మలయాళ స్వామి

వికీపీడియా నుండి
(మళయాళస్వామి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మలయాళ స్వామి
జననం
వేళప్ప

(1885-03-29)1885 మార్చి 29
మరణం1962 జూలై 12(1962-07-12) (వయసు 77)
ఇతర పేర్లుఅసంగానంద
వృత్తియోగి
తల్లిదండ్రులు
  • కరియప్ప (తండ్రి)
  • నొత్తియమ్మ (తల్లి)
మలయాళ స్వామి

మలయాళ స్వామి అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి. వ్యాసాశ్రమ వ్యవస్థాపకుడు. స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి, అన్ని కులాల వారిని ఆదరించిన మహాజ్ఞాని. ఈయన సన్యాసం స్వీకరించిన తర్వాత అసంగానంద స్వామి అనే పేరుతో కూడా పిలిచారు. విద్యా ప్రకాశానంద గిరి స్వామి ఆయన శిష్యుల్లో ముఖ్యమైన వాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన తలిదండ్రులు కేరళలోని తిరువాయూర్ సమీపంలో కరియప్ప, నొత్తియమ్మ దంపతులకు మార్చి 29 1885 న జన్మించాడు. చిన్న వయసులో ఈయనకు వేళప్ప అని పేరు పెట్టారు. వీరి ఇంటికి వచ్చిన ఒక సాధువు ఈయనను చూసి మీ బిడ్డ సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు. చిన్నతనం నుండి అందరిలా కాక నేలమీదనే నిద్ర పోవడం. జాలి దయ ఎక్కువగా ఉండటం. ఇంట్లో ఉన్న పంజరంలోని పక్షులను విడిపించడం. ఇంటి దగ్గర కుటీరంలో ఎప్పుడూ ధ్యానంలో ఉండటం చేసేవాడు. చిన్నప్పటి నుండి ఆంగ్లం చదవటం ఇష్టం ఉండేది కాదు. దానికి బదులు సంస్కృతం నేర్వటానికి వెళ్లిపోయేవాడు

సన్యాస జీవితం ప్రారంభం[మార్చు]

తిరువంతపురానికి కొంత దూరంలో శివగిరి గ్రామంలో నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంది. ఆయన సామాజిక విప్లవ కారుడు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవాడు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి పెరింగోత్కర అనే గ్రామంలో విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు. వేళప్ప ఆయన వద్ద శిష్యునిగా చేరాడు. శివలింగస్వామి వేలప్పకు మంత్రోపదేశం చేసి, పతంజలి యోగ రహస్యాలపై సాధన చేయించాడు. నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సులను గురువు ద్వారా పొంది, తిరుగు పయనమైనాడు. ఇంటికి వెళ్లి జబ్బుతో ఉన్న తల్లికి సేవలు చేసి నయం చేశాడు. వివాహం కొరకు అడిగితే తాను దేశాటన చేయాలని తిరస్కరించాడు. వేళప్ప కాలి నడకతో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు. రోజుకు ఇరవై ముప్పై మైళ్ల వరకూ నడిచేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు. అలా తిరుగుతున్నపుడు అనారోగ్యంతో ఒక వారం బాధపడ్దా ఇంటికి వెళ్ళకుండా యాత్రను కొనసాగించాడు. ఒక రోజు స్వప్నంలో ఎవరో నోట్లో మాత్ర వేసినట్టుగా అనిపించింది. అప్పటి నుండి అనారోగ్యం మరి దరిచేరలేదు.

తిరుమల సందర్శన[మార్చు]

అనేక పుణ్యక్షేత్రాలను దర్శించిన అనంతరం చివరగా ఆయన తిరుమలలోని గోగర్భం చేరాడు. ఆ ప్రదేశం ఆయనకు నచ్చడం, అది తపస్సుకు అనుకూలంగా ఉందని భావించి కొంత కాలం తపమాచరించి అటునుండి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన నాటికి తండ్రి కాలధర్మం చెందడంతో కొద్ది రోజుల అనంతరం తిరిగి తిరుమల గోగర్భం చేరాడు. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ, తిరుమలలో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి, చివరికి అదీ మానివేసి, పితృదేవతలకు పెట్టే పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు. ఆయన భాష, వేషం చూసి "మళయాళ స్వామి" అని అందరూ పిలిచే వారు. అదే తరువాత స్థిర నామంగా మారింది.

మైసూరు తిరువెంకటాచార్యుడు అనే అతడు వేంకటేశ్వర పూజ చేసి రోజూ ప్రసాదం ఇచ్చి వెళ్ళేవాడు. తరువాత కొందరు భక్తులు రోజూ ఆయనకు ప్రసాదం అందించేవారు.

లీలా విశేషాలు[మార్చు]

తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు.

  • ఒక సారి తీవ్ర తపస్సులో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి ఒక వేటగాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు. అదేమీ ఆయనకు తగల్లేదు.
  • తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకసనంద తీర్థం నుండి, తుంబురు తీర్థానికి వెళ్లాడు. భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు. ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందంతో ఆహారం అందించాడు.
  • ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం‘’ అని చెప్పాడు.
  • వేయి కాళ్ళ మండపం లో బిచ్చమెత్తే పిల్లలకు ప్రసాదం ఇచ్చే ఏర్పాటు చేశాడు.
  • కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించాడు.
  • తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి వినిపించింది. ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందాడు.

వ్యాసాశ్రమం[మార్చు]

తిరుమల విడిచి ఏర్పేడు దగ్గర కాశీ బుగ్గ లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. శ్రీకాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమనాయుడు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశాడు. దాన్ని వ్యాసాశ్రమం అంటారు. వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి, పంటలు పండించాడు. జంతుబలి మాన్పించాడు. యదార్థ భారతి అనే పత్రికనుస్థాపించి అనేక వేదాంత విషయాలను వ్రాసి పుస్తకాలుగా తెచ్చాడు. అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించాడు. వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది. కేరళలో నారాయణ గురు ఏమి బోధించాడో, వ్యాసాశ్రమంలో అవన్నీ అమలు పరచడానికి ప్రయత్నించాడు.

సేవా కార్యక్రమాలు[మార్చు]

బందరు లో పట్టాభి సీతారామయ్య గారింట్లో గాంధీజీ ని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుధా ప్రశంసించాడు. దగ్గర లో ఉన్న కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ను స్వామి దర్శించాడు .

  • 1937లో ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రిలో ప్రారంభించి స్త్రీలకూ, ఇతర కులాల వారికి భోదలు చేసాడు.
  • 1943లో శివగిరిలో జ్ఞానయజ్ఞం చేసి, జ్ఞాన బోధలు చేసాడు.
  • 1945 ఒక స్త్రీకి సన్యాస దీక్షనిచ్చి చరిత్ర సృష్టించాడు.
  • 1951లో రాజమండ్రిలో రెండవ చాతుర్మాస్యం చేసినపుడు వేలాది మంది పంచములు పాల్గొన్నారు.
  • వ్యాసాశ్రమంలో కొన్ని వందల సంఖ్యలో గ్రంథాలను ప్రచురించి ఆస్తిక జనాలకు అందించాడు.

12 జూలై 1962లో మలయాళ స్వామి కైవల్యం పొందాడు. వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలు ఉన్నాయి. ఇప్పుడు విద్యానందగిరి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు.

ఆశ్రమ నిర్వహకులు[మార్చు]

  1. మలయాళ స్వామి
  2. విమలానంద గిరి స్వామి
  3. విద్యా ప్రకాశానంద గిరి స్వామి
  4. పరిపూర్ణానంద గిరి స్వామి

రచనలు[1][మార్చు]

  • చాతుర్మాస మహత్యం
  • మలయాళ సద్గురు గ్రంథావళి-1-శుష్క వేదాంత తమో భాష్కరము
  • మలయాళ సద్గురు గ్రంథావళి-2-శ్రీస్వబోధసుధాకరం
  • మలయాళ సద్గురు గ్రంథావళి-4-శ్రీ ధర్మ సేతువు
  • మలయాళ సద్గురు గ్రంథావళి-7-బాల యోగిని
  • మలయాళ సద్గురు గ్రంథావళి-8-లోకోద్దారకము
  • మలయాళ సద్గురు గ్రంథావళి-9-ఈశ్వర కృప
  • మలయాళ సద్గురు గ్రంథావళి-11-ఉపదేశామృతము
  • మలయాళ సద్గురు గ్రంథావళి-13-ధర్మోపన్యాసములు-2
  • మలయాళ సద్గురు గ్రంథావళి-15-ధర్మోపన్యాసములు-4
  • మలయాళ సద్గురు గ్రంథావళి-17-బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, సన్యాస, శ్రీనిర్యాణ
  • మలయాళ సద్గురు గ్రంథావళి-19-సాంఖ్య, ముక్తి సోపానము, సమాధి చేయు విధానము
  • మలయాళ సద్గురు గ్రంథావళి-20-బ్రహ్మ విద్య, నిర్విఘ్న యోగ సిద్ధి
  • ప్రశ్నోత్తర మాణిక్యమాల
  • ధర్మోపన్యాసములు-4
  • నిర్విఘ్న యోగసిద్ధి
  • ప్రశ్నోత్తరీప్రవచన గీత
  • మలయాళ సద్గురు గ్రంథావళి-6-శ్రీ మద్భగవద్గీత
  • మలయాళ సద్గురు గ్రంథావళి-10
  • గురుభక్తి ప్రభావం

మూలాలు[మార్చు]

  1. "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Archived from the original on 2019-07-15. Retrieved 2020-04-07.