ద్వైతాద్వైతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నింబార్క సంప్రదాయం లోని శంఖ, చక్ర, ఊర్థ్వపుండ్రాలు

నింబార్కుడు నెలకొల్పిన సిద్ధాంతం ద్వైతాద్వైతం. ఇది ఒకేసమయంలో బ్రహ్మము, జీవజగత్తుల మధ్య భేదాన్ని, అభేదాన్ని; అలాగే ద్వైతాన్ని, అద్వైతాన్ని కూడా ప్రకటిస్తుంది కాబట్టి ఈ పేరు వచ్చింది.

ద్వైతాద్వైత సిద్ధాంతం

[మార్చు]

పరబ్రహ్మమే జీవాత్మలగాను, జగత్త్తుగాను పరిణామం చెందింది. అంటే తన్ను తాను తన శక్తి ద్వారా పరిణామం చెందించుకున్నది. అలా పరిణామం చెందినంత మాత్రాన బ్రహ్మం మొత్తంగా జీవాత్మలలోనూ, జగత్తులోనూ ఉండిపోదు. పరిణామం చెందినప్పటికీ పరబ్రహ్మంలో కించిత్తు తరుగు కూడా ఉండదు. అది యథాతథంగానే ఉండిపోతుంది. అది అనంతం. జీవజగత్తులుగా పరిణమించినప్పటికీ దాని అనంతత్వానికి భంగం రాదు.

బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మమే. అది సృష్టికి నిమిత్త కారణం, భౌతిక కారణం కూడా. కుండకు మట్టి భౌతిక కారణం. కుండ తయారు చేసేవాడు నిమిత్త కారణం. అయితే జీవ జగత్తుల విషయంలో నిమిత్త భౌతిక కారణాలు రెండూ బ్రహ్మమే.

భేదం, అభేదం

[మార్చు]

బ్రహ్మము తాను సృజించిన జీవునికంటే వేరు కాడు. బ్రహ్మము అంశి. జీవుడు అంశం. అలాగే జగత్తు కూడా. అది బ్రహ్మం కంటే వేరు కాదు. సూర్యుని కాంతి కిరణాలు సూర్యుని కంటే ఎలా వేరు కావో, సముద్ర తరంగాలు సముద్రంకంటే ఎలా వేరు కావో అలాగే బ్రహ్మము కంటే జీవులు, జగత్తు వేరు కావు. బ్రహ్మానికి, వాటికి అభేదం ఉంది. మట్టిలోనుంచి కుండ తయారవుతున్నది. కనుక ఆ మట్టికంటే కుండ వేరు కాదు. కుండ మొత్తంగా మట్టి మాత్రమే. అలాగే బ్రహ్మము, జీవజగత్తులు.

అదే సమయంలో బ్రహ్మానికి, జీవజగత్తులకు భేదం కూడా ఉంది. సముద్ర తరంగాలకు, సముద్రానికి భేదం ఉంది. సూర్యునికి, సూర్య కిరణాలకూ తేడా ఉంది. మట్టికి, కుండకు తేడా ఉంది. అలాగే బ్రహ్మము, జీవజగత్తులు.

బ్రహ్మము స్వతంత్ర తత్త్వం. జీవజగత్తులు పరతంత్ర తత్త్వాలు. కుండమీద మట్టి ఆధారపడిలేదు. మట్టిమీదనే కుండ ఆధారపడి ఉంది. మట్టి లేనిదే కుండ లేదు. కుండ లేకపోయినా మట్టి ఉండగలదు. అలాగే బ్రహ్మముమీద జీవజగత్తులు ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మము లేకపోతే అవి లేవు.

పరమాత్మ నియంత, నియామకుడు, శాసకుడు, పాలకుడు, తానే జీవజగత్తులుగా పరిణమించాడు కనుక అన్నిటికి అంతర్యామిగా ఉన్నాడు. అతడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వ శక్తిమంతుడు, సృష్టికర్త. ఈ గుణాలేవీ జీవునికి లేవు. పరమాత్మ అనంత సౌందర్యమూర్తి, అనంత ఆనందమూర్తి, దోష రహితుడు, మాలిన్యరహితుడు. అందుచేత పరమాత్మకు లేదా పరబ్రహ్మమునకు, జీవులకు, జగత్తుకు భేదం ఉంది.

జీవాత్మ

[మార్చు]

జీవాత్మ అంటే చిత్, చేతన పదార్థం. అది జగత్తుకంటే భిన్నం. దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి కంటే కూడా జీవాత్మ భిన్నం. జీవాత్మ బ్రహ్మంవలె చిత్పదార్థం అయినప్పటికీ బ్రహం అనంతం కాగా, జీవాత్మ అజ్ఞాన వశాన దేహేంద్రియాలకు, జననమరన సంసార చక్రానికి బద్ధుడు. ఈ కారణాన అతడు కర్మలు చేస్తాడు. ఆ కర్మల ఫలితంగా ఫలితాలను అనుభవించడానికి గాను పునఃపునః జన్మిస్తాడు. తాను దేహేంద్రియాలకంటే భిన్నమనే విషయం తెలియని అజ్ఞానం అతడిని ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే తాను భగవదంశ అని, తన స్వస్వరూపం చిత్ అని గ్రహిస్తాడో అప్పుడు జీవత్మ ముక్తుడౌతాడు. మోక్షం పొందుతాడు. మోక్షం అంటే పరమాత్మతో జీవుడు సామ్య స్థితిని, సాధర్మ్యస్థితిని పొందటం. అయితే మోక్షం పొందినప్పతికీ జీవాత్మ తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలిపుకుంటాడు. జీవాత్మ బ్రహ్మంవలెనే ఆద్యంతరహితమైన శాశ్వతతత్త్వం.

మోక్షానికి మార్గం ఏమిటి? జ్ఞానం ఒక మార్గం. జ్ఞానోదయం అంటే జీవునికి స్వస్వరూపజ్ఞానం కలగడం. అయితే జ్ఞానం తనంతట తాను మోక్షమార్గం కాదు. జ్ఞానం భక్తికి దారి తీస్తుంది. భక్తి అంటే ఈశ్వరునుపట్ల అమిత ప్రేమ, అమితానురాగం. భక్తి కంటే ఉన్నతస్థితి ప్రపత్తి. అంటే భగవచ్ఛరణాగతి. భక్తి దానంతటది కలగదు. దానికికూడా భగవత్కృప కావాలి. భగవదుగ్రహం వల్లనే భక్తుని హృదయంలో భక్తి పల్లవిస్తుంది.

చిత్తు భిన్నం అచిత్తు అనే ప్రకృతి. ప్రకృతి మొదట అవ్యక్త, సూక్ష్మరూపంలో బ్రహ్మములో ఉంటుంది. బ్రహ్మ ప్రేరితమైన ప్రకృతి జగత్తుగా పరిణమిస్తుంది. బ్రహ్మం కారణం. జగత్తు కార్యం. కారణం కంటే కార్యం భిన్నం కాదు. కార్యం అవ్యాకృత, సూక్ష్మరూపంలో కారణంలో ఉంటుంది. అందుచేత కారణం వేరు. కార్యం వేరు. కారణం అవ్యాకృతం. కార్యం వ్యాకృతం. అలాగే బ్రహ్మం, జగత్తు కూడా. బ్రహ్మం అవ్యాకృతం. జగత్తు వ్యాకృతం.

ఈశ్వరుడు జగత్సృష్టిని తన క్రీడా నిమిత్తం చేశాడు. తన లీల కోసం ఈశ్వరుడు సృష్టి చేస్తాడు. లీలాంతంలో జగత్తును లయింపచేస్తాడు. ఈ స్థితిలో జగత్తు సూక్ష్మాతి రూపంలో ఈశ్వరుడిలో నిక్షిప్తమై ఉంటుంది. అప్పుడది అవ్యక్తం. తిరిగి సృష్టి సమయం వచ్చేసరికి అది స్థూల జగత్తుగా పరిణామం చెందుతుంది.

మాయావాద ఖండన

[మార్చు]

సత్యాన్ని గ్రహించడానికి మూడు ప్రమాణాలున్నాయి. అవి ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలు. బ్రహ్మము నిర్గుణమైతే ఈ మూడు ప్రమాణాలలో దేనివల్ల కూడా నిర్గుణ బ్రహ్మం ఉనికిని గ్రహించలేము. ఇంద్రియాలకు, మనసుకు అందదు కనుక నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణం నిష్ప్రయోజనం అవుతుంది.

నిర్గుణ బ్రహ్మం నిర్విశేషం అయితే అది అనుమాన ప్రమాణానికి కూడా అందదు. అలాగే నిర్గుణ బ్రహ్మాన్ని మాటలలో వర్ణించలేము కనుక శబ్ద ప్రమాణం (శృతి ప్రమాణం) కూడా దానికి పనికిరాదు. బ్రహ్మం స్వయం ప్రకాశకమైతే అది తనంతట తానే అభివ్యక్తం కావాలి. ఇక దానికి శృతిప్రమాణం దేనికి?

జగత్తును మిథ్య అని, భ్రాంతి అని పేర్కొనడం కూడా చెల్లదు. రజ్జుసర్పభ్రాంతిలో రజ్జువు ఎంత సత్యమో సర్పభ్రాంతి కూడా అంతే సత్యం. ఆ భ్రాంతికి ఆధారం రజ్జువుకు, సర్పానికి గల పోలికలు. భ్రాంతి తొలగడానికి ఆధారం రెండింటికి గల తేడాలు. బ్రహ్మం విషయంలో అటువంటి భ్రాంతికి, భ్రాంతి నిర్మూలనకు అవకాశం లేదు. ఏ గుణాలు లేని బ్రహ్మం నిర్గుణం కనుక దానికి జగత్తుతో పోలికలకు, తేడాలకు అవకాశం లేదు. ఏ గుణాలు లేని బ్రహ్మం సగుణ సహితమైన జగత్తుకు ఆధారం ఎలా కాగలదు? బ్రహ్మం కేవలం జ్ఞానం అయితే అది అజ్ఞానానికి ఆధారం ఎలా అవుతుంది? చీకటికి కాంతి ఆధారం ఎలా అవుతుంది?

ఇవి కూడా చూడండి

[మార్చు]