విద్యా ప్రకాశానందగిరి స్వామి
శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి | |
---|---|
జననం | ఆనంద మోహనుడు. 1914, ఏప్రిల్ 13 |
మరణం | ఏప్రిల్ 10, 1998 |
ఇతర పేర్లు | శ్రీ విద్యా ప్రకాశానందగిరి |
వృత్తి | ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు ,బహుభాషాకోవిదులు, శ్రీ గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరీ వ్యవస్థాపకులు. |
తల్లిదండ్రులు |
|
విద్యా ప్రకాశానందగిరి స్వామి (ఏప్రిల్ 13, 1914 - ఏప్రిల్ 10, 1998) ఒక ఆధ్యాత్మికవేత్త. శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ముఖ్యమైన వాడు. ఆయన జన్మనామం ఆనందమోహనుడు. బందరులో జన్మించిన అతను అక్కడే బి. ఎ. దాకా అక్కడే చదువుకున్నాడు. హిందీలో నైపుణ్యం కోసం కాశీకి వెళ్ళి వచ్చాడు. తర్వాత తండ్రి కోరిక మేరకు మలయాళ స్వామి చెంతకు చేరి అక్కడే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందాడు. 1950 లో శ్రీకాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమం ఏర్పాటు చేసి ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాడు. దేశంలో పలు ప్రాంతాల్లో గీతాజ్ఞాన యజ్ఞాలు నిర్వహించాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. పలు పుస్తకాలు రచించాడు. భగవద్గీతపై అతను రచించిన విపులమైన వ్యాఖ్యాన గ్రంథం గీతా మకరందం చాలా ప్రాచుర్యం పొందిన గ్రంథం.[1] వ్యాసాశ్రమంలో ఉన్నపుడు యథార్థ భారతి, శుకబ్రహ్మాశ్రమం తరపున వేదాంతభేరి పత్రికలను ప్రచురించడం ప్రారంభించాడు. స్వాతి లాంటి పలు పత్రికల్లో అతను రాసిన పరమార్థ కథలు ప్రచురితమయ్యాయి. ఈ కథలు పామరులు కూడా అర్థం చేసుకోగలిగిన సులభ శైలిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేశాయి. శ్రీకాళహస్తిలో ఆయన మొట్టమొదటి డిగ్రీ కళాశాలను స్థాపించడానికి తన వంతు విరాళం అందించారు. ఈ కళాశాలను ఆయన పేరు మీదుగా శ్రీ విద్యాప్రకాశానంద డిగ్రీ కళాశాల అని వ్యవహరిస్తున్నారు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆనంద నామ సంవత్సర చైత్ర బహుళ తదియ (13-4-1914) నాడు బందరులో రామస్వామి, సుశీలా దేవి అనే పుణ్య దంపతులకు మూడవ పుత్రుడుగా జన్మించాడు.[2] తండ్రి రామస్వామి న్యాయవాది. దేశభక్తి మెండుగా గలవాడు. హైందవ సమాజాన్ని చక్కగా సంస్కరించాలనే దృఢ సంకల్పంతో పనిచేసిన సంఘసంస్కర్త. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలను భాష్యంతో సహా అధ్యయనం చేశాడు. శిష్టాచార సంపన్నులైన ఈ పుణ్య దంపతుల ఇంటికి తరచుగా విద్వాంసులు, సాధు మహాత్ములు వచ్చేవారు. వేదాంత గోష్టులు జరుగుతుండేవి.
విద్యాప్రకాశానంద బాల్యనామం ఆనంద మోహన్. చిన్నతనంలోనే ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించేవాడు. పసితనం నుంచే ఎంతో దైవ భక్తి ఉండేది. రామస్వామి తెనాలిలో న్యాయవాద వృత్తిలో బాగా సంపాదించాడు. తర్వాత ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నాడు. వకీలు వృత్తికి రాజీనామా చేసి చిన్న పర్ణ కుటీరంలో జీవిస్తూ, ధ్యానం, జపం, భజన, పారాయణం, అర్చన, ఆత్మవిచారణ, వేదాంతగోష్టులతో కాలం గడపసాగాడు. ఆదర్శ గృహిణి సుశీలాదేవి భర్తకు అన్ని విధాలా సహకరించేది. సహజంగానే ఆధ్యాత్మిక సంస్కారం గల ఆనంద మోహనుని చిత్త వృత్తి దైవ మార్గంలో పురోగమించటానికి వాతావరణం అనుకూలించింది.
తండ్రితో పాటు "పంచదశి", "జీవన్ముక్తి", "ప్రకాశిక " గ్రంథాలను పఠించేవాడు. "భర్తృహరి సుభాషితం", "ప్రశ్నోత్తర", "గాయత్రీ రామాయణం", "ఆత్మబోధ" గ్రంథాలన్నీ కంఠస్థం చేసాడు. తండ్రి ఆంగ్లాంధ్ర భాషల్లో ప్రవీణుడవడం చేత వివిధ సంస్థల వారు భగవద్గీతపై ఉపన్యసించవలసినదిగా ఆహ్వానించేవారు. ఆనందమోహన్ కూడా ఆయా సందర్భాల్లో తండ్రి గారితో వెళ్ళి శ్లోకాలను చదువుతూ ఉంటే, అతను వ్యాఖ్యానం చేసేవాడు. ఆ విధంగా బాల్యం నుంచి ఆనందమోహన్ కు భగవద్గీతతో అనుబంధం ఏర్పడింది. దేశభక్తి ప్రభావితుడైన రామస్వామి ఇంట్లోనే నూలు వడికి ఖద్దరు వస్త్రాలనే ధరించేవాడు. దీపావళినాడు బాణసంచా కాల్చడం నిషిద్ధం. ఆనాడు 108 జ్యోతుల్ని ఓంకారంతో వెలిగించేవాడు.
శాస్త్ర విధుల ననుసరించి ఉపనయన సంస్కారం పొందిన ఆనందమోహన్, ఒకసారి వేటపాలెం లోని సారస్వత నికేతనంలో ఆనాటి ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ కాశీ కృష్ణాచార్యులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేద ప్రతిపాదితాలైన బ్రహ్మ చర్య ధర్మాల గురించి అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉపన్యసించి సభలోని విద్వాంసులను పెద్దలను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. బ్రహ్మశ్రీ కాశీకృష్ణాచార్యులవారు "ఈ బాలబ్రహ్మచారి భవిష్యత్తులో గొప్ప యతీశ్వరుడు కాగలడు. ఇతని కీర్తి నలుదెసలా వ్యాపిస్తుంది." అంటూ ఆశీర్వదించాడు.
అతను చదువు అందరిలాగే సర్వసాధారణంగానే సాగింది. మెట్రిక్యులేషన్ వరకు విజయవాడ లోను తర్వాత డిగ్రీ మచిలీపట్నంలో పూర్తి చేశాడు. 1933 లో బి.ఎ.పట్టా పుచ్చుకొన్న ఆనందుడు కళాశాలలో చదివే రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించాడు. ఉన్నత చదువుల కోసం ఆ రోజుల్లో చాలామందిలానే వారణాసి లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయా నికి వెళ్ళాడు. అక్కడే 'కోవిద' పరీక్ష పూర్తి చేశాడు.
ఆధ్యాత్మిక పరిమళం
[మార్చు]అతని ఆలోచనా విధానం లౌకిక విద్య నుండి అలౌకిక విద్య వైపు మళ్ళింది. ఒకసారి అతను గంగానది తీరంలోని పుణ్యక్షేత్రమైన రిషికేశ్ను దర్శించి గంగలో స్నానమాచరించాలని వచ్చాడు. నదిలో మూడు మునకలు వేయడానికి నదిలో దిగి రెండు మునకలు పూర్తి చేసి మూడో మునక పూర్తి చేయగానే అతను చేతిలోకి తాళపత్రాల్లో లిఖించబడిన భగవద్గీత ప్రత్యక్షమయింది. అవి పూలు, పసుపు, కుంకుమలతో అర్చింపబడి ఉన్నాయి. ఈ సంఘటన అతను తన కర్తవ్య దీక్షను గుర్తు చేసిందిగా భావించాడు. గీతా సారాన్ని అందరికీ అందజేయాలని సంకల్పించాడు. వంద గీతా మహాజ్ఞాన యాగాలను చేశాడు.
వివేకానందస్వామి సారస్వతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయటం ద్వారా ఆధ్యాత్మిక వికాసాన్ని పొందారు. భగవద్గీత బైబిల్ కు గల సామ్యాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేశారు. జాతీయోద్యమంలో భాగంగా సూత్ర యజ్ఞమనే పేరుతో రాట్నం నుండి నూలు తీసి దుస్తులు నేయించి ధరించటమనే మహా యజ్ఞంలో పాల్గొని అందులోనూ స్వర్ణపతకాలు సంపాదించాడు. ఆనందమోహన్ తండ్రి శ్రీ మలయాళస్వాముల వారిని తమ గురువుగా నిర్ణయించుకున్నారు. వారు రచించిన "శుష్క వేదాంత తమోభాస్కరం" వారిని ఎంతగానో ఆకర్షించింది.
తన 34వ ఏట శ్రీ సద్గురు మళయాళస్వామి వారి సన్నిధిలో సన్యాస దీక్ష స్వీకరించాడు. అప్పుడే అతను పేరు విద్యాప్రకాశానందగిరి స్వామిగా మార్చుకున్నాడు. మలయాళస్వామి అనుగ్రహ దృష్టి ఆనందమోహనుడిపై పడింది. అప్పుడే స్వామి అతడికి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ విధంగా గురుశిష్యులిద్దరికీ అనుబంధం ఏర్పడింది. హిందీ భాషలో పరిజ్ఞానం అవసరమని భావించి రాష్ట్ర విశారద పరీక్షల్లో ఉత్తీర్ణుడైన ఆనందమోహనుడిని మరింత ఉత్తమమైన ప్రజ్ఞ సంపాదించటానికి తండ్రిగారు కాశీ విద్యా పీఠానికి పంపారు. అక్కడి విద్యార్థులు నడిపే ఇంగ్లీషు మాసపత్రికకు, "తపోభూమి" అనే హిందీ పత్రికకు ఆనందుడు సంపాదకత్వం వహించాడు.
ఆశ్రమ ప్రవేశం
[మార్చు]1936, మే 17 వ తేదీన ఆనందుడు ఆశ్రమ ప్రవేశం చేశాడు. శ్రీవారి నిష్టాశ్రమానికి దక్షిణ దిశలో ఏకాంతంగా గుహాలయంలో తపోనిష్టతో కూడిన కూడిన సాధనానుష్టానాలు ప్రారంభించాడు. అపక్వాహారాన్ని (వండని ఆహారం) స్వీకరిస్తూ గురు సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధనలో అనేక గ్రంథాలను రచించారు. యోగవాశిష్టం అనువాదం చేశాడు. "ధర్మపథం" ఆంధ్రానువాదం చేశారు.
గురుదేవులు ఓంకార సత్రయాగంలో చెప్పిన దివ్యప్రబోధాలను గ్రంథ రూపంలో అందించారు. ఒక సంవత్సరం మౌననిష్ఠ సాగించారు. శిష్యుని పురోగతిని గమనించిన గురుదేవులు అతనికి మహావాక్యాలను ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటుచేశాడు. గిరి సంప్రదాయానుసారంగా శ్రీ విద్యా ప్రకాశనందగిరి అని అతనికి నామకరణం చేసి ఉపదేశ ప్రబోధాలను అధికారమిచ్చారు. సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాలకు శ్రీ శుకబ్రహ్మాశ్రమం[3][4] స్థాపించాడు. గురువు శ్రీ వ్యాసాశ్రమం స్థాపిస్తే శిష్యుడైన విద్యాప్రకాశానంద వ్యాసుని కుమారుడైన శుకముని పేరు మీదుగా ఆశ్రమం స్థాపించాడు. 1950 సంవత్సరంలో శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమానికి సద్గురుదేవులు శ్రీ మలయాళ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రవేశోత్సవం జరిగింది.
శుక బ్రహ్మ ఆశ్రమ కార్యక్రమాలు
[మార్చు]ఆశ్రమం స్థాపించాక స్వామివారు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాడు. శుకబ్రహ్మాశ్రమం యొక్క ముఖ్యమైన సందేశం "నిర్భయుడై ఉండుము. భగవంతుడు మీ చెంతే ఉన్నాడు". ఈ ఆశ్రమం చిత్తూరు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో సువర్ణముఖీ నదీ తీరాన వెలసి ఉంది. ఆశ్రమం స్థాపించినది మొదలు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. వేదాంత సంబంధ అంశాలమీద, అలౌకిక విషయాల మీద చర్చలు జరిపాడు. అపార జ్ఞానాన్ని సంపాదించాడు. భగవద్గీత పారాయణం చేశాడు.
ఆశ్రమంలో గీతా పారాయణ ప్రవచనాలపై ఒక ప్రార్థనా మందిరం నిర్మించబడింది. సాధకుల నివాసానికీ, వంటకు, భోజనాదులకు కుటీరాలు నిర్మించారు. 1954 సంవత్సరంలో శ్రీ శుక బ్రహ్మాశ్రమంలోనే శ్రీ వ్యాసాశ్రమం వారు నిర్వహించే 28 వ సనాతన సభ దిగ్విజయమయింది. 1955 లో జరిగిన ఆశ్రమ పంచమ వార్షికోత్సవానికి వ్యవస్థాపకులు శివానంద సరస్వతి మహారాజ్ తమ దివ్య సందేశాన్ని పంపించాడు.
"మానవ జాతి సముద్ధరణపై వారు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం అవుగాక!" అంటూ శ్రీ ముఖం పంపాడు. 1956 సంవత్సరం నుండి శ్రీ సనాతన వేదాంత సభలకు శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి వారు అధ్యక్షస్థానం వహించారు. శ్రీ మలయాళ స్వాముల వారి అనుజ్ఞతో, ఆశీస్సులతో శ్రీ స్వాములవారు 1957 సంవత్సరంలో గీతాజ్ఞాన యజ్ఞాలను ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో మొదటి గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించారు. పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలకులు తన్మయులై స్వామివారి ప్రవచనాలు శ్రద్ధగా వినేవారు. అలా మొదలైన ఈ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. హైదరాబాదులో తితిదే వారి సౌజన్యంతో నూరవ గీతాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. వివిధ వార్తాపత్రికలు స్వామిని ప్రశంసిస్తూ వారి వారి పత్రికల్లో ప్రకటనలు వేసేవారు. ఆశ్రమంలో విశేష కార్యక్రమాలు జరిగే రోజులలో భక్తులకు అన్న వస్త్ర దానాలు జరిగేవి. ఆశ్రమం చుట్టుప్రక్కల నివసించే గిరిజనుల కోసం ఆనంద వైద్యాలయం స్థాపించబడింది.
ఆశ్రమాన్ని స్థాపించిన పదమూడు సంవత్సరాలకు మౌక్తికోత్సవం నిర్వహించాడు. ఆ తరువాత స్వర్ణోత్సవం కూడా జరిగింది. వేదాంతభేరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించి వేదాంతపరమైన అనేక విషయాలపై వివరణ ఇచ్చాడు. అనేక కథల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించాడు. అదే సమయంలో గీతామకరందమనే గ్రంథాన్ని వెలువరించాడు.
రచనలు
[మార్చు]స్వాములవారు తమ గురువుగారి వలె అనేక రచనలు చేశారు.
|
|
|
|
సేవా కార్యక్రమాలు
[మార్చు]వేదాంత కార్యక్రమాలతో అతను సంతృప్తి చెందకుండా మానవసేవయే మాధవసేవ గాభావించి ప్రభుత్వానికి సహాయం చేశాడు. ఆ విరాళంతో ప్రభుత్వం డిగ్రీ కళాశాలను, తదుపరి జూనియర్ కళాశాలను స్థాపించి వాటికి ఆయన పేరే పెట్టారు. అంతటితో ఆగకుండా చుట్టు పక్కల ఉన్న పేద ప్రజలకోసం ఒక కంటి ఆసుపత్రిని నిర్మించాలనుకున్నాడు. భక్తకన్నప్ప పేరుతో అక్కడే ఉచిత కంటి వైద్యశాలను నిర్మించాడు.[5]
స్వామి వారి సందేశాలు(పంచామృతాలు)
[మార్చు]- తప్పు దారిలో పోతున్న యువకులను సక్రమ మార్గంలో పెట్టడానికి వారికి భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాలి. యువత భోగ విలాసాలపై మనస్సు మళ్ళించటానికి కారణం వారికి సరైన ఆధ్యాత్మిక బోధన లేకపోవటమే.
- మితిమీరిపోతున్న హింసను అరికట్టాలి. సృష్టిలోని ఏ ప్రాణిని బాధించినా భగవంతునికి అపకారం చేసినట్లు అవుతుంది.
- మన మతం పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్లనే మతమార్పిడులు జరుగుతున్నాయి. మన మత ధర్మాలను తెలియజేసి తగిన సదుపాయాలు కలుగ జేసినట్లయితే ఒక మతంలో నుండి మరొక మతం లోకి మారవలసిన అవసరం రాదు.
- మానవ జీవితంలో ఎన్నో చిక్కు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మరొక రకంగా తీర్చలేని పరిస్థితులలో ఆధ్యాత్మిక పరిజ్ఞానం తోనే పరిష్కరించుకోవాలి. చిత్తవృత్తిని పరమాత్మ వైపు మళ్ళించి నిర్భయులై ఉండండి. బ్రహ్మానుభవం మానవ జన్మను సార్థకం చేస్తుంది.
- జాతి మత కుల వర్గ భాషా విభేదాలు మనం సృష్టించుకున్నవే. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా శాంతి, సుఖం, ఆనందం ఏర్పడతాయి. ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను జన సమూహం లోనికి తీసుకువెళ్ళీ ప్రచారం చేస్తే ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది.
తన శిష్యుడైన విద్యాస్వరూపానంద స్వామిని తన వారసుడిగా నియమించి చైత్ర శుద్ధ చతుర్దశి నాడు (10-4-1998) మహాసమాధి పొందాడు. అతను సమాధి చుట్టూ ఒక ధ్యానమందిరాన్ని నిర్మించి పైన శివలింగాకారంలో గోపురం ఏర్పాటు చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "జరిగేదేదైనా దైవనిర్ణయమే!". www.andhrajyothy.com. Retrieved 2020-12-23.
- ↑ సముద్రాల, లక్ష్మణయ్య (1992). శ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారి జీవిత చరిత్ర (PDF). శ్రీకాళహస్తి: శ్రీ శుకబ్రహ్మాశ్రమం. p. 7.
- ↑ Reporter, Staff (2014-04-13). "Sukabrahma Ashram: a centre for spiritual learning". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-23.
- ↑ "శ్రీ శుకబ్రహ్మాశ్రమం జాలస్థలి". Archived from the original on 2019-09-11. Retrieved 2020-06-10.
- ↑ "ఆధ్యాత్మికం..సామాజికం". www.eenadu.net. Retrieved 2021-05-05.
GITAMAKARANDAM BOOK BY SWAMI VIDYAPRAKASHANANDA GIRI LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/4/gitamakarandam-book
- CS1 Indian English-language sources (en-in)
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1914 జననాలు
- 1998 మరణాలు
- తెలుగు రచయితలు
- సంస్కృత రచయితలు
- కృష్ణా జిల్లా ఆధ్యాత్మిక గురువులు
- అద్వైతం
- కృష్ణా జిల్లా తత్వవేత్తలు
- కృష్ణా జిల్లా రచయితలు
- కృష్ణా జిల్లా ప్రవచనకర్తలు