Jump to content

చాణక్యుడు

వికీపీడియా నుండి
చాణక్యుడు.

చాణక్యుడు (సంస్కృతం: चाणक्य Cāṇakya) (c. 350-283 BC) మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు.[1]. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు[2]. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన 'అర్ధ' పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.[3]. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణం [4] అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి, తెలుగులో ఆరమండ్ల వెంకయ్యార్య అనువదించారు

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చణకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం. చాణక్యుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు.

పాటలీపుత్ర ప్రస్తావన

[మార్చు]

ప్రాచీన భారతదేశంలోని రాజ్యాల అన్నిటిలో మగధ రాజ్యం ప్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. మహాభారతంలో ప్రస్తావించిన జరాసంధుని రాజధాని ఈ మగధదేశలోని గిరివ్రజము. ఇక్కడే బింబిసారుడు రాజగృహ మను నగరాన్ని నిర్మించాడు. తరువాత కొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను ఒక పల్లెచెంత గొప్ప కోటను నిర్మించాడు. అతని మనుమడు ఉదయనుడు పాటలీదుర్గము సమీపాన పాటలీపుత్రమను గొప్పనగరం నిర్మించాడు.

పాటలీపుత్రమును మహాపద్మనందుడు తన ఎనిమిది మంది కుమారుల సాయముతో పాలించేవాడు. మహాపద్మునకు ఇళ, ముర యను ఇద్దరు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జన్మించారు. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని అనేవారు. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు ఐన చంద్రగుప్తునియెడ సవతి సోదరులు ఎనిమిదిమంది పగ బూని ఎలాగైనా వానిని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను చంద్రగుప్తుడు అందరికన్నా చిన్నవాజవటం వలన, రాజ్యభారమంతా ఎనిమిదిమందికి చేజిక్కింది. చంద్రగుప్తుని చంపడానికి ఎన్నో దురాలోచనములు చేసి అనేక విధముల భాదిస్తూ ఉండేవారు. చివరికి చంద్రగుప్తుడు తినడానికి సరైన తిండి కూడా లభించేదు కాదు. చివరకు సత్రాధికారిగా కాలము గడుపుచుండెను.

నందులు చాణక్యుడిని అవమానించుట

[మార్చు]

నందులు తమ మహామంత్రియైన రాక్షసుని మాటలేమీ పాటించకుండా స్వతంత్ర భావముతో ప్రవర్తిస్తూ ఉండేవారు. ఒకరోజు చాణక్యుడను యువ పండితుడు నందరాజుల సభకు వచ్చి అందు గల ఒక ఉన్నతాసనమున కూర్చున్నాడు. నందులు అక్కడికి వచ్చి ఉత్తమ పీఠమునందున్న ఆపేద బ్రాహ్మణుని తిరస్కారభావముతో చూసి సింహాసనమునుండి కిందికి లాగారు. రాక్షసమంత్రి ఇది అక్రమమనీ, పండితులు పూజనీయులనీ బోధించాడు. కానీ లాభం లేకపోయింది. సిగముడి విడిపోయు ఉన్నతాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులపై ఆగ్రహించి ఓ నందాధము లారా! అందరి మధ్యలో నన్ను ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇదే విధంగా సింహాసనమునుండి లాగి, మీతలలను నరికి గానీ ఈ జుట్టు ముడి వేయను అని శపథము చేసి సభామందిరమును వదలి వెళ్ళిపోయాడు.

చాణక్యుడు ఆవిధంగా కోపంతో వెళ్ళిపోవడం చూసిన చంద్రగుప్తుడు వేరొక దోవన వెళ్ళి ఒక యేకాంత ప్రదేశమున ఆయనను కలుసుకొని, సాగిలి పడి నమస్కరించి, నందులు తనను పెడుతున్న అవస్థలను తెలిపి తనను అనుగ్రహింపుమని వేడుకొన్నాడు. చాణక్యుడు అతనిని ఆదరించి నందరాజ్యమునకు నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేయడం నారెండవ ప్రతిజ్ఞ అని చెప్పి, అప్పటి నుండి చంద్రగుప్తుని తనవద్దనే ఉంచుకుని నందువంశ నిర్మూలమునకై ప్రయత్నములు చేయడం ప్రారంభించాడు.

చాణక్యుడు తన మిత్రుడును సహాధ్యాయయు నగు నిందుశర్మను సమీపించి తన ప్రతిజ్ఞను దెలిపి ఎలాగునైనా క్షపణక వేషముతో అభిచారిక విద్యచే నందులను, రాక్షసుని లోగొని యచటి రహస్యములను చారులచే నెఱింగించుచు, జంద్రగుప్తునకు నందరాజ్యమును ధారవోయుటకు దోడ్పడ వసినదిగా కోరెను.

ఇందుశర్మ యంగీకరించి నందుల చెంతకేగి చెలిమిగడించి రాక్షసుని చెంత బ్రాపకము నార్జించి తలలో నాలుకవలె గలిసిమెలసి యుండి రాజ్యరహస్యము లన్నియు నెప్పటికప్పుడు చాణక్యున కెఱింగించుచుండెను. చాణక్యుడు చంద్రగుప్తుని వెంటగొని హిమాలయపర్వత ప్రాంతమునందున్న యరణ్య భాగములను బాలించుపర్వతరాజు చెంత జేరి యతని స్నేహమును సంపాదించి నందులను చంపుటకు అతనిని బ్రోత్సహించెను. గెలిచిన యెడల నందరాజ్యమునందు సగము పర్వతరాజునకోసంగుటకు గూడ జాణక్యుడు వాగ్దానము గావించెను. జయించితిమేని జాణక్యుని జంద్రగుప్తుని వంచించి నందరాజ్యము నంతయు హరింప వచ్చునని పర్వతరాజు తలంచి సామంతుల యొద్దనుండి మిత్రుల యొద్దనుండి యసంఖ్యాకమగు సైన్యమును రప్పించి చాణక్యుడు పెట్టిన సుమూర్తమున నందరాజ్యముపైకి దాడికి వెడలెను. పర్వతరాజు వెంట నాతని సైన్యమే కాక శక, యవన కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లి కాది సైన్యములుగూడ వచ్చెను. చాణక్యుడు, చంద్రగుప్తుడు సైన్యమును మూడు భాగములుగా భాగించి తాము చెరియొక భాగమును దీసికొని గండకీ ప్రాంతమునకు బోయి పాటలీపుత్రమును ముట్టడించిరి. పర్వతరాజు కడమ మూడవభాగమును వెంటగొని గంగా శోణా సంగమప్రదేశము చెంత పాటలీపుత్రమును ముట్టడించెను. ఇందుశర్మ నందులనందరిని జీలదీసి చాణక్యునకు బట్టియిచ్చెను. చాణక్యుడు ఎనమండ్రు నందులను సంహరించి తన మొదటిప్రతిజ్ఞను నిర్వహించి యప్పుడు తల వెండ్రుకలను ముడివైచికొనెను.

నందుల నాశము జూచి మంత్రియగు రాక్షసుడు చీలిన సైన్యమునంతయు సమైక్యబఱచి పర్వతరాజు సైన్యముతో బాటలీపుత్రసైన్యమును భయంకరముగా యుద్ధము జేయించెను. నందరాజులమరణము విన్న రాక్షసుల సైన్యము కొంతసేపటికి బర్వతరాజు సైన్యమునకు లొంగిపోయెను. పాటలీపుత్రమునందు అమాత్య రాక్షసున కెక్కువ పలుకుబడి యుండుటచేతను వెంటనే రాజ్యమున బ్రవేశించినచో జంద్రగుప్తునకైనను దనకైనను నపాయము గలుగవచ్చుననియు బర్వతరాజు నందరాజ్యమంతయు దానే వశపరచుకొను నేమో యనియు సందేహించి చాణుక్యుడు జయించిన రాజ్యమున బ్రవేశింప నగరం వెలుపల పరిజనముతో విడిసి యుండెను.

రాక్షసుడు ఎలాగైనా జంద్రగుప్తుని, జాణక్యుని జంప దలంచి మాయోపాయములు తప్ప వేఱు మార్గము లేదని, యొక యుపాయము పన్నెను. రాక్షసు డొకబాలికను విషము అలవాటు చేసి పెంచుచుండెను. ఆబాలిక విషము జీర్ణించుకొనుట కలవాటుపడి యౌవనవతియై సర్వాంగసుందరియై యుండెను. ఆసుందరి తాకినయెడ విషముసోకి మనుజులు మరణింతురు. ఆమెను రప్పించి తనచెంత విశ్వాసపాత్రుని వలె క్షపణక వేషథారియై వర్తించుచు జీవసిద్ధియను పేరుతోనున్న ఇందుశర్మను బిలిచి యీబాలికను జంద్రగుప్తునకు నేను సమర్పించితి ననియు బరిగ్రహించి మమ్ముల ననుగ్రహింపు మనియు జెప్పి పంపెను. జీవసిద్ధి విషకన్యను వెంటగొని చాణక్యునికడకు బోయి జరిగిన యుదంత మంతయు రహస్యముగా దెలిపి విషకన్యను సమర్పించెను. నందరాజ్యము నంతయు హరింపనెంచిన పర్వతరాజును జంప నిదియ తరుణమని చాణక్యుడు విషకన్యను బర్వతరాజునొద్దకు బంపెను. కామాతురుడగు పర్వతరాజు విషకన్యనుజూడగనే యొడలుప్పొంగి కౌగిలించుకొని విషము తల కెక్కి మరణించెను. నందరాజ్యమునంతయు హరింపదలంచిన పర్వతేశ్వరుడు గతించుట చాణక్యుని సంకల్పమునకు సర్వవిధముల సహాయకారి యయ్యెను. పర్వతరాజు మరణము విని యతని కుమారుడగు మలయ కేతువు విచారపడుచుండ బ్రతిపక్షుల సేనానాయకుడగు భాగురాయణుడు వచ్చి చెలిమి సంపాదించుకొని, చాణక్యుడు నీతండ్రిని జంపించినటులే నిన్నును జంపింప నున్నాడని బ్రదుక దలచిన నిటనుండి వెడలిపోవుట మంచిదని తెల్పెను. అతని మోసపుమాటలు నమ్మి మలయ కేతువు భాగురాయణుని మంత్రిగ జేసికొని తన పర్వత రాజ్యమునకు వెడలిపోయెను.

పర్వతరాజు మరణించుట, మలయకేతువు పాఱిపోవుటయు జూచి యిదియే మంచి సమయమని చాణక్య చంద్రగుప్తులు మంగళవాద్యములతో బాటలీపుత్రమున బ్రవేశించిరి. రాక్షసుడు సైన్యముల బ్రోత్సాహపఱచి చాణక్య చంద్రగుప్తుల బలము మీదికి యుద్ధమునకు ఉసి గొల్పెను. ఉభయులకు భయంకరమగు యుద్ధము జరిగెను. రాక్షసుడు ఈ యదును గనిపెట్టి నందులపక్షమున జేరి, చంద్రగుప్తునకు బట్టాభిషేకము చేయరాదని చాటించెను. మహానందుని ఒక సొరంగ మార్గమున దపము జేసికొనుటకు బంపి యతని స్వీకారపుత్రుని రాజ్యమునందు బ్రతిష్ఠింపవలయునని రాక్షసుడు నిశ్చయించెను. చంద్రగుప్త చాణక్యులు పాటలీపుత్రమున బరిచయము సంపాదించుకొనిన కొలది తన కపకారము కలుగక తప్పదని రాక్షసుడు గర్భవతి యగు తన భార్యను పుత్రుని ప్రాణమిత్రుడగు చందనదాసుని యింట రహస్యముగా నుంఛెను. తన యంతరంగ మిత్రుడగు శకటదాసునకు గోశాగారము లోని ధనము నంతయు నొసంగి నందుల పక్షమునకు సహాయముచేయు నేర్పాటు చేయించెను. అంతతో దృప్తినందక చంద్రగుప్తుని మట్టుపెట్టిన గాని చాణక్యుడు లొంగడని యమాత్యరాక్షసుడు తలంచి దారు వర్మయను శిల్పిని బిలిపించి చంద్రగుప్తుడు నగరంన జేరునపుడు ద్వారము కూలునటుల జేయుమనెను. ఏనుగు నెక్కి నపుడు చంద్రగుప్తుని చుఱకత్తితో బొడిచి చంపుమని మావటీనిని బ్రోత్సహించెను. రాజవైద్యునితో జంద్రగుప్తునకు విషప్రయోగము చేయుమనియు, శయనాధికారితో నిదురించునపుడు తలనఱకు మనియు గొందఱు ఘాతుకులను గోడ సందులలో బంధించి సమయము జూచి చంపుమనియు రాక్షసుడు కట్టుదిట్టములు చేసెను. చాణక్యుడు తన యసాధారణ ప్రజ్ఞచే రాక్షసుని మాయోపాయము లన్నియు గమనించి చంద్రగుప్తున కెట్టి యపాయము గలుగకుండ గాపాడి హంతకుల నందఱ జంపించెను. సర్వార్థసిద్ధిని వెదకించి చాణక్యుడు కొందఱు హంతకుల బంపి చంపునటుల జేసెను. తన ప్రయత్నము లన్నియు విఫలమగుటయు బర్వతరాజు, సర్వార్థసిద్ధి మరణించుటయు మలయ కేతువు పాఱిపోవుటయు జూచి రాక్షసుడు తానిక బాటలీపుత్రమున నుండ లాభములేదని సొరంగమార్గమున నగరుదాటి పర్వతరాజ్యమునకు పారి పోయెను. ఇట్లు రాక్షసుడు మలయ కేతువు నొద్దకేగి యతనితో చాణక్యుడే నీతండ్రియగు పర్వతరాజును జంపించెననియు బాటలీపుత్రమును ముట్టడించి తండ్రిని జంపిన పగ దీర్చు కొమ్మనియు బ్రోత్సహించెను. మలయ కేతువునకు శక, గాంధార, యవన, శచీన, హూణాదిరాజులు సైన్యసహితముగా సాయము రానుండిరి.

చంద్రగుప్తుని బట్టాభిషిక్తుని జేయుటతో తనభారము తీరలేదని చాణక్యుడు తలంచి తన యంతరంగ మిత్రుడగు జీవసిద్ధిని బిలువనంపి నీవు విషకన్యను బ్రయోగించి పర్వతరాజును జంపితివి గాన రాజ్యమునం దుండదగవని వెడల నంపెను. ఈయవకాశమును బురస్కరించుకొని జీవసిద్ధి మలయ కేతువును శరణుగోరి రాక్షసునకు మలయ కేతువునకు విరోదము కలుగజేయుచు విషకన్యను బ్రయోగించి రాక్షసుడే పర్వతరాజును జంపెనను ప్రవాదము నందందు గలుగ జేసెను. జీవసిద్ధి యవకాశమున్నపుడెల్ల నచటి రహస్యములు చాణక్యాదులకు గూడచారులచే దెలియబఱచుచు బయటికి మలయ కేతువు పక్షమువానివలె నటించుచుండెను. చాణక్యుడు పాటలీపుత్రమున రాక్షసుని పక్షము వారెటనుండిరొ తెలిసికొనుటకు జారులను నియోగింప వారు వెదకి వెదకి చందనదాసుని యింటిలో రాక్షసుని భార్యయు బిడ్డలు నుండిరని తెలిసి కపటో పాయములతో తామార్జించిన రాక్షసుని ముద్రికను జాణక్యున కోసంగిరి. చాణక్యు డాముద్రికా సహాయమున గొన్ని పత్రికలను సృష్టించి జీవసిద్ధి చేతికిచ్చి ప్రచారము లోనికి దెప్పించి, రాక్షసునకు మలయ కేతువునకు విరోధము కలుగు నటుల జేసెను. అందుచే మలయ కేతువు నిశ్చయించిన దాదియు విఫలమయ్యెను. రాక్షసునకు మలయకేతువు నొద్ద ప్రాపకము తగ్గెను. తనతండ్రిని రాక్షసుడే చంపెనని మలయ కేతువు ద్వేషముగూడ వహించెను. 'మృతినొందిన నందాదుల యాత్మ శాంతికొఱకు జాణక్యుని గాని చంద్రగుప్తుని గాని సాధింపలేక పోతినిగదా, నేను జీవించి ఫలమేమని రాక్షసుడు పరితపించు చుండెను. రాక్షసుని నెటులేని చంద్రగుప్తునకు మంత్రినిగా జేసిన బాగుండునని సర్వవిధముల జాణక్యుడు ప్రయత్నించెను గాని నందపక్షపాతియగు రాక్షసుడందుల కంగీకరింపక పోయెను.

రాక్షసామాత్యుడిని చంద్ర గుప్తునకు మంత్రిగా జేయుట

[మార్చు]

రాక్షసుని లోబఱచికొన మార్గము గానక చాణక్యుడు కడకొక యుపాయమును బన్నెను. రాక్షసుని భార్య సుతులు చందనదాసుని యింట బాటలీపుత్రమున నుండిరి. చందనదాసుడు రాక్షసునియెడ భక్తివిశ్వాసములు గలవాడు. చాణక్యుడు చందనదాసుని రప్పించి రాక్షసుని భార్యా శిశువుల దన యధీనము గావింపుమని నిర్భంధించెను. స్వామి భక్తిపరాయణుడగు చందనదాసు డందుల కంగీకరింపక తిరుగ బడుటచే చాణక్యుడాతని కురిశిక్ష విధించెను. ఈసంగతి రాక్షసుడు విని నిరపరాధియు దన ప్రాణమిత్రుడు నగు చందనదాసునకు దన మూలమున ఘోరమరణము కలిగినందులకు విచారించి యెటులేని యంత్యకాలమునందేని పరమ విశ్వాసపాత్రుడగు చందనదాసుని గలిసికొని తన ప్రాణము లోసంగియేని యాతని గాపాడనెంచి వధ్యస్థానమునకు జేరెను. హంతకులు చందనదాసుని వధ్యస్థానమునకు జేర్చి యురిదీయబోవు తరుణమున రాక్షసు డడ్డుపడి నిరపరాధియగు చందనదాసుని వదలి నన్ను జంపుడని ముందునకు వచ్చెను. చాణక్యు డది యంతయు జూచి రాక్షసామాత్యా! నీవు చంద్రగుప్తునకు మంత్రిగానుండుటకు ఇష్టపడెదవేని దోషియగు చందనదాసుని వదలుదుము. లేకున్న ఉరిదీయక తప్పదని చెప్పెను. మిత్రసంరక్షణమే తన కవశ్యకర్తవ్యము గావున విథిలేక రాక్షసుడు చంద్రగుప్తునకు మంత్రిగానుండుట కంగీకరించెను. చంద్రగుప్తుడు రాజనీతివిశారదుడగు రాక్షసుడు మంత్రిగనుండుట కెంతయో సంతసించెను. తన ప్రతిజ్ఞలగు నందసంహారము, చంద్రగుప్త పట్టాభిషేకములను ఈవిధముగా ముగించి రాజ్యము బ్రశాంత మొనరించి చాణక్యు డాథ్యాత్మికవిచారము గావింపనెంచి రాజకీయరంగమునుండి తొలంగెను. గతము నంతయు మఱచి రాక్షసుడు చంద్రగుప్తునిచే ననేక దండయాత్రల నొనరింప జేసి పరాజయము నెఱుంగని విజయములతో పాటలీపుత్రరాజ్యమును మిగుల విస్తరింప జేయుటయేగాక హిమాలయమున కావలి దుర్గమ రాజ్యభాగములుగూడ సాధించెను. మలయ కేతువు చంద్రగుప్తునకు సామంతుడై యుండెను.

పేరు

[మార్చు]

ఎక్కువమందికి చాణక్యుడనే పేరుతోనే తెలుసు.[5] కానీ ఇతడు రాసిన అర్థ శాస్త్ర గ్రంథంలో గోత్రనామం వాడటం వలన కౌటిల్యుడు అనే పేరు కూడా సార్థకమైంది.[6] ఈ గ్రంథమంతటా రచయిత పేరు కౌటిల్యుడిగానే ఉంది.[2] కానీ ఒక్క శ్లోకం మాత్రం అతన్ని విష్ణు గుప్తుడిగా సంబోధించింది.[7]

చాణక్య అర్ధశాస్త్రం

[మార్చు]

ఇందులో రాజకీయ శాస్త్రాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ, దానిని ఏ విధంగా సజావుగా రాజ్యాన్ని ఏలేందుకు ఉపయోగించుకోవాలి, యుద్ధాల్లో, పరదేశీయులతో చేసే మంతనాల్లో ఎలాంటి విధానాన్ని చేపట్టాలి,వేగులు, గూఢచారుల వ్యవస్థను ఎలా నడపాలి, వివిధ అవసరాలకు నిఘా వ్యవస్థను ఎలా అమర్చుకోవాలి, రాజ్య ఆర్థికస్థిరత్వానికి ఏం చేయాలి - మొదలగు అంశాలను విశదీకరించాడు. కౌటిల్యుడు తన ధర్మ-నీతి-అర్థ శాస్త్రాలకు ఆధారం బృహస్పతి, ఉషణసుడు, ప్రాచేతస మనువు, పరాశరుడు, అంబి మొదలగు వారు ప్రతిపాదించిన పాలనా తత్త్వశాస్త్రగ్రంథాలని చెప్పుకున్నాడు. తనను తాను పాలన తత్త్వ శాస్త్రవేత్తల వంశానికి చెందిన వాడిగా చెప్పుకుంటూ, తన తండ్రి చణకుడు కూడా గొప్ప పాలనాతత్త్వశాస్త్రవేత్త అని పేర్కొన్నాడు.

ఇందులో ఒక ముఖ్య సిద్ధాంతము మండలయోని. మండలయోనిలో సంక్లిష్టమైన రాజ మండలాన్ని కౌటిల్యుడు సృష్టించాడు. రాజ్యావతరణ మొదటి దశలో చిన్న చిన్న రాజ్యాలు పెద్ద పెద్ద రాజ్యాలుగా రూపొందడం కొరకు సంఘర్షణలు, యుద్ధాలు తప్పనిసరి అయినాయి. చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా ఏర్పడవలెననే కాంక్షకు కారణం సాంఘికంగా, ఆర్థికంగా, రాజ్కీయ సుస్థిరమైన, దృఢమైన రాజ్యంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించటమే అంటాడు కౌటిల్యుడు. మండలయోనిలో రాజ్య విస్తరణను (Political Aggrandizement) సాధించడమే కాక వివిధ రాజ్యాలమధ్య రాజ్యాధికార సమతౌల్యతను ( Balance of Power) సాధించడం ఎట్లో ఈ సిద్ధాంతం వివరిస్తుంది. వివిధ రాజ్యాలతో కూడిన రాజమండలంలో బాహ్యంగా ఏకాంతరంగా వున్న రాజ్యాలను నేమి గా, తదనంతర రాజ్యాలను ఆకులుగా, విజుగీషు లైన నేత తనను నాభిగా చేసుకొని నలుదిక్కులకు వ్యాపించవలెను. ప్రకృతి మండల వృత్తములలో నాభిగా ఉన్న విజిగీషులైన రాజును లేక రాజ్యమును, వెంటనే చుట్టివున్న రాజ్యాలు విజిగీషుకు సహజ శత్రువులు. వీరియడల నాభిగా వున్న విజిగీషులైన రాజు అత్యంత జాగరూకుడై ఉండాలి. సహజ శత్రువులతో కూడిన వృత్తమునకు వెంటనే ఆవరించి వున్న బాహ్య వృత్తములోని రాజ్యములు విజిగీషుకు సహజ మిత్ర రాజ్యములు. అంతేకాక విజిగీషునకు ఆవరించిఉన్న రెండవవృత్తములోని (మిత్ర రాజ్యములు) వీరు సహజ శత్రువులు. ఈ విధంగా విజిగీషు నాభిగా, సహజ శత్రువులు ఆకులుగా, సహజ మిత్ర రాజ్యములు నేమిగా ప్రకృతి మండల చక్రం అతి సంక్లిష్టమైన అంతర్ రాజ్య సంబంధాలను విజిగీషు అతి జాగరూకతతో నిర్వహించవలసి వుంటుంది. మండలం రాజ్యములు యుద్ధములతో సతమతమై వుండటం సహజం.రాజ మండలములో రాజకీయ యధాతస్థితికి ఏక్షణంలోనూ తావులేదు అంటాడు కౌటిల్యుడు. 18వ శాతాబ్దం ఐరోపా రాజకీయాలలో బ్రిటీష్ రాజనీతిని పరిశీలిస్తే ప్రకృతి మండలం సిద్ధాంతం ఎంత విశ్వజనీయమైనదో తెలుస్తుంది.ఫ్రెంచి దేశపు 14వ లూయీ తన మనుమడైన ఫిలిప్ కు స్పెయిన్ కు రాజుగా చేసినప్పుడు ఇంగ్లాండ్ ఐరోపా రాజకీయాధికార చిత్రాన్ని సమతౌల్యం చేయుటకొరకు నెదర్ల్యాండ్, జర్మనీ, పోర్చుగల్, డెన్మార్క్, హాబ్ర్బర్గ్ కుటుంబంతో చేతులు కలిపి ఫ్రెంచి సామ్రాజ్య విస్తరణ కాంక్ష 1701-1714 మాధ్య కాలంలో స్పానిష్ యుద్ధాలతో దెబ్బతీసింది.

తక్షశిల విశ్వవిద్యాలయం

[మార్చు]

తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందులో చదివిన వాళ్ళలో అశోకుడు కుడా ఒకడు. ఇది భారతదేశం లోనే కాదు ప్రపంచం లోనే గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Boesche, Roger (2003). "Kautilya's Arthaśāstra on War and Diplomacy in Ancient India". The Journal of Military History. 67 (1): 9–37. ISSN 0899-3718. "Kautilya [is] sometimes called a chancellor or prime minister to Chandragupta, something like a Bismarck…"
  2. 2.0 2.1 Mabbett, I. W. (1964). "The Date of the Arthaśhāstra". Journal of the American Oriental Society. 84 (2): 162–169. ISSN 0003-0279.
  3. L. K. Jha, K. N. Jha (1998). "Chanakya: the pioneer economist of the world", International Journal of Social Economics 25 (2-4), p. 267-282.
  4. చాణక్యుడు; వెంకయ్యార్య, ఆరమండ్ల. చాణక్య దర్ప నీతి.
  5. Trautmann, Thomas R. (1971). Kautilya and the Arthaśhāstra: A Statistical Investigation of the Authorship and Evolution of the Text. Leiden: E.J. Brill. p. 10.
  6. Trautmann 1971:10 "while in his character as author of an arthaśhāstra he is generally referred to by his gotra name, Kautilya."
  7. Mabbett 1964
    Trautmann 1971:5 "the very last verse of the work...is the unique instance of the personal name Vishnugupta rather than the gotra name Kautilya in the Arthaśhāstra.

బయటి లింకులు

[మార్చు]

డి.ఎల్.ఐలో చాణక్య నీతి దర్పణం పుస్తక ప్రతి