Jump to content

చార్వాకుడు

వికీపీడియా నుండి

చార్వాకుడు : బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత, బార్హస్పతి మతము అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు.

‘లోకేషు అయతాః లోకాయత’

‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్కా’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే వున్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి అధ్యత్మికవాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు.

14వ శతాబ్దికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ…మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయుత’. వస్తు రీత్యా సరైన పేరు.” దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని చరిత్ర భౌతికవాదులుగా పేర్కొనింది.

ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా బలవంతులైన వైదిక సంప్రదాయ వాదులచే అణగద్రొక్కబడిన లోకయతుల ప్రాచీన గ్రంథాలన్నీ క్రీ.పూర్వమే ధ్వంసం చేయబడ్డాయని అంటారు. చివరకు వీరి ఆచారాలు, సంప్రదాయాలను, వీరి ప్రత్యర్దుల గ్రంథాల నుండి,(వ్యంగ్య) వ్యాఖ్యల నుండి తీసుకోవలసి వచ్చింది. క్రీ.పూ.300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లోకాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలం లోనే లోకాయత గ్రంథమూ, దానిపై వ్యాఖ్యానమూ వున్నాయన్నమాట.

‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ప్రకృతిజనాః’ (మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. ‘షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు. ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ముఖ్యత గోచరిస్తాయి.

సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి. బ్రాహ్మణుడైన జాబాలి, శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు పిడి సూత్రాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. ‘వినయపిటిక’ ప్రకారం, బుద్ధుడు ఆపి వుండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట. బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’.).మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో వుండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’లో సాఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. బాణుని ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా ఉంది.

14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్యసహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపు లేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట (భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు. ఈ బృహస్పతి పూర్వాశ్రమ నామము రక్తశర్మ. ఇతఁడు సాందీపని మహర్శి సహాధ్యాయి!

వాస్తవ జగత్తును మినహా, అన్నింటినీ తిరస్కరించినందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ ఎండగట్టి తిరస్కరించినందువలనే, ఈ లోకాయతులు అణచివేయబడ్డారన్నది సుస్పష్టం.

మహాభారతం’లో శాంతిపర్వంలో వున్న ప్రసిద్దమైన చార్వాక వధ.

కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యధిష్టురుని ఆశీర్వదించడానికి ప్రోగయ్యారు. వారిలో చార్వాకుడు కూడా వున్నాడు . మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజు నుద్దేశించి ఇలా అన్నాడు. “ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సంహరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)” హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యుధిష్ఠిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో వున్న రాక్షసుడనీ, రాజ విరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించి వేసారు.

‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు.” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించేవారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి.

చార్వాకుడు యుధిష్ఠిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే. సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆవిధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

—‘చార్వాకుల’ గురించి అనేక చరిత్రకారులు పరిశోధనలు జరిపారు. వీరిలో ముఖ్యులు యస్.యన్.దాస్ గుప్తా, రాధాకృష్ణన్, తుచ్చి, గార్బే, రిస్ డేవిడ్స్, జార్జ్ ధాంసన్, హెచ్.పి.శాస్త్రి, ఇ.బి.కావెల్.