబాద్ బదిలీ అయింది. అక్కడే ఈమెకు మొదటిసారి నెహ్రూ కుటుంబంతో పరిచయం అయ్యింది. వీరి తండ్రి, నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ మంచి స్నేహితులు. తర్వాత ఈవిడకు ఆయన కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ, మనవరాలు ఇందిరా గాంధీతో స్నేహం కుదిరింది.[3]

1936లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పట్టా పుచ్చుకొని తర్వాత బెడ్‍ఫోర్ట్ కళాశాల, లండన్ నుండి ఉన్నత విద్యను పూర్తి చేసింది.[2] తర్వాత మనదేశానికి వచ్చి, న్యాయవాదిగా పనిచేస్తున్న మన్మోహన్ జయకర్ ను వివాహం చేసుకుని, బొంబాయిలో స్థిరపడింది.

జీవన ప్రస్థానము

[మార్చు]

బొంబాయిలో స్థిరపడిన తర్వాత చిన్న పిల్లల కోసం టాయ్ కార్ట్ అనే పత్రికను ప్రారంభించింది. ప్రముఖ చిత్రకారులు జైమిని రాయ్, ఎం.ఎఫ్. హుసేన్లు ఈ పత్రికలో బొమ్మలు గీసేవారు. 1940లో కస్తూర్బా ట్రస్ట్ కు చెందిన అప్పటి కాంగ్రెస్ నేత మృదుల సారాభాయ్ కి సహాయకురాలిగా పనిచేయడం ప్రారంభించాక ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలోని జాతీయ ప్లానింగ్ కమిషన్ లోని మహిళా వ్యవహారాలశాఖకి ఉప సంచాలకురాలిగా నియమితమైంది.[6] జిడ్డు కృష్ణమూర్తితో పరిచయమైన తర్వాత చేనేత రంగంలో ఈమెకు ఆసక్తి కలిగింది. చేనేత మంత్రిత్వ శాఖ నేతృత్వంలో మద్రాసు, బీసెంట్ నగర్ లో చేనేతకారుల సేవా సంఘమును స్థాపించింది.[7]

తర్వాతికాలంలో ఇందిరా గాంధీకి ఆప్త మిత్రురాలిగా మారింది. 1966లో ఆమె ప్రధానమంత్రి అయ్యాక పుపుల్ ని ఆవిడ సాంస్కృతిక సలహాదారుగా నియమించింది. అనతి కాలంలోనే జాతీయ హస్తకళల, చేనేత సంస్థ (హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లో వివిధ పదవులను చేపట్టి ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఎదిగింది. 1974 నుండి మూడేళ్ళ వరకు ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉంది.[3]

రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఈవిడ ప్రధాన మంత్రి సాంస్కృతిక సలహాదారుగా వ్యవహరించింది. తన పదవీకాలంలో భారత చేనేత, హస్తకళల ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం లండన్, పారిస్, అమెరికా లలో అప్నా ఉత్సవ్ పేరిట పలు కళా ప్రదర్శనలను ఏర్పాటు చేయించింది.[8] 1982లో భారత సాంస్కృతిక సంబంధ సమితి (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్)) కి ఉపాధ్యక్షురాలిగా నియమితమైంది. అదే సమయంలో (1985–1989) ఇందిరాగాంధీ జాతీయ మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలిగానూ, ప్రధానమంత్రి సాంస్కృతిక, వారసత్వ వనరుల సలహాదారు గానూ వివిధ సేవలు అందించింది. తన స్నేహితురాలు, ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ కోరిక మేరకు 1984లో భారత జాతీయ సాంస్కృతిక, కళా, వారసత్వ ధర్మనిధి (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) ని స్థాపించింది.[6]

బెంగాల్ లోని అక్షరాస్యతా ఉద్యమం హంగ్రీ జనరేషన్ కి గట్టి మద్దతును తెలిపి 1961 లో వారి కార్యకలాపాలకు సహాయపడింది. తన మరణించే వరకు కృష్ణమూర్తి ఫౌండేషన్ లో చురుకైన పాత్ర పోషించింది. అంతేకాకుండా మనదేశంలోనూ, అమెరికా, ఇంగ్లాండు, కొన్ని లాటిన్ దేశాలలో కృష్ణమూర్తి ఫౌండేషన్ స్థాపనకు విశేష కృషి చేసింది. మదనపల్లె లోని రిషీ వ్యాలీ పాఠశాల నిర్వహణలోనూ ప్రధాన పాత్ర పోషించింది.

ఈవిడ జీవితము తర్వాత తరాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. వీరిలో 'శ్రీమతి నందినీ పుష్కర్ త్రివేదినీ, కుమారి నందిని వ్యాస్ , ప్రముఖ విద్యావేత్త, భోపాల్లో పేద పిల్లల కోసం బ్రిగేడియర్ త్రివేదీ స్మారక సంస్థ పేరుతో పాఠశాల నడుపుతున్న పుపుల్ ముఖ్యులు.

రచనలు

[మార్చు]

ఈవిడ రచనలలో కెల్లా పేరెన్నికగలిగినవి ఈమె వ్రాసిన ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు. ఒకటి 1988లో వ్రాసిన ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్ర జె.కృష్ణమూర్తి: ఏ బయోగ్రాఫీ, 1992లో రచించిన భారత దివంగత ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఇందిరా గాంధీ: యాన్ ఇంటిమేట్ బయోగ్రఫీ. రెండవ పుస్తకం రాస్తున్నపుడు తనకు ఆపరేషన్ బ్లూస్టార్ వలన ప్రాణాపాయం ఉన్నదని నాటి ప్రధాని, ఈవిడ స్నేహితురాలు ఇందిరాగాంధీ సూచనా ప్రాయంగా చెప్పడం జరిగింది.[9]

ముఖ్య రచనలు

[మార్చు]
సంవత్సరం రచన ప్రచురణ ISBN ఇతర వివరాలు
1949 గాడ్ ఈజ్ నాట్ ఏ ఫుల్ స్టాప్: అండ్ అదర్ స్టోరీస్ కుతుబ్
1956 టెక్స్టైల్స్ అండ్ ఎంబ్రాయిడరీస్ ఆఫ్ ఇండియా మార్గ్ పబ్లికేషన్స్
1972 టెక్స్టైల్స్ అండ్ ఆర్నమెంట్స్ ఆఫ్ ఇండియా: ఏ సెలక్షన్ ఆఫ్ డిజైన్స్, విత్ జాన్ ఇర్విన్ జాన్ ఇర్విన్ తో సహ రచన
1980 ది ఎర్తెన్ డ్రమ్: యాన్ ఇంట్రడక్షన్ టు ది రిచ్యువల్ ఆర్ట్స్ ఆఫ్ రూరల్ ఇండియా నేషనల్ మ్యూజియం
1982 ది బుద్ధ: ఏ బుక్ ఫర్ ది యంగ్ వకీల్స్, ఫెఫర్ & సైమన్స్
1986 వాట్ ఐ యామ్: ఇందిరా గాంధీ ఇన్ కన్వర్సేషన్ విత్ పుపుల్ జయకర్ ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్
1989 ది ఎర్త్ మదర్ పెంగ్విన్ బుక్స్ ISBN 0-14-012352-0
1992 ఇందిరా గాంధీ: యాన్ ఇంటిమేట్ బయోగ్రఫీ పాంథియోన్ బుక్స్ ISBN 0-679-42479-2
1994 ది చిల్డ్రన్ ఆఫ్ బారెన్ ఉమెన్: ఎస్సేస్, ఇన్వెస్టిగేషన్స్, స్టోరీస్ పెంగ్విన్ బుక్స్ ISBN 0140240
1995 ది చిల్డ్రన్ ఆఫ్ బారెన్ ఉమెన్: ఎస్సేస్, ఇన్వెస్టిగేషన్స్, స్టోరీస్ పెంగ్విన్ బుక్స్ ISBN 0140240
1994 ఫైర్ ఇన్ ది మైండ్: డైలాగ్స్ విత్ జె. కృష్ణమూర్తి పెంగ్విన్ బుక్స్ ISBN 0-14-025166-9
1996 జె.కృష్ణమూర్తి: ఏ బయోగ్రాఫీ అర్కానా ISBN 0-14-019519-X

కుటుంబము

[మార్చు]

1937లో ఈమె వివాహము బారిష్టరు మన్మోహన్ జయకర్ తో జరిగింది. 1972లో ఆయన మరణించాడు.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Burns, John F. (April 2, 1997). "Pupul Jayakar, 81; Led Revival Of Arts and Handicrafts in India". The New York Times.
  2. 2.0 2.1 2.2 Singh, Kuldip (April 2, 1997). "Obituary: Pupul Jayakar". The Independent. London.
  3. 3.0 3.1 3.2 Mrázek, Jan; Morgan Pitelka (2008). What's the use of art?: Asian visual and material culture in context. University of Hawaii Press. p. 84. ISBN 0-8248-3063-6.
  4. "About IGNCA". IGNCA website. Archived from the original on 2018-01-06. Retrieved 2013-03-04.
  5. "Padma Bhushan Awardees". Ministry of Communications and Information Technology. Retrieved 2009-06-28.
  6. 6.0 6.1 The tapestry of her life Malvika Singh, Indian Seminar, 2004.
  7. "Past perfect". The Hindu. Feb 28, 2004. Archived from the original on 2004-05-30. Retrieved 2013-03-04.
  8. Weisman, Steven R. (October 27, 1987). "Many Faces of the Mahabharata". New York Times.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-28. Retrieved 2013-03-04.