పతంజలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పతంజలిని ఆదిశేషుడి అంశగా భావిస్తారు.పతంజలి విగ్రహం హరిద్వార్

పతంజలి యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణిని రచించిన అష్టాధ్యాయి కి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి [1][2][3] "యోగ సూత్రాలు" గ్రంథంతో బాటు పాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయి కి కూడా భాష్యం రాసాడు. ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ ప్రపంచం భారత దేశంలో పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ)రాజయోగం బహుళ ప్రచారంలో కి వచ్చింది.

చరిత్ర[మార్చు]

క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాశ్చ చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.

యోగ సూత్రములు[మార్చు]

పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి.అవి క్రమముగ:సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు.కొందరి అభిప్రాయము ప్రకారము మొదటి మూడు మాత్రము పతంజలి విరచితములు మిగిలినది తరువాత చేర్పబడినదట.కాని ప్రాచీనులు దీనికి ఎక్కడ ఏకీభవించినటులు కనబడదు.

ప్రధమ పాదమున యోగము యొక్క ఉద్దేశ్యము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ బేధములను వర్నింపబడినది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవికాపము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్నింపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సమ్యమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి,ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.

పతంజలి సాంఖ్యుల పంచవిశంతి తత్వములను అంగీకరించి, పైపెచు వారు ఖంఢించిన ఈశ్వరునిగూడా గ్రంహించినాడు.అందువలన పతంజలి తత్వములు మొత్తం 26 అగుచున్నవి. ఈశ్వరు ఎవడు? 'అధ ప్రధాన పురుష వ్యతిరిక్తః కోయం ఈశ్వరోనామః? అను ప్రశ్నకు పతమజలి, క్లేశకర్మవిపాకాశయై రపరామృష్టః పురుష విశేష ఈశ్వరః (యో.సూ.1-24) తత్ర నిరతి శయం సర్వజ్ఞబీజం(యో.సూ.1-25) స ఏష పూర్వేషామపి గురుః కాలేన అనవచ్చేదాత్(యో.సూ.1-26)ఆను సూత్రములను ఈశ్వర తత్వమందు ప్రస్తావించిన=కారు. ఏపురుష విశేషమున క్లేశ, కర్మ, విపాక, ఆశయముల సంపర్కములేదో, అతడే ఈశ్వరుడు. అతడు జ్ఞానముయొక్క పరమోత్కర్ష. సర్వజ్ఞడు. అతడు పూర్వాచార్యులకుగూడ గురువు, కారణము, అతడు కాలాతీతుడు. సాధారణమానవులందరు పైన చెప్పబడిన క్లేశాదియుక్తులు.

1.క్లేశము

ఈక్లేశము 5 తెగలు-అవిద్య (మిధ్యా భావము), అస్మిత(విభిన్న వస్తువుల అభిన్న ప్రతీతి), రాగ (అనురాగము), ద్వేష (విరాగము), అభినివేశము (మరణ భయము).

2. కర్మ

ఈ కర్మ నాలుగు విధములు- కృష్ణ, శుక్ల కృష్ణ, శుక్ల, అశుక్లాకృష్ణ. అత్యంతము పాప కర్మ కృష్ణ కర్మ. బహిరంగములగు సాధనములతో నొనర్పబడు యజ్ఞయాగాదులు శుక్లకృష్ణ కర్మలు. తపస్వాధ్యాది ధ్యానాది కర్మలు శుక్లములు. యోగానిష్థానము అశుక్లాకృష్ణ.

3 & 4.విపాకము & ఆశయము

విపాకము అనగ కర్మ ఫలము. ఇది తన్మ, ఆయు, భోగములను మూడు విధములు.ఈ విపాకానుగణమగు సంస్కారమే ఆశయము. ఈసంస్కారములేనిచో భోగము ఉండదు.

అందువలన ఈ పంచవిధ క్లేశముల సంపర్కములేనివాడును, జ్ఞాననిధియను, కాలాతీతుడును, నిత్యయుక్తుడును, అద్వితీయుడును అగు పరమపురుషుడే ఈస్వరడు అని పతంజలి నిర్వచించినాడు.

యోగ శ్చిత్తవృత్తినిరోధః (యో.సూ.1.1.) అను సూత్రమున పతంజలి చిత్తవృత్తుల నిరోధమే యోగమని స్థిరీకరించినాడు.ఈచిత్తము క్షిప్తము(రజోగుణాధిక్యమున చంచలమై ఉన్నది), మూఢము(తమో గుణాది మోహముతో కూడిఉన్నది)), విక్షిప్తము( సత్వగుణ ప్రాబల్యమున ఒకప్పుడు స్థిరముగుచు మరొకప్పుడు చంచలముగ ఉన్నది), ఏకాగ్రము (ధ్యాయ వస్తువున ఏకాగ్రత ఉంచుట), నిరుద్ధము(వృత్తి నిరోధమై వృత్త జనిత సంస్కారము మాత్రమే మిగిలిఉన్నది) అను 5 విధములు.క్షిప్త, మూఢ చిత్తముల యోగం అసంభవము. విక్షిప్త చిత్తమున, యోగం ఆరభంఅగును. ఇట్టి చిత్తమును క్రియాయోగము వలన ఏకగ్రమొనర్చిన యోగాధికారి అగును.

ఇక చిత్తవృత్తులు ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతు లని పంచ విధములు. ప్రమాణము మరల 3 విధములు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమము లని పేర్కొనబడినది. విపర్య అనగ మిధ్యా జ్ఞానము. విషయము(object) లేకపోయినను శబ్ద జ్ఞానము వలన ఉత్పన్నమగు, ఆకాశకుసుమ, నరశ్ర్ంగబంధములగు వృత్తులు వికల్పములు. నిద్రయను సుషుప్తి. స్మృతి అను అనుభూతి విషయ స్మరణ.చిత్తవృత్తులన్నియు ఈ విభాగముననే చేరియున్నవి. ఈ చిత్తవృత్తులన్నియు నిరోధింపవలెను.కారణము, కేవలుడును, నిర్గుణుడును అగు పురుషుడు చిత్తముచే గలయుట వలన, ఈవృత్తులన్నియు అతనియందు ఉపచరింపబడి, దుఃఖమును కలిగించుచున్నవి. వీటిని నిరోధించిన పురుషునకు మాయ తొలగి, నిజస్వరూపము కనిపించును.(తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, వృత్తిసారూప్యం ఇతరత్ర. యో.సూ.1.34).

వీటి నిరోధమునకు ఉపాయమేమి? అభ్యాస వైరాగ్యములని పతంజలి నుడివినాడు.(అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః యో.సూ.1.12).అభ్యాస మనగ చిత్తవృత్తులను ఏకాగ్రమొనర్ప ప్రయత్నము.శ్రద్ధా బ్రహ్మచర్యపూర్వకముగ నిరంతరము, దీర్ఘకాలమున అనుష్టించిన, అభ్యాసము దృఢమగును. దృష్టాదృష్ట విషయ వితృష్ణ వైరాగ్యము. అభ్యాసము వలన వివేకము అబ్బును.వైరాగ్యమున విషయ వాసన నిర్వాపితమగును. అభ్యాస వైరాగ్యము లబ్బిన శ్రద్ధా, స్మృతి, ఉత్సాహము, ఏకాగ్రతలు కలిగి వైరాగ్యమువలన సంప్రజ్ఞాత సమాధియును; వైరాగ్యము సంపూర్ణమైన అసంప్రజ్ఞాత సమాధియును లభింపగలవు. మరియు తీవ్ర ప్రయత్నము గలవారికి సమాధి కరతలామరకము.

సమాధికి మరేమైనా ఉపాయములున్నవా? ఉన్నది. ఈశ్వరప్రణిధానము, ఏకతత్వాభ్యాసము, చిత్తప్రసాదము, శ్వాస నిరోధము, చిత్తస్థైర్యము, జ్యోతిర్ద్యాసము, మహాత్ముల ధ్యానము, స్వప్న జ్ఞానావలంబనము లలో ఏఒక్కదానినైనను అవలంబింపవచ్చునని పేర్కొనినాడు.

సాధనా కాలమున యోగికి కొన్ని అలౌకిక శక్తులబ్బును. వీటిని, విభూతులని గాని, సిద్ధులని గాని అందురు. పాతంజలదర్సన తృతీయపాదమున వీటి ప్రస్తావన ఉన్నది. ఇయ్యవి సమాధికి విఘ్నములు; పెడదారిన కొనిపోవును. అందువలన సాధకుడు వీటిని గర్హించి, నిర్జించి చరమస్థితియగు కైవల్యము నొందవలేనని పతంజలి అభిమతము.(తే సమాధావుపసర్గా వ్యుత్థానే సిద్ధయః-యో.సూ.3.32).

పతంజలి రచించిన యోగ సూత్రములలో 8 స్థాయిలు ఉన్నాయి. వీటినే అంగములని అని కూడా అంటారు. గ్రంథ రూపంలో 8 అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. అవి 1)యమ 2) నియమ 3) ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7)ధ్యాన 8) సమాధి అనేవి.

ప్రతీ మానవుడి శరీరంలో షట్చక్రాలు అనే నాడీమండలాలు 6 ప్రధానంగా ఉంటాయని పతంజలి సిద్ధాంతీకరించాడు. మానవుడిలో వుండే ప్రాణ శక్తి కారణంగానే అతడు సజీవంగా ఉండగలుగుతున్నాడు. ఆ ప్రాణశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా ప్రేరేపించటం (ప్రచోదనం చెందించటం) వలన మానవ శరీరంలో సహజంగా శక్తి వెలువడుతుంది. ఈ వెలువడే శక్తి కుండలినీ శక్తి, కుండలినీ శక్తిని ప్రేరేపించడం వలన మానవుడికి శారీరక ఆరోగ్యం చేకూరడమే కాక ఆత్మజ్ఞానం కలిగి సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందగలుగుతాడని పతంజలి చెప్పాడు.

పతంజలి చెప్పిన మూడో స్థాయి ఐన "ఆసన" ను దానికి ముందు చెప్పబడిన యమ, నియమ సూత్రాలను క్రోడీకరించి ఆధునిక కాలంలో భారతీయ, పాశ్చాత్య పండితులు ఎందరో ఎన్నో రకాల యోగాభ్యాస ప్రక్రియలను యోగాసనాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి సామాన్య ప్రజలకు శిక్షణనిస్తున్నారు. దీనిద్వారా తీవ్ర ఒత్తిడితో జీవితాలు గడుపుతున్న ఆధినికులు ఎంతో ప్రశాంతతను పొందుతున్నట్లు పరిశోధనల్లోనూ, స్వానుభవాలతోనూ అంగీకరించటం విశేషం.

పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)[మార్చు]

 1. యమము : అస్తవ్యస్తంగా, గజిబిజిగా ఉండే మనస్సును, శరీరాన్ని ఒక నిర్దిష్ట పద్దతిలో క్రమబద్దీకరించే ప్రక్రియనే "యమము" అందురు.
 2. నియమము : శరీరాన్ని మనస్సునూ, యోగాభ్యాసానికి సిద్ధం చేయటానికి ఆహారం, అలవాట్లు మొదలైన వాటిల్లో అనవసరమైన నియమాలు ఏర్పరిచే క్రమశిక్షణ తో ఉండటం.
 3. ఆసనం: ఆసనం అంటె యిప్పుడు పాశ్చాత్యులలో ఉన్న భౌతిక అవసరాలైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనం యిలా అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవరసాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్యతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు.
 4. ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. శ్వాసను గమనించడం, శ్వాసతో ధ్యానం చేయడం. వంటి శ్వాసక్రియా యోగ పద్ధతులన్నీ ఈ ప్రాణాయామం విభాగంలోకి వస్తాయి.
 5. ప్రత్యాహారం : శరీరం కన్నా మానవుడు వేరు అన్న సత్యాన్ని భారతీయులు ఏనాడో తెలుసుకున్నారు. పాశ్చాత్యులు కూడా ఈ సత్యాన్ని అంగీకరించగలిగితే పతంజలి చెప్పిన "అస్టాంగయోగ" విశేషాలు అర్థమవుతాయి. లేకపోతే యిదేదో కల్పిత రచనగానే పొరబడే అవకాశం ఉంది. ఇంతకూ ప్రత్యాహారమనగా వెనుకకు తిప్పడం అని అర్థం. అంటే పరిపరి విధాల పరుగులెత్తే మనస్సును మరల్చి హృదయంలో ఉండే ప్రజ్ఞతొ అనుసంధానం చెయ్యడం ప్రత్యాహారం.
 6. ధారణ: సర్వాంతర్యామి అయిన భగవాంతునిలో మనసు నిలపడమే ధారణ . సాదారణంగా మనస్సు క్షణకాలం కూడా ఒక విషయం మీద స్థిరంగా ఉండదు. అలాటి చంచలమైన మనస్సుకు ఒక క్రమబద్దమైన యోగాభ్యాస ప్రక్రియ ద్వారా స్థిరత్వం కలిగించి స్ర్వాంతర్యామి యందు లగ్నం చెయడమే ధారణ.
 7. ధ్యానము : సర్వాంతర్యామి యందు లగ్నం చేయబడిన మనస్సు యితర పాపంచిక విషయాలు గుర్తు రానంతగా ఒకే విషయం నందు (భగవంతుని యందు) ప్రశాంతమైన స్థితిలో నిలిచి ఉండటాన్ని "ధ్యానస్థితి" అంటారు.
 8. సమాధి : సమాధి అంటే సిద్ధించడం, ఏ లక్ష్యం కోసం సాధకుడు అష్టాంగ యోగాన్ని అవలంబించి, అనుసరించి సాధన చేశాడో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం లేదా సాధిచ్మిన స్థితిలో ఉండటాన్నే సమాధి స్థితి అన్నడు పతంజలి.

పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.

ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినో పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.

భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంధాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.

యివి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

 1. Jonardon Ganeri, Artha: Meaning, Oxford University Press 2006, 1.2, p. 12
 2. S. Radhakrishnan, and C.A. Moore, (1957). A Source Book in Indian Philosophy. Princeton, New Jersey: Princeton University, ch. XIII, Yoga, p.453
 3. Gavin A. Flood, 1996

యితర లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పతంజలి&oldid=1648512" నుండి వెలికితీశారు