నింబార్కుడు
బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసిన మహామహులలో మరొక ప్రముఖుడు నింబార్కుడు.
కాలం, జన్మస్థలం[మార్చు]
ఇతని జన్మస్థానం ఇథమిత్తంగా తెలియకపోయినా బళ్ళారిలోని నింబ గ్రామమనీ అందుకే ఇతనికి నింబార్కుడని పేరు వచ్చిందనీ అంటారు. మరొక ఊహ ప్రకారం ఇతనిది గోదావరీ తీరప్రాంతం. ఇతని జనన కాలంకూడా కచ్చితంగా తెలియదు. 11వ శతాబ్దం వాడని ఒక వాదమైతే 13వ శతాబ్దమని మరికొందరి లెక్క. ఇతడి తల్లిదండ్రులు జగన్నాథుడు, సరస్వతి.
వీరిది వైష్ణవసాంప్రదాయంలోని సనక సాంప్రదాయం. అనగా సనక మహర్షి నెలకొల్పిన సంప్రదాయం. వేదాంతపరంగా ఇతనిది ద్వైతాద్వైతం. దీనినే భేదాభేదవాదం అని కూడా అంటారు.
రచనలు[మార్చు]
బ్రహ్మసూత్రాలకు నింబార్కుడు వ్రాసిన భాష్యం పేరు "వేదాంత పారిజాత సౌరభం". దీనిని అర్థం చేసుకోవటానికి ఆయన శిష్యుడైన శ్రీనివాసాచార్యుడు "వేదాంత కౌస్తుభం" అనే వ్యాఖ్యానం వ్రాయవలసి వచ్చింది. దీనిని మరింత సుబోధకం చేయటానికి కేశవ కాశ్మీరీభట్టు "వేదాంత కౌస్తుభ ప్రభ" అనే మరొక వ్యాఖ్యాన గ్రంథం వ్రాసాడు.
భేదాభేదవాదం[మార్చు]
బ్రహ్మము తాను సృజించిన జీవునికంటే వేరు కాడు. బ్రహ్మము అంశి. జీవుడు అంశం. అలాగే జగత్తు కూడా. అది బ్రహ్మం కంటే వేరు కాదు. సూర్యుని కాంతి కిరణాలు సూర్యుని కంటే ఎలా వేరు కావో అలాగే బ్రహ్మము కంటే జీవులు, జగత్తు వేరు కావు. బ్రహ్మానికి, వాటికి అభేదం ఉంది. అదే సమయంలో బ్రహ్మానికి, జీవజగత్తులకు భేదం కూడా ఉంది. సూర్యునికి, సూర్య కిరణాలకూ తేడా ఉంది. బ్రహ్మము స్వతంత్ర తత్త్వం. జీవజగత్తులు పరతంత్ర తత్త్వాలు. సూర్య కిరణాలమీద సూర్యుడు ఆధారపడి లేడు. సూర్యకిరణాలే సూర్యుడిమీద ఆధారపడి ఉన్నాయి. సూర్యుడు లేకపోతే సూర్యకిరణాలు లేవు. అలాగే బ్రహ్మముమీద జీవజగత్తులు ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మము లేకపోతే అవి లేవు.
ఈవిధంగా ఒకే సమయంలో భేదం, అభేదం; ద్వైతం, అద్వైతం ఉండటంవలన ఈ సిద్ధాంతానికి భేదాభేదవాదమనీ, ద్వైతాద్వైతమని పేరు వచ్చింది.
బయటి లింకులు[మార్చు]
- http://nimbarka.wordpress.com
- http://www.dlshq.org/saints/nimbarka.htm
- http://www.golokdham.org Archived 2021-08-15 at the Wayback Machine
- https://web.archive.org/web/20160323010856/http://www.vps-international.org/
- http://shrijagatgurunimbarkacharyapeeth.org Archived 2020-01-22 at the Wayback Machine