పల్లవులు
పల్లవులు పారశీక దేశవాసులనియు, శక-పహ్లవ-కాంభోజ జాతుల వలసలలో భాగముగా దక్షిణదేశము చేరి శాతవాహనులతో సంబంధములు నెరిపి క్రమముగా స్వతంత్రులయ్యారని చెప్పవచ్చును. శాతవాహన రాజు గౌతమీపుత్ర సాతకర్ణి 'శకపహ్లవుల'ను నిర్జించెనని నాసిక్ శాసనము తెలుపుతున్నది. ప్రాచీన తమిళ గ్రంథాలు పల్లవులను విజాతీయులుగా పరిగణించాయి[1].
క్రీ. శ. రెండవ శతాబ్దిలో కాలభర్తి అనువాడు ఉత్తరదేశమునుండి వచ్చి శాతవాహనులకడ ఉద్యోగిగా చేరాడు. ఇతడు చూటు వంశీయుల కన్యను పెండ్లాడగా ఆమెవలన చూతుపల్లవుడు జన్మించాడు. చూతపల్లవుని కుమారుడు వీరకూర్బవర్మ. ఈతని మనుమడు స్కందమూలునికి పూర్వీకులవల్ల దక్షిణాంధ్ర దేశము, దానికి సమీపములోని కర్ణాటక ప్రాంతములు సంక్రమించాయి. శాతవాహనుల సామ్రాజ్యము అంతరించిన తరువాత, స్కందమూలుడు ఇక్ష్వాకుల ఒత్తిడికి తాళలేక తనదేశమును దక్షిణానికి విస్తరింపదలచాడు. తన కుమారుడు కుమారవిష్ణువును కంచి పైకి పంపగా అతడు సత్యసేనుని ఓడించి కంచిని వశపర్చుకున్నాడు. స్కందమూలుని తరువాత కుమారవిష్ణువు రాజ్యమును విస్తరించి అశ్వమేధ యాగము చేశాడు. ఈ సమయములో చోళులు మరలా విజృంభించి కంచిని తిరిగి వశపరచుకొనుటకు యత్నించారు. కుమారవిష్ణు రెండవ కుమారుడు బుద్ధవర్మ చోళులను నిర్జించి వారి ప్రాభవాన్ని అంతరింపచేశాడు. బుద్ధవర్మ పెద్ద కుమారుడు స్కందవర్మ రాజ్యాన్నికావేరి మొదలుగా కృష్ణానది వరకును, ప్రాక్సముద్రము మొదలుగ కుంతలపు పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించాడు. ఈ కాలమున పరాజితులైన చోళులలో పలువురు ఆంధ్ర మండలములు చేరి పల్లవరాజులకడ ఉద్యోగాలు నిర్వహించారు. వీరే తరువాతి తెలుగు చోళులకు మూలపురుషులయ్యారు.[2]
స్కందవర్మ తరువాత బుద్ధవర్మ కుమారుడగు రెండవ కుమారవిష్ణువు రాజయ్యాడు. ఈతని తరువాత మొదటి స్కందవర్మ కుమారుడు వీరవర్మ రాజరికము గ్రహించాడు. వీరవర్మ కుమారుడు రెండవ స్కందవర్మ, అతని కుమారుడు మొదటి సింహవర్మ వరుసగా రాజ్యం చేశారు. సా.శ. 300ప్రాంతమున సింహవర్మ ఇక్ష్వాకులను కూలద్రోశాడు. తరువాత పినతండ్రి విష్ణుగోపుని సాయంతో మూడవ స్కందవర్మ రాజయ్యెను. క్రీ. శ. 345లో విష్ణుగోపుడు రాజ్యము చేయాల్సివచ్చింది. ఈసమయములో ఉత్తరదేశమునుండి సముద్రగుప్తుడు దక్షిణదేశదండయాత్రకై వచ్చి శాలంకాయనులను, పలక్కడలో ఉగ్రసేనుని, తరువాత విష్ణుగోపుని జయించి తిరిగివెళ్ళాడు. క్రీ. శ. 360లో విష్ణుగోపుని మరణానంతరము ఆతని అన్న మనుమడు మొదటి నందివర్మ రాజయ్యాడు. క్రీ. శ. 383లో విష్ణుగోపుని కుమారుడు రెండవ సింహవర్మ రాజై పల్లవరాజ్యానికి పూర్వప్రతిష్ఠలు కలిగించాడు. ఈతని అనంతరము కుమారుడు రెండవ విష్ణుగోపుడు, మనుమడు మూడవ సింహవర్మ, మునిమనుమడు మూడవ విష్ణుగోపుడు, మునిమునిమనుమడు నాలుగవ సింహవర్మ క్రమముగా రాజులైరి. నాలుగవ సింహవర్మ విష్ణుకుండిన రాజులగు ఇంద్రభట్టారక వర్మ, రెండవ విక్రమేంద్ర వర్మలకు సమకాలీనుడు. క్రీ. శ. 566లో సింహవర్మను రెండవ విక్రమేంద్ర వర్మ జయించాడు. దీనితో పాకనాటికి ఉత్తరాననున్న తెలుగుదేశం విష్ణుకుండినుల వశమైనది. అదే సమయములో కళభ్రులను యోధజాతి (జైనులు) కంచిని వశముచేసుకొన్నది. పల్లవరాజన్యులు పాకనాటిలో తలదాచుకున్నారు. పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయింది.
పల్లవుల శిల్పశైలి
[మార్చు]పల్లవుల శిల్పశైలి విజాతీయ శైలి అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. దీనికి ఆధారముగా వీరు మహాబలి పురములో గల గంగావతరణ శిల్ప చిత్రములోని దిగువున జటామకుటధారి చేతిలో కార్నుకోపియా అనే లేడికొమ్ము ఆకారపు పాత్ర ధరించాడు, ఇది వస్త్రము కానేకాదు, అట్లాంటి పాత్ర మనదేశానిది కాదు అన్నది వీరి విషయము. మరియొక ఆధారముగా పల్లవులు శిల్పించిన సింహపుజూలు రింగురింగులూ- గాంధార బుద్ధిని జుట్టు రీతిగా- తీర్చి ఉంటుంది.మహిషమర్దిని చిత్రములో ఆమెవాహనమూ ధర్మరాజ సింహాసమనే బండకు ఒక అంచునగల సింగపుజూలు, పల్లవుల స్తంభాలకూ దిగువనగల సింహాల జూలూ రింగు రింగులుగానే ఉంటుంది అనునది మరియొక అభిప్రాయము.
నిజంగా శిల్పమందు శైలి జాతిని, కాలమును తప్పక సూచిస్తుందని, వేరే ఆధారములు తేల్చనపుడు శిల్ప శైలియే, జాతి, కాలముల నిర్ణయమునకు ప్రబల ప్రమాణము కాగలదని, మహా పండితుల వాక్యము. అయినప్పటికీ, శిల్ప శైలికిని భావాంకురములకును (Motifs) చాలా వ్యత్యాసము ఉంది. భారతశిల్ప మందైతేనేమి, అనేక ఇతర శిల్పములందైతే నేమి, సర్వకాలములందును సంపూర్ణముగా దేశజీవితములకు సంబంధించిన భావాంకురములు కొన్నిగోచరిస్తాయి. ఇందుకు కారణము నాటికి నేటికి మానవ నైజమునకు సహజమైన దేశసంచార కాంక్ష. అనేక కారణముల వలన మానవుడు దేశములను పర్యటించి తాను చూచిన అనుభవించిన నేర్చుకొన్న కొత్త విషయములను తనదేశస్థులకు పరిచయము కృషిచేస్తాడు. అందువలన కొన్ని పల్లవుల శిల్పములలో కొన్ని భావాంకురములను గమనించి శిల్పము విజాతీయమనుట పొరబాటని కొందరి శాస్త్రజ్ఞల అభిప్రాయము. గంగావతరణ శిల్ప చిత్రములోని దిగువున జటామకుటధారి చేతిలో కార్నుకోపియా వలే కనిపించుచున్నది పాత్రకాదు. ఆ జటామకుట దారి భగీరధ తపం ఫలితంగా వచ్చిన దివ్యగంగలో తన వస్త్రమును తడిపి, పిండుకుంటున్నాడు. కార్నుకోపియా కూడా మనదేశ శిల్పములకు కొత్తకాదు. పల్లవులకు ముందు 300 సం.పూర్వమే మలచిన నాగార్జునకొండ శిల్పములందు ఈరూపము కనిపించును. కార్నుకోపస్ అనగా మేకకొమ్ము.
పల్లవులు శిల్పించిన సింహపుజూలు రింగురింగులుగా తీర్చిఉంటుంది. ఇది గంగాధార బుద్ధులరీతి కాదు అనడానికి ఆధారంగా, బౌద్ధులు బుద్ధులకు బోధిసత్వులకు ముప్పది రెండు మహాపురుషుల లక్షణములను నిర్వచించారు. అందు ఉష్ణీషం ఒకటి. ఉష్ణీషం అనగా శిరస్సుపైభాగం ఎత్తుగా ఉండడం, ఇది గాంధారబుద్ధుల శిల్పములందు అగుపడు ముడి కాదు. ఈ ఉష్ణీషం సంపూర్ణ హైందవ సంప్రదాయములను వ్యక్తపరచు మన ఆంధ్ర బుద్ధరూపమునందే చక్కగా ప్రభావితమైనది. శిరస్సుపై జుట్టు కుడివైపుకు రింగులుగా తిరిగి ఉండుటకూడా ఆ 32 మహాపురుషుల లక్షణములందొకటి. అమరావతి బుద్ధులందు ఈ లక్షణము స్పష్టముగా కానవస్తుంది. ఈ రింగుల జుట్టు మహాయోగుల శిరస్సులందు విచ్చుకొన్న సహస్రార చక్రమును సూచించునని కొందరి అభిప్రాయము. ఇటువంటి పరిశీలనలతో పల్లవుల శిల్పము దేశీయమనే చెప్పవచ్చును. పల్లవ శిల్పశైలి నిజంగా ఆంధ్రశిల్పశైలి. ఈశైలి అంకురం ఆంధ్ర గర్భమయిన అమరావతే.
పల్లవ శిల్పంలో పొడుగ్గా నాజూకుగా శక్తివంతంగా కనుపించే దివ్యమానవరూపములు, కాలం గడుచుచున్న కొలదీ పొట్టిగా, మొరటుగా తయారయి, తమ సహజ సౌందర్యాన్ని ప్రతిభను, క్రమంగా ద్రావిడ శిల్పంలో అదృశ్యమైనవి.
మూలాలు
[మార్చు]- ↑ విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు
- ↑ History of the Andhras, G. Durga Prasad, 1988, P.G. Publishers, Guntur; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine