చార్వాకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యావజ్జీవేత్ సుఖం జీవేత్ జీవోన్నాస్తి మృత్యురాగోచర:

భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత:

తాత్పర్యము: జీవితమంతయు సుఖముగ జీవించు. మృత్యువు కంటిచూపు నుండి తప్పించుకొనే జీవుడు లేడు. శ్మశానంలో కాలి బూడిదై పోయిన తర్వాత ఈ దేహము మరల తిరిగి వచ్చునా?

చార్వాకము (సంస్కృతం: चार्वाकदर्शनम् ) లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ప్రత్యక్ష గ్రహణశక్తిని, అనుభవవాదాన్ని, నియత అనుమితులని ఇది జ్ఞానము యొక్క సరైన మూలాలుగా పేర్కొంటుంది. తత్వపరమైన సంశయవాదాన్ని అక్కున చేర్చుకొని వేదాలను, వైదిక సంప్రదాయాలను, అతీంద్రియాలను ఇది ధిక్కరిస్తుంది.

బృహస్పతి చార్వాకాన్ని స్థాపించగా అజిత కేశకంబళి దీనిని ప్రాచుర్యం లోకి తెచ్చినట్లుగా చెప్పడమైనది. క్రీ.పూ 600వ సంవత్సరములో రచించిబడిన బృహస్పతి సూత్రాలు చాలా వరకు కాలగర్భంలో కలసిపోయినవి. హైందవ శాస్త్రాలు, సూత్రాలు, గ్రంథాలలో; బౌద్ధ, జైన మతాల సంభాషణలలో ప్రస్తావనలని బట్టి వీటి సిద్ధాంతాలని కనుగొనడం, అభివృద్ధి చేయటం జరిగింది.

చార్వాక సిద్ధాంతాలలో అత్యంత ప్రాముఖ్యత గత సిద్ధాంతం - అంగీకారయోగ్యమైన సార్వత్రిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక, భౌతిక సత్యాలని తెలుసుకొనే మార్గంలో హేతుబద్ధత యొక్క తిరస్కరణ. అనగా చార్వాకం యొక్క జ్ఞానమీమాంస, "కొన్ని గమనికలు, వాస్తవాల నుండి హేతుపరంగా ఏర్పడే భావనని అనుమానించాలి; హేతుబద్ధమైన జ్ఞానము బేషరతు కాదు" అని సూచిస్తుంది.

చార్వాకము భారతీయ ఆధునికిఅ తత్వాల క్రింద వర్గీకరించబడింది. ఇతర హైందవ నాస్తిక వాదాలకు ఇదే ఆద్యంగా పరిగణించబడింది.

వ్యుత్పత్తి, అర్థం

[మార్చు]

చార్వాకము యొక్క అర్థంలో అనిశ్చితి నెలకొని ఉంది. కొందరి ప్రకారం దీని అర్థం "అంగీకారమైన ప్రసంగం" అయితే మరికొందరి ప్రకారం ఇది "అసమ్మతి". చర్వ అనగా భుజించటం అని కూడా అర్థం ఉండటంతో, బహుశ "తిని, త్రాగి, సంతోషంగా జీవించు" అనే వాదాన్ని కూడా ఇది సూచిస్తుండవచ్చు. బృహస్పతి శిష్యుడైన చార్వాకుడు దీన్ని ప్రచారం లోకి తెచ్చాడు కాబట్టి దీనికి ఈ పేరు వచ్చి ఉండవచ్చునన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. లోకాయతం అనగా "ప్రపంచమే లక్ష్యము" అని అర్థం. ప్రాథమిక సాహిత్యం దొరకకపోవటం వలన లోకాయత అనే పదానికి ఇతరత్రా ప్రస్తావించిన సాహిత్యంలో వివిధ అర్థాలు గోచరిస్తున్నవి.

లోకాయతం

[మార్చు]

చార్వాకం యొక్క సాంప్రదాయిక నామమే లోకాయతం. (లోకేషు ఆయత:) లోకులలో ప్రబలంగా ఉండటం మూలాన, ఇది ప్రాపంచిక దృక్పథం కావటం మూలాన దీనికి లోకాయతం అనే పేరు వచ్చింది. నిఘంటువులో లోకాయతం యొక్క అర్థం "ప్రాపంచికమైన, ప్రపంచాన్ని సూచించేది, ప్రపంచాన్ని లక్ష్యంగా చేసుకొన్నది".

ప్రాథమిక మూలాలు లేకపోవటం మూలాన, ఇతర సాహిత్యం ఆధారంగానే దీని అర్థాన్ని ఆపాదించవలసి రావటం మూలాన, 20వ శతాబ్దపు ప్రారంభం నుండి మధ్య వరకు లోకాయతం యొక్క వ్యుత్పత్తి పరిపరివిధాలుగా అర్థం చేసుకొనబడటమైనది. చాణక్యుని అర్థశాస్త్రంలో ఇది మూడు అన్వీక్షికిలలో (కారణభూతంగా పరిశీలింపబడే తార్కిక తత్వాలలో) ఒకటిగా ప్రస్తావించబడినది (యోగ, సాంఖ్య, లోకాయతలు). అయితే అర్థశాస్త్రంలో లోకాయతం వేదాలకు వ్యతిరేకం కాదు, వేదాలను నమ్మేదే. ఇందులో లోకాయతం చర్చ యొక్క శాస్త్రం లేదా తర్కంగా పరిగణించబడింది. రుడోల్ఫ్ ఫ్రాంకె ప్రకారం, లోకాయతం అనగా "ప్రకృతి యొక్క తార్కిక వివరణకు ఋజువు".

8వ శతాబ్దపు జైన సాహిత్యంలో హరిభద్రుడు రచించిన సదర్శనసముచ్చయ ప్రకారం, లోకాయత "దేవుడు లేడు, పునర్జన్మ లేదు, కర్మ లేదు, కర్తవ్యం లేదు, కష్టఫలాలు లేవు, పాపము లేదు" అని బోధించే ఒకానొక హైందవ తత్వం.

బౌద్ధ సాహిత్యం దివ్యవదన ప్రకారం లోకాయతం తార్కికపరంగా అభ్యసించవలసిన శాస్త్రం.

లోకాయతం, బ్రాహస్పత్యం, చార్వాకం పర్యాయపదాలే.

మూలాలు

[మార్చు]

ఋగ్వేదంలో చార్వాక ప్రస్తావనలు ఉన్ననూ, దీని పై ప్రధాన చర్చలు వైదిక సాహిత్య కాలం తర్వాత జరిగినవి. చార్వాకానికి ప్రాథమిక సాహిత్యంగా పరిగణించబడే బ్రహస్పతి సూత్రాలు కనుమరుగైపోయింది. దీని సిద్ధాంతాలు, అభివృద్ధి, ఇతర శాస్త్రాలు, సూత్రాలు, (రామాయణం, మహాభారతం వంటి) గ్రంథాలలో, బౌద్ధ/జైన సాహిత్యాలలో వీటి ప్రస్తావనలతో జరిగింది.

చార్వాక సిద్ధాంతాలపై తగినంత చర్చ క్రీ.పూ 600 సంవత్సరం తర్వాతే జరిగినవి. వైదిక కాలంలో ఇది అభివృద్ధి చెందినది అని చెప్పటానికి ఆధారలున్ననూ, చార్వాకము ఆస్తిక వాదానికి ప్రత్యాన్మాయంగా సమకాలీన తర్వాతి కాలంలో ఉద్భవించిన ప్రాచీన భారతీయ తత్వాలైన అజీవిక, జైన, బౌద్ధ తత్వాలకు తత్వ మూలంగా వ్యవహరించింది.

ఇప్పటికి తెలిసిన చార్వాకులలో ప్రథముడు అజిత కేశకంబళి అని తేలినది. భౌతికవాదము చార్వాకము కంటే ముందు నుండే ఉండిననూ నానుడిలను ఏర్పరుస్తూ సూత్రప్రాయంగా వ్యవస్థీకృతింపబడినది మాత్రం క్రీ.పూ ఆరవ శతాబ్దంలో చర్చకి వచ్చిన చార్వాకం లోనే. చార్వాకంలోనే భౌతికవాద ఉద్దేశాలు సిద్ధాంతాలు విస్తృతంగా విశ్లేషించబడినవి. మూలాధార సాహిత్యం, సేకరించబడిన సూత్రాలు, నానుడిలు, వాటిని విశ్లేషించే వ్యాఖ్యలు అప్పుడే ఉన్నాయి.

The Ethics of India (1924)లో E W Hopkins చార్వాక తత్వము జైన/బుద్ధ మతాల సమకాలీనమని తెలిపినాడు. Rhys Davids క్రీ.పూ 500లోనే సంశయవాదం ఉన్నదని తెలిపినాడు. రామాయణం లోని అయోధ్యకాండలో 108 వ అధ్యాయంలో జాబలి రాముణ్ణి రాజ్యాధికారం చేపట్టమని నాస్తికవాదం చేస్తాడు.

ఓ జ్ఞానీ! నిర్ణయించుకొనుము. ఈ సృష్టికి మించినది ఏదీ లేదు. కంటికి కనబడ్డదానికే ప్రాధ్యాన్యతనివ్వు. నీ జ్ఞానానికి మించినదాని గురించి ఆలోచించకు

చార్వాకము యొక్క మూలాలకు వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. బృహస్పతి చార్వాకానికి ఆద్యుడని ఒక వాదన అయితే, బృహస్పతి సూత్రాలని రచించినది 6వ శతాబ్దానికి చెందిన చార్వాకుడు అని మరొక వాదన ఉంది. 12వ శతాబ్దం వరకూ చార్వాకము వెలుగొందగా ఆ తర్వాత అది నామరూపాలు లేకుండా పోయింది. క్రీ.పూ. 6వ శతాబ్దంలో చార్వాకుడు బ్రహస్పతి సూత్రాలను పొందుపరచాడని ఒక వాదన ఉంది. అయితే క్రీ.పూ 150 లో రచించబడిన మహాభాస్యలో కూడా చార్వాక ప్రస్తావనలు ఉన్నాయి.

బౌద్ధ సాహిత్యం సమ్మన్నఫల సుత్త ప్రకారం బౌద్ధ, జైన మతాలకు పూర్వమే క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఉన్న ఆరు వివిధ నాస్తిక వాదాలలో చార్వాకము, అజీవికము కూడా ఉన్నాయి. 12వ శతాబ్దం వరకూ చార్వాకము భారతదేశ చారిత్రక కాలమానముపై వర్థిల్లగా దాని తర్వాత ఇది నామరూపాలు లేకుండా పోయింది.

తత్వము

[మార్చు]

చార్వాక తత్వము వివిధ నాస్తిక, భౌతిక నమ్మకాల చుట్టూ అల్లుకొనబడి ఉంది. అవగాహనయే జ్ఞానము యొక్క హేతుబద్ధ, నమ్మదగిన మూలముగా చార్వాకులు భావించారు.

జ్ఞానమీమాంస

[మార్చు]

అనుమితి సరియైనది కానూవచ్చును/కాకపోనూవచ్చును అని, కావున అనుమితి నియతబద్ధమైనదని, అందుకే అవగాహనయే జ్ఞానానికి ప్రాథమిక, సరియైన మూలమని చార్వాకములో జ్ఞానమీమాంస గుర్తించింది. అవగాహన రెండు విధాలు, - అంతర్గతం, బహిర్గతం. బహిర్గత అవగాహన అనగా పంచేంద్రియాలు ప్రాపంచిక వస్తువుల పరస్పర చర్యల వలన ఉత్పన్నమౌతుంది. అంతర్గత అవగాహన అనగా లోపలి భావాలు, అనగా మనసుకు చెందినది. అనుమితి అనగా గమనికలను బట్టి అదివరకే తెలుసుకొన్న సత్యాలను బట్టి ఒక సరికొత్త నిర్ధారణకు రావటం లేదా సరికొత్త సత్యాన్ని కనుగొనటం. సంశయాస్పదం అవ్వటం మూలాన చార్వాకుల ప్రకారం అనుమితి ఉపయోగకరమే కానీ లోపభూయిష్టమైనది. అనుమితి మంచిదే, సహాయకారే అయిననూ కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో; ఒక్కోమారు పలు విషయాలలో దాని చెల్లుబాటు సందేహాస్పదం. చార్వాకుల ప్రకారం అనుమితి యొక్క సమర్థను జ్ఞానము యొక్క సాధనాలుగా ప్రతిష్ఠించటానికి ఎటువంటి నమ్మదగిన సాధనాలూ లేవు.

జ్ఞానమీమాంస వాదం నిప్పు లేనిదే పొగ రాదు అనే నానుడికి సరిగ్గా సరిపోతుంది. పొగ ఉన్నది అంటే నిప్పు ఉన్నదనే అర్థం. చాలా వరకు ఇది నిజమే అయిననూ, ఒక్కోమారు ఇది నిజం కాకపోవచ్చును. పొగకు వేరే కారణాలు కూడా ఉండవచ్చును. జ్ఞానమీమాంసలో దృగ్విషయం/గమనిక, సత్యానికి మధ్య సంబంధం నిబంధన లేనిది అని నిరూపితమయ్యే వరకు ఆ సత్యం అనిశ్చితమైనది. అటువంటి తార్కిక పద్ధతులు అనగా అనుమితిని అవలంబించటం లేదా అసంబద్ధ నిర్ధారణలు చేయటం ఈ భారతీయ తత్వం ప్రకారం దోషపూరితం. అన్ని గమనికలు, అన్ని పరిసరాలు, అన్ని స్థితిగతులు తెలిసినపుడే సంపూర్ణ జ్ఞానం ప్రాప్తిస్తుందని చార్వాకులు ప్రకటిస్తారు. కానీ కొన్ని స్థితిగతులు దాగి ఉండటం వలన మరి కొన్ని మనం గమనించటం నుండి తప్పించుకొనటం వలన స్థితిగతులు అసలు లేనేలేవని రూఢీగా చెప్పటం (అవగాహనచే అనుమానాన్ని మించేంతగా స్థాపించటం) కష్టం. ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో అనుమితిపై ఆధారపడతాడని, అయితే వాటిని విమర్శాత్మక దృష్టితో చూడకపోతే మనచే తప్పిదాలు జరుగుతాయని చార్వాకులు తెలిపారు. ఒక్కోమారు మన అనుమితి నిజం కావటం వలన మనం విజయవంతం అవుతాము, కానీ ఒక్కోమారు అది అబద్ధం కావటం వలన తప్పు కూడా చేస్తాము. దీని అర్థం సత్యం అనుమితి యొక్క వైఫల్యం చెందని లక్షణం కాదు, సత్యం ప్రత్యేకించబడదగే అనుమితి యొక్క ప్రమాదం మాత్రమే. అందుకే మనం సంశయవాదులై ఉండాలి, అనుమితిచే పొందిన జ్ఞానాన్ని ప్రశ్నించాలి, మన జ్ఞానమీమాంసను ప్రశ్నించాలి.

చార్వాకులచే ప్రతిపాదించబడ్డ ఈ జ్ఞానమీమాంస సరిక్రొత్త ఆలోచనా విధానాలతో, పూర్వపు సిద్ధాంతాల పున:పరిశీలనలతో వివిధ భారతీయ తత్వాలపై ప్రభావం చూపినది. హైందవ, బౌద్ధ, జైన పండితులు వారి స్వంత సిద్ధాంతాల హేతుబద్ధ పున:పరిశీలనల అనుమితిలో చార్వాక మెళకువలపై విస్తారంగా ఆధారపడ్డారు.

ఇతర హైందవ తత్వాలతో పోలిక

[మార్చు]

అద్వైత వేదాంత పండితులు జ్ఞానానికి, సత్యానికి ఆరింటిని వనరులుగా పరిగణించారు. అవి -

 • ప్రత్యక్ష (అవగాహన)
 • అనుమాన (అనుమితి)
 • ఉపమాన (పోలిక, సారూప్యత)
 • అర్థపత్తి (హితోపదేశం)
 • అనుపలబ్ధి (అవగాహనారాహిత్యం, అభిజ్ఞాధారం)
 • శబ్ద (పదము, గత/ప్రస్తుత నిపుణుల నమ్మకమైన వాంగ్మూలం)

అయితే చార్వాక జ్ఞానమీమాంస హైందవ తత్వాలలోని మితవాద ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది. ఇతర హైందవ తత్వాలు ఈ జ్ఞానమీమాంస యొక్క వివిధ రూపాలను ఆమోదించటమే కాక వాటి అభివృద్ధికి కూడా తోడ్పడ్డాయి. చార్వాకులకు ప్రత్యక్ష (అవగాహన) జ్ఞానానికి ఉన్న ఏకైక మూలం. ఇతర జ్ఞానమూలాలు నియతమైనవి లేదా అసంబద్ధమైనవి. చార్వాకము ఈ ఒక్క వనరునే అంగీకరించి మిగతా వనరులని తిరస్కరించగా, ఇతర హైందవ తత్వాలు వీటిలో కనీసం రెండు వనరులను అంగీకరించినవి.

అధిభౌతికత

[మార్చు]

గమనికకు, సత్యానికి మధ్యనున్న స్థిరమైన సంబంధాన్ని కనుగొనటానికి ఏ వనరూ ఉపయోగకరం కాకపోవటం మూలాన, అధిభౌతిక సత్యాలను తెలుసుకొనుటకు అనుమితి ఉపయోగకరం కాదని చార్వాకులు తేల్చారు. అందుకే, తెలిసిన ఒక విషయంతో తెలియని మరొక విషయం గురించి మనసు వేసే అడుగు మునుపటి అవగాహనను బట్టి సరైనదీ అయ్యి ఉండవచ్చు, లేదా తప్పటడుగు అయ్యి ఉండవచ్చు అని చార్వాకులు తేల్చారు. కొన్ని పర్యాయాయలలో అనుమితి వలన కలిగిన సత్ఫలితాలు కేవలం యాదృచ్ఛికాలు అనే దృక్కోణంలో చూశారు.

చార్వాకులు అధిభౌతిక భావాలైన

 • పునర్జన్మ
 • మరణానంతరం శరీరమును వీడే ఆత్మ
 • మతాచారాల సమర్థత
 • పరలోకముములు (స్వర్గం, నరకం వంటివి)
 • విధి
 • కొన్నింటిని చేయటం/చేయకపోవటం వలన కలిగే సత్ఫలితాలు/దుష్ఫలితాలు

వంటి వాటిని తిరస్కరించారు. సృష్టి ప్రక్రియ విశదీకరణకు మానవాతీత కారకాల వినియోగాన్ని కూడా తిరస్కరించారు. వారి ప్రకారం సృష్టి ప్రక్రియ యావత్తూ, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ప్రాకృతిక అంశాల అంతర్లీన స్వభావాన్ని బట్టి జరుగుతోంది.

అగ్గి లోని వేడిమి, నీటిలోని చల్లదనం, ప్రొద్దుట వీచే పిల్లగాలిలో జవసత్వాలను అందించే చల్లదనం ;
ఈ వైవిధ్యం ఎవరి వలన వచ్చినది? వాటికుండే సహజగుణాల నుండే.

చేతనావస్థ, పునర్జన్మ

[మార్చు]

చార్వాక దర్శనము చైతన్యాన్ని (స్పృహ కలిగి ఉండటం), కర్మను, పునర్జన్మ లను నమ్మదు. ఒక వ్యక్తి యొక్క (బలహీనంగా ఉండటం/ఊబకాయులుగా ఉండటం వంటి) (అవ) లక్షణాలు అతని శరీరములోనే నిగూఢమై ఉన్నాయని తెలిపినది. సర్వసిద్ధాంత సంగ్రహం ప్రకారం -

ఈ ప్రపంచం తప్పితే వేరే ఏ ప్రపంచం లేదు;
స్వర్గం లేదు, నరకం లేదు;
శివుని రాజ్యం ఇంకా అటువంటి ప్రదేశాలు;
తెలివితక్కువ మోసగాళ్ళచే కనుగొనబడ్డాయి.

ఆనందం

[మార్చు]

ఇంద్రియాల వలన పొందే ఆనందంలో ఎటువంటి తప్పు లేదని చార్వాకుడు నమ్మాడు. కష్టపడకుండా ఆనందం పొందటం అసాధ్యం కాబట్టి వీలైనంత తక్కువ కష్టపడి ఆనందాన్ని అనుభవించటంలోనే జ్ఞానం ఉన్నదని చార్వాకుడు యోచించాడు. సమకాలీన హైందవ తత్వాలవలె కాక చార్వాకుడు నిరాడంబరత్వాన్ని, ఆనందాన్ని అనుభవించటం వలన తర్వాత కష్టాల పాలౌతామనే తర్కాన్ని మూఢత్వంగా అభిప్రాయపడ్డాడు.

ఆనందం, విలాసవంతమైన జీవితం గురించి చార్వాకుడు సర్వసిద్ధాంత సంగ్రహంలో-

స్వర్గసౌఖ్యాలన్నీ రుచికరమైన ఆహారాన్ని ఆరగించటంలో, పడుచు స్త్రీల సాంగత్యంలో, చక్కని దుస్తులలో, సుగంధ ద్రవ్యాలలో, పుష్పమాలలలో, చందన లేపనంలోనే ఉన్నాయి. మోక్షం అంటే శ్వాస ఆగిపోయే మృత్యువే. అందుకే, జ్ఞానులు కష్టాలలోనే మోక్షమున్నదని భ్రమించరాదు.

ఉపవాసాలు, తపస్సులు అవివేకులకు. పవిత్రత, అటువంటి ఇతర శాసనాలు బలహీనులైన తెలివిగలవారిచే చేయబడ్డవి.

చార్వాకులు వేదాలను, బౌద్ధ గ్రంథాలను తిరస్కరించారు. సర్వసిద్ధాంత సంగ్రహం ప్రకారం చార్వాకులు నీతినియమాలను కూడా ధిక్కరించారు. చార్వాకుల ప్రకారం వేదాలలో లోపాలున్నవి, తరాలతో బాటు ఈ లోపాలు కూడా మారుతూ వచ్చాయి, అవి అసత్యాలు, స్వీయ వైరుధ్యం గలవి, ఒకే అసత్యాన్ని పలు విధాలుగా నొక్కి వక్కాణించేవి. కర్మకాండ వైదికులకు, జ్ఞానకాండ వైదికులకు మధ్య ఉన్న అసమ్మతులు, వారి మధ్య జరిగే విమర్శాత్మక చర్చలు ఈ రెంటిలోనూ ఏదో ఒకటి అసత్యమని లేదా రెండూ అసత్యాలే అయి ఉండవచ్చుననేదానికి నిదర్శనాలు అని తెలిపారు. వేదాలు అసంబద్ధ ప్రేలాపనలని, పూజారుల పొట్ట నింపటానికే ఇవి ఉత్సాహము చూపుతాయని వీటి వల్ల మరే ఇతర ఉపయోగమూ లేదని తెలిపారు. వేదాలను కనుగొన్నది మానవులే కానీ అవి ఏ విధమైన దైవాజ్ఞలు కావని తెలిపాయి.

అయితే ఈ వాదనలు చార్వాకులవి కాదు అని ప్రతిపాదించిన ఆచార్యులూ ఉన్నారు.

మూలాలు

[మార్చు]

బృహస్పతి కూర్చిన కొన్ని సూత్రాలు తప్పితే చార్వాక తత్వం పై ప్రత్యేకించి ఎక్కడా గ్రంథాలు లేవు. 8వ శతాబ్దానికి చెందిన జయరసి భట్టుని తత్వోపప్లవసింహ నుండి చార్వాక తత్వము గ్రహించబడింది. సద్దర్శన సముచ్చయము, విద్యారణ్యుని సర్వదర్శనసంగ్రహము చార్వాక ఆలోచనావిధానాన్ని తెలిపే మరికొన్ని గ్రంథాలు. మహాభారతంలో యుధిష్ఠిరుడిని చెడు మార్గముననుసరించమని సలహా ఇచ్చినవాడు చార్వాకుడేనని ఒక కథనమున్నది.

సర్వదర్శన సంగ్రహములో ప్రారంభంలో శివుణ్ణి, విష్ణువుని స్తుతించిన విద్యారణ్యుడు ఈ క్రింది విధంగా ప్రశ్నిస్తాడు:

...నాస్తికవాదానికి ఆణిముత్యంలా వ్యవహరించిన, బ్రాహస్పత్యం పుచ్చుకొన్న చార్వాకుడు దైవాన్ని ధిక్కరించిననూ, దైవాంశసంభూతడను మనం ఎలా స్తుతించగలం? చార్వాకుడి శ్రమ తుడిచిపెట్టుకుపోజాలనిది, ఈ క్రింది భావజాలం ఇప్పటి ప్రజలలో బలంగా నాటుకుపోయినది:
జీవితకాలం సంతోషంగా ఉండు;
వెదుకుతూ వచ్చే మృత్యువు కంటి నుండి ఎవరూ తప్పించుకోలేరు
ఒక్కమారు ఈ చట్రాన్ని వారు కాల్చి బూడిద చేయగనే,
మరల అది ఎప్పటికైనా తిరిగి వస్తుందా?

అక్బర్ రాజ్యం చార్వాక తత్త్వంపై విమర్శలు గుప్పించింది. కాదంబరి వంటి నాటకాలలో కూడా చార్వాకం విమర్శాకోణంలోనే ప్రస్తావించబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Ramkrishna Bhattacharya (2013), The base text and its commentaries: Problem of representing and understanding the Carvaka / Lokayata, Argument: Biannual Philosophical Journal, Issue 1, Volume 3, pages 133-150
 2. MM Kamal (1998), The Epistemology of the Carvaka Philosophy, Journal of Indian and Buddhist Studies, 46 (2) : 13-16
"https://te.wikipedia.org/w/index.php?title=చార్వాకం&oldid=4010748" నుండి వెలికితీశారు