శ్రీకాళహస్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి
పట్టణం
భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము
భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము
శ్రీకాళహస్తి is located in Andhra Pradesh
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి
Location in Andhra Pradesh, India
నిర్దేశాంకాలు: 13°46′N 79°42′E / 13.76°N 79.70°E / 13.76; 79.70Coordinates: 13°46′N 79°42′E / 13.76°N 79.70°E / 13.76; 79.70
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు
మండలంశ్రీకాళహస్తి
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపురపాలకసంఘం
 • నిర్వహణశ్రీకాళహస్తి పురపాలకసంఘం
 • శాసనసభ్యుడుబియ్యపు మధుసూధనరెడ్డి
విస్తీర్ణం
 • మొత్తం24.50 కి.మీ2 (9.46 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం80,056
 • సాంద్రత3,300/కి.మీ2 (8,500/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
జాలస్థలిsrikalahasthitemple.com

శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం,శ్రీకాళహస్తి మండల కేంద్రం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

క్షేత్ర పురాణము

సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతు వంతెన. సువర్ణముఖి నది ఈ కోవెలకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ వున్నది
ఆలయం ప్రవేశం వద్ద కోలాహలం

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు ఉన్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము ఉంది. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు. అందులో శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ

ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

చరిత్ర

దక్షిణ గోపురం

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.[3]

ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.[4] ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.[5]

క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.[6]

ఆలయ విశేషాలు

స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.
.శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.

నాలుగు దిక్కుల దేవుళ్ళు
గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

గోపురాలు

ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు,, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

ఇతర శివలింగాలు, పరివార దేవతలు

ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

మంటపములు

ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

రాహు కేతు క్షేత్రము

ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణామూర్తి

దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

సేవలు
శ్రీకాళహస్తి రాజగోపురం

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

తీర్ధాలు

ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయి. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ఇతర విశేషాలు

ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

సౌకర్యాలు

శ్రీకాళహస్తీశ్వర

శ్రీకాళస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాల చాలా ప్రసిద్ధి గాంచినది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల , మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాల శ్రీకాళహస్తిలో చాలా కాలంగా ఉన్న పాఠశాలలు. ఇవికాక కేవలం బాలికల కోసమే గల బాలికల ఉన్నత పాఠశాల, సంక్షేమ పాఠశాలలు కూడా ఉన్నాయి. కళాశాల విషయానికొస్తే బాలురకు, బాలికలకు ప్రత్యేకమైన జూనియర్ కళాశాలలున్నాయి.ప్రైవేటు పాఠశాలల్లో ఎంజీఎం, విశ్వభారతి, వివేకానంద, ది స్కూల్, ఆర్.సీ.పీ గురుకులం, రాజా ఉన్నత పాఠశాల, మొదలైనవి ప్రధానమైనవి.

బస్ స్టాండుకు సమీపంలోనున్న అయ్యలనాయుడు చెరువులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక్కడ ప్రధాన బ్యాంకులైన భారతీయ స్టేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు,మొదలైనవి తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు, గ్రామీణ బ్యాంకు లాంటి ప్రాంతీయ బ్యాంకులు కూడా ఉన్నాయి.

ఆదాయ వనరులు

ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు వ్యవసాయం, వ్యాపారం , పర్యాటకం. ప్రధాన పంటలు వరి, వేరుశనగ, , చెరకు. వందల కొద్దీ కలంకారీ కళాకారులు కూడా ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇంకా చేనేత కళాకారులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. వీరు ప్రధానంగా పట్టణంలోగల "సాలిపేట" అనే ప్రాంతమందు కేంద్రీకృతమై ఉన్నారు. పట్టణంలో జరిగే నిర్మాణాల పనులకు, ఇతర కూలిపనులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. బీడీ కార్మికులు కూడా ఎక్కువే.

ప్రభుత్వం

శ్రీకాళహస్తి ఒక శాసనసభ నియోజక వర్గం. దీనికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. ఇది తిరుపతి పార్లమెంటు నియోజక వర్గం క్రిందకు వస్తుంది. దీనికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందిన వరప్రసాద్ రావు.

ఆచారాలు, సంస్కృతి , నాగరికత

ఇక్కడి ప్రజలు ప్రధానం తెలుగు మాట్లాడుతారు. కానీ తమిళనాడుకు దగ్గరలో ఉండటం వలన చాలామంది తమిళం కూడా మాట్లాడుతారు. విద్యా రంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలామంది ఆంగ్లమును కూడా అర్థం చేసుకోగలరు. వస్త్రధారణలో పంచె, చీరలు, లుంగీలు, ధోతీలే కాకుండా ఆధునిక వస్త్రధారణలైన ప్యాంటు, చొక్కా, చుడీదార్ వంటివి కూడా సాధారణమే.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పట్టణం యొక్క సంస్కృతిని ప్రతిబింబజేస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి స్వరకర్తలలో ఒకడైన ముత్తుస్వామి దీక్షితార్ "శ్రీకాళహస్తీశ" అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు.

క్రీడలు

క్రికెట్ ఇక్కడి ప్రజలు బాగా ఆడే, అభిమానించే క్రీడ. అంతేకాక కొన్ని ప్రాంతీయ క్లబ్బులు టెన్నిస్ ను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది 1916లో స్థాపించబడిన రిపబ్లిక్ క్లబ్. ఈ క్లబ్ 2004లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంటును కూడా నిర్వహించింది. ఇంకా గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో మొదలైనవి కూడా ఒక మాదిరి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

మాధ్యమాలు

తెలుగులో ప్రధాన పత్రికలైన ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి మొదలైన అన్నీ పత్రికలు ఇక్కడ తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇంతేకాక ప్రాంతీయంగా వెలువడే చైతన్య, ఆదర్శిని వంటి కొన్ని చిన్న వార్తాపత్రికలు కూడా ఉన్నాయి. ఈటీవీ, జెమిని టివి, తేజ టివి, మా టివి మొదలైన ఛానళ్ళు ప్రధానంగా వీక్షించబడుతున్నాయి. ఇవి కాక ప్రాంతీయ కేబుల్ ఛానల్ కూడా కొద్ది మంది వీక్షిస్తుంటారు.

పండుగలు

పట్టణం ప్రవేశం రోడ్

పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.

సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, నటి, భరత నాట్య కళాకారిణి శోభన, నేపథ్య గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మొదలైనవారు ఇక్కడికి వచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.

ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.

ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.

చుట్టుపక్కల ప్రదేశాలు

చూడదగ్గ ప్రదేశాల గురించి దేవాలయం వారు ఏర్పాటు చేసిన ఒక బోర్డు
నందనవనంలో కల అందమైన కోనేరు
 • గుడికి దక్షిణాన ఒక కిలోమీటరు దూరంలో శుకబ్రహ్మాశ్రమం ఉంది. దీనిని విద్యా ప్రకాశానందగిరి స్వామి స్థాపించారు.ఇక్కడ ఏర్పాటు చేసిన భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేదరోగులకు ఉచితంగా కంటి వైద్యం, ఆపరేషన్లు నిర్వహిస్తారు.
 • గుడికి దగ్గర్లోనే కల "నందనవనం" ("లోబావి") భరధ్వాజ మహర్షి తపస్సు నాచరించిన పుణ్య స్థలం. ఈ సరస్సులో ఒక నాలుగు పలకల మండపం ఉంది.
 • ఇక్కడికి కొద్ది దూరంలో ఉండే వేయిలింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరల ఒక కొండ ఎక్కితే కనిపించే ఒక చిన్న ఆలయంలో ఒకే లింగం పై చెక్కిన వేయి శివ లింగాలను (యక్షేశ్వర లింగము) సందర్శించవచ్చు. దీనికి దగ్గర్లోనే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. ప్రత యేటా జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి ఎక్కవగా భక్తులు సందర్శనార్థం విచ్చేస్తుంటారు. జ్ఞాన ప్రసూనాంబ ఇక్కడ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందట.
 • శ్రీకృష్ణదేవరాయల మంటపం, జలకోటి మంటపం పాలగర్ మంటపం
 • తొండమనాడు ఆలయం: తొండమాను చక్రవర్తి నిర్మించిన ప్రాచీనా వేంకటేశ్వరాలయం.
 • దక్షిణ కాళీమాత దేవాలయం (వేడాం) (2005 లో విగ్రహ పునస్థాపన జరిగింది).
 • దుర్గాంబ కొండ. ఇక్కడ వీర శృంగార మూర్తియైన కనకదుర్గ ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
 • సుబ్రహ్మణ్య స్వామి కొండ
 • చక్రేశ్వర స్వామి ఆలయం, జెట్టిపాళెం
 • శ్రీ నింబజాదేవి ఆలయం, జెట్టిపాళెం
 • ద్రౌపదీ సమేత ధర్మరాజులు స్వామి గుడి
 • సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి
 • మణికర్ణిక దేవాలయం

సినిమా హాళ్ళు

విజయలక్షి సినిమా హాలు అన్నింటికన్నా ప్రాచీనమైనది.దీనిని సుమారు 80 సంవత్సరాలకు మునుపు నిర్మించి ఉన్నారు.

 • విజయలక్ష్మి
 • ఆర్.ఆర్
 • శ్రీరామ మహల్
 • సాయిరాం
 • బలరాం
 • శ్రీనివాస
 • రామచంద్ర

ప్రముఖులు

శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ధూర్జటి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, మాజీ శాసన సభ్యులు ఎస్సీవీ నాయుడు, శాంతారాం పవార్, మాజీ శాసన సభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి, ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య గారు. ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్, గురప్ప చెట్టి (పద్మశ్రీ). ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక సంవత్సరం పాటు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదవడం విశేషం.

ప్రయాణ సౌకర్యాలు

శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది. గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషను ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. గూడూరు రైల్వే స్టేషను నుంచి తిరుమలకు ప్రతి అర్థగంటకు ఒక బస్సు ఉంటుంది. ఇక్కడకి దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి దగ్గరలోని రేణిగుంట. కానీ అక్కడకు విమానాలు ఇంకా ప్రతిరోజూ లేవు. కనుక చెన్నై, విజయవాడ లేదా బెంగళూరు లకు వచ్చి అక్కడ నుండి రోడ్డుమార్గములో రావచ్చు.

ఇవి కూడా చూడండి

మూలాలు

 1. "Srikalahasthi Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration and Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 19 August 2014.
 2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 1 September 2014.
 3. "Temples & Legends of Andhra Pradesh/Kalahasti/(Page5)". Archived from the original on 2008-03-07. Retrieved 2008-04-11.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-05-30. Retrieved 2010-05-30.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-08. Retrieved 2010-08-08.
 6. "Temples & Legends of Andhra Pradesh/Kalahasti/(Page8)". Archived from the original on 2008-03-07. Retrieved 2008-04-11.

వనరులు

 • శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారి సమాచార పత్ర పుస్తకం (2000)

బయటి లింకులు