పిఠాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
నిర్దేశాంకాలు: 17°07′N 82°16′E / 17.12°N 82.27°E / 17.12; 82.27Coordinates: 17°07′N 82°16′E / 17.12°N 82.27°E / 17.12; 82.27
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండలంపిఠాపురం మండలం
విస్తీర్ణం
 • మొత్తం22.71 కి.మీ2 (8.77 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం54,859
 • సాంద్రత2,400/కి.మీ2 (6,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1020
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8869 Edit this on Wikidata )
పిన్(PIN)533450 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

పేరు వ్యుత్పత్తి[మార్చు]

పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో అమృతం పాత్ర, వేరొక చేత బాగుగా పండిన మాదీఫలము కాయ, మూడవ చేత డాలు, నాల్గవ చేత లోహ లోహదండము ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో స్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.

హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్.


చరిత్ర[మార్చు]

సముద్ర గుప్తుడు అలహాబాదు శాసనములో పిఠాపురము సా.శ. 14 శతాబ్దపు తొలిపాదములో ఒక రాజధానిగా ఉండినట్లు తెలుస్తున్నది. పిఠాపురములోని దొరికిన విగ్రహముల మీది ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, తాటిపర్తి విగ్రహములు, గొల్లప్రోలు చౌముఖములు మొదలైనవి అన్నీ కోన రాజ్యము ఏర్పడిన సా.శ. 18 శతాబ్దము ప్రారంభము తరువాతవని తెలియుచున్నవి.

పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు (ప్రస్తుత పేరు చెరుకుల కాలవ) అనే ఏరు ఒకటి ఉంది. పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాథుడు తన రచనలలో వర్ణించేడు. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాథుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి. పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడా సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాథ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డే రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ఠ చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని అంటారు.

ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో పిఠాపురాన్ని ప్రస్తావించాడు. దానిలో ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధాని అని ప్రస్తుతం పాదగయ అంటారని, ఇక్కడ గల శివాలయాన్ని కుక్కుటేశ్వరుడంటారని, తొలిఏకాదశి రోజున పండుగ చేస్తారని తెలిపాడు. ఇది పెద్ద ఊరని, ఇక్కడ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కుటుంబస్థులు ఒక మట్టికోటకట్టుకొని వున్నారని,ఊరు తోపులతో తటాకాలతో నిండి విశాలమైన చెరువులు కలదని, జగన్నాధము మొదలుగా యిసకపరభూమిలో తాటిచెట్లు, మొగిలిచెట్లు, జెముడు వున్నాయని తెలిపాడు.

భౌగోళికం[మార్చు]

జిల్లా కేంద్రమైన కాకినాడ కు ఉత్తరంగా 15 కి.మీ దూరంలో వుంది.

జనగణన గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,29,282 - పురుషులు 64,906 - స్త్రీలు 64,376

పరిపాలన[మార్చు]

పిఠాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణ సౌకర్యాలు[మార్చు]

పిఠాపురం రైల్వేస్టేషను

జాతీయ రహదారి 216 పైనుంది. ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం
  • సూర్యరాయ డిగ్రీ కాలేజి

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

పాదగయ[మార్చు]

కుక్కుటేశ్వర స్వామి
పాదగయ క్షేత్రం

కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంబంధించిన ఒక కథనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర, సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు.

పౌరాణిక ప్రశస్తి[మార్చు]

గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశాడు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.
ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.[2]

బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగాడు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టాడు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.[3]

గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందాడు.

ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తున్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన (కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో (కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.

ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది.

పురుహూతికా దేవి ఆలయం[మార్చు]

పురుహూతికా దేవి

కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.

శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం[మార్చు]

పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామిల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు, భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు, మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.

ఇతర ఆలయాలు[మార్చు]

  • కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)
  • నూకాలమ్మ గుడి


ప్రముఖులు[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

  • సా. శ. 1830 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా రామేశ్వరంలో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారు ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (మాంసం వ్యాపారి అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, సూట్ కేసులో పెట్టేసి ఆ పెట్టెని చెన్నై పేసెంజరు లోనోక్కించేసేరు. దరిమిలా రైలు రామేశ్వరం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం రామేశ్వరంలో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
  • పిఠాపురంలో గిటార్ల తయారీ జరుగుతోంది. దత్త క్షేత్రానికి దగ్గరలో గిటార్లు తయారు చేస్తారు.

పిఠాపుర సంస్థాన విశేషాలు[మార్చు]

పిఠాపురం సంస్థానాన్ని కాపు రాజులు పాలించే వారు. వీరిలో సూర్యారావు బహదూర్ ప్రముఖుడు. ఈయన సాహిత్యాన్ని బాగా పోషించాడు.

చిత్రమాలిక[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. కమల, ఎం. (నవంబర్ 13, 2010). "దేహమే దేవాలయం-పాదగయే పిఠాపురం". ఆంధ్రప్రభ. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 20 December 2014. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (help)
  3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  4. "Aaramadravidulu". Aaramadravidulu. Retrieved 16 May 2020.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పిఠాపురం&oldid=3595089" నుండి వెలికితీశారు